ఒకవైపు పన్నులు.. మరోవైపు రాయితీలు
కేంద్ర బడ్జెట్‌పై భిన్న అంచనాలు
• సెక్యూరిటీల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచే అవకాశం
• క్యాపిటల్ గెయిన్స్‌లోనూ మార్పులు!
• కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు
• లేదంటే పలు రంగాలకు ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: కొంత బాదుడు... కొంత ప్రోత్సాహకం... ఫిబ్రవరి 1న మోదీ సర్కారు తీసుకురానున్న బడ్జెట్ రూపం ఇలా ఉండనుంది. కానీ, వ్యాపారులు, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరించే మోదీ సర్కారు నగదు కొరతతో ఆర్థికంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సమయంలో ఆకస్మిక చర్యలకు దిగకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెక్యూరిటీల ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచే అవకాశం, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను మినహాయింపులను సవరించొచ్చన్న అంచనాలున్నాయి. మార్కెట్ పార్టిసిపెంట్లు తగినంత మొత్తాన్ని జాతి నిర్మాణం కోసం పన్ను రూపంలో చెల్లించాల్సి ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గత డిసెంబర్‌లో చేసిన ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లలో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఏడాది లోపు షేర్లను కొని విక్రయిస్తే స్వల్ప కాలిక మూలధన లాభాల పన్నును చెల్లించాలనే నిబంధన ఉంది. ఏడాదికి మించి అట్టిపెట్టుకున్న షేర్లపై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేదు. అయితే, ప్రధాని ప్రకటన తర్వాత దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధించొచ్చన్న అనుమానాలు తలెత్తాయి. ప్రభుత్వం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను విధింపునకు బదులు ప్రస్తుతమున్న ఏడాది కాలాన్ని మూడేళ్లకు మార్చే అవకావం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఇటువంటి చర్యలకు సంబంధించి ఏదైనా ప్రతికూల ప్రభావం ఎదురైనా... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు లేదా నోట్ల రద్దు వల్ల నష్టపోయిన రంగాలకు ఇచ్చే ప్రోత్సాహక చర్యలతో దాన్ని ప్రభుత్వం అధిగమిస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ‘‘ప్రభుత్వం వ్యాపార నిర్వహణ వ్యయం, సంక్లిష్టతలను తగ్గించాలనుకుంటోంది. భారత్ పోటీతత్వాన్ని పెంచడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించాలని భావిస్తోంది. కానీ, అదే సమయంలో ద్రవ్య పరమైన లక్ష్యాలను చేరుకునేందుకు ఆదాయపరమైన ఒత్తిడులను ఎదుర్కొంటోంది’’ అని డెలాయిట్ హస్కిన్స్ అండ్ సెల్స్ ట్యాక్స్ పార్ట్‌నర్ రాజేష్ హెచ్‌గాంధీ పేర్కొన్నారు.
మరోవైపు పరోక్ష నిధుల బదిలీ పన్ను విషయంలో విదేశీ పోర్ట్‌ఫోలియే ఇన్వెస్టర్లు మరింత స్పష్టతను కోరుకుంటున్నారు. విదేశీ కంపెనీలు తమ ఆస్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ మొత్తం భారత్‌లో కలిగి ఉంటే, తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో పరోక్ష బదిలీ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆదాయపన్ను శాఖ గత డిసెంబర్‌లో ప్రకటన చేసింది. తమ పోర్ట్‌ఫోలియోలో 50 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని భారత్‌లో పెట్టుబడి పెట్టిన విదేశీ ఫండ్స్‌కు ఈ ప్రకటన శరాఘాతమే. ఈ విషయంలో అవి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.