శనివారం ఉదయమే అమెరికా సెనెట్ ఆమోదించిన పన్ను బిల్లు ప్రతినిధులసభ (కాంగ్రెస్ లో దిగువసభ) ఆమోదం పొందాక చట్టమైతే ఎక్కువ లాభం పొందేది ధనికులని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అవకాశాల స్వర్గంగా పిలిచే ఏకైక అగ్రరాజ్యంలో అపర కుబేరుల ఆస్తులు బాగా పెరిగిపోతున్నాయని, మధ్యతరగతి, పేదలు పెద్దగా బాగుపడింది లేదనేది అత్యధికుల అభిప్రాయం. ఇది కేవలం అభిప్రాయం కాదు కళ్లముందు కనిపించే వాస్తవం. అమెరికాలో 20వ శతాబ్దం మధ్య నుంచి సంపన్నుల్లో అగ్రభాగాన ఉన్న ఒక శాతం బిలియనీర్లకు జాతీయ సంపదలో ఉన్న వాటా రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగింది.
ఇంకా వివరంగా చెప్పాలంటేదాదాపు 70 ఏళ్ల క్రితం జాతీయ సంపదలో పది శాతం కలిగిన ఈ ఒక్క శాతం అగ్రశ్రేణి కుబేరుల వాటా ఇప్పుడు 20 శాతానికి ఎగబాకింది. ఆర్థిక వ్యవస్థలోని అవకతవకల వల్ల పెరిగిన అసమానతల కారణంగా వెనుకబడిపోయిన బలహీనుల తరఫున నిలబడాతానని, ఆర్థిక తారతమ్యాలను సరిచేస్తానని కిందటేడాది ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్హామీ ఇచ్చారు. దేశంలో అత్యున్నత పీఠం అధిరోహించి ఏడాది నిండకముందే ఈ ఎన్నికల వాగ్దానం అమలు చేసే ప్రక్రియలో భాగంగా హడావుడిగా ఆదాయ పన్ను బిల్లు రూపిందించారు. వెంటనే ఎగువసభ సెనెట్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేయగలిగారు. అమెరికా ప్రజల ఆదాయాల్లో కనిపించే అసమానతలను ఇవి తగ్గించకపోగా, మరింత పెంచుతాయని ఆర్ధికవేత్తలు హెచ్చరిస్తున్నారు.
బాగా తగ్గనున్న కార్పొరేట్పన్ను!
బడా కంపెనీల నుంచి సర్కారుకు డబ్బు బదిలీ చేసే కార్పొరేట్పన్నును 35 నుంచి 20 శాతానికి తగ్గించడమే ఈ పన్ను తగ్గింపు బిల్లులోని ప్రధానాంశం. ఈ పన్నును ఇలా గణనీయంగా కుదించడం వల్ల ఇప్పటికే ఆస్తులు అనేక రెట్లు పోగేసుకుంటున్న ధనికులు అడ్డగోలుగా లాభపడతారని అంచనా. కార్పొరేట్పన్ను చెల్లించే అన్ని కంపెనీల యజమానులందరూ ధనికులే. ఇలాంటి కంపెనీలు స్థాపించే పెట్టుబడిదారులు, వాటి నిర్వాహుకులైన ఎగ్జికూటివ్ల చేతుల్లోని షేర్ల విలువ ఈ చట్టం అమల్లోకి వస్తే ఆకాశం వైపు పరుగులు పెడుతుంది. వారి సంపద పెరుగుతుంది. ఇంకా ఈ చట్టం వల్ల ఈ కంపెనీల యజమానులు పన్నులు ఎగవేయడానికి కొత్త దారులు తెరుచుకుంటాయి.
కంపెనీలపై పన్నుభారం తగ్గినప్పుడల్లా ఆయా కంపెనీల షేర్ల ధరలు మార్కెట్లలో పెరుగుతాయి. ఈ లెక్కన కంపెనీల అధిపతులు, ఉన్నతాధికారులకు కేటాయించిన షేర్ల విలువ అదే నిష్పత్తిలో పెరిగి వారి సంపద వృద్ధిచెందుతుంది. అమెరికా సమాజంలో సంపద, ఆదాయం ఆధారంగా పెరుగుతున్న తారతమ్యాలను తగ్గించే లక్ష్యంతో రూపొందించిన చట్టం చివరికి విరుద్ధ ఫలితాలిస్తుందని ఆర్థిక నిపుణులు భయపడుతున్నారు. ‘‘ ఈ బిల్లు చట్టమయ్యాక సంపన్నులు, వారి పిల్లలు ఎక్కువ లబ్ధిపొందుతారు. వారసత్వంగా వారికి సంక్రమించే ఆస్తులపై కూడా పన్ను రేటు తగ్గిపోతుంది. దిగువ, మధ్యస్థాయి కార్మికులకు దక్కే వనరులు తగ్గిపోవడం వల్ల వారు తమ పిల్లల అవసరాలపై చేసే వ్యయం కూడా కుంచించుకుపోతుంది. దీంతో ఆరోగ్యబీమా లేని అమెరికన్ల సంఖ్య మరింత పెరుగుతుంది.’’ అని న్యూయార్క్యూనివర్సిటీ ప్రొఫెసర్లిలీ బ్యాచెల్డర్ ఓ ఇంటర్వ్యూలో హెచ్చరించారు.
వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లలో మార్పులూ ధనికులకే అనుకూలం!
కొత్త బిల్లులో ప్రతిపాదించిన వ్యక్తిగత ఆదాయపన్ను రేట్లలో ప్రతిపాదించిన మార్పులు కూడా ధనికులకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ చట్టం అమల్లోకి వసుందని భావిస్తున్నారు. సంపదలో కింది పది శాతం వాటా పొందే సామాన్యులకు వ్యక్తిగత ఆదాయపన్ను భారం ఒక్కొరికి 50 డాలర్లు తగ్గుతుంది. అదే అగ్రశ్రేణి ఒక శాతం ధనికుల్లో ఒక్కొక్కరికి 34, 000 డాలర్ల మేరకు పన్ను భారం తగ్గి ఎక్కువ లబ్ధి కలుగుతుంది. అలాగే, ఎస్టేట్పన్ను రేట్లను పూర్వస్థాయికి ఈ బిల్లు ద్వారా తీసుకెళ్లే ప్రతిపాదన వల్ల కూడా ధనికులే ఎక్కువ లాభపడతారని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్వాగ్దానం మేరకు రూపొందించిన ఈ సమగ్ర పన్ను బిల్లు కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గించకపోగా, దీర్ఘకాలంలో కొద్దిగా పెంచే ప్రమాదం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment