బెదిరించి తప్పించారు: ట్రంప్
వాషింగ్టన్: సొంత డెమొక్రాటిక్ పార్టీ నేతల కుట్రలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలయ్యారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆయన్ను తొలుత బ్రతిమాలి, చివరకు భయపెట్టి అధ్యక్ష బరి నుంచి తప్పించారన్నారు. శనివారం మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘బైడెన్‌కు 1.4 కోట్ల మంది ఓటర్ల అండ ఉంది. పోటీలో కొనసాగాలని కృతనిశ్చయంతో కన్పించారు. అలాంటి బలమైన నేతను బెదిరించి తప్పించారు.
‘మర్యాదగా తప్పుకుంటే మంచిది. లేదంటే అవమానభారంతో పంపిస్తాం. అధ్యక్షుడు మరణించినా, బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో ఉన్నా 25వ రాజ్యాంగ సవరణ ద్వారా తప్పించగలమని బెదిరించారు. అలా ఇంటిదారి పట్టించారు. చేసేదేమీ లేక బైడెన్ తప్పుకున్నారన్నది వాస్తవం. కానీ మీడియాలో మాత్రం తప్పుడు కథనాలొచ్చాయి. ఆయన ధైర్యంగా ని్రష్కమించారంటూ అంతా ఆయనను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి ఆయనను బలవంతంగా పక్కకు నెట్టేశారు’’ అన్నారు.
కమలపై తిట్ల దండకం
డెమొక్రటిక్ పార్టీ నుంచి తన ప్రత్యరి్థగా దాదాపుగా ఖాయమైన కమలా హారిస్‌పై ట్రంప్ తిట్ల దండకానికి దిగారు. ‘‘ఆమె మితిమీరిన ఉదారవాది. స్థిరచిత్తం లేని నాయకురాలు. మతిలేని వామపక్షవాది. అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ ఉపాధ్యక్షురాలు. గతంలో మార్కిస్ట్ జిల్లా అటార్నీగా శాన్‌ఫ్రాన్సిస్కోను నాశనం చేశారు. ఇలాంటి నేత అమెరికా చరిత్రలో ఎన్నడూ అధ్యక్ష పోటీలో నిలబడలేదు. హారిస్ పొరపాటున దేశాధ్యక్షురాలైతే దేశంలో హింస, కల్లోలం నిత్యకృత్యాలవుతాయి.
ఆమె పరిపాలనలో అమెరికా అంతటా అతివాదం, వైఫల్యాలు, ఉద్రిక్త పరిస్థితులు.. చివరకు మూడో ప్రపంచ యుద్ధమే రావొచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో ఆమెను మనం గెలవకుండా అడ్డుకుందాం. ఆమె అమెరికాకు కాకుండా నేరగాళ్లకు అధ్యక్షురాలిగా మసులుకుంటారు. ఆమె గెలిస్తే గాజా నుంచి కూడా శరణార్థులు అమెరికాకు వచ్చి తిష్టవేస్తారు’ అని ట్రంప్ ఆరోపించారు. ‘నేను గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలి రోజే బైడెన్–హారిస్ హయాంలో తీసుకున్న సరిహద్దు విధానాలన్నింటినీ చెత్తబుట్టలో పడేస్తా. సరిహద్దును మూసేసి అక్రమ వలసలను అడ్డుకుంటా’ అని అన్నారు. అధికారంలోకి వస్తే క్రిప్టోకరెన్సీని సూపర్‌పవర్‌గా మలుస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment