వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను దిగువ సభ అభిశంసించింది. సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే అధ్యక్షపదవి నుంచి ట్రంప్ దిగిపోవాల్సిందే. అమెరికాలోని డెమొక్రాట్లు మెజారిటీగా ఉన్న ప్రతినిధుల సభలో విశ్వాసపరీక్షలో ట్రంప్‌పై రెండు అంశాల ప్రాతిపదికగా అవిశ్వాస తీర్మానం పెట్టారు. ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడన్న ఆరోపణ ఒకటైతే, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనేది రెండో ఆరోపణ.
ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు అనుకూలంగా 230 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్‌ను అడ్డకున్నారన్న ఆరోపణలకు అనుకూలంగా 229 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు వచ్చాయి. తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన జో బిడెన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్‌ను ఒత్తిడిచేసి, ఆ దేశాన్ని తనకు రాజకీయంగా సాయం చేయాలని ట్రంప్ కోరడం అధికార దుర్వినియోగమని అభియోగంలో పేర్కొన్నారు. ప్రతినిధుల సభ విచారణకు ట్రంప్ సహకరించకుండా కాంగ్రెస్‌ను అడ్డుకున్నారన్నది రెండో అభియోగం.
సెనేట్‌కి అభిశంసన తీర్మానం
ప్రతినిధుల సభ ఆమోదం తర్వాత ట్రంప్ అభిశంసన తీర్మానం సెనేట్‌కు వెళుతుంది. అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్ కొనసాగాలా? లేదా? అన్నది సెనేట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రతినిధుల సభలో అభిశంసన పూర్తయినప్పటికీ సెనేట్‌లోనూ నెగ్గడం కీలకం. సెనేట్‌లోనూ అభిశంసన ఆమోదం పొందితే ట్రంప్ అధికారం నుంచి వైదొలగాలి. అయితే అభిశంసన ఆమోదం పొంచే అవకాశమే లేదు. సెనేట్‌లో ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లకు స్పష్టమైన మెజారిటీ ఉంది. అభిశంసన ఆమోదం పొందాలంటే అందుకు సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. అది జరిగే అవకాశమే లేదు. దీంతో ట్రంప్ అధికారపీఠాన్ని దిగకపోవచ్చు. అయినప్పటికీ అమెరికా రాజకీయ చరిత్రలో అభిశంసనను ఎదుర్కున్నారనే మరక మాత్రం ట్రంప్‌పై పడింది. జనవరి రెండోవారంలో సెనేట్‌లో ఓటింగ్ ఉండే చాన్సుంది.
అభిశంసనను ఎదుర్కొన్న మూడో అధ్యక్షుడు ట్రంప్
అమెరికా చరిత్రలో అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షుల్లో ట్రంప్ మూడోవ్యక్తి. గతంలో ఆండ్య్రూ జాన్సన్, బిల్‌క్లింటన్‌లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ప్రతినిధుల సభలో ఓటింగ్ జరుగుతున్నప్పుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌తో కలిసి మిచిగాన్‌లోని బాట్లే క్రీక్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. తనపై అభిశంసనపై ట్రంప్ మాట్లాడుతూ ‘అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే వాళ్లు నాపై అభిశంసనకు యత్నిస్తున్నారు. లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని గద్దెదించాలని డెమొక్రాట్లు ప్రయత్నిస్తున్నారు’ అని అన్నారు.
అభిశంసన ఎదుర్కొన్నవారు మళ్లీ గెలవలేదు
ఇప్పటివరకు అభిశంసనను ఎదుర్కొన్న అధ్యక్షులెవరూ తిరిగి ఆ తర్వాతి ఎన్నికల్లో గెలవలేదు. 1868లో అభిశంసనకు గురైన అమెరికా అధ్యక్షుడు ఆండ్య్రూ జాన్సన్ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలవలేకపోయారు, బిల్ క్లింటన్‌పై 1998లో అభిశంసన ప్రవేశ పెట్టారు. రెండోసారి అధ్యక్ష ఎన్నికల్లో క్లింటన్ విజయం సాధించలేకపోయారు. 1974లో ఆనాటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అభిశంసన ప్రక్రియ సభ ముందుకు రాకముందే పదవికి రాజీనామా చేశారు.
ట్రంప్‌పై అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
Published Fri, Dec 20 2019 2:18 AM | Last Updated on Fri, Dec 20 2019 8:19 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment