Senate Committee
-
అరుణాచల్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు గట్టి ఎదురుదెబ్బ..
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అరుణాచల్ ముమ్మాటికీ భారత్‌లో అంతర్భాగమే తప్ప చైనాలో భాగం కాదని అగ్రరాజ్యం అమెరికా తేల్చిచెప్పింది. చైనా, అరుణాచల్ మధ్యనున్న మెక్‌మోహన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు వద్ద యథాతథ స్థితిని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సెనేటర్లు బిల్ హగెట్రీ, జెఫ్ మెర్క్లీ సెనేట్‌లో తీర్మానం ప్రవేశపెట్టగా మరో సెనేటర్ జాన్ కార్నిన్ కూడా దాన్ని ప్రతిపాదించారు. ‘‘స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు చైనా నుంచి ముప్పు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలకు అండగా నిలవడం అమెరికా బాధ్యత. ప్రత్యేకించి భారత్‌కు మా మద్దతు ఉంటుంది’’ అని హగెట్రీ పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద యథాతథ స్థితిని మార్చాలన్న చైనా కుటిల యత్నాలను ఖండిస్తున్నామని చెప్పారు. అమెరికా–భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత ముందుకెళ్లనుందని అన్నారు. స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు ‘క్వాడ్’ కూటమి మద్దతు ఉంటుందని వెల్లడించారు. సరిహద్దు వెంట వివాదాస్పద ప్రాంతాల్లో గ్రామాల నిర్మాణం, అరుణాచల్ భూభాగాలకు మాండరిన్ భాషలో మ్యాప్‌లను రూపొందించడాన్ని తీర్మానంలో ప్రస్తావించారు. -
ట్రంప్‌పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించింది. సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్షపదవి నుంచి ట్రంప్ దిగిపోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాసపరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనేది రెండో ఆరోపణ. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు అనుకూలంగా 230 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ను అడ్డకున్నారన్న ఆరోపణలకు అనుకూలంగా 229 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన జో బిడెన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్ను ఒత్తిడిచేసి, ఆ దేశాన్ని తనకు రాజకీయంగా సాయం చేయాలని ట్రంప్ కోరడం అధికార దుర్వినియోగమని అభియోగంలో పేర్కొన్నారు. ప్రతినిధుల సభ విచారణకు ట్రంప్ సహకరించకుండా కాంగ్రెస్‌ను అడ్డుకున్నారన్నది రెండో అభియోగం. సెనేట్‌కి అభిశంసన తీర్మానం ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత ట్రంప్ అభిశంసన తీర్మానం సెనేట్‌కు వెళుతుంది. అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్ కొనసాగాలా? లేదా? అన్నది సెనేట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రతినిధుల సభలో అభిశంసన పూర్తయినప్పటికీ సెనేట్‌లోనూ నెగ్గడం కీలకం. సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే ట్రంప్ అధికారం నుంచి వైదొలగాలి. అయితే అభిశంసన ఆమోదం పొంచే అవకాశమే లేదు. సెనేట్‌లో ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అభిశంసన ఆమోదం పొందాలంటే అందుకు సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అది జరిగే అవకాశమే లేదు. దీంతో ట్రంప్ అధికారపీఠాన్ని దిగకపోవచ్చు. అయినప్పటికీ అమెరికా రాజకీయ చరిత్రలో అభిశంసనను ఎదుర్కున్నారనే మరక మాత్రం ట్రంప్‌పై పడింది. జనవరి రెండోవారంలో సెనేట్‌లో ఓటింగ్ ఉండే చాన్సుంది. అభిశంసనను ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడు ట్రంప్ అమెరికా చరిత్రలో అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షుల్లో ట్రంప్ మూడోవ్యక్తి. గతంలో ఆండ్య్రూ జాన్సన్, బిల్‌క్లింటన్‌లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ప్రతినిధుల సభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో కలిసి మిచిగాన్‌లోని బాట్లే క్రీక్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తనపై అభిశంసనపై ట్రంప్ మాట్లాడుతూ ‘అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వాళ్లు నాపై అభిశంసనకు యత్నిస్తున్నారు. లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని గద్దెదించాలని డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు. అభిశంసన ఎదుర్కొన్నవారు మళ్లీ గెలవలేదు ఇప్పటివరకు అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షులెవరూ తిరిగి ఆ తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. 1868లో అభిశంసనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆండ్య్రూ జాన్సన్ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలవలేకపోయారు, బిల్ క్లింటన్‌పై 1998లో అభిశంసన ప్రవేశ పెట్టారు. రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో క్లింటన్ విజయం సాధించలేకపోయారు. 1974లో ఆనాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అభిశంసన ప్రక్రియ సభ ముందుకు రాకముందే పదవికి రాజీనామా చేశారు. -
పన్ను సంస్కరణలకు అమెరికా సెనెట్ ఓకే
వాషింగ్టన్: అమెరికా పన్ను వ్యవస్థ సమగ్ర ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పన్ను సవరణ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. మంగళవారం జరిగిన ఓటింగ్‌లో 51–48 ఓట్ల తేడాతో ఈ బిల్లు గట్టెక్కింది. వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలకు భారీగా పన్ను ఉపశమనం కలిగించనున్న ఈ బిల్లు ఇప్పటికే ప్రతినిధుల సభలో ఆమోదం పొందింది. ప్రత్యేక సందర్భాల్లో కార్పొరేట్లకు శాశ్వతంగా పన్ను విరామాలు, వ్యక్తులకు తాత్కాలికంగా పన్ను కోతలను ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీని వల్ల రాబోయే పదేళ్లలో దేశ ఆర్థిక లోటు 1.5 ట్రిలియన్ డాలర్లు పెరుగుతుందని అంచనావేస్తున్నారు. విధానపర ప్రక్రియపై కాంగ్రెస్‌లో చివరిసారి చర్చ జరిగిన తరువాత బిల్లు శ్వేతసౌధం చేరుతుంది. అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన తరువాత చట్టరూపం దాల్చుతుంది. క్రిస్మస్ సందర్భం గా ప్రజలకు తీపికబురు అందిస్తానని ట్రంప్ ఇది వరకే ప్రకటించిన నేపథ్యంలో రేపోమాపో ఈ శుభవార్త అధికారికంగా వెలువడనుంది. అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ఏడాది చట్టసభల్లో సాధించిన అతిపెద్ద విజయం ఇదే కానుంది. -
క్షమాపణ చెప్పనున్న సీఈవో
న్యూయార్క్ : ఇంటర్నేషనల్‌గా బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సేవలందించే వెల్స్ ఫార్గో సీఈవో జాన్ స్టంఫ్ అమెరికన్ కాంగ్రెస్‌కు, పబ్లిక్కు క్షమాపణ చెప్పేందుకు సిద్దమయ్యారు. సెనెట్ బ్యాంకింగ్ కమిటీ ముందు స్టంఫ్ హాజరుకాబోతున్న ఆయన, సెనెట్‌కు క్షమాపణ చెప్పబోతున్నారు. దీనికి సంబంధించిన ఓ కాఫీని అసోసియేట్ ప్రెస్‌కు విడుదల చేశారు. బ్యాంకు తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనందుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందుతున్నామని ఆ కాఫీలో సీఈవో స్టంఫ్ పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లఘించి, కస్టమర్ల నమ్మకాన్ని ఒమ్ము చేసినందుకు క్షమాపణ కోరుతున్నట్టు తెలిపారు. రిటైల్ బ్యాంకర్ల దూకుడు ఉత్పత్తి అమ్మకపు గమ్యాలను చేధించడానికి నిబంధనలకు విరుద్ధంగా మిలియన్లకు పైగా అనధికారిక అకౌంట్లను తెరిచిందనే ఆరోపణలను ఈ కంపెనీ ఎదుర్కొంటోంది. ఈ కుంభకోణ నేపథ్యంలో కంపెనీ 185 మిలియన్ డాలర్ల జరిమానాను సైతం ఫేస్ చేస్తోంది. సంస్థ ఉద్యోగులు ఆయా ఖాతాదారుల అనుమతి లేకుండా 20 లక్షలకు పైగా ఖాతాలు తెరిచిన కుంభకోణం వెలుగులోకి రావడంతో కంపెనీ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది. కంపెనీ విలువ కుప్పకూలడంతో, దీనిలో ఇన్వెస్ట్ చేసిన వారి సంపద ఆవిరైంది. 2013 లో లాస్ ఏంజిల్స్ టైమ్స్ విచారణ లో ఈ విషయంలో తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల పట్ల విచారం వ్యక్తం చేసిన ఫార్గో అనుమతిలేకుండా ప్రారంభించిన ఖాతాలకు సంబంధించిన ఫీజును వాపస్ చేస్తామని వెల్లడించింది. జనవరి 1 నుంచి సేల్స్ టార్గెట్‌ను కూడా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. -
ఇక ఐసిస్ ప్రతీకారాన్ని చూడండి
* కాల్పులకు ముందు ఫేస్బుక్లో మతీన్ పోస్టులు * విచారణకు సహకరించాలని జుకర్‌బర్గ్‌కు సెనేట్ కమిటీ లేఖ వాషింగ్టన్: ఆర్లెండో కాల్పులకు ముందు, కాల్పుల సమయంలో హంతకుడు ఒమర్ మతీన్ ఫేస్బుక్లో చేసిన పోస్టులపై ఆసక్తి నెలకొంది. మతీన్ ఫేస్బుక్ వివరాల్ని ప్రస్తావిస్తూ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌కు అమెరికా అంతర్గత భద్రతపై ఏర్పాటైన సెనేట్ కమిటీ లేఖ రాసింది. కేసు విచారణలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని కమిటీ చైర్మన్ రాన్ జాన్సన్ ఫేస్‌బుక్‌ను కోరారు. దాడులకు ముందు, దాడుల సమయంలో ఉగ్రవాద సమాచారంతో పాటు విద్వేష పూరిత పోస్టులు చేసేందుకు మతీన్ ఫేస్బుక్ ఉపయోగించినట్లు తెలిసిందన్నారు. ఈ లేఖ వివరాలను అమెరికా న్యూస్ చానల్ వెల్లడించింది. ‘ఐదు ఫేస్బుక్ ఖాతాలకు మతీన్‌తో సంబంధమున్నట్లు విచారణలో తేలింది. జూన్ 12, 2016న ఫేస్బుక్లో ‘పల్స్ ఆర్లెండో’, ‘షూటింగ్’ పదాలతో మతీన్ వెదికాడు. ఐసిస్‌పై అమెరికా, రష్యాలు దాడులు ఆపాలని, ఐసిస్ చీఫ్ బగ్దాదీతో కలసి పనిచేసేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నానని, అల్లా నన్ను అంగీకరిస్తాడంటూ మతీన్ పోస్టు చేశాడు. మరో పోస్టులో పాశ్చాత్య దేశాల చెడు పనుల్ని నిజమైన ముస్లింలు ఎప్పటికీ అంగీకరించరని, అమాయక మహిళలు, పిల్లల్ని వైమానిక దాడులతో చంపుతున్నారని, ఇక ఇస్లామిక్ స్టేట్ ప్రతికారం రుచి చూడండంటూ పేర్కొన్నాడు. చివరి పోస్టులో మతీన్ స్పష్టంగా... వచ్చే కొద్ది రోజుల్లో అమెరికాలో ఐసిస్ దాడుల్ని చూస్తారని రాశాడు. మే 2016లో ‘శాన్ బెర్నార్డినో’ ఉగ్రవాదుల సమాచారం కోసం మతీన్ అన్వేషించాడు. జూన్ 4, 2016న ఫేస్బుక్లో ‘బగ్దాదీ స్పీచ్’ కోసం వెదికాడు.’ అని జాన్సన్ తెలిపాడు. భార్య అరెస్టుకు సిద్ధం ఈ ఆర్లెండో కాల్పుల కేసులో మతీన్ భార్య నూర్ సల్మాన్‌ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు సంస్థలు సిద్ధమవుతున్నాయి. కాల్పుల ప్లాన్ ముందుగానే నూర్‌కు తెలుసని మీడియా తెలిపింది. తర్వాతి లక్ష్యం శాన్‌డియాగో ‘గే’ వైబ్‌సైట్ క్రైగ్స్‌లిస్ట్ లోని ప్రకటనొకటి కలకలం రేపింది. ‘మరిన్ని ఆర్లెండో కాల్పుల్ని కోరుతున్నాం. ఆర్లెండో ఘటన ఇప్పటికే ఆలస్యమైంది. మీ వర్గాన్ని నిర్మూలిస్తాం. కాలిఫోర్నియాలోని శాన్డియాగోనే తర్వాతి లక్ష్యం’ అని అందులో ఉంది.