డొనాల్డ్ ట్రంప్‌తో ముఖాముఖి చర్చలో జో బైడెన్ ఆద్యంతం తడబడటం, మాటల కోసం వెతుక్కోవడంతో డెమొక్రాట్లలో భయాందోళనలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 81 ఏళ్ల వయసులో బైడెన్ సమర్థుడైన అభ్యర్థి కాగలరా? మరో నాలుగేళ్లు అగ్రరాజ్యం అధినేతగా భారం మోయగలరా? అనే సందేహాలు ముప్పిరిగొన్నాయి.
నవంబరు 5న అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తుండటంతో వయోభారం రీత్యా అధ్యక్షుడి మానసిక సంతులతపై డెమొక్రాట్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి. టెక్సాస్ నుంచి డెమొక్రాట్ ఎంపీ ఒకరు బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని పిలుపునిచ్చారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థగా జో బైడెన్‌ను మార్చే అవకాశంఉందా? స్వయంగా ఆయన రేసు నుంచి తప్పుకోవచ్చా? అప్పుడు ఎవరు అధ్యక్ష అభ్యర్థి అవుతారు? అనే అంశాలను ఒకసారి పరిశీలిద్దాం.
బైడెన్‌పై తీవ్ర ఒత్తిడి
అవును.. తప్పుకోవచ్చు. కాకపోతే అందుకు ఆయన సిద్ధంగా లేరు. తానే డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థనని, వైదొలగాలని తననెవరూ ఒత్తిడి చేయడం లేదని బైడెన్ బుధవారం స్పష్టం చేశారు. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యరి్థని ఆగస్టు 19–22 వరకు షికాగోలో జరిగే డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్ (డీఎన్‌సీ)లో అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఓహియో రాష్ట్రంలో బ్యాలెట్ పేపర్‌పై పేరుండటానికి వీలుగా జూలై 21 నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు జరిగే వర్చువల్ కన్వెన్షన్‌లో తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. వివిధ రాష్ట్రాల ప్రైమరీల్లో వచి్చన ఫలితాల ఆధారంగా.. ఆ నిష్పత్తిలో అభ్యర్థులకు డెలిగేట్లను కేటాయిస్తారు.
దాదాపు 4,000 డెలిగేట్లలో 99 శాతం బైడెన్ గెల్చుకున్నారు. డీఎన్‌సీ నిబంధనల ప్రకారం వీరందరూ బైడెన్‌కు మద్దతు పలకాలి. ఒకవేళ రాబోయే రోజుల్లో ఒత్తిడి మరీ పెరిగిపోయి.. రేసు నుంచి వైదొలగాలని బైడెన్ నిర్ణయించుకుంటే.. అప్పుడు ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో పాటు ఇతరులెవరైనా డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వం కోసం పోటీపడవచ్చు. అప్పుడు డెలిగేట్లు జాతీయ కన్వెన్షన్‌లో (ఓపెన్ కన్వెన్షన్ అంటారు) తమకు నచ్చిన అభ్యర్థులను సూచించి ఒకరికి మెజారిటీ వచ్చేదాకా రౌండ్ల వారీగా ఓటింగ్ చేయొచ్చు. 1968లో అప్పటి అధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ మళ్లీ పోటీచేయకూడదని నిర్ణయించడంతో ఓపెన్ కన్వెన్షన్ నిర్వహించారు.
బలవంతంగా తప్పించొచ్చా?
పారీ్టలో మెజారిటీ మార్పును కోరుకొని బైడెన్ ససేమిరా అంటే ఆయన్ను బలవంతంగా తప్పించడానికి ఆస్కారం ఉంది. డీఎన్‌సీ నియమావళిలో కొన్ని లొసుగులు ఉన్నాయి. ’జాతీయ కన్వెన్షన్లో డెలిగేట్లు తమను ఎన్నుకున్న వారి అభిప్రాయాన్ని/ మనోగతాన్ని ప్రతిబింబించాలి’ అని నిబంధనలు చెబుతున్నాయి. అంటే డెమొక్రాటిక్ పార్టీ డెలిగేట్లు ఇతరుల వైపు కూడా మొగ్గు చూపవచ్చు (అదే రిపబ్లికన్ పారీ్టలో అయితే డెలిగేట్లు ఎవరి తరఫున అయితే ఎన్నికయ్యారో వారికే బద్ధులై ఉండాలని స్పష్టంగా ఉంది). బైడెన్ తరఫున ఎన్నికైన 3,894 డెలిగేట్లలో 1,976 మంది పైచిలుకు డెలిగేట్లు వర్చువల్ కన్వెన్షన్‌లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలి. అప్పుడు స్పష్టమైన తీర్పు రాక అదనపు రౌండ్ల ఓటింగ్ జరుగుతుంది. డెలిగేట్లు ఇంత పెద్ద సంఖ్యలో తిరుగుబాటు చేస్తారా? అని అమెరికా రాజకీయ పండితులు సందేహిస్తున్నారు. అయితే అధ్యక్ష అభ్యరి్థని ఎన్నుకొనే నిబంధనలను డీఎన్‌సీ రూల్స్ కమిటీ ఏ సమయంలోనైనా మార్చవచ్చు.
కమలా హారిస్‌కు ఛాన్స్ ఉందా?
నాలుగేళ్ల పదవీకాలంలో అధ్యక్షుడు ఎప్పుడైనా తప్పుకొంటే.. ఉపాధ్యక్షురాలైన కమలా హారిస్ ఆటోమెటిగ్గా పగ్గాలు చేపడతారు. కానీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఇలాంటి ఆస్కారం లేదు. ఓపెన్ కన్వెన్షన్‌లో అందరి అభ్యర్థుల్లాగే భారతీయ–అమెరికన్ హారిస్ కూడా పోటీపడాల్సి వస్తుంది. మెజారిటీ డెలిగేట్ల ఓట్లను సంపాదించాల్సి ఉంటుంది. అధ్యక్ష డిబేట్ తర్వాత సీఎన్‌ఎన్ నిర్వహించిన పోల్‌లో ట్రంప్‌కు 47 శాతం మంది ఓటర్లు మద్దతు పలుకగా, కమలా హారిస్‌కు 45 శాతం మంది మద్దతు లభించడం విశేషం. హారిస్‌కు అనుకూలించే మరో అంశం ఏమిటంటే.. డెమొక్రాటిక్ పార్టీ ప్రచార ఫండ్‌ను బైడెన్ కాకుండా ఆమె మాత్రమే నేరుగా పొందగలరు.
బైడెన్ స్వయంగా వైదొలిగితే తప్పితే ఆయన్ను అధ్యక్ష అభ్యరి్థగా తప్పించడం అంత సులభం కాదు. సాంకేతికంగా అవకాశాలు ఉన్నప్పటికీ ఆచరణలో కష్ట సాధ్యమే.
– సాక్షి నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment