ముంబై: సానుకూల జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ సూచీల రికార్డు ర్యాలీ సోమవారమూ కొనసాగింది. అధిక వెయిటేజీ రిలయన్స్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్ ద్వయం షేర్లు రాణించడం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు కలిసొచ్చాయి. దేశీయంగా మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాలు నమోదు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి.
సెన్సెక్స్ ఉదయం 117 పాయింట్ల లాభంతో 64,836 వద్ద మొదలైంది. నిఫ్టీ 58 పాయింట్లు పెరిగి 19,247 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తొలి గంట తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే మిడ్‌సెషన్ సమయంలో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది.
ఇంధన, ఆర్థిక, మెటల్, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో అధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఇంట్రాడేలో వరుసగా మూడోరోజూ సెన్సెక్స్ 581 పాయింట్లు పెరిగి 65,300 వద్ద, నిఫ్టీ 156 పాయింట్లు బలపడి 19,345 కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేసాయి. చివరికి సెన్సెక్స్ 486 పాయింట్ల లాభంతో 65,205 వద్ద ముగిసింది. ఈ సూచీకిది వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు. మార్కెట్ ముగిసేసరికి 134 పాయింట్లు బలపడి 19,323 వద్ద స్థిరపడింది. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు చిన్న, మధ్య తరహా షేర్లకూ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్ సూచీలు 0.56%, 0.30% చొప్పున లాభపడ్డాయి.
జూన్ వాహన విక్రయాలు అంతంత మాత్రంగా ఉండటంతో ఆటో షేర్లు నష్టపోయాయి. ఐటీ, టెక్, విద్యుత్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలపడి 81.95 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ అరశాతానికి పైగా ర్యాలీ చేయడంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.1.73 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి రూ.2.98 లక్షల కోట్లకు చేరింది. ద్రవ్యోల్బణం దిగిరావడంతో కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల సైకిల్‌ను ఆపేయ్యొచ్చనే అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఆసియాలో జపాన్ ఇండెక్స్ నికాయ్ 33 ఏళ్ల గరిష్టం(33,753) ముగిసింది.
‘‘మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీతో పలు షేర్ల వాల్యూయేషన్లు భారీగా పెరిగాయి. నిఫ్టీ ఎఫ్‌వై 24 ఆదాయ అంచనాకు 20 రెట్ల అధిక ప్రీమియంతో ట్రేడవుతోంది. ఇది చరిత్రాత్మక సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం నెలకొన్న సానుకూల పరిస్థితులు మార్కెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్లే వీలుంది. ఏదైన చిన్న ప్రతికూలాంశం అనూహ్య దిద్దుబాటుకు దారి తీయవచ్చు. కావున పెట్టుబడులు పెట్టేటప్పుడు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించాలి’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ వ్యూహకర్త వీకే విజయ కుమార్ తెలిపారు.
మార్కెట్లో మరిన్ని సంగతులు
♦విలీనం తర్వాత తొలి ట్రేడింగ్ సెషన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు సానుకూలంగా స్పందించాయి. ఇంట్రాడేలో హెచ్‌డీఎఫ్‌సీ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు వరుసగా 4%, 3% చొప్పున ర్యాలీ చేసి రూ.2,926 వద్ద, రూ.1,758 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకాయి. చివరికి హెచ్‌డీఎఫ్‌సీ షేరు 2% లాభంతో రూ.2,871 వద్ద ముగిసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు ఒక శాతం పెరిగి రూ.1,719 వద్ద స్థిరపడింది. మొత్తంగా ఈ రెండు కంపెనీల మార్కెట్ విలువ రూ.14.93 లక్షల కోటక్లు పెరిగింది.
♦ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏడాది గరిష్టం (45,353) తాకింది. చివరికి ఒకశాతం లాభంతో 45,158 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇండెక్స్ సైతం 52 వారాల గరిష్టం(20,398) అందుకొని ఆఖరికి 1% లాభంతో 20,253 వద్ద నిలిచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ సూచీలు సైతం జీవితకాల గరిష్ట స్థాయి వద్ద ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment