ముంబై: కొత్త ఏడాది తొలి ట్రేడింగ్ సెషన్‌లోనూ సూచీల రికార్డుల జైత్రయాత్ర కొనసాగింది. ఇంధన, సర్వీసెస్, టెలికం షేర్లు రాణించడంతో సోమవారం ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ కొత్త సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి. అయితే లాభాల స్వీకరణతో తదుపరి వెనక్కి వచ్చాయి.
ఉదయం స్వల్ప నష్టంతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 322 పాయింట్లు పెరిగి 72,562 వద్ద, నిఫ్టీ 103 పాయింట్లు బలపడి 21,834 వద్ద జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఆటో, బ్యాంకులు, కన్జూమర్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగి 72,271 వద్ద, నిఫ్టీ 11 పాయింట్ల లాభంతో 21,742 వద్ద నిలిచాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.73%, 0.54% చొప్పున రాణించాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఆసియా, యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా మార్కెట్లకూ సెలవు. డాలర్ మారకంలో రూపాయి విలువ ఆరు పైసలు పతనమై 83.22 వద్ద స్థిరపడింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
►డిసెంబర్‌లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడంతో ఆటో షేర్లు నష్టపోయాయి.
►ఎన్‌పీఏ పోర్ట్‌ఫోలియో విక్రయంలో భాగంగా జేసీ ఫ్లవర్స్ ఏఆర్‌సీ నుంచి రూ.150 కోట్లు అందుకున్నట్లు ఎక్సే్చంజీలకు సమాచారం ఇవ్వడంతో యస్ బ్యాంక్ షేరు ఐదున్నర శాతం పెరిగి రూ. 22.64 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 7% లాభపడి రూ.22.99 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
►దక్షిణ మధ్య రైల్వే నుంచి రూ.121 కోట్ల ఆర్డర్ దక్కించుకోవడంతో రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేరు 4.50% లాభపడి రూ.353 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 10% ఎగసి రూ.371 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment