బైడెన్ గద్దె దిగి ఆమెకు బాధ్యతలు ఇవ్వాలంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లు
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో కాస్తంత వెనకబడి తొలి మహిళా దేశాధినేతగా అధ్యక్షపీఠంపై కూర్చునే సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌ను గద్దెనెక్కించాలని గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివాదాలకు కేంద్రబిందువైన ట్రంప్ స్థానికత సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి అంతర్జాతీయ దౌత్యనీతిని పక్కకునెట్టి, దిగజారుడు వ్యక్తిగత దూషణలకు దిగి ఎలాగోలా పాపులర్ ఓటును ఒడిసిపట్టారన్న విమర్శల వేళ అగ్రరాజ్యంలో కొత్తరకం డిమాండ్ తెరమీదకొచ్చింది.
చిట్టచివర్లో రేసులోకి దిగి, ఎన్నికల్లో చివరిదాకా పోరాడి అద్భుత పోరాటస్ఫూర్తిని ప్రదర్శించిన కమలాహారిస్‌కు చివరివారాల్లో అయినా అధ్యక్ష పట్టాభిషేకం చేయాలని చాలా మంది డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. అయితే ఇదేతరహా డిమాండ్లకు తలొగ్గి అధ్యక్ష రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవినే త్యాగం చేస్తారా? ఒకవేళ త్యజించినా హారిస్ అధ్యక్షపీఠమెక్కడం నైతికంగా ఎంత వరకు సబబు? అనే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ‘‘ బైడెన్ అద్భుతమైన నేత. ప్రజల ఎన్నో కోరికలను ఆయన నెరవేర్చారు.
ఈ ఒక్క విన్నపాన్నీ ఆయన మన్నించాలి. అధికార మార్పిడికి ఒప్పుకుని హారిస్‌కు అవకాశం ఇవ్వాలి. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టడానికంటే ముందే హారిస్ ఈ చివరి వారాలు అధికారంలో ఉంటే నైతిక విజయం కమలదే అనే బలమైన వాదనను వినిపించినవాళ్లమవుతాం. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయావకాశాలూ మెరుగవుతాయి.
చివరి రోజుల్లో బైడెన్ చేయగల గొప్పపని అంటూ ఏదైనా ఉందంటే అది ఇదే’’ అని కమలాహారిస్ కమ్యూనికేషన్స్ విభాగ మాజీ డైరెక్టర్ జమాల్ సైమన్స్ ఆదివారం విజ్ఞప్తిచేశారు. ‘‘ దేశవ్యాప్తంగా ట్రంప్‌తో పోలిస్తే కేవలం 36 లక్షల ఓట్లు మాత్రమే హారిస్‌కు తక్కువ వచ్చాయి. కోట్లాది మంది హారిస్‌ను అధ్యక్షపీఠంపై చూడాలనుకున్నారు. బైడెన్ దిగిపోయి హారిస్‌కు అవకాశమిస్తే వారి కల నెరవేరుతుంది. అమెరికా సైతం తొలి అధ్యక్షురాలిని చూస్తుంది’’ అని మరో డెమొక్రటిక్ నేత, నటుడు ఆండీ ఓస్ట్రీ అన్నారు.
ట్రంప్‌తో ముఖాముఖి డిబేట్‌కు ముందువరకు బైడెనే డెమొక్రటిక్ అభ్యర్థి. డిబేట్‌లో పేలవ ప్రదర్శన తర్వాత అత్యున్నతస్థాయి డెమొక్రటిక్ నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే బైడెన్‌ను రేస్ నుంచి తప్పించారు. కమలను బరిలో నిలిపారు. ఈసారి కూడా టాప్ డెమొక్రాట్ల లాబీయింగ్ పనిచేస్తుందో లేదో ఎవరికీ తెలీదు. అసలు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేవా అనే వార్తపై కూడా అంతర్జాతీయ మీడియాకు లీకులు రావడం లేదు.
25వ సవరణ ఏం చెప్తోంది?
అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే కమల ప్రెసిడెంట్ కావడం సాధ్యమే. రాజ్యాంగంలోని 25వ సవరణలోని ఒకటో సెక్షన్ ప్రకారం అధ్యక్షుడిని ఆ పదవి నుంచి తొలగించినా, అధ్యక్షుడు రాజీనామా చేసినా, లేదంటే చనిపోయినా అప్పటి ఉపాధ్యక్ష స్థానంలో ఉన్నవారే అధ్యక్షులవుతారు. ప్రస్తుతం కమల ఉపాధ్యక్షురాలు కాబట్టి ఒకవేళ బైడెన్ రాజీనామా చేసి తప్పుకుంటే సహజంగానే కమలకు అధ్యక్షపగ్గాలు చేతికొస్తాయి. అయితే ఇలా ఉద్దేశపూర్వకంగా చేయడం అనైతికమవుతుందని రిపబ్లికన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
‘‘ ఈ దుశ్చర్య ఏకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర’’ అని కాబోయే అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. కమల ఎందుకు అధ్యక్ష పదవికి అనర్హురాలో మరికొందరు భాష్యం చెబుతున్నారు. ఒక రాష్ట్రంలో అత్యధిక ఎలక్టోరల్ ఓట్లు గెలిస్తే ఆ రాష్ట్రంలోని ఓట్లన్నీ ఒక్క అభ్యర్థికే ధారాదత్తం అవుతాయి. ఈ విధానం కారణంగానే 2016 ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు.
ఆ ఎన్నికల్లో హిల్లరీక్లింటర్‌ను దేశవ్యాప్తంగా అత్యధిక ఓట్లు వచ్చాయి. అంటే పాపులర్ ఓటు సాధించారు. కానీ ఎలక్టోరల్ ఓట్లలో మెజారిటీ సాధించలేకపోయారు. ఈసారి ఎన్నికల్లో కనీసం పాపులర్ ఓటు సాధించిఉంటే కమలకు నైతిక అర్హత ఉండేదేమోనని కొందరు అభిప్రా యపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ట్రంప్ పాపులర్ ఓటుతోపాటు అత్యధిక ఎలక్టోరల్ ఓట్లనూ సాధించడం విశేషం. ఏదేమైనా పార్టీ తరఫున అభ్యర్థిత్వ రేసు నుంచి అనూహ్యంగా తప్పుకున్న బైడెన్ ఈసారి శ్వేతసౌధం నుంచి కూడా అర్ధంతరంగా బయటికొస్తారేమోనని కమల అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment