
వాషింగ్టన్: అమెరికా పన్ను వ్యవస్థ సమగ్ర ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పన్ను సవరణ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 51–48 ఓట్ల తేడాతో ఈ బిల్లు గట్టెక్కింది. వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలకు భారీగా పన్ను ఉపశమనం కలిగించనున్న ఈ బిల్లు ఇప్పటికే ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. ప్రత్యేక సందర్భాల్లో కార్పొరేట్లకు శాశ్వతంగా పన్ను విరామాలు, వ్యక్తులకు తాత్కాలికంగా పన్ను కోతలను ఈ బిల్లులో ప్రతిపాదించారు.
దీని వల్ల రాబోయే పదేళ్లలో దేశ ఆర్థిక లోటు 1.5 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనావేస్తున్నారు. విధానపర ప్రక్రియపై కాంగ్రెస్‌లో చివరిసారి చర్చ జరిగిన తరువాత బిల్లు శ్వేతసౌధం చేరుతుంది. అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తరువాత చట్టరూపం దాల్చుతుంది. క్రిస్మస్ సందర్భం గా ప్రజలకు తీపికబురు అందిస్తానని ట్రంప్ ఇది వరకే ప్రకటించిన నేపథ్యంలో రేపోమాపో ఈ శుభవార్త అధికారికంగా వెలువడనుంది. అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ఏడాది చట్టసభల్లో సాధించిన అతిపెద్ద విజయం ఇదే కానుంది.