సర్దుకుపోవాలి! | Family problems | Sakshi
Sakshi News home page

సర్దుకుపోవాలి!

Published Mon, Oct 23 2017 12:21 AM | Last Updated on Mon, Oct 23 2017 12:21 AM

Family problems

కిక్కిరిసిన జనంతో భారంగా కదులుతున్న బస్సులో నేను. ఎలాగోలా సీటు సంపాదించా. ఆలోచనలన్నీ సరళ చుట్టూ. భార్యలంతా ఇంతేనా? ‘కొంచెం అడ్జస్ట్‌ అవ్వండి’... బస్సు నాదే అన్నట్లు ఓ గొంతు. ఇద్దరు పట్టే సీట్లో ముగ్గురా? అన్నా. ‘సర్దుకో..’ ఏకవచనం. తప్పుతుందా.. సర్దుకున్నా. మళ్లీ ఆలోచనలో పడ్డా. కూరగాయలు తేకపోవడం తప్పా? పిల్లలతో హోమ్‌వర్క్‌ చేయించడం నా పనా? పొద్దున్నే నీళ్లు నేనెందుకు పట్టాలి? అవన్నీ ఇంటిపట్టున ఉండే భార్య పనులే కదా.

ఆలోచనలకు బ్రేక్‌ వేస్తూ... సనత్‌ నగర్‌ అనే అరుపు. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చా. అందర్నీ దాటుకుంటూ, అడ్జస్ట్‌ అవుతూ ఎలాగోలా బస్సు దిగా. వడివడిగా ఆఫీసు వైపు అడుగులేశా. మేనేజర్‌కి ఓ నమస్కారం పడేసి, శరీరాన్ని కుర్చీకి, కళ్లను ఫైళ్లకు అప్పగించా. మనసు మాత్రం సరళ చుట్టూ. పనిలో పడాలంటే ఓ మంచి కాఫీ తాగాలి. బాయ్‌ని పిలిచి కాఫీ అడిగితే, అరగంట ఆలస్యంగా టీ తెచ్చాడు. ‘కాఫీ అడిగా కదా’ అంటే, ‘అడ్జస్ట్‌ అవ్వండి సార్‌’ అన్నాడు.

తప్పుతుందా... సర్దుకున్నా. అయిష్టంగానే టీ లాగించేసి, సరళ ఆలోచనలను బలవంతంగా పక్కనపెట్టి ఫైళ్లల్లోకి తల దూర్చా. ఫర్లేదు.. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్లడానికి ఓ రెండు గంటల ముందే కంప్లీట్‌ చేయొచ్చనుకున్నా. ఈలోపు మేనేజర్‌ నుంచి పిలుపు. ‘ఏవయ్యా.... ఇవాళ రవీంద్ర రాలేదు. అతని ఫైల్స్‌ కూడా నువ్వే చూడు’ ఆర్డర్‌ జారీ చేశాడు. బిక్కమొహం వేసుకుని చూస్తే... ‘కొలీగ్స్‌ రాకపోతే సర్దుకోవాలయ్యా’... అన్నాడు. తప్పుతుందా. అడ్జస్ట్‌ అవ్వాలని ఫిక్సయ్యా.

ఫైళ్లతో పాట్లు పడుతుంటే కడుపులో అలారం మోగింది. వాచీ చూస్తే ఒంటి గంట. లంచ్‌ బాక్స్‌ తీసుకుని, స్టాఫ్‌ రూమ్‌కెళ్లా. ‘బాక్సులో ఏం ఉంది’ అడిగారు జమున. ‘ఆ.. ఏముంటుంది? అయితే బెండకాయ లేకపోతే దొండకాయ... ఏదీ లేకపోతే ఉండనే ఉంటుంది కదా.. ఆలు’ అంటూ బాక్సు ఓపెన్‌ చేశా. ఆలూ కర్రి. రొటీన్‌ అనుకుంటూ బాక్స్‌ ఖాళీ చేశా. మళ్లీ ఫైళ్లతో కుస్తీ. సాయంత్రం నాలుగు. ఈసారి టీ అడిగితే బాయ్‌ టీయే తెచ్చిచ్చాడు. హమ్మయ్య అడ్జస్ట్‌ అవ్వాల్సిన అవసరం లేదనుకున్నా. కానీ, చల్లారిన టీ. ప్రాణం ఉసూరుమంది. ‘అడ్జస్ట్‌ అవ్వాలి గురూ’ అనుకుంటూ, చల్లని టీని నీళ్లు తాగినట్లుగా గటగటా తాగేశా. చకాచకా పనులు పూర్తి చేసుకుని, ఈ పూటకు అయిందనిపించి, ఆఫీసు నుంచి బయటపడ్డా.

ఫుట్‌బోర్డ్‌ మీద వేలాడుతున్న జనాలతో కిర్రుమని సౌండ్‌ చేసుకుంటూ బస్సు వచ్చి ఆగింది. ఎలాగోలా బస్సు ఎక్కా. ‘అబ్బా.. చూసుకోవచ్చు కదా. అలా తొక్కావేంటి?’ పక్కనే ఉన్న కుర్రాడి మీద గయ్‌మన్నా. ‘ఓ ఇదైపోతున్నారు. ఎవరూ తొక్కకూడదంటే ఆటోలో వెళ్లండి. లేకపోతే సర్దుకుని నిలబడండి’ అన్నాడు. తప్పుతుందా.. సర్దుకున్నా. నా స్టాప్‌ రాగానే హడావిడిగా బస్సు దిగి, ఇంటి దారి పట్టా. ఇంట్లోకి అడుగుపెట్టగానే... సరళ ఎదురొచ్చింది. నేనడిగింది ఏం చేశారు? ‘కుదరదు. అన్నేసి రోజులు ఊరెళితే ఎలా?’ అన్నాను. ‘అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. వెళితే తప్పేంటి? ఓ నాలుగు రోజులు సర్దుకోలేరా?’ రివర్శ్‌ క్వశ్చన్‌. కోరు.. కోరంటే కోరు. అంతే.. నేనెందుకు సర్దుకోవాలి? అన్నా.

కోపంతో విసావిసా వంటింట్లోకి వెళ్లిపోయింది. ఆ కోపాన్నంతా గిన్నెల మీద చూపించింది. కాసేపాగి... ‘పోనీ మా అమ్మానాన్నలని ఇక్కడికి పిలిపిద్దాం. ఓ వారం రోజులు రెస్ట్‌ తీసుకుని వెళతారు’. ‘మూడు గదుల ఇంట్లో ఇద్దరు పిల్లలు, మనం... మనకే ఇరుకు. ఎలా కుదురుతుంది?’ అని తెగేసి చెప్పా. ఓ వారం రోజులు అడ్జస్ట్‌ అవ్వలేమా? లేము.. లేము.. అంతే అన్నా. ఈసారి సరళకు కోపంతో పాటు బాధ కూడా కలిగినట్లుంది. ఇల్లు ఇరుకంట ఇరుకు.. ఏం వారం రోజులు అడ్జస్ట్‌ చేసుకోలేమా? ఏడుచుకుంటూ లోపలికి వెళ్లింది.

ఇలాంటి ఏడుపులకు కరిగిపోతాననుకోకు... అంటుండగానే... సరళ అన్న ‘అడ్జస్ట్‌’ అనే మాట గుర్తొచ్చి, ఆలోచనలో పడ్డా. ఆఫీసుకి బయల్దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేసరికి... ఎన్నిసార్లు ‘అడ్జస్ట్‌’  అయ్యానో గుర్తుకొచ్చింది. మనసు అదోలా అయింది. పరిచయం లేనివాళ్ల కోసం బస్సులో సీటు ‘అడ్జస్ట్‌’, ఆఫీస్‌ బోయ్‌ కాఫీకి బదులు టీ తెచ్చిస్తే ఏమీ అనలేక ‘అడ్జస్ట్‌’, కొలీగ్‌ రాకపోతే ఆఫీసు పనితో ‘అడ్జస్ట్‌’.. ఏమీ కాని వాళ్ల కోసం ఇన్ని అడ్జస్ట్‌మెంట్లా? జీవితాంతం తోడూ నీడగా ఉండి, కష్టసుఖాలు పంచుకునే భార్య విషయంలో ‘అడ్జస్ట్‌’ అవ్వకూడదా? ఇంటి ఇల్లాలంటే అంత చిన్న చూపా? మనసు చివుక్కుమంది. అంతే... సరళను ఊరికి పంపించడానికి టికెట్స్‌ బుక్‌ చేయాలనుకున్నా.

పక్క రూములో ఉన్న పర్సు తీసుకోవడానికి వెళితే, కాస్త దూరంలో సరళ తన తల్లితో ఫోనులో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. ‘ఆయన మనిషి మంచివాడే. నేను లేకపోతే గడవదు. అందుకే రాలేకపోతున్నానమ్మా. నాన్న ఉంటారు కదా.. ఎలాగోలా అడ్జస్ట్‌ అవుతావా?’ అనడుగుతోంది. ‘వద్దు వద్దు.. అడ్జస్ట్‌ అవ్వాల్సిన అవసరంలేదు. రేపే నీ ప్రయాణం. లేకపోతే అత్తయ్యగారిని, మామయ్యగారిని ఇక్కడికే పిలిపిద్దాం..’ అన్న నా మాటలు వినపడి, సరళ తలెత్తి చూసింది. కళ్లల్లో మెరుపులు.

‘ఇక జీవితాంతం నీతో అడ్జస్ట్‌ అవుతా బంగారం. ఇంటి పనులతో నీకు క్షణం తీరిక ఉండడంలేదు. నేనూ హెల్ప్‌ చేస్తా’ అన్నా. ‘మీకోసం ఏ విషయంలో అయినా అడ్జస్ట్‌ అవుతా’ అంది సరళ. టిఫిన్‌ బాక్సులో ఏ కూర ఉంటే ఆ కూరే. మా సరూ ఏదంటే అదే అన్నా.. ప్రేమగా చూస్తూ.. ఎక్కడ అడ్జస్ట్‌ అవ్వాలో అక్కడ అడ్జస్ట్‌ అవుతున్నాం. ఏ మాటకా మాట.. అడ్జస్ట్‌మెంట్‌లో చాలా ఆనందం ఉంది. సంసారం బాగుండాలంటే సర్దుకుపోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.

‘ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ.. ఎప్పటికీ’... ఎప్పుడో ఎక్కడో విన్న సామెత గుర్తొచ్చింది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ! సురేశ్‌... సరళాసురేశ్‌.
 

సినిమాలో సంసారం
నాకు వెయ్యి చేతులు ఉన్నాయా? సర్దుకుపొండీ!
కృష్ణ (జగపతిబాబు), రాధ (సౌందర్య) దంపతులు. పెళ్లైన కొత్తల్లో సినిమాలు, షికార్లు, సరదాలతో లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తారు. ఎప్పుడూ ఇలానే ఉండాలనుకుంటాడు కృష్ణ. కానీ, ఇద్దరు బిడ్డలు పుట్టాక పరిస్థితులు మారిపోతాయి. ఇంటి బాధ్యతలతో రాధ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కృష్ణ మాత్రం పిల్లల కోసం రాధ తనను దూరం పెడుతుందని భావిస్తాడు.

అలాంటి సందర్భంలో ఓసారి.. ‘ఏంటి రాధా... బెడ్‌రూమ్‌లో బట్టలు పెట్టలేదు’ అని భార్యపై అరుస్తాడు కృష్ణ.  ‘ఇవతల పనిలో ఉన్నానండీ.. మీరే తీసుకోండి అంటుంది’ రాధ. ‘అరే...ఏడేళ్లుగా ఏ డ్రెస్‌ వేసుకోవాలో అలవాటు చేసి, ఇప్పుడు నన్ను సెలక్ట్‌ చేసుకోమంటే ఎలా?’ అని స్వరం పెంచి అడుగుతాడు కృష్ణ. ‘నాకు మాత్రం వెయ్యి చేతులు ఉన్నాయా.. తీసుకోండి. సర్దుకుపోవాలండీ’ అని రాధ బదులు ఇస్తుంది.

‘సర్దుకుపోవాలంట... సర్దుకుపోవాలి. ముందొచ్చిన మొగుడు కంటే వెనకొచ్చిన పిల్లలు ఎక్కువైపోయారు’ అని అసహనంగా అంటాడు కృష్ణ. నిట్టూర్పులు, నిష్టూరాలతో వారి సంసారం సోసోగా సాగుతుంటుంది. ఈ పరిస్థితి మారడానికి రాధ ఓ ప్లాన్‌ వేస్తుంది. ఆ ప్లాన్‌ కృష్ణకు కనువిప్పు చేస్తుంది. ఇంటెడు చాకిరీతో భార్య సతమవుతున్న విషయాన్ని గుర్తిస్తాడు. అంతే.. ‘సర్దుకుపోవాలి’ అంటూ గారాలుపోతాడు. ‘సర్దుకుపోదాం రండి’ సినిమాలోని ఈ సన్నివేశాలు భార్యా – భర్తలు సర్దుకుపోతే కాపురం ఎంత సాఫీగా సాగుతుందో చెబుతాయి.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement