నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE)లో నమోదిత ఇన్వెస్టర్ (investors) బేస్ (ఒకే ఖాతా) 2025 జనవరి 20న 11-కోట్ల (110 మిలియన్లు) మార్కును దాటింది. ఈ ఎక్స్ఛేంజ్‌లో రిజిస్టర్ అయిన క్లయింట్ కోడ్‌ల (ఖాతాలు) మొత్తం 21 కోట్ల (210 మిలియన్లు) కంటే ఎక్కువగా ఉన్నాయి (ఇప్పటి వరకు నమోదైన అన్ని క్లయింట్ రిజిస్ట్రేషన్‌లు కలిపి). సాధారణంగా క్లయింట్లు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను నమోదు చేసుకోవచ్చు.
ఎన్‌ఎస్‌ఈ (NSE)లో ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్‌లు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ పెరుగుదలను చూశాయి. ఇవి గత ఐదేళ్లలో 3.6 రెట్లు పెరిగాయి. 1994లో ఎన్‌ఎస్‌ఈ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుండి 1 కోటి పెట్టుబడిదారులను చేరుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. తర్వాత వేగం పుంజుకుంది. తదుపరి 1 కోటి రిజిస్ట్రేషన్‌లకు ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కోటి కోసం మరో 3.5 సంవత్సరాలు పట్టింది. ఇక నాలుగో కోటి మైలురాయికి కేవలం ఒక ఏడాదే పట్టింది. పెట్టుబడిదారుల ఉత్సాహం, స్టాక్ మార్కెట్‌లో భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తూ కేవలం ఐదు నెలల్లోనే చివరి 1 కోటి మంది పెట్టుబడిదారులు నమోదయ్యారు.
గత ఐదు నెలల్లో రోజువారీ కొత్త విశిష్ట (ఒక ఖాతా) పెట్టుబడిదారుల నమోదులు స్థిరంగా 47,000 నుంచి 73,000 మధ్య ఉన్నాయి. వేగవంతమైన డిజిటలైజేషన్ పురోగతి, పెట్టుబడిదారుల అవగాహనను పెంచడం, ఆర్థిక చేరిక ప్రయత్నాలు, బలమైన మార్కెట్ పనితీరుతో సహా అనేక కీలక కారకాలు ఈ వృద్ధికి దారితీశాయి. 2024లో నిఫ్టీ 50 ఇండెక్స్ 8.8% రాబడిని అందించగా, నిఫ్టీ 500 ఇండెక్స్ 15.2% లాభాన్ని సాధించింది. గత తొమ్మిదేళ్లుగా భారతీయ మార్కెట్లు సానుకూల రాబడులను కలిగి ఉన్నాయి. 2024 డిసెంబర్‌తో ముగిసిన ఐదేళ్ల కాలంలో నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీలు వరుసగా 14.2%, 17.8% వార్షిక రాబడిని అందించాయి. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత పెంచాయి.
మార్కెట్‌లో 20 శాతం కుటుంబాలు
2014 మే 1నాటికి 1.65 కోట్ల మంది ఉన్న ఇన్వెస్టర్లు నేడు 11 కోట్లకు చేరుకున్నారు. అంటే గత 10 సంవత్సరాలలో పెట్టుబడిదారుల భాగస్వామ్యంలో దాదాపు ఏడు రెట్లు పెరిగింది. దేశంలోని 20 శాతం కుటుంబాలు ఇప్పుడు నేరుగా మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2014 మే 1 నాటికి రూ. 73.5 లక్షల కోట్లు ఉండగా ఇప్పుడిది దాదాపు 6 రెట్లు పెరిగి రూ.425 లక్షల కోట్లకు చేరింది.
యువ ఇన్వెస్టర్లు
మార్కెట్లోకి వస్తున్న కొత్త పెట్టుబడిదారుల గణనీయమైన సంఖ్య మార్పును ప్రతిబింబిస్తోంది. నేడు ఈ పెట్టుబడిదారుల మధ్యస్థ వయస్సు ఇప్పుడు దాదాపు 32 సంవత్సరాలు. వీరిలో 40% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారే ఉన్నారు. కేవలం ఐదేళ్ల క్రితం కొత్త ఇన్వెస్టర్ల మధ్యస్థ వయస్సు 38 సంవత్సరాలు ఉండేది. యువ పెట్టుబడిదారులలో స్టాక్ మార్కెట్‌పై పెరుగుతున్న ఆసక్తిని ఇది తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment