మూలధన నష్టాలను, లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా?  | Know which MF category to choose how adjust capital losses | Sakshi
Sakshi News home page

మూలధన నష్టాలను, లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా? 

Published Mon, Nov 14 2022 9:16 AM | Last Updated on Mon, Nov 14 2022 9:17 AM

Know which MF category to choose how adjust capital losses - Sakshi

ఫ్రాంక్లిన్‌ ఇండియా ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. నాస్‌డాక్‌ 100 ఈటీఎఫ్‌ (పన్ను పరంగా డెట్‌ ఫండ్‌) పెట్టుబడులపై నష్టాలు వచ్చాయి. ఈ నష్టాన్ని లాభంలో సర్దుబాటు చేసి, మిగిలిన లాభంపైనే ఆదాయపన్ను చెల్లిస్తే సరిపోతుందా? – సంజయ్‌ కుమార్‌

లాభాల్లో నష్టాలను సర్దుబాటు చేసుకోవడాన్ని ‘సెట్టింగ్‌ ఆఫ్‌ లాసెస్‌’గా పేర్కొంటారు. ఒక సాధనంలో మూలధన నష్టాన్ని, మరో సాధనంలో మూలధన లాభంతో సర్దుబాటు చేసుకోవడాన్ని ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 70 అనుమతిస్తోంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను తెలుసుకోవాలి. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్ప కాల మూలధన లాభాలతోనూ, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. కేవలం దీర్ఘకాల మూలధన లాభాలతోనే వీటిని సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది.

పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా లాభాలు స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కిందకు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ అయితే ఏడాది వరకు (ఏడాది నిండకుండా) లాభాలు స్వల్పకాలంగా, ఏడాదికి మించితే దీర్ఘకాలంగా చట్టం పరిగణిస్తోంది. ఈక్విటీయేతర మ్యూచువల్‌ ఫండ్స్‌లో మూడేళ్ల వరకు లాభాలు స్వల్పకాలంగాను, మూడేళ్లు, అంతకు మించిన కాలానికి వచ్చేవి దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు.  

ఉదాహరణకు మీరు ఈ ఏడాది రెండు రకాల దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించారని అనుకుందాం. ఒకటి ఈక్విటీ, రెండోది ఈక్వీటీయేతర ఫండ్‌. ఈక్విటీ ఫండ్‌లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన నష్టం చ్చింది. నాన్‌ ఈక్విటీ ఫండ్‌లో రూ.4 లక్షల దీర్ఘకాల లాభం వచ్చింది. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.4 లక్షల నుంచి దీర్ఘకాల మూలధన నష్టం రూ.లక్ష మినహాయించి, మిగిలిన రూ.3 లక్షలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండూ దీర్ఘకాలిక సాధనాలే. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేనప్పుడు వాటిని ఎనిమిది సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్‌ (కొనసాగించుకోవడం) చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది వచ్చిన నష్టాన్ని.. భవిష్యత్‌ 8 సంవత్సరాల లాభాల్లో అయినా చూపించుకోవచ్చు.  
దీర్ఘకాల పెట్టుబడులకు స్మాల్‌ క్యాప్‌ఫండ్స్‌ మంచివేనా?   – వర్షిల్‌ గుప్తా 
స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు కేవలం దీర్ఘకాలం ఒక్కటీ చాలదు. ఫండ్‌లో నష్టాలు వచ్చినా, పెట్టుబడుల విలువ క్షీణించినా తట్టుకుని పెట్టుబడులు కొనసాగించే సామర్థ్యం కూడా ఉండాలి. దీర్ఘకాలంలో స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌ను సంపద సృష్టి మార్గంగా చూడొచ్చు. కానీ, స్మాల్‌క్యాప్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం అంత సులభం కాదు. మార్కెట్‌ పతనాల్లో ఇవి అదే పనిగా క్షీణిస్తూ, నష్టాలను చూపిస్తుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి రాబడులు ఇస్తున్నప్పుడు.. అదే సమయంలో రాబడులు చూపించని స్మాల్‌క్యాప్‌ మాదిరి సాధనాల్లో పెట్టుబడులు పెడితే ఆందోళన చెందడం సహజం. అందుకనే స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు, మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం మించి కేటాయింపులు చేసుకోరాదు. ఓ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే సంపద సృష్టి జరుగుతుంది. అదే సమయంలో సంపదను తుడిచి పెట్టే కంపెనీలు కూడా ఉంటాయి. చిన్న కంపెనీలు ఆటుపోట్లకు ఎక్కువగా గురవుతుంటాయి. 

స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఉన్న అనుకూలతలను చూస్తే.. దీర్ఘకాలంలో ఇవి పెట్టుబడులపై రాబడులు కురిపిస్తాయి. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ పెరగని సందర్భాల్లోనూ ఇవి వృద్ధిని చూపించగలవు. చిన్న కంపెనీలను ఇనిస్టిట్యూషన్స్‌ పెద్దగా పట్టించుకోవు. కనుక తెలివైన ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్‌ విభాగం చాలా పెద్దది. ప్రతీ స్మాల్‌క్యాప్‌ పథకం కూడా భిన్నమైనది. భిన్నమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటాయి. కనుక వీటి మధ్య సారూప్యత ఉండదు. సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తూ రిస్క్‌ తగ్గించుకోవచ్చు. అయితే, స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌లో లిక్విడిటీ అన్నది పెద్ద సవాలు. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి వస్తే విలువ గణనీయంగా తగ్గిపోతుంది. కొనేవారు కరువై లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చు. పైగా, స్మాల్‌క్యాప్‌ పథకాలు పెద్ద సైజుతో ఉంటే ప్రతికూలతే. అంటే ఒక స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ నిర్వహణ ఆస్తులు రూ.2,000 కోట్లు, అంతకంటే తక్కువే ఉండడం అనుకూలం. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే వీటిల్లో అస్థిరతలు ఎక్కువ. మార్కెట్లలో సెంటిమెంట్‌ మారిపోతే ఇవి ఎక్కువ నష్టపోతుంటాయి. ఏ సమయంలో స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేశారన్నది (ఏకమొత్తంలో) రాబడులను నిర్ణయిస్తుంది.

- ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement