డెమొక్రాట్ల అంతర్మథనం
ఆ నీడను వదిలించుకోలేదు
హారిస్ తీరుపైనా విమర్శలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డెమొక్రాట్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోంది. ఓటమికి అధ్యక్షుడు జో బైడెనే ప్రధాన కారణమంటూ వారిలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. అధ్యక్ష రేసు నుంచి ఆయన ఆలస్యంగా తప్పుకోవడం పార్టీ పుట్టి ముంచిందంటూ మండిపడుతున్నారు. హారిస్ తీరునూ పలువురు నేతలు తప్పుబడుతున్నారు.
‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ మానసిక సంతులనం సరిగా లేదని ముందే తెలిసి కూడా సకాలంలో బయట పెట్టలేదు. దానికి తోడు బైడెన్ స్థానంలో అధ్యక్ష అభ్యర్థిగా ఖరారైన తర్వాత కూడా ఆయన నీడ నుంచి బయట పడలేదు’’అంటూ వారు ఆక్షేపిస్తున్నారు. ‘‘దాంతో బైడెన్ విధానాలపై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పదేపదే తీవ్ర విమర్శలు చేసినా సమర్థంగా తిప్పికొట్టలేకపోయారు. వాటిలో లోటుపాట్లను సరిచేసుకుంటామని స్పష్టంగా చెప్పి ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యారు’’అంటూ వాపోతున్నారు. ఈ దారుణ ఓటమితో డెమొక్రటిక్ పార్టీ భవితపై నీలినీడలు కమ్ముకున్నాయన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
81 ఏళ్ల బైడెన్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తానని 2023 ఏప్రిల్లోనే ప్రకటించారు. వయోభారం దృష్ట్యా తప్పుకోవాలని పార్టీ నేతలు చెప్పినా ససేమిరా అన్నారు. పారీ్టలో ట్రంప్‌ను ఓడించగల ఏకైక నేతను తానేనని వాదించారు. మరో నాలుగేళ్లు అధ్యక్షుడిగా కొనసాగే సత్తా తనకుందని, దేవుడు తప్ప ఎవరూ తనను తప్పించలేరని చెప్పుకున్నారు.
కానీ ట్రంప్‌తో తొలి డిబేట్‌లో ఆయన దారుణంగా తడబడటం, ప్రసంగం మధ్యలో ఆగి పదాల కోసం తడుముకోవడం డెమొక్రాట్లను హతాశులను చేసింది. బైడెన్ మానసిక సంతులనంపై అనుమానాలు పెరిగాయి. అభిప్రాయానికి పార్టీ నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు జూలైలో పోటీ నుంచి తప్పుకుని హారిస్‌కు దారిచ్చారు. దాంతో ప్రచారానికి ఆమెకు తక్కువ సమయం లభించింది. దానికి తోడు అప్పటికే ట్రంప్ గెలుపు ఖాయమనే తరహా వాతావరణం నెలకొని ఉంది. దాన్ని మార్చేసి ట్రంప్‌ను గట్టిగా ఢీకొట్టేలోపే పోలింగ్ తేదీ ముంచుకొచ్చింది. ఇదంతా ఆయనకు బాగా కలిసొచ్చిందని డెమొక్రాట్లు ఇప్పుడు తీరిగ్గా నిట్టూరుస్తున్నారు.
బైడెన్ నీడలోనే...
అమెరికాలో గత 70 ఏళ్లలో అత్యంత తక్కువ ప్రజాదరణ పొందిన అధ్యక్షుడు బైడెనేనని గాలప్ పోల్ సర్వే తేల్చింది. ప్రజల మనసులు గెలవలేకపోయిన రిచర్డ్ నిక్సన్, జిమ్మీ కార్టర్ కంటే కూడా ఆయనకు తక్కువ మార్కులు పడ్డాయి. అలాంటి అధ్యక్షుడి నీడ నుంచి హారిస్ బయటపడలేకపోవడం కూడా ఓటమికి గట్టి కారణంగా నిలిచిందని ఆమె సహాయకులే అంటున్నారు. ‘‘ఉపాధ్యక్షురాలిగా బైడెన్ నిర్ణాయల్లో తాను భాగమేనని ఆమె భావించారు. అందుకే బైడెన్ విధానాలపై ట్రంప్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకా ముందయ్యారు.
అలాగాక బైడెన్ విధానాల్లో లోటుపాట్లను సమీక్షించి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకుంటామని స్పష్టంగా చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’అని వారంటున్నారు. ఎకానమీ, వలసల వంటి కీలక విధానాలపై ట్రంప్ దూకుడుకు హారిస్ నుంచి గట్టి సమాధానమే లేకపోయిందని గుర్తు చేస్తున్నారు. కనీసం వాటికి దీటైన ఇతర అంశాలను తెరపైకి తేవడంలో కూడా ఆమె విఫలమయ్యారంటున్నారు. అంతేగాక అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి తెలిసి కూడా ముందే చెప్పకుండా తమను, అమెరికా ప్రజలను హారిస్ మోసగించారని పలువురు డెమొక్రాట్లు ఆక్రోశిస్తున్నారు. పైగా 78 ఏళ్ల ట్రంప్‌తో పోలిస్తే కొత్త ఓటర్లను ఆకట్టుకోవడంలో 60 ఏళ్ల హారిస్ విఫలమయ్యారని వారు విశ్లేషిస్తున్నారు. తమ ప్రచార తీవ్రత చాలలేదని హారిస్ ప్రచార కమిటీ సీనియర్ సలహాదారు డేవిడ్ ప్లోఫ్ అంగీకరించారు. ఇది దారుణమైన ఓటమేనంటూ ఎక్స్‌లో వాపోయారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment