
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లో అత్యధిక శాతం మంది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లేనని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ (ఎన్‌ఎస్‌ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్పష్టం చేశారు. మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించే 11 కోట్లమందిలో కేవలం 2 శాతమే డెరివేటివ్స్‌లో పాలు పంచుకుంటుంటారని వివరించారు.
మార్కెట్ పార్టిసిపెంట్లలో 98 శాతంమంది దీర్ఘకాలానికి మదుపు చేసేవారేనని పేర్కొన్నారు. ఇది దేశీయంగా క్రమశిక్షణ కలిగిన పెట్టుబడుల పద్ధతిని సూచిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి మెజారిటీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడులకే కట్టుబడుతుంటారని తెలియజేశారు. తద్వారా ఇటీవల సింగపూర్‌లో జరిగిన బృంద చర్చలో భారత స్టాక్ మార్కెట్లు ప్రధానంగా ఊహాజనిత(స్పెక్యులేటివ్) ట్రేడింగ్‌పైనే ఆధారపడి కదులుతుంటాయన్న అభిప్రాయాలకు చెక్ పెట్టారు.
పెట్టుబడులులేని పెట్టుబడిదారీవిధానం ప్రాధాన్యత సంతరించుకుంటున్నట్లు చౌహాన్ పేర్కొన్నారు. ఈ అంశంపై ఇలా స్పందించారు. ‘సంప్రదాయబద్ధంగా చూస్తే భారీ పెట్టుబడుల ద్వారా మాత్రమే సంపద సృష్టి జరుగుతుందన్నది వాస్తవమే అయినా ఇటీవల ఆధునిక సాంకేతికతలు రూల్స్‌ను తిరగరాస్తున్నాయి. ఏఐ, బ్లాక్‌చెయిన్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ తదితరాలు కనీస పెట్టుబడితోనే వ్యాపార విస్తరణకు దారి చూపుతున్నాయి. వెరసి ఎకనామిక్ మోడల్ సంప్రదాయ పెట్టుబడి ఆవశ్యకత విధానాల నుంచి దూరం జరుగుతోందంటూ’ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment