
న్యూఢిల్లీ: పసిడి మరోసారి కొత్త గరిష్ట రికార్డును నమోదు చేసింది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9% స్వచ్ఛత) రూ.1,650 పెరగడంతో రూ.98,100 స్థాయికి చేరింది. క్రితం రికార్డు రూ.96,450ను చెరిపేసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండడం బంగారం ధరలకు ఆజ్యం పోస్తోంది.
బంగారం ఈ నెల 11న ఒక్క రోజే 10 గ్రాములకు రూ.6,250 పెరగడం గమనార్హం. ఈ ఏడాది ఇప్పటి వరకు 23.56 శాతం ర్యాలీ చేసింది. జనవరి 1న రూ.79,390 స్థాయి నుంచి చూస్తే 10 గ్రాములకు రూ.18,710 లాభపడింది. మరోవైపు వెండి కిలోకి రూ.1,900 పెరిగి రూ.99,400కు చేరింది.
‘‘బంగారం మళ్లీ భారీ ర్యాలీ చేసింది. ఎంసీఎక్స్‌లో రూ.95,000 స్థాయిని చేరింది. సురక్షిత సాధనానికి ఉన్న బలమైన డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది తెలిపారు.
భౌగోళిక అనిశ్చితులకుతోడు అమెరికా–చైనా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు చల్లారనంత వరకు బంగారం ర్యాలీకి అవకాశాలున్నట్టు చెప్పారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్‌కు 105 డాలర్లు పెరిగి 3,349 డాలర్ల సరికొత్త ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిని తాకింది.