
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసన సందర్భంగా హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. డెమొక్రాట్లను సామాజిక తీవ్రవాదులుగా అభివర్ణించిన రిపబ్లికన్లు... ట్రంప్‌ను ద్వేషిస్తూ కక్షపూరిత రాజకీయాలకు దిగారని మండిపడ్డారు. అదే విధంగా వాళ్లకు ఉక్రెయిన్ గురించి వివరాలు అక్కర్లేదని.. కేవలం అధికారం కోసమే అభిశంసనకు పట్టుబట్టారని ఆరోపించారు. ఇక అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యుడు బారీ లౌడర్‌మిల్స్ చర్చ సందర్భంగా.. ట్రంప్‌ను ఏకంగా జీసస్‌తో పోల్చారు. ‘ మీ చరిత్రాత్మక ఓటు ఉపయోగించుకునే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. వారం రోజుల్లో క్రిస్‌మస్ రాబోతుంది. ఆ జీసస్‌పై అసత్యపు ఆరోపణల నేపథ్యంలో.. విచారణలో తనపై ఆరోపణలు చేసిన వారిని ఎదుర్కొనే అవకాశం ఆయనకు లభించింది. కొన్ని హక్కులు కూడా లభించాయి. కానీ ఇక్కడ డెమొక్రాట్లు మాత్రం అంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా కేవలం అధ్యక్షుడిపై ఉన్న ద్వేషం కారణంగానే ఆయనను అభిశంసించారనే విషయాన్ని ప్రజలు తప్పక గుర్తుపెట్టుకుంటారని.. ఎన్నికల్లో డెమొక్రాట్లకు తగిన బుద్ధి చెబుతారని విమర్శలు గుప్పించారు.(అభిశంసనకు గురైన ట్రంప్)
ఇందుకు స్పందనగా డెమొక్రాట్లు సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘అధ్యక్షుడిపై వచ్చిన ఆరోపణలు, అందుకు గల సాక్ష్యాలను పరిశీలించకుండా... విమర్శలకు దిగుతూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ మండిపడ్డారు. ట్రంప్ అభిశంసన జ్యుడిషియరీ కమిటీలో భాగమైన జెర్రీ నాడ్లర్ మాట్లాడుతూ.. ‘మేం వినాలనుకోవడం లేదు అందుకే వినబోము. ఎందుకంటే అధ్యక్షుడి తప్పులు కప్పిపుచ్చడమే మా పని అన్నట్లు ఉంది’ అని రిపబ్లికన్ల విమర్శలను తిప్పికొట్టారు. ఇక హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ మాట్లాడుతూ... ‘అధ్యక్షుడి అధికార దుర్వినియోగం కారణంగా అభిశంసనకు గురయ్యారు. ఇది చాలా విషాద ఘటన. అయితే ఇంతకుమించి ఆయన మాకు మరో అవకాశం ఇవ్వలేదు. ఇది జాతీయ భద్రతకు, ఎన్నికల వ్యవస్థకు సమగ్రతకు, విశ్వసనీయతకు సంబంధించిన అంశం. కాబట్టి సభ్యులకు ఇది తప్పలేదు’ అని పేర్కొన్నారు.
ఇది అమెరికాపై దాడి
తనను అభిశంసించడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘వామపక్ష తీవ్ర భావజాలం.. దారుణమైన అబద్ధాలు ఆడింది. డెమొక్రాట్లు ఇంకేమీ చేయలేరు. ఇది అమెరికాపై దాడి. రిపబ్లికన్ పార్టీపై దాడి’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా అభిశంసన నేపథ్యంలో తనకు మద్దతుగా నిలుస్తున్న వారి ట్వీట్లు, తనకు సంఘీభావంగా ర్యాలీలు నిర్వహిస్తున్న వీడియోలను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో ట్రంప్ అభిశంసనకు గురయ్యారు. ప్రతిపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్ అభిశంసన తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో జనవరిలో ఆయన సెనేట్‌లో అభిశంసనను ఎదుర్కోనున్నారు. అయితే అక్కడ రిపబ్లికన్ల ఆధిక్యం ఉండటంతో ట్రంప్ అభిశంసన నుంచి తప్పించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
SUCH ATROCIOUS LIES BY THE RADICAL LEFT, DO NOTHING DEMOCRATS. THIS IS AN ASSAULT ON AMERICA, AND AN ASSAULT ON THE REPUBLICAN PARTY!!!!
— Donald J. Trump (@realDonaldTrump) December 18, 2019