adjustment
-
నీటి కేటాయింపులు.. ఆ ఆరు ప్రాజెక్టులకే పరిమితం
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల్లో నీటి కేటాయింపుల్లేని ఆరు ప్రాజెక్టులకు కేటాయింపులు చేయడంపైనే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 పరిమితమైందని న్యాయ, సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే అధికారం తమకు లేదంటూ ‘పాలమూరు–రంగారెడ్డి’ పథకంపై చేసిన విచారణలో ట్రిబ్యునల్ తేల్చిచెప్పడమే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూలులో ఏపీలోని హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ, వెలిగొండ.. తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులకే పరిమితం కానుంది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడాలని విభజన చట్టంలో సెక్షన్–89లో కేంద్రం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో కేడబ్ల్యూడీటీ–1 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల జోలికి కేడబ్ల్యూడీటీ–2 వెళ్లే అవకాశంలేదు. ఉమ్మడి రాష్ట్రానికి మిగులు జలాలు 194 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయిస్తూ 2013లో తుది నివేదిక ఇచ్చింది. ఇందులో తెలుగుగంగకు 25 టీఎంసీలు కేటాయించింది. విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ద్వారా కేంద్రం ఆ ట్రిబ్యునల్‌కే కట్టబెట్టింది. దాంతో 2016 నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ జరుపుతోంది. ఏపీకి 125.5.. తెలంగాణకు 47 టీఎంసీలు విభజన చట్టం 11వ షెడ్యూలులో కేంద్రం ఆమోదించిన తెలుగుగంగకు తుది తీర్పులోనే 25 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 కేటాయించింది. శ్రీశైలం నుంచి 29 టీఎంసీల కృష్ణా వరద జలాలకు 30 టీఎంసీల పెన్నా జలాలు జతచేసి తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టారు. అంటే.. తెలుగుగంగకు మరో 4 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి 40 టీఎంసీలు తరలించేలా హంద్రీ–నీవా, 38 టీఎంసీలు తరలించేలా గాలేరు–నగరి, 43.5 టీఎంసీలు తరలించేలా వెలిగొండను ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీకి 125.5 టీఎంసీలు అవసరం. మరోవైపు.. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి 22 టీఎంసీలు తరలించేలా నెట్టెంపాడు, శ్రీశైలం నుంచి 25 టీఎంసీలు తరలించేలా కల్వకుర్తి ఎత్తిపోతలను చేపట్టారు. ఈ రెండు ప్రాజెక్టులకు తెలంగాణకు 47 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటే 172.5 టీఎంసీలు అవసరం. కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన మిగులు జలాలు 169 టీఎంసీలను.. ఆ ఆరు ప్రాజెక్టులకు ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు సర్దుబాటు చేయనుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త ప్రాజెక్టులకు కొత్త ట్రిబ్యునలే.. ఇక విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టినా.. ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘంతో మదింపు చేయించుకుని, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోవాలి. అపెక్స్ కౌన్సిల్లో ఏకాభిప్రాయానికి రాని ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల కోసం అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956 ప్రకారం కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాల్సి ఉంటుందని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంచేసింది. విభజన తర్వాత తెలంగాణ సర్కార్ ‘కృష్ణా’పై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస, నెట్టెంపాడు, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), మిషన్ భగీరథలకు నీటి కేటాయింపులపై విచారణ చేయాలంటే కొత్త ట్రిబ్యునల్‌ను వేయాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. -
గుడ్ న్యూస్: వీఆర్ఏల కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు, ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)ను ఇతర ప్రభుత్వ శాఖల్లో విలీనం చేసే ప్రక్రియలో మరో ముందడుగు పడింది. వీఆర్ఏలను పలు శాఖల్లో విలీనం చేసుకునేందుకు వీలుగా ఆయా శాఖల్లో సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పించేందుకు ఆర్థిక శాఖ అంగీకారం తెలిపింది. ఈ మేరకు 14,954 సూపర్ న్యూమరరీ పోస్టులను కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్, మున్సిపల్ శాఖలో 1,266 వార్డు ఆఫీసర్లు (జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ), రెవెన్యూ శాఖలోనే 2,113 రికార్డు అసిస్టెంట్లు, 679 సబార్డినేట్/చైన్‌మెన్ పోస్టులు, సాగునీటి శాఖ పరిధిలో 5,073 లస్కర్లు, హెల్పర్ పోస్టులు, మిషన్ భగీరథలో 3,372 హెల్పర్ పోస్టులను కల్పించేందుకు అనుమతిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయా శాఖల వారీగా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు కల్పిస్తున్నారన్న దానిపై స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇదీ చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ఆర్డీవో వ్యవస్థ రద్దు! -
మరిన్నీ అవకాశాలిస్తా.. గదిలో సర్దుకుపోవాలన్నారు: బుల్లితెర నటి జీవిత
సినీ ఇండస్ట్రీలో ఎదగాలంటే అంతా ఈజీ కాదు. ఎన్నో అవకాశాలు తలుపుతట్టినా కూడా అదృష్టం కలిసి రావాలి. సినీ రంగుల ప్రపంచం అంటేనే సవాళ్లతో కూడుకున్నది. సినీ ఇండస్ట్రీ కెరీర్ ప్రారంభంలో పలువురు స్టార్ హీరోయిన్లు సైతం వేధింపులకు గురైనవారే. తాజాగా ఈ జాబితాలో ఓ బుల్లితెర నటి చేరింది. కడైకుట్టి సింగం తమిళ సీరియల్ ఫేమ్ జీవిత తన కెరీర్లో ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆమెకు ఎదురైన సంఘటనపై నోరు విప్పింది. ఆ సంఘటన తర్వాత జీవితంపై విరక్తి కలిగిందని చెబుతోంది. (ఇది చదవండి: అలా చేస్తేనే హీరోయిన్ ఛాన్సులిస్తామన్నారు: నటి) ఓ ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ..' ఒక దర్శకుడు తనకు ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేశాడు. అధిక రెమ్యూనరేషన్, మరిన్ని సినిమా అవకాశాల ఇస్తానని చెప్పాడు. అయితే వాటి కోసం సర్దుకు పోవాలని కోరాడు. నాకు అప్పట్లో సినిమా ఇండస్ట్రీ కొత్త. కెమెరామెన్, నిర్మాత, మేనేజర్‌తో సర్దుకుపోవాలన్నారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు గదికి రావాలి అన్నారు. దీంతో దర్శకుడి మాటలకు షాక్ తిన్నా. ఆ సమయంలో నాకు ఏడుపొచ్చేసింది. దర్శకుడి మాటలకు అవమానంగా ఫీలయ్యా. దీంతో అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వచ్చేశా.' అని అన్నారు. ఇటీవలే సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై నటి వరలక్ష్మి శరత్‌కుమార్, ఖుష్బూ కూడా నోరు విప్పారు. తాము కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు. -
మూలధన నష్టాలను, లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చా?
ఫ్రాంక్లిన్ ఇండియా ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్‌లో పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభాలు వచ్చాయి. నాస్డాక్ 100 ఈటీఎఫ్ (పన్ను పరంగా డెట్ ఫండ్) పెట్టుబడులపై నష్టాలు వచ్చాయి. ఈ నష్టాన్ని లాభంలో సర్దుబాటు చేసి, మిగిలిన లాభంపైనే ఆదాయపన్ను చెల్లిస్తే సరిపోతుందా? – సంజయ్ కుమార్ లాభాల్లో నష్టాలను సర్దుబాటు చేసుకోవడాన్ని ‘సెట్టింగ్ ఆఫ్ లాసెస్’గా పేర్కొంటారు. ఒక సాధనంలో మూలధన నష్టాన్ని, మరో సాధనంలో మూలధన లాభంతో సర్దుబాటు చేసుకోవడాన్ని ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 70 అనుమతిస్తోంది. కాకపోతే ఇందుకు సంబంధించి కొన్ని షరతులను తెలుసుకోవాలి. స్వల్పకాల మూలధన నష్టాలను.. స్వల్ప కాల మూలధన లాభాలతోనూ, అలాగే దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాల విషయంలో కొంత వ్యత్యాసం ఉంది. కేవలం దీర్ఘకాల మూలధన లాభాలతోనే వీటిని సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా లాభాలు స్వల్పకాలం లేదా దీర్ఘకాలం కిందకు వస్తాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏడాది వరకు (ఏడాది నిండకుండా) లాభాలు స్వల్పకాలంగా, ఏడాదికి మించితే దీర్ఘకాలంగా చట్టం పరిగణిస్తోంది. ఈక్విటీయేతర మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్ల వరకు లాభాలు స్వల్పకాలంగాను, మూడేళ్లు, అంతకు మించిన కాలానికి వచ్చేవి దీర్ఘకాల మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు మీరు ఈ ఏడాది రెండు రకాల దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించారని అనుకుందాం. ఒకటి ఈక్విటీ, రెండోది ఈక్వీటీయేతర ఫండ్. ఈక్విటీ ఫండ్‌లో రూ.లక్ష దీర్ఘకాల మూలధన నష్టం చ్చింది. నాన్ ఈక్విటీ ఫండ్‌లో రూ.4 లక్షల దీర్ఘకాల లాభం వచ్చింది. అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం రూ.4 లక్షల నుంచి దీర్ఘకాల మూలధన నష్టం రూ.లక్ష మినహాయించి, మిగిలిన రూ.3 లక్షలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ రెండూ దీర్ఘకాలిక సాధనాలే. మూలధన నష్టాలను సర్దుబాటు చేసుకునే అవకాశం లేనప్పుడు వాటిని ఎనిమిది సంవత్సరాల పాటు క్యారీ ఫార్వార్డ్ (కొనసాగించుకోవడం) చేసుకోవచ్చు. అంటే ఈ ఏడాది వచ్చిన నష్టాన్ని.. భవిష్యత్ 8 సంవత్సరాల లాభాల్లో అయినా చూపించుకోవచ్చు. దీర్ఘకాల పెట్టుబడులకు స్మాల్ క్యాప్ఫండ్స్ మంచివేనా? – వర్షిల్ గుప్తా స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు కేవలం దీర్ఘకాలం ఒక్కటీ చాలదు. ఫండ్‌లో నష్టాలు వచ్చినా, పెట్టుబడుల విలువ క్షీణించినా తట్టుకుని పెట్టుబడులు కొనసాగించే సామర్థ్యం కూడా ఉండాలి. దీర్ఘకాలంలో స్మాల్‌క్యాప్ ఫండ్స్‌ను సంపద సృష్టి మార్గంగా చూడొచ్చు. కానీ, స్మాల్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం అంత సులభం కాదు. మార్కెట్ పతనాల్లో ఇవి అదే పనిగా క్షీణిస్తూ, నష్టాలను చూపిస్తుంటాయి. మార్కెట్లో ఇతర విభాగాలు మంచి రాబడులు ఇస్తున్నప్పుడు.. అదే సమయంలో రాబడులు చూపించని స్మాల్‌క్యాప్ మాదిరి సాధనాల్లో పెట్టుబడులు పెడితే ఆందోళన చెందడం సహజం. అందుకనే స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు, మొత్తం పెట్టుబడుల్లో 10-15 శాతం మించి కేటాయింపులు చేసుకోరాదు. ఓ చిన్న కంపెనీ, పెద్ద కంపెనీగా మారిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే సంపద సృష్టి జరుగుతుంది. అదే సమయంలో సంపదను తుడిచి పెట్టే కంపెనీలు కూడా ఉంటాయి. చిన్న కంపెనీలు ఆటుపోట్లకు ఎక్కువగా గురవుతుంటాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో ఉన్న అనుకూలతలను చూస్తే.. దీర్ఘకాలంలో ఇవి పెట్టుబడులపై రాబడులు కురిపిస్తాయి. లార్జ్‌క్యాప్ స్టాక్స్ పెరగని సందర్భాల్లోనూ ఇవి వృద్ధిని చూపించగలవు. చిన్న కంపెనీలను ఇనిస్టిట్యూషన్స్ పెద్దగా పట్టించుకోవు. కనుక తెలివైన ఇన్వెస్టర్లు ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి చేసుకోవచ్చు. స్మాల్‌క్యాప్ విభాగం చాలా పెద్దది. ప్రతీ స్మాల్‌క్యాప్ పథకం కూడా భిన్నమైనది. భిన్నమైన పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంటాయి. కనుక వీటి మధ్య సారూప్యత ఉండదు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ రిస్క్ తగ్గించుకోవచ్చు. అయితే, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో లిక్విడిటీ అన్నది పెద్ద సవాలు. ఒకేసారి అమ్మకాల ఒత్తిడి వస్తే విలువ గణనీయంగా తగ్గిపోతుంది. కొనేవారు కరువై లిక్విడిటీ సమస్య ఏర్పడవచ్చు. పైగా, స్మాల్‌క్యాప్ పథకాలు పెద్ద సైజుతో ఉంటే ప్రతికూలతే. అంటే ఒక స్మాల్‌క్యాప్ ఫండ్ నిర్వహణ ఆస్తులు రూ.2,000 కోట్లు, అంతకంటే తక్కువే ఉండడం అనుకూలం. మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే వీటిల్లో అస్థిరతలు ఎక్కువ. మార్కెట్లలో సెంటిమెంట్ మారిపోతే ఇవి ఎక్కువ నష్టపోతుంటాయి. ఏ సమయంలో స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేశారన్నది (ఏకమొత్తంలో) రాబడులను నిర్ణయిస్తుంది. - ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్
కరోనా రాకముందే... అలాగే, దాని గురించి తెలిసిన కొత్తలో దాని కారణంగా చాలామందిలో కొన్ని మానసిక సమస్యలు కనిపించడం వైద్యులు గమనించారు. ఉదాహరణకు... యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి కొన్ని. అలాగే ఇప్పుడు రెండో వేవ్ కొనసాగుతూ ఉండగా...ఇందులోనూ తమకు సన్నిహితులూ... కొందరైతే తమ సొంత కుటుంబ సభ్యులను కోల్పోవడంతో మరింత తీవ్రమైన మానసిక సమస్యలను చవిచూశారూ...చూస్తున్నారు. అందులో ప్రధానమైనది ‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్’. దాని గురించి తెలుసుకుందాం. గత ఏడాది మొదటి కరోనా వేవ్ సీజన్లో దాని గురించి పెద్దగా తెలియని పరిస్థితుల్లో చాలామంది తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. ఇలా ఒత్తిడికి గురైనప్పుడు కొన్ని మానసిక లక్షణాలూ కనిపిస్తాయి. కొందరిలో ఈ లక్షణాలు తొందరగానే తగ్గిపోవచ్చు. అలా వచ్చి తగ్గిపోయిన సమస్యలను ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు. మరికొందరిలో అవి తీవ్రమైన ఒత్తిడి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, యాంగ్జైటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, ఫోబియా, ఓసీడీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలుగా మారే అవకాశమూ ఉండింది. అప్పుడూ ఇప్పుడు కూడా కరోనా విషయమై బాగా టెన్షన్‌గా ఉండటం, తీవ్రమైన ఆందోళన, విపరీతమైన బెంగ... వ్యాధి వస్తుందా, వస్తే తగ్గుతుందా, లేక మరణానికి దారితీస్తుందా లాంటి సందేహాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇప్పటి రెండో సీజన్లోనూ అలా అవుతున్నారు. దాన్ని కరోనా ఫోబియా గా చెప్పవచ్చు. వాళ్లలో కరోనా లేకపోయినా... లేదా వచ్చి తగ్గిన వారిలోనూ మళ్లీ మళ్లీ ఎన్నోసార్లు పరీక్ష చేయించుకుంటూ ఉంటారు. వారిలో ఆ వ్యాధి లేదనీ... ఒకసారి వచ్చి తగ్గినందున మళ్లీ ఆ వెంటనే సాధారణంగా రాదని చెప్పినా భయం పోదు. ఇలా తమకు దూరంగా ఉన్న రక్తసంబంధీకులు, కావాల్సినవారు ఎలా ఉన్నారో అంటూ ఆందోళన పడవచ్చు. ఇలాంటి ఆందోళన తో టెన్షన్ పడటాన్ని ‘జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ (జీఏడీ)’గా చెప్పవచ్చు. టెన్షన్‌తోపాటు విపరీతంగా భయపడటాన్ని ప్యానిక్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. అంటే వీళ్లు కరెన్సీనీ, కూరగాయలనూ, తమ ఇంటిలోని సొంత ఆత్మీయులనూ తాకడానికి కూడా తీవ్రమైన భయాందోళనలకు గురవుతూ ప్యానిక్ అవుతుంటారు. దీన్ని ‘ప్యానిక్ డిజార్డర్’ గా చెప్పవచ్చు. ఇక చేతులకు మళ్లీ మళ్లీ శానిటైజర్ పూసుకోవడం, చేతులు అదేపని గా కడుక్కోవడం చేస్తూ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్‌కూ లోను కావచ్చు. ఒకసారి చేతులు కడుక్కున్నా లేదా శానిటైజర్ పూసుకున్నా దాదాపు గంటపాటు రక్షణ ఉందని తెలిశాక కూడా ప్రతి ఐదు నిమిషాలకూ ఇలా చేస్తుంటే ఓసీడీగా పేర్కొనవచ్చు. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే... అంతకు ముందు ఉన్న సాకుకూల స్థితి తొలగిపోయి ఒకేసారి కొత్త పరిస్థితులకు ఎక్స్పోజ్ అయినప్పటుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో, దానికి తగినట్లుగా తమను తాము ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలియని అయోమయంలో వ్యక్తులు తీవ్రమైన వ్యాకులతకూ, కుంగుబాటుకు గురియ్యే అవకాశం ఉంది. దాన్నే ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’గా పేర్కొనవచ్చు. లక్షణాలు - అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అవే లక్షణాలన్నీ అందరిలోనూ కనిపించకపోవచ్చు. బాగా దగ్గరివారు ఆ లక్షణాలను గమనిస్తూ ఉండటం అవసరం. అవి... ఏదో తెలియని భయం/ఆందోళన/గుబులు/గాభరా ∙గుండెవేగంగా కొట్టుకోవడం/గుండెదడ/గుండెల్లో మంట / గుండె బిగబట్టినట్టుగా ఉండటం/ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ - అకస్మాత్తుగా అంతులేని భయానికీ లోనవ్వడం (ప్యానిక్ అటాక్) , విపరీతంగా చెమటలు పట్టడం, ఛాతీ బిగబట్టినట్టుగా అనిపించడం / ఛాతీలో మంట , శ్వాససరిగా అందకపోవడం లేదా బలంగా ఊపిరి తీసుకోవడం / ఆయాస పడటం - నోరు తడారిపోవడం ఒళ్లు జలదరించడం ∙అయోమయం, కడుపులో గాభరా కడుపులో మంట, ఎక్కువసార్లు మూత్రానికి వెళ్తూ ఉండటం. చేతులు, కాళ్లు వణకడం, ఒకచోట నిలకడగా ఉండలేకపోవడం. - నిత్యం అలజడిగా ఉండటం, తీవ్రమైన నిద్రలేమి, నిద్రవేళల్లో మార్పులు, వేళకు నిద్రపట్టకపోవడం (ఇర్రెగ్యులర్ స్లీప్ పాట్రన్స్), అకస్మాత్తుగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేవడం ఇక ఆ తర్వాత నిద్రపట్టకపోవడం - ఈ లక్షణాలతో పాటు కొత్త పరిస్థితులకు అడ్జెస్ట్ అయ్యేందుకు పడే ప్రయాసలో డిప్రెషన్‌కు గురైన వారిలో తీవ్రమైన నిరాశ, నిస్పృహ, నెగెటివ్ ఆలోచనలు రావడం, భవిష్యత్తు ఆశాజనకంగా కనిపించకపోవడం వంటి లక్షణాలూ కనిపించడంతో పాటు ఆత్మహత్యకు పాల్పడే లక్షణాలూ (సూసైడల్ టెండెన్సిస్) కూడా కనిపిస్తాయి. ఆత్మహత్యకు చేసుకోవలన్న ఆలోచనలు మాటిమాటికీ వస్తుంటాయి. దీని నుంచి బయటపడటం ఎలా? - మీ ఇతర కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, తెలిసినవారు, మీ శ్రేయోభిలాషులు అనుకున్నవారితో భౌతికంగా కాకపోయినా... వర్చువల్‌గా (అంటే మొబైల్ లేదా ఫేస్‌టైమ్‌తో) వారితో సన్నిహితంగా ఉండండి. వారితో మీ సంతోషదాకయమైన క్షణాలను స్మరిస్తూ... ఆ ఆనందకరమైన సమయాలు మళ్లీ త్వరలోనే వస్తాయనే ఆశాభావంతో కూడిన సంభాషణలు చేయండి. - మీ దగ్గరివారు కూడా కోవిడ్‌ను ఎదుర్కోవడమో, తమకు ఆత్మీయులైనవారిని కోల్పోవడమో చేసి ఉండవచ్చు. వారు ఈ క్రైసిస్‌ను ఎలా ఎదుర్కొన్నారు అనే లాంటి అంశాలను మాట్లాడుతూ... మీరూ ఆ మాటలతో మోటివేట్ అయ్యేలా మీ సంభాషణలు ఉండాలి. వారి నుంచి మీరు స్ఫూర్తి పొందేలాంటి సంభాషణలే వినండి. వారి ధైర్యసాహసాలను మెచ్చుకోండి. వాటిని మీరు మీలోనూ నింపుకోండి. - మీకు ఇష్టమైనవారి ధైర్యసాహసాలను, వారు వారి క్రైసిస్ నుంచి బయటపడ్డ తీరును, వారి మంచి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచండి. దాంతో ఇతరులూ స్ఫూర్తి పొందుతారు. ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచినప్పుడు ఇతరులు వాటిని లైక్ చేస్తే... మీరు వాటిని మళ్లీ మళ్లీ చదువుతున్నప్పుడు మీరూ ఉత్తేజితులవుతారు. ∙ - మీ అనుభవాలను ఉత్తరాలుగా రాసుకోండి. వాటిని మీరు మళ్లీ చదువుకోండి లేదా ఇష్టమైనవారికి పంపండి లేదా మీరే చించివేయండి. - మీకు ఇష్టమైన హాబీలలో నిమగ్నం కావాలి. గతంలో మీరు ప్రదర్శించిన నైపుణ్యాలను మళ్లీ వెలికి తీయాలి. అంటే పెయిటింగ్, డాన్స్ వంటి వాటిలో నిమగ్నమవుతూ... వాటిని ఆస్వాదిస్తూ ఉండాలి. మీరు బాగా ప్రదర్శించిన వాటికి మీకు మీరే బహుమతులు ఇచ్చుకుంటూ మిమ్మల్ని మీరు మోటివేవ్ చేసుకోవడమూ అవసరం. - గతంలో మీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలు మాటిమాటికీ తలచుకోవాలి. ‘అప్పుడు వాటిని చేసింది కూడా నేను కదా. మరలాంటప్పుడు నేను ఇప్పుడూ అవే ధైర్యసాహసాలను ప్రదర్శించగలను కదా’ అంటూ ధైర్యం చెప్పుకోవాలి. ∙ఆటలూ, క్రీడలూ వంటివి క్రీడా స్ఫూర్తి పెంచుతూ... ఓటమిని తేలిగ్గా తీసుకునే అడ్జస్ట్మెంట్ బిహేవియర్‌ను వేగవంతం చేయడమే కాకుండా... కొత్త పరిస్థితులకు తేలిగ్గా సర్దుకుపోయే గుణాన్ని పెంపొందిస్తాయి. డిప్రెషన్ నుంచి వేగంగా బయటపడేస్తాయి. - ఇంట్లోనే వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడులో ఎండార్ఫిన్స్ వంటి సంతోషకరమైన రసాయనాలు వెలువడుతాయి. అవి ఆనందాన్ని పెంచి డిప్రెషన్‌ను అధిగమించేందుకూ తోడ్పడతాయి. ఇవి కూడా చేయండి: రోజూ అన్ని పోషకాలు ఉండే సమతులాహారం, మంచి పౌష్టికాహారం తీసుకోండి. ∙టీవీలో మీకు విపరీతమైన ఆందోళన కలిగించే వార్తలను చూడకండి, వినకండి. ∙మీకు చాలా ఇష్టమైనవారితోనే సమయం గడపండి. ∙ఆహ్లాదకరమైన సంగీతం/పాటలు వినండి. - ఇంట్లోనే మీకు ఇష్టమైన సినిమాలు చూడండి. ముఖ్యంగా హాస్యచిత్రాలు. - బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడంతో పాటు... యోగా, ప్రాణాయామ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. - ఈ పరిస్థితేమీ ప్రమాదకరం కాదంటూ మీకు మీరు ధైర్యం చెప్పుకుంటూ ఉండండి. ఒకవేళ అది సాధ్యపడకపోతే... టెలిఫోన్లోనే మీ కుటుంబ డాక్టర్‌తో లేదా సైకియాట్రిస్ట్‌తో మాట్లాడి, ప్రొఫెషనల్స్ సలహా తీసుకోండి. అలాంటివారిలోనూ మీ పట్ల సహానుభూతితో ఉండేవారినే ఎంచుకుని వారిని సంప్రదించండి. సెకండ్‌వేవ్‌లో కనిపిస్తున్న ప్రధాన మానసిక సమస్య... అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగై్జటీ అండ్ డిప్రెషన్ మొదటివేవ్‌తో పోలిస్తే ఈసారి సెకండ్ వేవ్‌లో... కుటుంబ సభ్యులూ, తమకు కావాల్సిన సన్నిహితులు, ఆత్మీయులు మరణించడంతో... చాలామంది ఇప్పుడు ‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ మానసిక సమస్యతో బాధపడుతుండటాన్ని చాలామంది సైకియాట్రిస్టులు చూస్తున్నారు. ఈ సమస్య తాలూకు కొన్ని కేస్ స్టడీలు కేస్ స్టడీ 1 : డెబ్బయి ఏళ్ల పెద్దవయసు దంపతులు సొంతకూతుర్ని పోగొట్టుకున్నారు. యూఎస్‌లో ఉండే వారి కుమారుడు ఇక్కడికి వచ్చేసి వాళ్లకు చికిత్స అందిస్తున్నాడు. అతడు తన ఉద్యోగం కోసం యూఎస్‌కు వెళ్లే పరిస్థితి లేదు. కేస్ స్టడీ 2 : మంచి ఉద్యోగం చేస్తూ బాగా సంపాదిస్తున్న ఓ యువకుడు ఇటీవల కరోనాతో మరణించాడు. దాంతో 58 ఏళ్ల వయసున్న అతడి తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. వీళ్లంతా‘‘అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్’’ గురైనట్లు తేలింది. -
సర్దుకుపోవాలి!
కిక్కిరిసిన జనంతో భారంగా కదులుతున్న బస్సులో నేను. ఎలాగోలా సీటు సంపాదించా. ఆలోచనలన్నీ సరళ చుట్టూ. భార్యలంతా ఇంతేనా? ‘కొంచెం అడ్జస్ట్ అవ్వండి’... బస్సు నాదే అన్నట్లు ఓ గొంతు. ఇద్దరు పట్టే సీట్లో ముగ్గురా? అన్నా. ‘సర్దుకో..’ ఏకవచనం. తప్పుతుందా.. సర్దుకున్నా. మళ్లీ ఆలోచనలో పడ్డా. కూరగాయలు తేకపోవడం తప్పా? పిల్లలతో హోమ్‌వర్క్ చేయించడం నా పనా? పొద్దున్నే నీళ్లు నేనెందుకు పట్టాలి? అవన్నీ ఇంటిపట్టున ఉండే భార్య పనులే కదా. ఆలోచనలకు బ్రేక్ వేస్తూ... సనత్ నగర్ అనే అరుపు. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చా. అందర్నీ దాటుకుంటూ, అడ్జస్ట్ అవుతూ ఎలాగోలా బస్సు దిగా. వడివడిగా ఆఫీసు వైపు అడుగులేశా. మేనేజర్‌కి ఓ నమస్కారం పడేసి, శరీరాన్ని కుర్చీకి, కళ్లను ఫైళ్లకు అప్పగించా. మనసు మాత్రం సరళ చుట్టూ. పనిలో పడాలంటే ఓ మంచి కాఫీ తాగాలి. బాయ్‌ని పిలిచి కాఫీ అడిగితే, అరగంట ఆలస్యంగా టీ తెచ్చాడు. ‘కాఫీ అడిగా కదా’ అంటే, ‘అడ్జస్ట్ అవ్వండి సార్’ అన్నాడు. తప్పుతుందా... సర్దుకున్నా. అయిష్టంగానే టీ లాగించేసి, సరళ ఆలోచనలను బలవంతంగా పక్కనపెట్టి ఫైళ్లల్లోకి తల దూర్చా. ఫర్లేదు.. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్లడానికి ఓ రెండు గంటల ముందే కంప్లీట్ చేయొచ్చనుకున్నా. ఈలోపు మేనేజర్ నుంచి పిలుపు. ‘ఏవయ్యా.... ఇవాళ రవీంద్ర రాలేదు. అతని ఫైల్స్ కూడా నువ్వే చూడు’ ఆర్డర్ జారీ చేశాడు. బిక్కమొహం వేసుకుని చూస్తే... ‘కొలీగ్స్ రాకపోతే సర్దుకోవాలయ్యా’... అన్నాడు. తప్పుతుందా. అడ్జస్ట్ అవ్వాలని ఫిక్సయ్యా. ఫైళ్లతో పాట్లు పడుతుంటే కడుపులో అలారం మోగింది. వాచీ చూస్తే ఒంటి గంట. లంచ్ బాక్స్ తీసుకుని, స్టాఫ్ రూమ్కెళ్లా. ‘బాక్సులో ఏం ఉంది’ అడిగారు జమున. ‘ఆ.. ఏముంటుంది? అయితే బెండకాయ లేకపోతే దొండకాయ... ఏదీ లేకపోతే ఉండనే ఉంటుంది కదా.. ఆలు’ అంటూ బాక్సు ఓపెన్ చేశా. ఆలూ కర్రి. రొటీన్ అనుకుంటూ బాక్స్ ఖాళీ చేశా. మళ్లీ ఫైళ్లతో కుస్తీ. సాయంత్రం నాలుగు. ఈసారి టీ అడిగితే బాయ్ టీయే తెచ్చిచ్చాడు. హమ్మయ్య అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకున్నా. కానీ, చల్లారిన టీ. ప్రాణం ఉసూరుమంది. ‘అడ్జస్ట్ అవ్వాలి గురూ’ అనుకుంటూ, చల్లని టీని నీళ్లు తాగినట్లుగా గటగటా తాగేశా. చకాచకా పనులు పూర్తి చేసుకుని, ఈ పూటకు అయిందనిపించి, ఆఫీసు నుంచి బయటపడ్డా. ఫుట్‌బోర్డ్ మీద వేలాడుతున్న జనాలతో కిర్రుమని సౌండ్ చేసుకుంటూ బస్సు వచ్చి ఆగింది. ఎలాగోలా బస్సు ఎక్కా. ‘అబ్బా.. చూసుకోవచ్చు కదా. అలా తొక్కావేంటి?’ పక్కనే ఉన్న కుర్రాడి మీద గయ్మన్నా. ‘ఓ ఇదైపోతున్నారు. ఎవరూ తొక్కకూడదంటే ఆటోలో వెళ్లండి. లేకపోతే సర్దుకుని నిలబడండి’ అన్నాడు. తప్పుతుందా.. సర్దుకున్నా. నా స్టాప్ రాగానే హడావిడిగా బస్సు దిగి, ఇంటి దారి పట్టా. ఇంట్లోకి అడుగుపెట్టగానే... సరళ ఎదురొచ్చింది. నేనడిగింది ఏం చేశారు? ‘కుదరదు. అన్నేసి రోజులు ఊరెళితే ఎలా?’ అన్నాను. ‘అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. వెళితే తప్పేంటి? ఓ నాలుగు రోజులు సర్దుకోలేరా?’ రివర్శ్ క్వశ్చన్. కోరు.. కోరంటే కోరు. అంతే.. నేనెందుకు సర్దుకోవాలి? అన్నా. కోపంతో విసావిసా వంటింట్లోకి వెళ్లిపోయింది. ఆ కోపాన్నంతా గిన్నెల మీద చూపించింది. కాసేపాగి... ‘పోనీ మా అమ్మానాన్నలని ఇక్కడికి పిలిపిద్దాం. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుని వెళతారు’. ‘మూడు గదుల ఇంట్లో ఇద్దరు పిల్లలు, మనం... మనకే ఇరుకు. ఎలా కుదురుతుంది?’ అని తెగేసి చెప్పా. ఓ వారం రోజులు అడ్జస్ట్ అవ్వలేమా? లేము.. లేము.. అంతే అన్నా. ఈసారి సరళకు కోపంతో పాటు బాధ కూడా కలిగినట్లుంది. ఇల్లు ఇరుకంట ఇరుకు.. ఏం వారం రోజులు అడ్జస్ట్ చేసుకోలేమా? ఏడుచుకుంటూ లోపలికి వెళ్లింది. ఇలాంటి ఏడుపులకు కరిగిపోతాననుకోకు... అంటుండగానే... సరళ అన్న ‘అడ్జస్ట్’ అనే మాట గుర్తొచ్చి, ఆలోచనలో పడ్డా. ఆఫీసుకి బయల్దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేసరికి... ఎన్నిసార్లు ‘అడ్జస్ట్’ అయ్యానో గుర్తుకొచ్చింది. మనసు అదోలా అయింది. పరిచయం లేనివాళ్ల కోసం బస్సులో సీటు ‘అడ్జస్ట్’, ఆఫీస్ బోయ్ కాఫీకి బదులు టీ తెచ్చిస్తే ఏమీ అనలేక ‘అడ్జస్ట్’, కొలీగ్ రాకపోతే ఆఫీసు పనితో ‘అడ్జస్ట్’.. ఏమీ కాని వాళ్ల కోసం ఇన్ని అడ్జస్ట్మెంట్లా? జీవితాంతం తోడూ నీడగా ఉండి, కష్టసుఖాలు పంచుకునే భార్య విషయంలో ‘అడ్జస్ట్’ అవ్వకూడదా? ఇంటి ఇల్లాలంటే అంత చిన్న చూపా? మనసు చివుక్కుమంది. అంతే... సరళను ఊరికి పంపించడానికి టికెట్స్ బుక్ చేయాలనుకున్నా. పక్క రూములో ఉన్న పర్సు తీసుకోవడానికి వెళితే, కాస్త దూరంలో సరళ తన తల్లితో ఫోనులో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. ‘ఆయన మనిషి మంచివాడే. నేను లేకపోతే గడవదు. అందుకే రాలేకపోతున్నానమ్మా. నాన్న ఉంటారు కదా.. ఎలాగోలా అడ్జస్ట్ అవుతావా?’ అనడుగుతోంది. ‘వద్దు వద్దు.. అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరంలేదు. రేపే నీ ప్రయాణం. లేకపోతే అత్తయ్యగారిని, మామయ్యగారిని ఇక్కడికే పిలిపిద్దాం..’ అన్న నా మాటలు వినపడి, సరళ తలెత్తి చూసింది. కళ్లల్లో మెరుపులు. ‘ఇక జీవితాంతం నీతో అడ్జస్ట్ అవుతా బంగారం. ఇంటి పనులతో నీకు క్షణం తీరిక ఉండడంలేదు. నేనూ హెల్ప్ చేస్తా’ అన్నా. ‘మీకోసం ఏ విషయంలో అయినా అడ్జస్ట్ అవుతా’ అంది సరళ. టిఫిన్ బాక్సులో ఏ కూర ఉంటే ఆ కూరే. మా సరూ ఏదంటే అదే అన్నా.. ప్రేమగా చూస్తూ.. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో అక్కడ అడ్జస్ట్ అవుతున్నాం. ఏ మాటకా మాట.. అడ్జస్ట్మెంట్లో చాలా ఆనందం ఉంది. సంసారం బాగుండాలంటే సర్దుకుపోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ‘ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ.. ఎప్పటికీ’... ఎప్పుడో ఎక్కడో విన్న సామెత గుర్తొచ్చింది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ! సురేశ్... సరళాసురేశ్. సినిమాలో సంసారం నాకు వెయ్యి చేతులు ఉన్నాయా? సర్దుకుపొండీ! కృష్ణ (జగపతిబాబు), రాధ (సౌందర్య) దంపతులు. పెళ్లైన కొత్తల్లో సినిమాలు, షికార్లు, సరదాలతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడూ ఇలానే ఉండాలనుకుంటాడు కృష్ణ. కానీ, ఇద్దరు బిడ్డలు పుట్టాక పరిస్థితులు మారిపోతాయి. ఇంటి బాధ్యతలతో రాధ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కృష్ణ మాత్రం పిల్లల కోసం రాధ తనను దూరం పెడుతుందని భావిస్తాడు. అలాంటి సందర్భంలో ఓసారి.. ‘ఏంటి రాధా... బెడ్రూమ్లో బట్టలు పెట్టలేదు’ అని భార్యపై అరుస్తాడు కృష్ణ. ‘ఇవతల పనిలో ఉన్నానండీ.. మీరే తీసుకోండి అంటుంది’ రాధ. ‘అరే...ఏడేళ్లుగా ఏ డ్రెస్ వేసుకోవాలో అలవాటు చేసి, ఇప్పుడు నన్ను సెలక్ట్ చేసుకోమంటే ఎలా?’ అని స్వరం పెంచి అడుగుతాడు కృష్ణ. ‘నాకు మాత్రం వెయ్యి చేతులు ఉన్నాయా.. తీసుకోండి. సర్దుకుపోవాలండీ’ అని రాధ బదులు ఇస్తుంది. ‘సర్దుకుపోవాలంట... సర్దుకుపోవాలి. ముందొచ్చిన మొగుడు కంటే వెనకొచ్చిన పిల్లలు ఎక్కువైపోయారు’ అని అసహనంగా అంటాడు కృష్ణ. నిట్టూర్పులు, నిష్టూరాలతో వారి సంసారం సోసోగా సాగుతుంటుంది. ఈ పరిస్థితి మారడానికి రాధ ఓ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ కృష్ణకు కనువిప్పు చేస్తుంది. ఇంటెడు చాకిరీతో భార్య సతమవుతున్న విషయాన్ని గుర్తిస్తాడు. అంతే.. ‘సర్దుకుపోవాలి’ అంటూ గారాలుపోతాడు. ‘సర్దుకుపోదాం రండి’ సినిమాలోని ఈ సన్నివేశాలు భార్యా – భర్తలు సర్దుకుపోతే కాపురం ఎంత సాఫీగా సాగుతుందో చెబుతాయి. – డి.జి. భవాని -
సర్దుబాటు ఉత్తర్వులు రద్దు చేయాలి
ఏలూరు సిటీ : విద్యాసంవత్సరం పూర్తికావస్తున్న దశలో ఉపాధ్యాయులను సుదూర ప్రాంతాలకు సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఫ్యాప్టో) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. బి.గోపీమూర్తి, పి.ప్రసాద్, గుగ్గులోతు కృష్ణ, రాజబాబు ఈ కర్యక్రమానికి నేతృత్వం వహించారు. ధర్నాకు హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన సర్దుబాటు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విద్యాశాఖ మంత్రి, పాఠశాల విద్యశాఖ కార్యదర్శితో చర్చిస్తానని తెలిపారు. నాయకులు మాట్లాడుతూ జిల్లాలో 672 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు అసంబద్ధంగా ఉందని, సరిదిద్దమని విన్నవించేందుకు అధికారులు అందుబాటులో లేరని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా సబ్జెక్టు రిలవెన్సీతో సంబంధం లేకుండా ఇష్టమైన వారిని పాఠశాలల్లో ఉంచి మిగిలిన వారిని డెప్యుటేషషన్ వేశారని ఆరోపించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ వేసవి సెలవుల్లో, పాఠశాలలు ప్రారంభించిన వెంటనే మాత్రమే రేషనలైజేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 7 నెలలు గడిచిన అనంతరం ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ చేపట్టడంతో విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.బాలాజీ మాట్లాడుతూ అధికారులు ఎటువంటి ముందుచూపు లేకుండా ఉత్తర్వులు జారీ చేయటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.నరహరి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో పి.జయకర్ (యూటీఎఫ్), పి.సాల్మన్‌రాజు (ఏపీటీఎఫ్), ఆర్‌వీవీఎం శ్రీనివాస్ (ఏపీటీఎఫ్1938), ఎన్.శ్రీనివాసరావు (డీటీఎఫ్), ప్రతాపరాజు (ఎస్టీయూ) తదితరులు ఉన్నారు. -
రామ్‌చరణ్ కోసమే ఈ అడ్జస్ట్మెంట్! - హీరో సూర్య
‘‘హీరోగా ప్రయాణం మొదలు పెట్టినప్పుడు నా కోసం కథలు రాస్తారనీ, ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు. ఐదేళ్ల తర్వాత ‘సింగం-3’ చేయాలనేది మా ప్లాన్. కుటుంబ సభ్యులు, అభిమానుల కోరిక మేరకు ఇప్పుడే చేశా. నా కోసమే 8 నెలలు కష్టపడి హరి ఈ కథ రాశారు’’ అన్నారు సూర్య. హరి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సింగం-3’. ‘సింగం’ సిరీస్‌లో వస్తోన్న ఈ మూడో చిత్రంలో అనుష్క, శ్రుతీహాసన్ హీరోయిన్లు. హ్యారీస్ జైరాజ్ స్వరకర్త. తమిళంలో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 11న తెలుగు పాటల్ని, 23న తెలుగు, తమిళ భాషల్లో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. విడుదల తేదీని ఈ నెల 16 నుంచి 23కు మార్చడంపై సూర్య స్పందిస్తూ.. ‘‘రామ్‌చరణ్ ‘ధృవ’ మా ఫ్యామిలీ సినిమా వంటిదే. దాంతో చిన్న అడ్జస్ట్మెంట్ చేశాం’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ - ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్, తమిళనాడులో ఎమ్జీఆర్ సీఎంలుగా ఉన్నప్పడు జరిగిన ఘటనల స్ఫూర్తితో చిత్రం తెరకెక్కింది. ‘సింగం’ అనేది సినిమా మాత్రమే కాదు, ఓ మతం’’ అన్నారు. ‘‘సూర్య అంటే అభిమానం. అందుకే ‘సింగం-3’ హక్కులు తీసుకున్నా’’ అన్నారు మల్కాపురం శివకుమార్. ‘‘టీజర్, ట్రైలర్లు థౌజెండ్‌వాలా అయితే.. సినిమా టెన్ థౌజెండ్ వాలా తరహాలో ఉంటుంది’’ అన్నారు మాటల రచయిత శశాంక్ వెన్నెలకంటి. -
ఇక ఉద్యోగుల వంతు
నేను ఇటు.. నువ్వు అటు చర్చించుకుంటున్న ఉద్యోగులు విభజనకు తుది కసరత్తు జిల్లా కేంద్రం నుంచే సర్దుబాటు 73 శాఖల నుంచి వివరాలు సేకరణ ముకరంపుర : నిన్న మెున్నటి వరకు జిల్లాల విభజనపై ప్రభుత్వం తర్జనభర్జన పడిన విషయం తెలిసిందే. కొత్త జిల్లాల ముసాయిదా ప్రకటన వెలువడడంతో ఇక ఉద్యోగుల్లో చర్చ మెుదలైంది. కరీంనగర్‌ను మూడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తుండడంతో ఎవరెవరూ ఎటూ వెళ్తామని చర్చించుకుంటున్నారు. కలెక్టరేట్లోని ఎన్ఐసీ విభాగంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి సీసీఎల్ఏ రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, డీఆర్వో, ఏజేసీలతో రహస్యంగా సమీక్షించడం చర్చనీయాంశమైంది. కొత్త జిల్లాల్లో పరిపాలన సౌలభ్యానికి జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగుల సర్దుబాటు, మానవ వనరుల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మూడు జిల్లాలకు సర్దుబాటు చేసే క్రమంలో ప్రత్యేక నమూనాలో 73 శాఖలకు చెందిన ఉద్యోగుల సమగ్ర వివరాలు తేల్చుతున్నారు. గతంలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల కేంద్రాలుగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.తాజాగా సిరిసిల్ల స్థానంలో పెద్దపల్లి జిల్లాను ఖాయం చేయడంతో మరోసారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే సర్దుబాటు చేయాలని ఆదేశించడంతో ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇందుకు ప్రభుత్వం నాలుగు రకాల ఫార్మాట్లను పంపించింది. ఫార్మాట్ 1లో ఉద్యోగి పనిచేస్తున్న విభాగం, పోస్టు, హోదా వివరాలు, మూడు జిల్లాల్లో ప్రాధాన్య క్రమంలో ఆప్షన్ల వివరాలు సేకరించారు. ఇంకా కొన్ని శాఖలు వివరాలు సమర్పించకపోవడంతో మరోసారి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి కొత్తగా ఏర్పాటయ్యే కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు సర్దుబాటు చేయనున్నారు. రెండు రోజుల్లో నివేదిక గతంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 73 శాఖల్లో 3,290 మంజూరు పోస్టులు కాగా 2,504 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్‌కు 881, జగిత్యాలకు 826, సిరిసిల్లకు 797 ఉద్యోగులను సర్దుబాటు చేశారు. ఆ సమయంలో అదనంగా 2,696 పోస్టులు అవసరమని నివేదించగా 1,253 పోస్టులు కొత్తగా కేటాయించాలని జిల్లా యంత్రాంగం నివేదికలు రూపొందించింది. కలెక్టరేట్ పరిపాలనపరంగా కలెక్టర్ నుంచి అటెండర్ వరకు 88 మంజూరు పోస్టులుండగా 86 మంది పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మరో 92 మంది ఉద్యోగులు అవసరమని, అన్ని హోదాల్లో 60 మంది చొప్పున మూడు జిల్లాలకు ఉద్యోగులు విభజించవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వివరాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశముందని సంబంధిత అ«ధికారులు తెలిపారు. రెండు రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధంకానుందని పేర్కొన్నారు. సమగ్రంగా క్రోడీకరణ ఫార్మాట్–ఏలో జిల్లా స్థాయి అధికారులెందరు? గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు సేకరిస్తూ వాటిని మూడు జిల్లాలకు సర్దుబాటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఫార్మాట్–2లో ఉద్యోగి పేరు, హోదా, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, వేతనం, ఉద్యోగి ఐడీ నంబర్, ప్రస్తుతం పనిచేస్తున్న కార్యాలయం, ఉద్యోగి పుట్టిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీ, ఉద్యోగ విరమణ పొందే సమయం, పూర్తి చిరునామా, కులం, అంగవైకల్యం, రిమార్కులు నమోదు చేస్తున్నారు. ఫార్మాట్ 3లో మంజూరు పోస్టులెన్ని? ఏ జీవో ద్వారా ఎన్ని పోస్టులను మంజూరు చేశారు? ప్రస్తుతం పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులెంత? ఖాళీగా ఉన్న పోస్టులెన్ని? డెప్యూటేషన్‌పై పనిచేస్తున్న వారు ఏ విభాగం నుంచి వచ్చారు? సెలవులో కొనసాగుతున్నవారు? వంటి వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఉద్యోగులు ఆప్షన్లు కోరుకునే విషయంలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో స్పష్టత లేదు. మౌలిక వసతుల విషయానికొస్తే ఇప్పటికే జగిత్యాలలో కలెక్టరేట్‌ను న్యాక్ సెంటర్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా తాజాగా ధరూర్ క్యాంపు ఎస్సారెస్పీ కార్యాలయంలో ఏర్పాటుకు బుధవారం పరిశీలించారు. పెద్దపల్లిలోని పెద్దకల్వలలో గల ఎస్సారెస్పీ క్యాంపు కార్యాలయంలో కలెక్టరేట్ నిర్మాణాలకు స్థలాన్ని పరిశీలించారు. -
కాస్త... సర్దుకుపోదాం!
సెల్ఫ్‌చెక్ 1. మీకు నచ్చని కూర వండితే ముఖం మాడ్చుకుంటారు. ఆ రోజు ఉపవాసమే బెటర్ అనుకుంటారు. ఎ.కాదు. బి.అవును. 2. టీ ఇవ్వడానికి కాస్త ఆలస్యం అయినా... భార్య మీద మండిపడతారు. ఎ.కాదు. బి.అవును 3. చెప్పిన పని సకాలంలో చేయలేదని అలకబూనుతారు. ఎ కాదు. బి.అవును. 4. అతి క్రమశిక్షణతో కుటుంబసభ్యులను చీకాకు పెడతారు. ఎ.కాదు. బి.అవును. 5. భార్య సరదాగా చిన్న మాట అన్నా... పరువు పోయినట్లు బాధపడతారు. ఎ.కాదు బి.అవును 6. ప్రతి విషయంలోనూ మీ మాటే చెల్లుబాటు కావాలనుకుంటారు. ఎ.కాదు బి.అవును 7. సర్దుకుపోవడం అంటే లొంగిపోవడం అనే భావనలో ఉంటారు. ఎ. కాదు బి.అవును సంసారం అనే రథానికి భార్యభర్తలు రెండు చక్రాల్లాంటి వారు...అనే డైలాగు పాతదైనా ఎప్పటికప్పుడు కొత్తగా గుర్తు తెచ్చుకోవాల్సిన పవర్ఫుల్ డైలాగు. సంసారం అనే బండి సజావుగా నడవాలంటే, సర్దుకు పోవడాన్ని మించిన గొప్ప ఐడియా లేదు. పై వాటిలో మీకు ‘బి’లు ఎక్కువగా వచ్చాయంటే మీలో సర్దుకుపోయేతత్వం తక్కువ అని. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. ‘‘ఇంత కాలం ఎలాంటి గొడవ లేకుండా కాపురం చేశారు కదా! ఏమిటి మీ విజయరహస్యం?’’ అని ఒక సీనియర్ భర్తను ఒక జూనియర్ భర్త అడిగాడట. అప్పుడు ఆయన తన తెల్లగడ్డం సవరిస్తూ ‘‘ఆమె బల్లిని చూసి పిల్లి అంటుంది. నేను ఖండించకపోగా... ఎంత ముద్దుగా ఉందో అంటాను’’ అంటూ తన విజయరహస్యం చెప్పాడట. ఇది హాస్యానికే కావచ్చుగానీ, దీని నుంచి నేర్చుకోవల్సింది కూడా ఉంది. ప్రతి దాన్నీ విభేదిస్తూ పోవడం వల్ల అశాంతి తప్ప ఏమీ మిగలదు.