వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దించడానికి డెమొక్రాట్లు మరోసారి అభిశంసన తీసుకువచ్చారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ నాయకుడు జోయ్ బైడన్ నుంచి ట్రంప్‌కి గట్టి పోటీ నెలకొని ఉంది. బైడన్‌ను రాజకీయంగా దెబ్బ తీయడానికి ట్రంప్ ఉక్రెయిన్ సహకారాన్ని తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. బైడన్ కుమారుడు హంటర్ బైడన్‌కు ఉక్రెయిన్‌లో భారీగా వ్యాపారాలున్నాయి. ఆ దేశానికి ఆర్థిక సాయాన్ని ప్రకటించిన ట్రంప్ దీనిని రాజకీయంగా వాడుకోవాలని చూశారని, బైడన్ ఆయన కుమారుడిపై అవినీతి కేసుల విచారణ వేగవంతం చేయాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నట్టు డెమొక్రాట్లు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడినట్టు అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. ట్రంప్ చర్యలన్నీ జాతీయ భద్రతకు భంగకరంగా ఉన్నాయని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ డెమొక్రాట్లు వాదిస్తున్నారు. డెమొక్రాట్ ప్రజాప్రతినిధుల్ని కలుసుకొని చర్చించిన తర్వాత హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ట్రంప్‌పై అమెరికా ప్రతినిధుల సభలో అభిశంసన ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారు, అధ్యక్షుడైనా సరే ప్రజలకి జవాబుదారీగా ఉండాలి అని నాన్సీ అన్నారు. అభిశంసన ప్రక్రియపై ట్రంప్ స్పందించారు. తనని వెంటాడి వేధిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ట్రంప్‌పై తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ బలం లేకపోవడంతో వీగిపోయింది.
పదవి నుంచి ఎలా తొలగిస్తారు ?
అమెరికా అధ్యక్షుడిని గద్దె దింపాలంటే సెనేట్ అత్యంత కీలకం. సెనేట్‌లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుంది. ఆ సమయంలో అధ్యక్షుడికి తన వాదనల్ని వినిపించుకునే అవకాశం ఉంటుంది. సెనేట్‌లో మూడింట రెండు వంతుల మంది సభ్యులు (67 మంది) అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆయన పదవిని కోల్పోవలసి వస్తుంది.
గతంలో ఎదుర్కొన్నవారెవరు?
అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు అభిశంసనకు గురి కాలేదు. 1868లో ఆండ్రూజాన్సన్, తిరిగి 1998లో బిల్ క్లింటన్‌లపై అభిశంసన ప్రవేశపెట్టినా సెనేట్‌లో వారిద్దరికీ ఊరట లభించింది. ఇక 1974లో రిచర్డ్ నిక్సన్ అభిశంసన తీర్మానంపై చర్చ జరగక ముందే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పటివరకు సభలో 60సార్లకు పైగా అభిశంసన ప్రక్రియ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment