ముంబై: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం ర్యాలీకి తోడ్పడ్డాయి. సూచీలు నాలుగోరోజూ ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డ్‌లను నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 299 పాయింట్ల లాభంతో 65,504 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 19,407 వద్ద మొదలయ్యాయి.
తొలి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో సూచీలు కొంతమేర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల్లో అధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఇంట్రాడేలో వరుసగా నాలుగోరోజూ సెన్సెక్స్ 468 పాయింట్లు పెరిగి 65,673 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు బలపడి 19,434 కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 65,479 వద్ద ముగిసింది. ఈ సూచీకిది వరుసగా అయిదోరోజూ లాభాల ముగింపు.
నిఫ్టీ మార్కెట్ ముగిసేసరికి 66 పాయింట్లు బలపడి 19,389 వద్ద స్థిరపడింది. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు చిన్న, మధ్య తరహా షేర్లకూ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్ సూచీలు 0.22%, 0.05 % చొప్పున లాభపడ్డాయి. ఇంధన, ఆటో, కన్జూమర్, కమోడిటీ, టెలికం షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,134 కోట్లు ఈక్విటీ షేర్లు కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.785 షేర్లు అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి 11 పైసలు బలపడి 82.02 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.
అయిదురోజుల్లో రూ.7.90 లక్షల కోట్లు
సెన్సెక్స్ వరుస రికార్డుల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. గడిచిన అయిదు రోజుల్లో ఈ సూచీ 2,500 పాయింట్లకు పైగా బలపడటంతో బీఎస్‌ఈ ఎక్సే్చంజీలో రూ.7.90 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.44,898 కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.2,98.57 లక్షల కోట్లకు చేరింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
♦ ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్‌ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ షేరు లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.585)తో పోలిస్తే బీఎస్‌ఈలో 5% ప్రీమియంతో రూ.615 వద్ద లిస్టయ్యింది. తొలి సెషన్‌లో 15% ర్యాలీ రూ.670 స్థాయికి చేరింది. ఆఖరికి 0.04% స్వల్ప నష్టంతో రూ.584.75 వద్ద ఫ్లాటుగా ముగిసింది.
♦ ఐడీఎఫ్‌సీ విలీనానికి బోర్డు ఆమోదం తెలపడంతో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 4% నష్టపోయి రూ.79 వద్ద స్థిరపడింది. అయితే ఐడీఎఫ్‌సీ షేరు మాత్రం 6 శాతం పెరిగి రూ.116 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 2% పెరిగి రూ.111 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment