Samsaram
-
ఆలుమగల డ్యూయెట్
పొద్దున్నే వచ్చిన న్యూస్ పేపర్ కనిపించలేదు. వెతగ్గా వెతగ్గా కిచెన్‌లో మిక్సీ పైన ఉంది. ‘ఏంటిక్కడా?’ అనడిగితే ‘ఇవాళ మీకా పేపర్ తాకే హక్కు లేదు. అది నాది’ అంది. ‘వై? కైకో?’ అన్నాను రెండు భాషల్లో. ‘అందులో నా రాజా ఉన్నాడు’ అంది. అనుమానం పెనుభూతం అయ్యింది. ‘ఎవడు వాడు? ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ఈ భాగోతం’ అన్నాను. ‘నా చిన్నప్పటి నుంచి’ అంది. ‘ఆ... అంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావన్నమాట’ అన్నాను. ‘కాదు... రాజాను త్యాగం చేసి మీచే తాళి కట్టించుకున్నాను’ అంది. పేపర్ విసురుగా లాక్కున్నాను. తిరగేశాను. ‘ఎక్కడ నీ ర్రా..జా’ జగ్గయ్యగారిలా బొంగురుగా అడిగాను. ‘కొత్తగా రెక్కలొచ్చేనా గూటిలోని గువ్వపిల్లకి’ అంటూ చూపించింది. ఇళయరాజా ఫొటో. హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ అట. పెద్ద యాడ్ ఇచ్చున్నారు.‘ఇతడే నా రాజా. నా పదహారేళ్ల వయసులో పదహారేళ్ల వయసు సినిమా పాట విన్నాను. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా...’ హమ్ చేసింది. ‘వింటే?’ ‘అప్పటి నుంచి మనసు పారేసుకున్నాను. మౌనగీతం పాటలు విని మౌనంగా, మౌనరాగం పాటలు విని మూగగా ఆరాధించాను. చిరంజీవి ‘ఆరాధన’ సినిమా చూసి ‘అరె ఏమైంది... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది...’ అని నేను మా ఊరికి దూరంగా ఉన్న బీచ్‌కి వెళ్లి అక్కడి అలల్లో రాళ్లల్లో పాడుతూ ఉంటే బెస్తవాళ్లు పట్టుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టారు. అంత పిచ్చి నాకు రాజా అంటే’ అంది. ఊపిరి కొంచెం పీల్చుకున్నాను. ‘అయితే అతడు నీ హాబీకి రాజా. కాని దిల్ కా రాజా నేనేగా’ అన్నాను. ‘ఆ మాట నిరూపించుకోవాలంటే షోకి రెండు టికెట్లు కొనండి’ అంది. ‘కొనకపోతే?’ ‘నన్ను ఇంట్లో కనలేకపోతారు’ ‘అంత పని చెయ్యొద్దు’ అని బుక్ మై షో ఓపెన్ చేశాను. టికెట్ల రేట్లు ఓ రేంజ్లో ఉన్నాయి. ‘ఇంత రేట్లా?’ అన్నాను. ‘జిఎస్టిని మర్చిపోయారా?’ అంది ‘టీవీలో చూడొచ్చు కదా డాళింగ్’ ‘వండిన కూర ఫ్రిజ్‌లో పెట్టి తిన్నట్టుగా ఉంటుంది. నథింగ్ డూయింగ్. నా రాజాను లైవ్‌లో చూడాల్సిందే.’ ‘అయినా ఆయనేం సింగర్ కాదు. పాడుతుంటే చూడటానికి. ఊరికే అలా నిలబడి రెండు కట్టెపుల్లలు ఆడిస్తూ ఉంటాడు. హీ ఈజ్ ఓన్లీ ఎ మ్యూజిక్ డైరెక్టర్ యూ నో మన పెళ్లి రిసెప్షన్లో పాట కచ్చేరి పెట్టించమంటే అన్నీ చక్రవర్తి పాటలే పెట్టించారు. అప్పుడే తెలిసింది మీ టేస్ట్ ఏమిటో’ ‘ఏయ్ చక్రవర్తి పాటలను ఏమీ అనొద్దు. నేను ఆయన ఫ్యాన్‌ని. నీకు తమిళ ఇళయరాజా అంటే ఎంతటి గొప్పో నాకు తెలుగు చక్రవర్తి అంటే అంత గొప్ప. అయినా సూళ్లూరుపేట అమ్మాయిని చేసుకోవడం తప్పయింది. అరవ వాసన ఎక్కడికి పోతుంది’ ‘సంగీతానికి కులం మతం ప్రాంతం వైఫై ఏరియా అంటూ ఏమీ ఉండవు మిస్టర్ రామ్మోహన్‌రావ్. మ్యూజిక్ ఈజ్ డివైన్’ ‘నో.. ఇప్పుడు నాకు వైన్ గుర్తు చేయకు’ ‘అంతకు మించి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయగలను కనుక’ ‘అలా అనకు. నీ సంతోషం కోసం ఏమైనా చేయగలను పల్లవీ. కావాలంటే ఒక చరణం పాడనా?’ ‘వద్దు’ ‘భార్యభర్తలు కలిసి పాడుకోవడం కన్నా అసలైన కచ్చేరి ఏముంటుంది చెప్పు. నీవేనా నను పిలిచినది... నీవేనా నను తలచినది’ పాడాను. తల పట్టుకుంది. మళ్లీ అందుకున్నాను. ‘నువ్వంటే నాకెందుకో అంత ఇదీ.. అంత ఇదీ’ పాడు ప్లీజ్ అన్నట్టుగా కళ్లలో కళ్లు పెట్టి చూశాను. ‘రావోయి చందమామా... మా వింత గాధ వినుమా’ మెల్లగా గొణిగింది. ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు... జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు’ హితబోధ చేశాను. ‘మనసున ఉన్నదీ చెప్పాలని ఉన్నదీ మాటలు రావే ఎలా?’ అంది. ‘ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనమూ ఏలనో’ సర్ది చెప్పడానికి చూశాను. అప్పటికి ఇడ్లీ అయిపోయి చట్నీ రెడీ చేయడానికి కొబ్బరి అందుకుంది. ‘పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా’ ఇళయరాజా ఫొటోను చూస్తూ అంది. మనసు చివుక్కుమంది. ఇలాంటి సమయాల్లోనే మగాడు తన మనసులోని ప్రేమ అంతా చెప్పగలగాలి. అందుకున్నాను– ‘నీవు నా పక్కనుంటే హాయి. నీవు లేకుంటే చీకటి రేయి. నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి’ అన్నాను. అలా అంటూ రెండు చేతులూ పట్టుకున్నాను. ప్రతి ఉదయమూ భర్త తన భార్య చేతులను మెల్లగా తాకి కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే తగదాలు రావు అని ఎక్కడో చదివాను. ఇప్పుడు అప్లై చేశాను. తనూ నా కళ్లలోకి చూసింది. ‘ఇలాగే... ఇలాగే... సరాగమాడితే... వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే’... అన్నాను. ‘ఇళయరాజా పాట కదా’ అంది సంతోషంగా. ‘అవును’ అన్నాను. ‘మీరు ఇళయరాజా పాట పాడారా?’ ఆశ్చర్యపోయింది. ఆగు ఆన్నట్టుగా ఆమె వైపు చెయ్యి అడ్డం చూపించి సెల్ ఓపెన్ చేసి టకటకా రెండు టికెట్లు ఆన్లైన్లో కొనేశాను. కన్ఫర్మ్ మెసేజ్ వచ్చింది. చూపించాను. ఇంకా ఆశ్చర్యపోయింది. ‘ఏంటి... టికెట్లు కొన్నారా?’ ‘ఇప్పుడు ఇంకో ఇళయరాజా పాట పాడతాను చూడు’ అంటూ భుజాల మీద చేతులు వేశాను. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముద్దుముచ్చట కాదన్నానా సరదా పడితే వద్దన్నానా హొయ్య’ ‘రామ్మోహన్‌రావ్’... అంటూ ముద్దుగా అల్లుకుపోయింది. మిక్సీలో చట్నీ నలుగుతోంది. కాని దానిని పట్టించుకునే టైమా ఇది? సినిమాలో సంసారం నా ఇంట్లో చేసిన ఉప్మా ‘అదే టచ్’ అంటూ తొలి రాత్రి బ్రహ్మానందానికి షాక్ ఇస్తుంది శ్రీలక్ష్మి. ఫ్లాష్‌బ్యాక్ కూడా చెప్తుంది. బాబూ మోహన్ (గోపి) ‘మానస సంచరరే...’ అని పాడుతుంటాడు, శ్రీలక్ష్మి డాన్స్ చేస్తుంటుంది. డాన్స్ అయిన తర్వాత కందిపోయిన శ్రీలక్ష్మి పాదాలకు వెన్న రాస్తాడు గోపి. తనను అంతగా ప్రేమించిన గోపి ఓ రోజు నీటిలో మునిగి పాడుతుండగా, మొసలి లాక్కు పోయిందని, గోపీ తన మనసు లాక్కుపోయాడని బాధపడుతుంది. గోపీని కాదని బ్రహ్మానందాన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం బామ్మ తన పెళ్లి చూడాలన్న కోరికే కారణమంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో లవ్వే కదా అని సరిపుచ్చుకుంటాడు బ్రహ్మానందం. ఓ రోజు... శ్రీలక్ష్మి, బ్రహ్మానందం మార్కెట్ నుంచి వస్తుంటే ఎదురు పడతాడు గోపి. అతడు బతికే ఉన్నాడని తెలిసి ఉద్వేగానికి లోనవుతుంది శ్రీలక్ష్మి. తన విజిటింగ్ కార్డిస్తాడు గోపి. మరో రోజు... శ్రీలక్ష్మి ఉప్మా చేసి, ఆ ఉప్మాను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. గోపీకి ఉప్మా చాలా ఇష్టమని, ఉప్మా తీసుకెళ్లి గోపీకి ఇవ్వమని భర్తను కోరుతుంది. ఒక ఏడుపు ఏడ్చి అలాగే ఇస్తాను కానీ ఆకలవుతోంది త్వరగా వడ్డించమంటూ డైనింగ్ టేబుల్ కుర్చీ లాక్కుని కూర్చుంటాడు. ‘నా గోపీ తినకుండా ఎవ్వరూ తినడానికి వీల్లేదు’ అని పట్టుపడుతుంది. ‘నా ఇంట్లో... చేసిన ఉప్మా నేను తినడానికి వీల్లేదా’ అంటూ ఎగిరిపడతాడు బ్రహ్మానందం ఏడుపు, కోపం కలగలిసిన గొంతుతో. ఇంతలో ‘నీ చేత ఉప్మా చేయించుకుని తినాలపించింది రాధా’ బాబూ మోహన్ వాళ్లింటికి వస్తాడు ‘మావి చిగురు’ సినిమాలో. – నిష్ఠల -
తరగని చీకటిరాత్రి
అతగాడిని ఈ వుదయమే చూశాను నేను. అతని మొహం చెమటతో కన్నీటి ధారలతో తడిసిపోయి వుంది. అతని ఇంట్లోంచి ఏడుపు వినపడుతోంది. రోజూ ఉదయాన్నే వాహ్యాళికి వెళ్లడం నాకలవాటు. రోజూ అదే సమయానికి ఆ యింటి ముందుకు వస్తూంటాను. సాధారణంగా నాకతడు కనుపించడు. ఆ రోజు అతగాడినలా కలుస్తాననుకోలేదు. కారణం గత సాయంత్రమే రాజు నన్ను యింటి దగ్గర దింపి కారు తీసుకుని వెళ్లిపోయాడు. కెందుఝర్ రోడ్లో జోడాకు తీసుకువెళ్లి తీసుకువచ్చాడు నన్ను. అక్కడ్నుంచి బయల్దేరేముందు టాక్సీ మీటరు విప్పి అంకెలను తలకిందులుగా చేసి, యజమానిని దెబ్బతీసి నాలుగు డబ్బులు చేసుకున్నాడు. అతనికి తెలుసు, నేనేం పట్టించుకోనని. కారణం టాక్సీకి నేను అద్దె కట్టనవసరం లేదు. నన్ను అతిథిగా తీసుకువెళ్లిన మనుషులే టాక్సీ చార్జి చెల్లిస్తారు. రాజు టాక్సీ నడుపుతాడు. తెల్ల ఎంబాసిడరు డీజిల్ గాడీని బాగానే నడుపుతాడు. నేనెక్కడికి వెళ్లాల్సినా అతనే తీసుకువెళతాడు. గోడనానుకుని అతను నిలబడిపోయాడు. అతనింట్లోంచి ఏడుపులు వినబడుతున్నాయి. చిన్నపిల్లవాడిని గుడ్డకప్పి ఆ మనుషులు మౌనంగా తీసుకుపోయారు. నా కాళ్లూ చేతులూ వణకసాగాయి. నాకు ఎటు చూసినా గోడకానుకుని కళ్లు మూసుకుని నిలబడ్డ రాజు విచార వదనమే గోచరించసాగింది. అతని దుఃఖ సమయంలో అతని పక్కన నిలబడలేకపోయానే అన్న భావన నన్ను దోషిగా నిలబెట్టింది.రాజు నలభై–నలభై అయిదేళ్లవాడు. అతని కొడుకు అంతగా చదువుకోలేదు. ‘వాడికి యేదనా ఓ దారి చూపించండి’ అంటూ నన్ను అడుగుతుండేవాడు. వాడు ఎదరకు చదివేదీ లేదు రాజు చదివించేదీ లేదు.త్రోవలో సంత కనబడితే నాకోసం చవకగా కూరలు తెచ్చిపెట్టాడు. తనకోసం ఓ గుమ్మడికాయ కొని తెచ్చుకున్నాడు. సంసారం పెద్దది గుమ్మడికాయలు, బంగాళదుంపలు ఎన్ని ఉన్నా చెల్లిపోతాయి అంటూ చెప్పేడు.ఇంకా యిలా చెప్పేడు.‘మా చంటాడికి వంట్లో బాగోలేదండి. గాడీ నడపకుంటే రోజు గడవదండి. చంటాడిని కనిపెట్టుకుని ఇంట్లో కూర్చుందుకు నాకు కుదరదండి.’జోడా చేరుకునే వరకూ మౌనంగా కారు నడిపేడు. బహుశా చంటిపిల్లవాడి గురించి అతడు ఆలోచిస్తూండవచ్చు. అతని కుటుంబం అంతా ఆకలి బాధతో మాడిపోతూంది. సహాయం చేసేవారెవరూ లేరు. అదే అతని దుఃఖం. గమ్యానికి చేరుకుని శుభ్రంగా తిన్న తరువాత రాత్రి అయ్యేసరికి అతను మామూలు మనిషి అయ్యాడు. ఇంటికి తిరుగు ముఖం పట్టే సమయంలో అతను ఉల్లాసంగానే కనిపించాడు.మేం ఈ నగర పొలిమేరకు చేరుకునేసరికి బాగా చీకటి పడిపోయింది. నన్ను మా యింటిముందు దించి, నా కూరల సంచి నాకందించి, నమస్కరించి సెలవు తీసుకున్నాడు. తెల్లవారే సరికి యిదంతా ఎలా జరిగింది? రాజు మొహం కళావిహీనమయిపోయింది. బహుశా అతను యింటికి చేరేసరికే సంగ్రామం ప్రారంభమయి ఉండాలి. డాక్టరు రావడం, మందు యివ్వడం, మళ్లా డాక్టరు రావడం, మందు మార్చడం... ఇంజక్షను ఇవ్వడం... రాత్రంతా యిదే వరుస... ఒకటే దుఃఖం... బాధ. భళ్లున తెల్లవారడంతో పాటు అతని బతుకు కూడా తెల్లవారిపోయింది. చంటివాడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.నేను రోజంతా యిదే విషయం మీద ఆలోచిస్తూ అన్యమనస్కంగా ఉండడాన్ని యింట్లో అంతా గుర్తించారు. ఎలాగో అయిదు గంటల వేళకు నేను అతని యింటికి చేరుకున్నాను. అతను ప్యాంటు షర్టు వేసుకుని పైన ఓ గావంచానుంచుకుని బయటకు వస్తూ కనిపించాడు. ఈ వేళప్పుడు అతను ఎక్కడకు బయల్దేరుతున్నాడు? అతని అడుగులు తడబడుతున్నాయి. బహుశా ఆ మనిషి తాగేసి ఉండవచ్చు. లోపల రగులుతున్న దుఃఖాన్ని చల్లార్చుకుందుకు!నన్ను చూసి అప్రతిభుడయ్యేడు. నమస్కరించి పళ్లు బయటపెట్టి నిలబడ్డాడు. ‘సార్! టాక్సీ కావాలా సార్?’‘నువ్విప్పుడు గాడీ తీస్తావా?’‘ఏం ఫర్వాలేద్సార్. స్టీరింగు పట్టుకుని కూర్చుంటే చాలు, బండి నడుస్తుంది.’‘నే చెప్పేది అది కాదు రాజు! ఇవాళే కదా నీ...’‘ఓ... దానికి ఎవరేం చేస్తారు? దాని గురించి చింతిస్తూ కూర్చుంటే బతికున్నవాళ్లు తినేది ఏవిటి? కాలం కలిసి రాలేదు. లేకుంటే వాడెంతటివాడయి వుండేవాడో? రెండున్నర సంవత్సరాలు వాడికి. వాడి మొహంలో ఎంత కళ ఉండేదని?!’అతని కళ్లలో నిరాశానిస్పృహలు గూడు కట్టుకున్నాయి. అంతలో తృళ్లిపడి, నన్ను చూసి పళ్లుయికిలిస్తూ – ‘నడవండి సార్! మీరెక్కడికో బయల్దేరినట్టున్నారు...’‘లేదు రాజూ! నేను నిన్ను చూసి పోదామనే వచ్చాను.’అతని పెదాలు వణకసాగాయి, కళ్లు చెమ్మగిల్లాయి. నేను అతని యజమాని గారేజీకి దారి చూపిస్తున్నట్టుగా అతగాడిని తీసుకుపోయేను.ఇద్దరం మౌనంగా నడుస్తున్నాం. ‘నువ్వు నన్ను తీసుకుని వెళ్లకుండా వుంటే నీకీ విపత్తి వచ్చి వుండేది కాదు. నువ్విక్కడ వుండి వుంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు కబురుపెట్టావు కాదు!’‘ఏం చెప్పమంటారు సార్! నేనింట్లో అడుగుపెట్టేసరికే అంతా జరిగిపోయింది.’నాకు ఒళ్లు మండింది. ‘ఏమయిందీ? నువ్వెందుకు పనికిరాని ఒట్టి బడుద్దాయివి. ఇంట్లో కుర్రాడు అంత జబ్బుగా వుంటే నువ్వు సారా తాగుతావన్నమాట. మీటరులోని నెంబర్లు తారుమారు చేసి నాలుగు రూకలు దొంగిలించింది యిలా సారాకి తగలెయ్యడానికా?’‘అసలు విషయం అదికాద్సార్...’‘రాత్రంతా తాగిన మత్తులో యింట్లో తొంగుని ఉంటావు.’‘లేద్సార్, నిన్న రాత్రి సంగతి మీకు ఎలా చెప్పను సార్? నా కర్మ... నిన్న రాత్రి నేనసలు యింటికే చేరలేద్సార్!’‘అదేవిటి? ఏమయింది?’ తీవ్రంగా అడిగేను.అతను గారేజి తెరిచి లోపలికి వెళ్లకుండా తలుపుకి జేరపడి నేలకేసి చూస్తూ అన్నాడు.‘‘నేను ఆమెను ఆసుపత్రికి తీసుకుపోక పోయివుంటే చచ్చిపోయి వుండేది. మిమ్మల్ని మీ యింటి వద్ద దించి వస్తూ, రోగంతో వున్న నా కొడుక్కి ఏపిల్సు, ద్రాక్షపళ్లు కొని తీసుకుపోదామనుకున్నాను. బజారులోకి వెళ్లేను. తిరిగి వస్తూంటే ఓ ఎనిమిది పది సంవత్సరాల వయసున్న ఆడపిల్ల నా గాడీకి ఎదురుపడింది. నాకు తెలియకుండానే సడెన్ బ్రేక్ పడి గాడీ ఆగింది, కాబట్టి సరిపోయింది. తృటిలో చావును తప్పించుకుందా పిల్ల. దారికి అడ్డంగా వచ్చిన ఆ పిల్లమీద నాకు కోపం ముంచుకొచ్చి టాక్సీ దిగేను, ఆ పిల్ల చెవి మెలేసి ఆమె తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుపోదామని! నేను చీదరించుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లేసరికి ఆ పిల్ల యేడుస్తూ చెప్పింది –‘మా అమ్మ చనిపోయేలా ఉంది. మా యింట్లో ఎవరూ లేరు. కళ్లు నులుముకుంటూ యేడుస్తూంది. అంతలో ఓ ముసలావిడ ఒంగిన నడుముతో నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది. సరిగ్గా మా అమ్మలాగా ఉందామె. ‘పదవా! ఎక్కడున్నావే? నడు... త్వరగా నడు... నాయకా! కాస్తంత ముందుగా రావచ్చు గదా? రా... రా...’ అంటూ నా ముందు నుంచి ఎదరకు నడిచిందామె. ఆమె నన్నలా ఎందుకు పిలిచిందో నాకు అర్థం కాలేదు. ఇంట్లోకి వెళ్లి చూస్తే మా అందరి కొంపల్లాగే దరిద్రం ఉట్టిపడుతూ కనిపించింది. పద్మ తల్లి మంచం మీద గోడకు జేరగిలబడి కూర్చునుంది. ఆమె ఆయాసపడుతూ కనిపించింది. బింది కుండలా ఉన్న నిండు చూలాలు. ‘నడమ్మా నడు. పాపం ఈయన దేవుడిలా వచ్చేడు. నేను నీతో వస్తాను. పద్దవా! నువ్వు తమ్ముడి దగ్గరే ఉండు. మీ నాన్న వస్తే ఆసుపత్రికి పంపు. పద్దవా! నువ్వెళ్లి ఆ బిసియామాని పిల్చుకురా! నేనొంటరిగా దీన్ని తీసుకుపోలేను.’నేను పెదవి విప్పి మాట్లాడలేకపోయాను. నిజంగానే దేవుడున్నాడు, కష్టంలో వున్నవారిని ఆదుకునేందుకు ఎవరినో ఒకరిని ఆయనే పంపుతూంటాడు’’‘అయితే నువ్వామెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లాలన్నమాట’‘అదే కదా సార్ చెబుతున్నాను. ఆ ముసలామె, మరో బిసియా మా ఇద్దరూ కలిసి ఎలాగో సాయం పట్టి ఆమెను నా బండిలో కూర్చోబెట్టేరు. ఇద్దరూ చెరొక పక్కా కూర్చున్నారు. ‘పోనీ నాయనా! త్వరగా తీసకునడు’ అంది ముసలామె. ఆసుపత్రికి చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలు కావచ్చింది. వాళ్లామెను దించేసుకునుంటే నేను నా యింటికి పోయివుందును కాని ముసలామె అంది –‘మగాడవు నువ్వుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. డాక్టరుగారితో కాస్తంత మాట్లాడి పెట్టు నాయనా.’ విధిలేక ఆమె వెంట వెళ్లాను. డాక్టర్లు ఆసుపత్రుల సంగతి గురించి నేను మీకు చెప్పనవసరం లేదు కానీ ఒక అదృష్టం ఏమిటంటే, ఎంబాసిడరులోంచి దిగిన రోగి కాబోలని అనుకుంటాను వాళ్లు కాస్తంత సానుభూతి చూపేరెందుకనో! ‘తీసుకురండి... తీసుకురండి!’ అన్నారు.చూస్తూనే డాక్టరు, నర్సు ఇద్దరూ అన్నారు –‘వెంటనే పురుడొస్తుంది. ఇంజక్షను, సెలయిన్ బాటిలు వగైరాలు వెంటనే కావాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో మందులు నిండుకున్నాయి. ఆమెను వెంటనే స్ట్రెచరు మీదలోపలకు తీసుకు నడవండి’ అంటూ స్టాఫ్‌కి ఆర్డరిచ్చి డాక్టరుగారు నన్ను చూసి తీవ్రంగా చెప్పారు. ‘ఈ చీటిలోని మందుల్ని ‘బస్వారి లాల్ మెడికల్’ నుంచి త్వరగా తీసుకురావాలి అని పురమాయించి డాక్టరు నర్సూ లోపలకు హడావుడిగా నడిచారు. ముసలావిడ నాకు చెప్పింది. ‘వెళ్లు నాయనా ఇంకా అలా చూస్తావేమిటి?’చీటిని వుండచుట్టి ఆమె మొహానవేసి కొట్టి ఉండేవాడినే, దోవే పోయేవాడిని నన్ను యింత దూరం లాక్కొచ్చింది చాలక, ఈ అధికారం ఏమిటి నా మీద? డబ్బెవడిస్తాడు వీళ్ల బాబు..?’అంతలో దీనంగా యేడుస్తూ దారిలో నిలబడ్డ ‘పద్దవా’ మొహం నా కళ్లముందుకొచ్చింది. ‘మా అమ్మ బతకదు. చనిపోయేలా ఉంది’ అన్న ఆమె మాటలు గుర్తుకొచ్చాయి.నేను వెంటనే బండి తీసుకుని బయల్దేరాను. వాటన్నిటికీ రెండొందలు పైన ఖర్చయింది. తీసుకుని వారికందించాను. లోపల ప్రసవం జరుగుతూంది. బయట నేను నిలబడ్డాను. ఎలా వదిలేసి రాగలను? మళ్లా ఏదైనా అవసరం వస్తే, నేను తప్ప అక్కడ యింకెవ్వరున్నారు? రాత్రి పన్నెండు గంటల పది నిముషాలకు మగపిల్లవాడు పుట్టేడు. ఆ బిడ్డడు నా బిడ్డ అయినట్టు. ముసలావిడ నా దగ్గరకు వచ్చి అంది. ‘ఎలాగయితేనేం నాయనా, పుణ్యం కట్టుకున్నావు. నువ్వు యింటికెడతావు యిప్పుడు, కానీ ఆమె ఒంటరిగా నీతో వెళ్లేందుకు భయపడవచ్చు. నేనూ కాస్తంత నడుము వాలుస్తాను. ఉదయాన్నే అయితే నేనూ ఆమె వెంట వస్తాను.’ నేనేమీ మాట్లాడలేదు. ముసలావిడను ‘పద్దవా’ యింటి దగ్గర దింపేశాను. తిరిగి నేను గాడీలో కూర్చుంటూంటే ముసలావిడ అంది.‘మళ్లీ ఎక్కడికి బయల్దేరావు? ఇంట్లోకి రా బాబు!’‘నేను నా యింటికి పోతున్నాను.’‘నీ యింటికేవిటీ?నువ్వు ‘పద్దవా’ బాబాయివి కాదా? నిన్ను వాళ్లు చీటి యిచ్చి పంపారు కదా! నువ్వు పద్మ వూరు నుంచి రాలేదా? ‘పద్దవా’ తండ్రి అయిదారు మాసాలయింది, దేశం పట్టిపోయేడు, నువ్వు ‘పద్దవా’ బాబాయివి కావా ఏమిటి?’‘కాదమ్మా! నేను ‘పద్దవా’కి యేమి కాను. ఈ దారినే పోతూ గాడీని ఆపేను. మీరు పిలిస్తే మీ మాట కాదనలేకపోయాను. సరే నే వస్తాను.’దీపస్తంభం దగ్గర ముసలావిడ బుగ్గలు నొక్కుకుని ‘ఆ’ అంటూ నిలబడి చూస్తూండిపోయింది. నేను అప్పటికీ యింటికి పెందరాళే చేరుకుని ఉండేవాడిని. యోగం లేదు. అది మరో గొడవ. ప్రభుత్వ ఉద్యానవన కాలనీకేసి వెళ్లి చాలా కాలం అయింది. ఆ కాలనీలో మా మావ వరస ఒకరుంటున్నారు. ఆ యింటిని చూసుకుంటూ వస్తున్నాను. ఆ రాత్రివేళ ఆ యింటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏవిటయిందని చూద్దును కదా, మా లక్ష్మణ మావ కాలం చేశాడు. నేను గాడీ ఆపుకుని కిందకు దిగాను. మా మావ కొడుకు సుదామ వచ్చి నన్ను వాటేసుకుని భోరుమన్నాడు. మరొక వలలో చిక్కాను. పాడిని లేపుతారు. నేను మోయక తప్పదు. శ్మశానానికి చేరుకునేసరికి రాత్రి మూడు గంటలయింది. తిరిగి వచ్చేసరికి వెలగొచ్చేసింది. తడి గావంచా చుట్టబెట్టుకుని యిల్లు చేరుకునేసరికి యిక్కడ జరగాల్సింది కాస్తా జరిగిపోయింది’’రాజు మొహం వాల్చుకుని నిలబడి ఉన్నాడు. వెర్రివాడు కాకపోతే ఏమిటి? ఆ రాత్రి అతని బతుకులో చిమ్మచీకటిని మిగిల్చింది. తరగని చీకటి రాత్రి అయింది. గాడీ యజమాని తన జమాఖర్చులు తీసుకున్నాక పెద్దగా యేమీ మిగల్లేదు. ‘సార్! మీరు ఎక్కడికైనా వెళ్లాలా సార్?’ నాకేసి ఆశగా చూస్తూ అడిగాడు అతను.నేను రాజు కళ్లలోకి చూడలేక తల కిందకు దించుకున్నాను. నిజం! ఆ దేవుడు కూడా అపరాధ భావంతో రాజు ముందు తలవంచక తప్పదు! ఒడియా కథాసంకలనం తరగని చీకటిరాత్రిసౌజన్యంతో... ‘మా అమ్మ చనిపోయేలా ఉంది. మా యింట్లో ఎవరూ లేరు.’ కళ్లు నులుముకుంటూ యేడుస్తూంది. అంతలో ఓ ముసలావిడ ఒంగిన నడుముతో నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చింది. సరిగ్గా మా అమ్మలాగా ఉందామె. ఒడియా మూలం: చంద్రశేఖర్ రథ్ అనువాదం: మహీధర రామశాస్త్రి -
శ్రీమతి లా పాయింట్
ఆఫీస్‌లో ఉండగా ఫోనొచ్చింది. ఓలా యాప్ సరిగ్గా పని చేయడం లేదట క్యాబ్ బుక్ చేయమని చెప్పింది. ‘ఎక్కడికి?’ అడిగాను.,‘లాయర్ దగ్గరికి’ అంది. గతుక్కుమన్నాను. బుర్ర ఇంకా రాని బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా పరిగెత్తింది.పొద్దున దోసెలు పోస్తానంటే వద్దని పాలలో అటుకులు చక్కెర కలిపి తిన్నాను. అందుకా? రాత్రి కంప్యూటర్ ముందు పని చేస్కుంటూచేస్కుంటూ తన ధ్యాస మరిచి అక్కడే కింద కార్పెట్ మీద దిండేసుకుని పడుకున్నాను. అందుకా? ‘రాజు గారి గది 2’ ఫస్ట్ షో తీసుకువెళ్తానని చెప్పి డుమ్మా కొట్టాను.అందుకా? మొన్న వాళ్లమ్మ ఫోన్ చేసినప్పుడు ‘మాట్లాడండి’ అని ఇస్తే తీసుకొని ‘నమస్తే అత్తగారూ’ అని ఆమెకు షుగరున్నా తియ్యగా మాట్లాడుకుండా ఏవో నాలుగు మాటలు పొడిపొడిగా మాట్లాడి ఇచ్చేసినందుకా? ఎందుకు? లాయర్ దగ్గరకు వెళ్లడం ఎందుకు? విడాకుల్స్ కేనా? ‘లల.. లాయర్ అంటున్నావ్. ఎందుకు?’ ‘తర్వాత చెప్తా. ముందు నల్లకుంటలో ఈశ్వరరావు లాయర్ దగ్గరకు క్యాబ్ బుక్ చేయండి’ అంది. గుండె గుడగుడమని కొట్టుకుంది. ఈశ్వరరావు ఎలాంటి లాయర్ అంటే మోడీ గారు బ్యాచిలర్ మొర్రో అంటున్నా వినకుండా మీకెందుకు బాసూ ఫీజిస్తే చిటికెలో ఏర్పాటు చేస్తాగా అని విడాకులకు రెడీ చేసే రకం. ‘ఇఇ..ఈశ్వరరావు ఎందుకు?’ ‘కోర్టులో కేసు వేయడానికి’ ‘ఎవరి మీద’ ‘మగాళ్లందరి మీద’ ‘మగాళ్లందరి మీదా?’ ‘అవును. పబ్లిక్ లిటిగేషన్ కేసు’ ‘ఏం పాపం చేశారు’ ‘మీరు చేస్తున్నదే’ ‘నేనేం చేశాను’ ‘జోకులేస్తున్నారు’ ‘జోకులేయడం తప్పా?’ ‘భార్యల మీద జోకులేయడం తప్పేు’ గొంతు సీరియస్‌గా ఉంది. ‘ఏం భార్యల మీద జోకులేయకూడదా?’ ‘లు అంటున్నారు. మీకు ఇంకో భార్య ఉందా?’ ‘సారీ... ఏం భార్య మీద జోకు వేయకూడదా?’ ‘ఏం... మీ అమ్మ మీద వేయొచ్చుగా?’ ‘ఏమన్నావ్?’ ‘ఏం.. పొడుచుకొచ్చిందా?’ మాట్లాడకుండా ఉన్నాను. రోషంగా మాట్లాడుతూ ఉంది. ‘ఈ దరిద్రపు ఫోన్ కొన్నాక నాకు మెల్ల మెల్లగా ఆడవాళ్ల పరిస్థితి అర్థమవుతోంది. అక్కర ఉన్నా లేకున్నా ఈ వాట్సప్ పుణ్యమా అంటూ రకరకాల గ్రూపుల్లో పడ్డాను. ప్రతి గ్రూపులో ఒకటే జోకులు. ఏం జోకులు? భార్యల మీద జోకులు. ‘గురువు దగ్గర వినయంగా ఉండాలి. స్నేహితుల దగ్గర ఉల్లాసంగా ఉండాలి. భార్య దగ్గర నోర్మూసుకొని ఉండాలి’. అదొక జోకు. ‘వైఫ్ ఈజ్ క్యూట్ వెన్ షీ ఈజ్ మ్యూట్’ అదొక జోకు. చావు బతుకుల్లో ఉన్న భర్త భార్యను పిలిచి అంటాడు– నేను పోయాక నువ్వా సుబ్బారావుగాణ్ణే కట్టుకో. ‘అదేమిటండీ. అతను మీ శతృవు కదా’ అని భార్య, ‘అందుకే అంటున్నాను. వాడికి తగిన శాస్తి జరిగాలి’ అని భర్త. ఇదొక జోకు’. ‘ఏదో సర్దాకు టైమ్ పాస్ జోకుల్లేవోయ్’ ‘టైమ్పాసా? దానికి భార్యలే దొరికారా? ఏం... తల్లీ చెల్లీ పనికి రారా. తల్లి పుణ్యాత్మురాలు. జన్మనిచ్చినది. ఆమె మీద జోకులు వేయరు. చెల్లి గారాల పట్టి. అందుకని జోకులు వేయరు. అక్క అభిమానంగా చూస్తుంది. అందుకని జోకులు వేయరు. మరి భార్యేగా దిక్కులేనిది దుర్మార్గమైనది. ఆమె మీద జోకులు. ఎందుకొస్తాయండీ మీకు’ ‘అదీ... అదీ’... ‘మిమ్మల్ని నమ్ముకొని పుట్టింటిని కాదని వస్తుంది. మళ్లీ పోదు. మీ దగ్గరే ఉంటుంది. మీకు వడ్డిస్తుంది. వార్చి పెడుతుంది. ప్రేమగా ఉంటుంది. సంతానాన్ని కని పెడుతుంది. మగాడికి కావాల్సిన చెల్లెలిని అక్కను భార్యను కని పెడుతుంది. అసలా మగాడికే ఉనికి ఇస్తుంది. మీ కష్టం ఆమె కూడా పడుతుంది. తన సుఖం మీకు కూడా పంచుతుంది. ఆమె మీద జోకులేమిటండీ. ఈ జోకుల ముసుగులో మీరు భార్యల మీద ఫన్ పంచట్లేదు. ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. భార్యంటేనే ద్వేషించదగ్గ మనిషిగా చిత్రీకరిస్తున్నారు’ అంత సీరియస్‌గా మాట్లాడటం ఎప్పుడూ చూళ్లేదు. ‘నువ్వు మరీ సీరియస్‌గా తీసుకుంటున్నావోయ్’ ‘కాదు. ఇంతకాలం సీరియస్‌గా తీసుకోక పోవడం తప్పంటాను. అందుకే కోర్టులో కేసు వేద్దామనుకుంటున్నాను’ ‘వేసి...’ ‘ఒకప్పుడు కులాల మీద జోకులు ఉండేవి. కాలక్రమంలో సంస్కారం తెచ్చుకొని వాటిని మానేశాం. శారీరక లోపాల మీద జోకులుండేవి. వాటి మీద కూడా తగ్గించేశాం. మతాల మీద జోకులు సహించాల్సిన పని లేదు. అలాగే భార్యల మీద జోకులను కూడా బ్యాన్ చేయమని కోరుతాను. బ్యాన్ చేసేంత వరకూ పోరాడతాను’ ‘దారుణం. బొత్తిగా సెన్సాఫ్ హ్యూమర్ లేకుండా తయారవుతున్నారంతా’‘సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలండీ. సరదాగా నవ్వుకోవాలి. భార్యలు కూడా ఎంజాయ్ చేసే జోకులు వారి మీద వేయాలి. అంతేతప్ప వారిపై నెగిటివిటీ పెంచే జోకులు వేయొద్దు. అరె... వాళ్లను కట్టడి చేసేది మీరు. స్వేచ్ఛ ఇవ్వకుండా నిర్బంధించేది మీరు. వేధించేది మీరు. బాధ పెట్టేది మీరు. మళ్లీ వాళ్లనే బ్యాడ్‌గా చూపిస్తూ జోకులేస్తారా?. ఇలా ఎంతకాలం?’... గుర్తొచ్చింది. పొద్దున టీ ఇచ్చింది. ‘ఇవి టీయా? టీ నీళ్లు. ఇంకొన్ని పట్టుకొచ్చావంటే గీజర్ అవసరం లేకుండా స్నానం చేసేస్తాను’ అన్నాను. పిల్లలను స్కూలుకు తయారు చేస్తూ హడావిడిగా పెట్టింది అన్న ఆలోచన కూడా లేకుండా పిచ్చి జోక్ వేసి హర్ట్ చేసినట్టున్నాను. ‘సారీ’ ‘మీరొక్కరే చెప్తే సరి పోదు’ ‘మరి’ ‘సమస్త మగజాతి చెప్పాలి’ ‘ఓరి దేవుడోయ్’ ‘ఆ మాటే మీ అందరి చేతా చెప్పిస్తాను. పెళ్లాం మీద జోక్ వేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే చట్టం తెచ్చేంత వరకూ విశ్రమించను’ ‘అది కాదోయ్’... ఆటో పిలుస్తున్న కేక వినిపించింది. ‘ఆగాగు.. క్యాబ్ బుక్ చేస్తాను’ ‘టైమ్ లేదు. ఇక ఏ విషయమైనా లాయర్ని కలిశాకే’ ఆటో డుర్రున కదిలింది.నాకు మాత్రం ఆ సౌండ్ ఆటంబాంబంత అనిపించింది. సినిమాలో సంసారం ఫారిన్ ప్రోగ్రామ్ క్యాన్సిల్! ప్రశాంత్ (పృ«థ్వి) సింగర్. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ మార్కెట్లో నంబర్‌వన్. ప్రశాంత్‌కి పిచ్చి ఫ్యాన్ నిర్మల (రాశి). ఓ ఆల్బమ్ బాలేదని ప్రశాంత్‌ని ముఖం మీదే విమర్శిస్తుంది. ఆ విమర్శ నచ్చి. నిర్మలను పెళ్లి చేసుకుంటాడు ప్రశాంత్. మ్యూజిక్ ఆల్బమ్‌లో కో సింగర్‌గా పాడమని భార్యని కోరతాడు. మొగుడు–పెళ్లాం ఒకే వృత్తిలో ఉండకూడదు. పాడనంటుందామె. ప్రశాంత్ మార్కెట్ డౌన్ అయిందనే విమర్శలొచ్చినప్పుడు ‘నేను పాడతాను ఆల్బమ్ చేద్దా’మంటుంది నిర్మల. ఒక్క ఆల్బమ్‌తో భర్త కంటే ఎక్కువ క్రేజ్ వస్తుంది భార్యకి. అది ఇబ్బందిగా ఫీలవుతాడు ప్రశాంత్. పుండుమీద కారం చల్లినట్టు.. నిర్మలకు ఫారిన్లో ఆల్బమ్స్ చేసే అవకాశం వస్తుంది. ప్రశాంత్ లేకుండా నిర్మల వెళ్లడానికి అతడు ఒప్పుకోడు. ‘ఫారిన్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్. నవ్వు వెళ్లడానికి వీల్లే్లదు’ అని కోప్పడతాడు ప్రశాంత్. ముష్టితో వచ్చే పేరు నాకు అక్కర లేదు, కంపెనీని మూసేస్తానంటాడు. నిర్మల ఫారిన్ వీసా, టికెట్లు చించేస్తాడు. ఇలా తరచూ గొడవ పడి, పడి చివరకు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు భార్యాభర్తలిద్దరూ ‘దేవుళ్ళు’ సినిమాలో. – నిష్ఠల -
సర్దుకుపోవాలి!
కిక్కిరిసిన జనంతో భారంగా కదులుతున్న బస్సులో నేను. ఎలాగోలా సీటు సంపాదించా. ఆలోచనలన్నీ సరళ చుట్టూ. భార్యలంతా ఇంతేనా? ‘కొంచెం అడ్జస్ట్ అవ్వండి’... బస్సు నాదే అన్నట్లు ఓ గొంతు. ఇద్దరు పట్టే సీట్లో ముగ్గురా? అన్నా. ‘సర్దుకో..’ ఏకవచనం. తప్పుతుందా.. సర్దుకున్నా. మళ్లీ ఆలోచనలో పడ్డా. కూరగాయలు తేకపోవడం తప్పా? పిల్లలతో హోమ్‌వర్క్ చేయించడం నా పనా? పొద్దున్నే నీళ్లు నేనెందుకు పట్టాలి? అవన్నీ ఇంటిపట్టున ఉండే భార్య పనులే కదా. ఆలోచనలకు బ్రేక్ వేస్తూ... సనత్ నగర్ అనే అరుపు. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చా. అందర్నీ దాటుకుంటూ, అడ్జస్ట్ అవుతూ ఎలాగోలా బస్సు దిగా. వడివడిగా ఆఫీసు వైపు అడుగులేశా. మేనేజర్‌కి ఓ నమస్కారం పడేసి, శరీరాన్ని కుర్చీకి, కళ్లను ఫైళ్లకు అప్పగించా. మనసు మాత్రం సరళ చుట్టూ. పనిలో పడాలంటే ఓ మంచి కాఫీ తాగాలి. బాయ్‌ని పిలిచి కాఫీ అడిగితే, అరగంట ఆలస్యంగా టీ తెచ్చాడు. ‘కాఫీ అడిగా కదా’ అంటే, ‘అడ్జస్ట్ అవ్వండి సార్’ అన్నాడు. తప్పుతుందా... సర్దుకున్నా. అయిష్టంగానే టీ లాగించేసి, సరళ ఆలోచనలను బలవంతంగా పక్కనపెట్టి ఫైళ్లల్లోకి తల దూర్చా. ఫర్లేదు.. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్లడానికి ఓ రెండు గంటల ముందే కంప్లీట్ చేయొచ్చనుకున్నా. ఈలోపు మేనేజర్ నుంచి పిలుపు. ‘ఏవయ్యా.... ఇవాళ రవీంద్ర రాలేదు. అతని ఫైల్స్ కూడా నువ్వే చూడు’ ఆర్డర్ జారీ చేశాడు. బిక్కమొహం వేసుకుని చూస్తే... ‘కొలీగ్స్ రాకపోతే సర్దుకోవాలయ్యా’... అన్నాడు. తప్పుతుందా. అడ్జస్ట్ అవ్వాలని ఫిక్సయ్యా. ఫైళ్లతో పాట్లు పడుతుంటే కడుపులో అలారం మోగింది. వాచీ చూస్తే ఒంటి గంట. లంచ్ బాక్స్ తీసుకుని, స్టాఫ్ రూమ్కెళ్లా. ‘బాక్సులో ఏం ఉంది’ అడిగారు జమున. ‘ఆ.. ఏముంటుంది? అయితే బెండకాయ లేకపోతే దొండకాయ... ఏదీ లేకపోతే ఉండనే ఉంటుంది కదా.. ఆలు’ అంటూ బాక్సు ఓపెన్ చేశా. ఆలూ కర్రి. రొటీన్ అనుకుంటూ బాక్స్ ఖాళీ చేశా. మళ్లీ ఫైళ్లతో కుస్తీ. సాయంత్రం నాలుగు. ఈసారి టీ అడిగితే బాయ్ టీయే తెచ్చిచ్చాడు. హమ్మయ్య అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదనుకున్నా. కానీ, చల్లారిన టీ. ప్రాణం ఉసూరుమంది. ‘అడ్జస్ట్ అవ్వాలి గురూ’ అనుకుంటూ, చల్లని టీని నీళ్లు తాగినట్లుగా గటగటా తాగేశా. చకాచకా పనులు పూర్తి చేసుకుని, ఈ పూటకు అయిందనిపించి, ఆఫీసు నుంచి బయటపడ్డా. ఫుట్‌బోర్డ్ మీద వేలాడుతున్న జనాలతో కిర్రుమని సౌండ్ చేసుకుంటూ బస్సు వచ్చి ఆగింది. ఎలాగోలా బస్సు ఎక్కా. ‘అబ్బా.. చూసుకోవచ్చు కదా. అలా తొక్కావేంటి?’ పక్కనే ఉన్న కుర్రాడి మీద గయ్మన్నా. ‘ఓ ఇదైపోతున్నారు. ఎవరూ తొక్కకూడదంటే ఆటోలో వెళ్లండి. లేకపోతే సర్దుకుని నిలబడండి’ అన్నాడు. తప్పుతుందా.. సర్దుకున్నా. నా స్టాప్ రాగానే హడావిడిగా బస్సు దిగి, ఇంటి దారి పట్టా. ఇంట్లోకి అడుగుపెట్టగానే... సరళ ఎదురొచ్చింది. నేనడిగింది ఏం చేశారు? ‘కుదరదు. అన్నేసి రోజులు ఊరెళితే ఎలా?’ అన్నాను. ‘అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. వెళితే తప్పేంటి? ఓ నాలుగు రోజులు సర్దుకోలేరా?’ రివర్శ్ క్వశ్చన్. కోరు.. కోరంటే కోరు. అంతే.. నేనెందుకు సర్దుకోవాలి? అన్నా. కోపంతో విసావిసా వంటింట్లోకి వెళ్లిపోయింది. ఆ కోపాన్నంతా గిన్నెల మీద చూపించింది. కాసేపాగి... ‘పోనీ మా అమ్మానాన్నలని ఇక్కడికి పిలిపిద్దాం. ఓ వారం రోజులు రెస్ట్ తీసుకుని వెళతారు’. ‘మూడు గదుల ఇంట్లో ఇద్దరు పిల్లలు, మనం... మనకే ఇరుకు. ఎలా కుదురుతుంది?’ అని తెగేసి చెప్పా. ఓ వారం రోజులు అడ్జస్ట్ అవ్వలేమా? లేము.. లేము.. అంతే అన్నా. ఈసారి సరళకు కోపంతో పాటు బాధ కూడా కలిగినట్లుంది. ఇల్లు ఇరుకంట ఇరుకు.. ఏం వారం రోజులు అడ్జస్ట్ చేసుకోలేమా? ఏడుచుకుంటూ లోపలికి వెళ్లింది. ఇలాంటి ఏడుపులకు కరిగిపోతాననుకోకు... అంటుండగానే... సరళ అన్న ‘అడ్జస్ట్’ అనే మాట గుర్తొచ్చి, ఆలోచనలో పడ్డా. ఆఫీసుకి బయల్దేరినప్పటి నుంచి ఇంటికి వచ్చేసరికి... ఎన్నిసార్లు ‘అడ్జస్ట్’ అయ్యానో గుర్తుకొచ్చింది. మనసు అదోలా అయింది. పరిచయం లేనివాళ్ల కోసం బస్సులో సీటు ‘అడ్జస్ట్’, ఆఫీస్ బోయ్ కాఫీకి బదులు టీ తెచ్చిస్తే ఏమీ అనలేక ‘అడ్జస్ట్’, కొలీగ్ రాకపోతే ఆఫీసు పనితో ‘అడ్జస్ట్’.. ఏమీ కాని వాళ్ల కోసం ఇన్ని అడ్జస్ట్మెంట్లా? జీవితాంతం తోడూ నీడగా ఉండి, కష్టసుఖాలు పంచుకునే భార్య విషయంలో ‘అడ్జస్ట్’ అవ్వకూడదా? ఇంటి ఇల్లాలంటే అంత చిన్న చూపా? మనసు చివుక్కుమంది. అంతే... సరళను ఊరికి పంపించడానికి టికెట్స్ బుక్ చేయాలనుకున్నా. పక్క రూములో ఉన్న పర్సు తీసుకోవడానికి వెళితే, కాస్త దూరంలో సరళ తన తల్లితో ఫోనులో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. ‘ఆయన మనిషి మంచివాడే. నేను లేకపోతే గడవదు. అందుకే రాలేకపోతున్నానమ్మా. నాన్న ఉంటారు కదా.. ఎలాగోలా అడ్జస్ట్ అవుతావా?’ అనడుగుతోంది. ‘వద్దు వద్దు.. అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరంలేదు. రేపే నీ ప్రయాణం. లేకపోతే అత్తయ్యగారిని, మామయ్యగారిని ఇక్కడికే పిలిపిద్దాం..’ అన్న నా మాటలు వినపడి, సరళ తలెత్తి చూసింది. కళ్లల్లో మెరుపులు. ‘ఇక జీవితాంతం నీతో అడ్జస్ట్ అవుతా బంగారం. ఇంటి పనులతో నీకు క్షణం తీరిక ఉండడంలేదు. నేనూ హెల్ప్ చేస్తా’ అన్నా. ‘మీకోసం ఏ విషయంలో అయినా అడ్జస్ట్ అవుతా’ అంది సరళ. టిఫిన్ బాక్సులో ఏ కూర ఉంటే ఆ కూరే. మా సరూ ఏదంటే అదే అన్నా.. ప్రేమగా చూస్తూ.. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో అక్కడ అడ్జస్ట్ అవుతున్నాం. ఏ మాటకా మాట.. అడ్జస్ట్మెంట్లో చాలా ఆనందం ఉంది. సంసారం బాగుండాలంటే సర్దుకుపోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ‘ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇదే మధురమైన బంధం... ఇప్పటికీ.. ఎప్పటికీ’... ఎప్పుడో ఎక్కడో విన్న సామెత గుర్తొచ్చింది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ! సురేశ్... సరళాసురేశ్. సినిమాలో సంసారం నాకు వెయ్యి చేతులు ఉన్నాయా? సర్దుకుపొండీ! కృష్ణ (జగపతిబాబు), రాధ (సౌందర్య) దంపతులు. పెళ్లైన కొత్తల్లో సినిమాలు, షికార్లు, సరదాలతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడూ ఇలానే ఉండాలనుకుంటాడు కృష్ణ. కానీ, ఇద్దరు బిడ్డలు పుట్టాక పరిస్థితులు మారిపోతాయి. ఇంటి బాధ్యతలతో రాధ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. కృష్ణ మాత్రం పిల్లల కోసం రాధ తనను దూరం పెడుతుందని భావిస్తాడు. అలాంటి సందర్భంలో ఓసారి.. ‘ఏంటి రాధా... బెడ్రూమ్లో బట్టలు పెట్టలేదు’ అని భార్యపై అరుస్తాడు కృష్ణ. ‘ఇవతల పనిలో ఉన్నానండీ.. మీరే తీసుకోండి అంటుంది’ రాధ. ‘అరే...ఏడేళ్లుగా ఏ డ్రెస్ వేసుకోవాలో అలవాటు చేసి, ఇప్పుడు నన్ను సెలక్ట్ చేసుకోమంటే ఎలా?’ అని స్వరం పెంచి అడుగుతాడు కృష్ణ. ‘నాకు మాత్రం వెయ్యి చేతులు ఉన్నాయా.. తీసుకోండి. సర్దుకుపోవాలండీ’ అని రాధ బదులు ఇస్తుంది. ‘సర్దుకుపోవాలంట... సర్దుకుపోవాలి. ముందొచ్చిన మొగుడు కంటే వెనకొచ్చిన పిల్లలు ఎక్కువైపోయారు’ అని అసహనంగా అంటాడు కృష్ణ. నిట్టూర్పులు, నిష్టూరాలతో వారి సంసారం సోసోగా సాగుతుంటుంది. ఈ పరిస్థితి మారడానికి రాధ ఓ ప్లాన్ వేస్తుంది. ఆ ప్లాన్ కృష్ణకు కనువిప్పు చేస్తుంది. ఇంటెడు చాకిరీతో భార్య సతమవుతున్న విషయాన్ని గుర్తిస్తాడు. అంతే.. ‘సర్దుకుపోవాలి’ అంటూ గారాలుపోతాడు. ‘సర్దుకుపోదాం రండి’ సినిమాలోని ఈ సన్నివేశాలు భార్యా – భర్తలు సర్దుకుపోతే కాపురం ఎంత సాఫీగా సాగుతుందో చెబుతాయి. – డి.జి. భవాని -
రెండు గుండెల చప్పుడు
సాయంత్రం ఆరవుతోంది. గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఓ పక్కకొచ్చి కూర్చున్నాను. మనసంతా వికలంగా ఉంది. హృదయం ఉప్పెనలా ద్రవిస్తోంది. శ్రావణ్ మీద కోపమొచ్చిన ప్రతిసారీ ఈ గుడికే వస్తుంటాను. శ్రావణ్... ఒళ్లు మండిపోతోంది తల్చుకుంటేనే. ఫోన్ వైపు చూశాను. వాట్సాప్‌లో శ్రావ్ టైపింగ్ అని వస్తోంది. వెంటనే బ్లాక్ చేశాను. అది గమనించి కాల్ చేశాడు. ఫోన్ స్విచాఫ్ చేశాను. తొమ్మిదేళ్లు ప్రేమించుకున్నాం. ఏడాది క్రితం పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. చచ్చేంత పిచ్చి ఒకరికి ఒకరంటే. ఏం లాభం. ఒక్కరోజు కూడా తను నాకు ‘ఐ లవ్ యు’ చెప్పడు. నేను చెబితే ‘ఐ టూ’ అంటాడు. మనసులోని భావాలను అల్లి ఎన్నో లేఖలు రాశాను. చదివి బాగుందని కూడా చెప్పడు. వాట్సప్‌లో మెసేజ్ పెడితే చాలాసార్లు చూసి కూడా రిప్లై ఇవ్వడు. స్పెషల్ డే వస్తే ఏం ప్లాన్ చేసుకుందాం అని కూడా అడగడు. నేను ఎందుకు కోపగిస్తానో.. ఎందుకు బాధపడతానో అన్నీ తనకు తెలుసు. కానీ దేనికీ ఎక్స్ప్లనేషనే ఉండదు. ఇవన్నీ తన దృష్టిలో చిన్న చిన్న విషయాలే. కానీ అవే నా చిన్న చిన్న సంతోషాలు. నా ప్రేమ తనకి తట్టుకోలేనంత వెగటు.. వదులుకోలేనంత ఇష్టం. ఈ మాటలు నిన్న నైట్ తనే నాకు స్వయంగా చెప్పాడు. ‘నీ ప్రేమ షుగర్ ఎక్కువగా కలిపిన స్వీట్ లాంటిది. కాస్త తింటే ఎక్కువైపోతుంది. అలా అని తినకుండా ఉంటే నీరసించి చచ్చిపోతా. ఎందుకంటే నాకు మరో స్వీట్ పడదు’ అంటూ డైలాగ్స్ చెప్పాడు. ఎవడడిగాడు ఈ డైలాగ్స్ అన్నీ? నేను ఏమైనా వజ్రాల వడ్డాణం చేయించమని గోల చేశానా? కేవలం నా భావాలకి చిన్నగా స్పందించమంటాను. ‘నా మీదే పంచప్రాణాలు పెట్టుకున్న ఓ పిచ్చిది ఉంది కదా. దాని కోసం కాసేపు ఖాళీ చేసుకుందాం. కాసేపు కబుర్లు చెబుదాం’ అని తనకు అనిపించాలి కదా. మరీ పట్టనట్లు ఉంటాడు. అందుకే నిన్న నైట్ ఇల్లు వదిలి దగ్గరలోని హాస్టల్‌కి వచ్చేశాను. దూరంగా ఉంటేనైనా నా విలువ తెలిసొస్తుందని! పుట్టింటికే వెళ్లొచ్చు. కానీ నా శ్రావణ్‌ని ఎవరిముందు తక్కువ చెయ్యడం ఇష్టం ఉండదు. లవ్ చేసుకునే మొదట్లో నేను గుంటూర్లో ఇంట్లో ఉండేదాన్ని. తను వైజాగ్‌లో జాబ్ చేస్తుండేవాడు. ఓ రోజు కాల్ చేసి ‘రేపు ఊరొస్తున్నా.. ఐదారు రోజులుంటాను’ అన్నాడు. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. నా ఆనందాన్ని కనిపించకుండా ‘అయితే’ అని అడిగాను. ‘నిన్ను చూడాలనిపిస్తుందిరా. ఆదివారం నీ ఫ్రెండ్ అమ్ముని తీసుకుని బాబా టెంపుల్‌కి రా’ అన్నాడు. నేను సరే అన్నాను. తను ఊరొచ్చి రెండు రోజులు దాటింది. కలుద్దామన్న ఊసే లేదు! ఫోన్స్, చాటింగ్స్లోనూ ఆదివారం కలవడం గురించి మాట్లాడలేదు. నాకు బీపీ రైజ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. మరునాడు సాయంత్రం 4 గంటలకి అమ్మ సెల్‌కి అమ్మూ ఫోన్ చేసింది. ‘నీ ఫోన్ ఎందుకే కలవట్లేదు? శ్రావణ్ చాలా సార్లు ట్రై చేశాడంట. ముందు తనకి కాల్ చెయ్యి.’ అని చెప్పి ఫోన్ కట్ చేసింది. దాంతో ఫోన్ ఆన్ చేశాను. వెంటనే కాల్ వచ్చింది. లిప్ట్ చేస్తే.. ‘ఏమైంది ఫోన్ ఆఫ్ చేశావు’ అని అడిగాడు ఏం తెలియనట్లు. అంటే నా అన్ని గంటల కోపానికి విలువే లేదు. అనిపించింది. అడిగేయ్యాలనిపించింది కానీ అహం అడ్డొచ్చింది. ‘ఎల్లుండి ౖవైజాగ్ వెళ్తున్నా. బస్టాప్కైనా రాగలవా?’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. కోపం నషాళానికి ఎక్కింది. ‘బుద్ది ఉందా నీకు. ఏం చెప్పావు? ఆదివారం కలుస్తానని చెప్పి కలవాలనే మాటే మరిచిపోయి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా?’ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేశాను. తనేదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే.. నేను పట్టించుకోకుండా... ‘మరిచిపోకపోతే ఇంకేమైనట్లు? నీ మనసులో కలవాలనే ఆలోచన లేనప్పుడు నా ఆవేదనకు విలువలేదు. అందుకే, నేనే నిన్ను కలవను’ అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అప్పుడో మెసేజ్ వచ్చింది.. ‘సోనా.. లవ్ యు సో మచ్.. ఊరువచ్చిన నాటి నుంచి నిన్ను కలవాలనిపిస్తుంది. కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా చూస్తే మనకి ప్రాబ్లమ్ అయిపోతుందేమోనన్న ఆలోచనే నన్ను భయపెట్టింది. నీతో ఇదే విషయం చెబితే ఏదైతే అవుతుంది కలుస్తా అంటావ్. నాకోసం నువ్వు ఏం చెయ్యడానికైనా సిద్ధమని నాకు తెలుసు. అందుకే నా బాధని నీతో షేర్ చేసుకోలేకపోయాను. సారీరా.. కానీ, ఇప్పుడు నా పెయిన్ బాగా ఎక్కువగా ఉంది నిన్ను చూడకుండా వెళ్లలేను ప్లీజ్’ అంటూ మెసేజ్ చేశాడు. నిజంగానే నా కోపానికి విలువ లేదనిపించింది. అందుకే మరునాడు ఉదయాన్నే అమ్మూని తీసుకుని షాపింగ్ మాల్లో ఓ రౌండ్ వేశాను. నా వెంటే కాస్త దూరంలో తను కూడా నడిచాడు. ఆ విషయం నాకు, తనకి, అమ్మూకి తప్ప మరెవరికీ తెలియలేదు. నా జ్ఞాపకాలకు అడ్డుపడుతూ... ప్రసాదం తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు గుడి పూజారి. టైమ్ చూస్తే ఎనిమిది దాటింది. పైకి లేచి ఆయన పాదాలకు మొక్కాను. ‘దీర్ఘ సుమంగళీభవ’ అని ఆశీర్వదించారు. ఎంత గొప్ప అర్థం. భార్యని దీవిస్తే భర్త రక్షింపబడతాడు. ఎంత గొప్ప దీవెనది!? భార్యాభర్తలు ఇద్దరు కాదు.. ఒక్కటే. ఆ సమయంలో నా కళ్లు మెరుస్తున్నా శ్రావణ్ నెగ్లిజెన్స్ గుర్తుకొచ్చి మనసు మాత్రం కాస్త భారంగానే నిట్టూర్చింది. అమ్మవారికి మరోసారి మనసులో మొక్కి హాస్టల్‌కి బయలుదేరాను. గుడి నుంచి హాస్టల్ రూట్లో నడకందుకున్న నా వేగానికి మరోవేగం అడ్డొచ్చింది. చేతిని వదిలించుకునే ప్రయత్నం చేశాను కానీ ఆ ప్రయత్నంలో ఎప్పుడూ శ్రావణే గెలుస్తాడు. ‘ఏంటి’ అంటూ కళ్లతో బెదిరించే ప్రయత్నం చేశాను. ‘సారీ! అన్నాడు. ‘ఆపింక.. రోడ్డు పక్కనే ఈ పంచాయితీ పెట్టకు’ అని ముందుకు నడవబోయాను. ఆగమన్నట్లు చెయ్యి అడ్డుపెట్టాడు. ‘సోనా సారీ... ఇంకెప్పుడు నెగ్లెక్ట్ చెయ్యను. ప్రతీది ముందే చెబుతాను. ఇంటికి వచ్చెయ్ ప్లీజ్. నువ్వు వెళ్లినప్పటి నుంచీ ఏం తినలేదు. ఆకలేస్తోంది’ అన్నాడు. అంతే! గుండె కరిగిపోయింది. అప్రయత్నంగానే కన్నీళ్లొచ్చాయి. తను ఆకలేస్తుందన్నా నిద్ర వస్తుందన్నా నేను తట్టుకోలేను. మనసు నిండా ఎంత కోపమున్నా ఎంత బాధున్నా అన్నీ వదిలేస్తాను. ఆదరబాదర అయిపోతాను. నా పిచ్చి కోపాన్ని నేనే తిట్టుకుంటూ.. ‘సారీ..’ అన్నాను. తను మౌనంగానే ఉన్నాడు. ఎదురుగా వచ్చిన కారు లైట్ వెలుగులో తన కళ్లను చూశాను. తన కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. తప్పుచేశాననిపించింది. మారాల్సింది తను కాదు! మారింది నేనే!! ఎందుకంటే ప్రేమను పంచినప్పుడు నాలో స్వార్థంలేదు! తిరిగి తన నుంచి ఆశించడం మొదలు పెట్టిన నాటి నుంచే మొదలైంది. అదే కాబోలు అమ్మ ప్రేమకు.. మిగిలిన ప్రేమలకు ఉన్న తేడా!! వెంటనే బ్యాగ్‌లో ఉన్న ప్రసాదం తీసిచ్చాను. తీసుకుని చాలా ఆత్రంగా తింటూ.. నా నోటికి అందించాడు. ‘రెస్టారెంట్లో తినేసి ఇంటికి వెళ్దాం’ అన్నాను.నడక మొదలైంది. ఇంకా మౌనంగానే ఉన్నాడు కుర్రాడు. తన చేతికి నా చేయి తాకేలా నడిచాను. అప్రయత్నంగానే నా చేయిపట్టుకున్నాడు. మరో కారు మా ఎదురుగా పోయింది. తను నావైపే చూస్తు నడుస్తున్నాడు. నేను కాస్త బెట్టుగా ముఖం తిప్పుకున్నా.చిన్నగా నవ్వు వచ్చింది అయినా.. బుజ్జగించి బ్రతిమాలేవాళ్లు ఉన్నప్పుడే కదా బుంగమూతికి విలువ. సంసారానికి అందమూనూ! సినిమాలో సంసారం ‘నవ మన్మధుడు’ సినిమాలో ధనుష్ తన తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆలోచిస్తూ డిప్రెషన్ మూడ్‌లో ఉంటాడు. ఆ సమయంలోనే భరత్ భార్య సమంత కడుపులో బిడ్డ కదలుతుందని చాలా సంబరపడుతూ భర్తతో చెబుతుంది. దానికి ఓ జీవం లేని నవ్వు నవ్వుతాడు భరత్. అది గమనించిన సమంత ‘జరిగింది తలుచుకుంటూ మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను కూడా పట్టించుకోకపోతే ఎలానండి’ అంటుంది. దానికి బాధపడిన ధనుష్ ‘మా నాన్నని అందరూ దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్ చూసుకోలేకపోతున్నా’ అంటూ సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే...ధనుష్ లంచ్ బాక్స్ తీసుకెళ్లకుండా పనికి బయలుదేరతాడు. అది గమనించిన భార్య సమంత.. అతడి వెనకే పరుగుపెడుతూ ‘ఏమండీ.. ఏమండీ..’ అని అరుస్తుంది. కంగారు పడిన ధనుష్ వెనుతిరిగి ‘హేయ్ నీకేమైనా పిచ్చా... కడుపులో బిడ్డతో అలా పరుగుపెడుతున్నావ్?’ అంటాడు. ‘మీరు నా మీద కోపంతో.. లంచ్ బాక్స్ తీసుకెళ్లకుండా వెళ్తున్నారు’ అంటుంది చాలా అమాయకంగా! భార్య ప్రేమను గుర్తించిన భరత్... ‘పిచ్చిదానా నీ మీద కోప్పడ్డమే నాకు తెలీదు. ఇంకా నీ మీద కోప్పడి ఎక్కడికి వెళ్తాను చెప్పు?’ అని అడుగుతాడు చాలా ప్రేమగా. ‘ఏమో మీ వాలకం చూస్తే అలా అనిపించలేదు’ అంటుంది సమంత ముభావంగా! ఆ మాటలకు నవ్వుకున్న ధనుష్ ‘సరే రా ఇంట్లో దింపేస్తా’ అంటూ రెండు చేతులతో ఎత్తుకుని ఇంటికి నడుస్తాడు. ‘ఏమండీ ఏం చేస్తున్నారు? చూసేవాళ్లంతా ఏం అనుకుంటారు?’ అంటూ సమంత ఆశ్చర్యపోతుంటే.. ‘ఏం నా పెళ్లాన్నేగా ఎత్తుకెళ్తుంది’ అంటాడు ధనుష్. నిజమే మరి ప్రేమంటే.. కాలే కడుపుని, తడిసిన మనసుని గుర్తించడమే కదూ! – సంహిత నిమ్మన -
నాకేమీ వద్దు!
