ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వారం దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్‌ని ఎలా లెక్కించాలో ఉదాహరణతో తెలుసుకుందాం. స్థిరాస్తులను రెండు రకాలుగా విభజించవచ్చు.
1) 2001 ఏప్రిల్ 1కి ముందు కొన్నవి
2) 2001 ఏప్రిల్ 1 తర్వాత కొన్నవి
మొదటిగా 2001 ఏప్రిల్ 1కి ముందు కొన్నవాటికి 01–04–2001ని కటాఫ్ తేదీగా నిర్ధారించారు. ఈ తేదీకి ముందు కొన్న ఆస్తి విషయంలో మీరు కొన్న ధరని పరిగణించరు. ఆ స్థిరాస్తి విలువ 2001 ఏప్రిల్ 1న ఎంతో నిర్ధారించాలి. అయితే, ఇక్కడ ‘‘ఫెయిర్ మార్కెట్ విలువ’’ అన్న పదం వాడారు. దీని అర్ధం మీరు అమ్ముకునే విలువ కాదు. 2001 ఏప్రిల్ 1న డిపార్టుమెంటు వారు.. అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు .. ఎంత విలువ మీద ‘‘స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు’’ వసూలు చేస్తారో అంత మొత్తాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పాయింట్‌లో నిర్ధారించే విలువ.. కొన్న ధర. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటుందో అదే తీసుకుంటారు.
ఉదాహరణకు, 11–01–1980న మీరొక ఇల్లు కొన్నారనుకుందాం. ఆ రోజున ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించారు. ధర రూ. 30,00,000. ఈ మొత్తం మీద స్టాంపు డ్యూటీ చెల్లించారు. ఆ ఇంటిని ఈ ఆర్థిక సంవత్సరంలో (2023–24) రెండు కోట్ల రూపాయలకు అమ్ముతున్నారనుకుందాం. 2001 ఏప్రిల్ 1న మీ ఇంటి మార్కెట్ విలువ .. అంటే మీరు అమ్ముకోగల విలువ రూ. 80,00,000 అనుకుందాం. కానీ, రాష్ట్ర ప్రభుత్వపు సబ్ రిజిస్ట్రార్ వారు రూ. 50,00,000కు ధృవీకరణ పత్రం ఇచ్చారు. కచ్చితంగా సర్టిఫికెట్ తీసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న వేల్యుయేషన్‌నే పరిగణిస్తారు కాబట్టి రూ. 50,00,000 విలువనే తీసుకుంటారు. దీన్ని 2001 ఏప్రిల్ 1న 100గా పరిగణించి, ఇన్‌కం ట్యాక్స్ వారు జారీ చేసిన పట్టిక .. కాస్ట్ ఆఫ్ ఇండెక్స్. ఇఐఐ అంటారు. ఇది పెద్ద పట్టిక. స్థలాభావం వల్ల ఇక్కడ పొందుపర్చడంలేదు. వెబ్‌సైట్‌లోనూ,పుస్తకాల్లోనూ, గూగుల్‌లోనూ దొరుకుతుంది.
2023–24వ ఆర్థిక సంవత్సరానికి దీని విలువ 348. అంటే 2001 ఏప్రిల్ 1న వంద రూపాయలుగా ఉంటే ఇప్పుడు 348గా పరిగణిస్తారు. 2001 ఏప్రిల్ 1 నాటి ధృవీకరణ విలువను ఈ మేరకు పెంచుతారు. ఇలా చేయడాన్ని కాస్ట్ ఆఫ్ ఇండెక్సింగ్ అని అంటారు. దీని ప్రకారం మీరు కేవలం రూ. 30,00,000కు కొన్నప్పటికీ ఆనాటి రూ. 50,00,000ను పరిగణనలోకి తీసుకుంటే 50,00,000/100 x 348 = రూ. 1,74,00,000గా .. అంటే కోటి డెబ్భై నాలుగు లక్షలుగా పరిగణిస్తారు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్‌ని లెక్కించండి.
అమ్మిన ధర 2 రూ. కోట్లలో
ఇండెక్స్‌డ్ కాస్ట్ 1.7 రూ. కోట్లలో
లాభం 0.26 రూ. కోట్లలో
ఏతావాతా లాభం .. క్యాపిటల్ గెయిన్స్ కేవలం రూ. 26 లక్షలే. ఈ మొత్తమే పన్ను భారానికి గురి అవుతుంది. దీన్ని ట్యాక్స్ ప్లానింగ్ ద్వారా లేకుండా చేసుకోవచ్చు. లేదా పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని మీ ఇష్టం వచ్చిన విధంగా వాడుకోవచ్చు.
పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ-మెయిల్ పంపించగలరు.
Comments
Please login to add a commentAdd a comment