సమ్సారం సంసారంలో సినిమా మా ఇద్దరికీ గొడవ అయింది. అది అవుతూనే ఉంటుంది. అవ్వకపోతేనే, గొడవ అవ్వలేదని చెప్పుకోవాలి. అసలు గొడవనేదే లేకుంటే భార్యాభర్తలన్న మాటకు అర్థమే లేదంటాడు మా మావయ్య. ఆయన పెళ్లి చేసుకోలేదు. కానీ ఈ విషయం గురించి మాత్రం బాగా మాట్లాడతాడు. చేసుకోకపోవడం వల్లే ఇంత తెలుసుకున్నాడా? ఏమో తెలియదు. ఆ మాటకొస్తే పెళ్లయిందన్న మాటే కానీ నేనూ గొప్పవాడినే! నాకూ గొప్ప పేరుంది. ఈ మాట మా ఆవిడ ముందు అంటే ఒప్పుకోదు. కుళ్లు అనుకోవచ్చు. భర్త గొప్పోడైతే భార్యకు కుళ్లు ఉంటుందా? ఉండొచ్చు.. మా ఆవిడకు ఉంది. చాలాసార్లు మేం గొడవ పడ్డ సందర్భాలు గుర్తుండవు. అసలు ఎందుకు గొడవ పడ్డామో ఇద్దరం మర్చిపోతుంటాం. కాకపోతే ఒకటుంది. గొడవ పడ్డప్పుడల్లా ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంటాం. దాన్ని ఎంత పద్ధతిగా అమలు పరుస్తాం అంటే... అంత పద్ధతిగా! మా పెళ్లి రోజుకి సరిగ్గా రెండు రోజుల ముందు గొడవ అయింది. చెప్పాను కదా, ఎందుకయిందో గుర్తుండదు. అప్పుడొక నిర్ణయం తీసుకున్నాం. ఇద్దరం ఎవ్వరం ఎవ్వరికీ గిఫ్ట్ ఇచ్చుకోకూడదు అని. అది ఏ గిఫ్ట్ అయినా, ఎంతటిదైనా! మాలో ఎవరు గిఫ్ట్ కొన్నా సర్ప్రైజ్లా కాకుండా ఇద్దరం షాపింగ్ చేసే కొంటాం. అది మేం ప్రేమలో ఉన్నప్పట్నుంచే జరుగుతూ వస్తోంది. పెళ్లిరోజు కేక్ కట్ చేశాం, డిన్నర్‌కి వెళ్లాం, పార్టీ చేసుకున్నాం. గిఫ్ట్‌లు మాత్రం ఇచ్చుకోలేదు. ఆ గొడవ అలా సద్దుమణిగిపోయింది. మేము తీసుకున్న నిర్ణయానికి మాత్రం కట్టుబడే ఉన్నాం. ప్రపంచానికి మేము మంచి భార్యాభర్తలం. మేమిద్దరమే ఉన్నా కూడా చక్కగా ఉంటాం. మా ఆవిడకు నేను గొప్ప వాడినని కుళ్లు అన్నా కదా, మా ఇద్దరినీ కలిసి చూస్తే ప్రపంచానికి కుళ్లు. అంత బాగుంటాం ఇద్దరం. గొడవలు గొడవలే! మా మావయ్య చెప్పింది నిజమే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.పెళ్లిరోజు పోయిన నెలకే నా పుట్టినరోజు. పొద్దున్నే ఆఫీసుకు వెళ్లేప్పుడే చెప్పింది, ‘‘ఇవ్వాళ తొందరగా వచ్చెయ్! నేను హాఫ్ డే లీవ్’’ అని. మధ్యాహ్నం అదే విషయం చెప్తూ మళ్లీ ఫోన్ చేసింది. ‘‘తిన్నావా?’’ ‘‘ఆ! తిన్నా’’ ‘‘సరే! నేనిప్పుడే ఇంటికి వచ్చా. ఇవ్వాళ హాఫ్ డే చేశా. నీకోసమే!’’ ‘‘రేపు నా పుట్టినరోజనా?’’ ‘‘అంత సీన్ లేదులే కానీ, త్వరగా వచ్చెయ్’’ నవ్వుతూ చెప్పింది. ‘‘సర్ప్రైజా? ఓ... వెయిట్.. సర్ప్రైజా?’’ అడిగా. ‘‘నువ్వైతే రా!’’ అంది. మా జంటను చూసి మీరు కుళ్లుకుంటే నేనేం చేయలేను. సాయంత్రం దాకా సర్ప్రైజ్ ఏంటా ఏంటా అనే ఆలోచిస్తూ కూర్చున్నా. నాకప్పుడు గుర్తొచ్చింది. నేను గిఫ్ట్స్ తీసుకోవద్దు అని. మొత్తం ఆలోచనలన్నీ ఎగిరిపోయాయి. ఎగై్జట్‌మెంట్ చచ్చిపోయింది. తను చెప్పింది కాబట్టి తొందరగానే ఇంటికెళ్లిపోయా. ‘‘సరే! రెడీ అయిరా.. బయటకెళ్దాం’’ అంది.. నేను ఇంట్లో అడుగుపెట్టడమే! ‘‘ఎందుకు?’’ ‘‘ఎందుకేంటి?’’ ‘‘అదే రెడీ అవ్వడం ఎందుకూ?’’ ‘‘రెడీ అయ్యి రా బాబూ.. బయటికెళ్దాం’’ ‘‘దేనికీ?’’ ‘‘రేపు నీ బర్త్‌డే కదా! నేనేదైనా కొనిపెడతా’’ ‘‘అవసరం లేదు.’’ ‘‘ఏం అవసరం లేదు?’’ ‘‘అవసరం లేదు. మన అగ్రిమెంట్ మర్చిపోయావా? ఎవ్వరం ఎవ్వరికీ గిఫ్ట్ ఇచ్చుకోవద్దు.’’ ‘‘ఇప్పుడవన్నీ ఎందుకు ఆలోచిస్తావ్?’’ ‘‘నేనిప్పుడే ఆలోచిస్తా. రేపు పార్టీ ప్లాన్ చేద్దాం. అంతే కానీ నువ్ నాకేం గిఫ్ట్ ఇవ్వనక్కర్లేదు.’’ కోపంగా చూసింది. నాకోసమే రెడీ అయి ఎదురుచూస్తూ కూర్చుందేమో, భలే అందంగా ఉంది. ‘‘చావ్!’’ అనుకుంటూ బెడ్రూమ్కు వెళ్లిపోయింది. గిఫ్ట్లేం ఇచ్చుకోకుండానే పుట్టినరోజు అయిపోయింది. నా పుట్టినరోజు పోయిన నెలన్నరకే తన పుట్టినరోజు వచ్చింది. మా అగ్రిమెంట్ బాగానే గుర్తుంది కానీ ఎందుకో ఏదోక గిఫ్ట్ ఇవ్వాలని అనిపించింది. ఎల్లుండి తన పుట్టినరోజు. టీవీలో ఏదో చూస్తూ కూర్చుంది. కాఫీ కలుపుకొని వెళ్లి ఇచ్చా. ‘‘థ్యాంక్యూ!’’ అని తీసుకుంటూ ‘రా కూర్చో’ అని సైగ చేసింది. ‘‘బర్త్‌డే ప్లాన్స్ ఏం చేద్దాం?’’ అనడిగా ‘‘రెగ్యులర్‌గానే చేద్దాం. కొత్తగా ఏం చేస్తాం?’’ ‘‘నేన్నీకు..’’ అని పూర్తి చేయకముందే ‘‘కొంపదీసి గిఫ్ట్ ఇస్తావా?’’ ‘‘అదే అనుకుంటున్నా. షాపింగ్‌కు వెళ్దాం పద’’ ‘‘నేను రాను’’ ‘‘అరే! ఏదైనా కొనిపెడతా అన్నా కదా..’’ ‘‘నాకేమీ వద్దు’’ ‘‘నేనేమన్నానని..’’ ‘‘నువ్ ఏమనడమో కాదు. నాకేమీ వద్దు. మొన్న నీ బర్త్‌డేకి అడిగితే వచ్చావా?’’ ‘‘అదేదో..’’ ‘‘అవసరం లేదు. నాకు నువ్విచ్చే గిఫ్ట్.. అదెంత చిన్నదైనా గొప్పే! కానీ వద్దు. వద్దంటే వద్దు.’’ ‘‘మొండి చెయ్యకు..’’ ‘‘సరే సార్! నాకేమీ వద్దు.’’ ‘‘చావ్!’’ అని అక్కణ్నుంచి వెళ్లిపోయా. తన పుట్టినరోజు కూడా అయిపోయింది. టైమ్ గిర్రున తిరిగి, మా పెళ్లి రోజు మళ్లీ వచ్చింది. అప్పుడూ గిఫ్ట్‌లు ఏమీ ఇచ్చుకోలే! నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడూ గిఫ్ట్ మాట వచ్చింది కానీ, నేనే మళ్లీ ఓవరాక్షన్ చేసి వద్దన్నా. ఇప్పుడు తన పుట్టినరోజు వచ్చింది. ఈసారి మా అగ్రిమెంట్ ఎలాగైనా బ్రేక్ చేయాలనుకున్నా. ఇక్కడ నాకూ కాస్త ఈగో ఉందనే చెప్పుకోవాలి. తన పుట్టినరోజుకి మూడు రోజుల ముందు ఒక లెటర్ రాశా. అది చదివింది. ‘బాగుంది’ అని మెచ్చుకుంది. భార్యాభర్తల మధ్య మెచ్చుకోవడాలు ఏంటో! ఆ ఉత్సాహం మీదనే అడిగా, ‘‘నీ బర్త్‌డేకి..’’ ‘‘చెప్పు నా బర్త్‌డేకి..’’ ‘‘షాపింగ్‌కి వెళ్దామా?’’ నవ్వింది. ‘‘చెప్పు వెళ్దామా?’’ మళ్లీ అడిగా. వెళ్దామన్నట్టు తలూపింది. ‘‘నువ్వు ఒప్పుకుంటావనుకోలే! రెండేళ్లలో రెండు సార్లు నీకు గిఫ్ట్ ఇవ్వలేకపోయినందుకు ఎంత బాధపడ్డానో!’’ అన్నా. ‘‘అహా! ఎక్కడ పెట్టావ్ ఆ రెండు గిఫ్ట్‌లూ?’’ అడిగింది. నేను అయోమయంగా చూశా. లోపలికెళ్లింది. రెండు నిమిషాల్లో తను నాకోసం ఈ రెండేళ్లలో తీసుకున్న మూడు గిఫ్ట్‌లు తెచ్చి ముందు పెట్టింది. వాచీ, మొబైల్ ఫోన్, ఏడు టీ షర్ట్స్ ఉన్న ప్యాక్. నేనైతే తను ‘నాకేమీ వద్దు’ అనగానే ఏ గిఫ్టూ కొనలేదు. జరగబోయేది భయపెట్టేసింది. అరుస్తుందా? ఎలా కవర్ చేయాలి? దాచిపెట్టా అని చెప్పి రెండు రోజుల్లో ఎప్పుడో కొన్నట్టు కొత్తవి కొంటే? అయినా... సడెన్‌గా ఏంటీ ట్విస్ట్? సినిమాలో సంసారం ప్యాంటు, షర్టు కావాలని నేనడిగానా? చీరలు కావాలని నేను వేధించానా? భానుప్రసాద్(వెంకటేశ్), స్వప్న(మీనా) ప్రేమించుకుంటారు. వారి పెళ్లికి ఇరుకుటుంబాల పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకుని వేరు కాపురం పెడతారు. భానుప్రసాద్ బస్సు క్లీనర్‌గా చేరతాడు. అడ్వాన్స్‌గా ఇచ్చిన 500 రూపాయలు భార్యకి ఇచ్చి, అందులో రూ.250 తీసుకుని సరుకులు తెస్తానని సంతకి వెళతాడు. అక్కడ ఒక చీర కొంటే మరో చీర ఉచితంగా ఇస్తుండటంతో సరుకులు తీసుకోకుండా చీరలు కొనుక్కొని ఇంటికొస్తాడు. ‘అదేంటండీ వట్టి చేతులతో వచ్చారు. సరుకులేవీ?’ అని భర్తని ప్రశ్నిస్తుంది భార్య. భానుప్రసాద్ గుంజిళ్లు తీస్తూ అసలు సంగతి చెబుతాడు. ‘ఉన్న డబ్బంతా పెట్టి చీరలు కొన్నారు.. మరిప్పుడు సాపాటు’ అంటుంది స్వప్న. ‘నేనంత తెలివి తక్కువ వాడినా.. నీ వద్ద రూ.250 ఉంది కదా.. వాటితో సరుకులు కొనేస్తా. వెళ్లి డబ్బులు తీసుకురా’ అంటాడు భానుప్రసాద్. స్వప్న కూడా గుంజిళ్లు తీస్తూ ఆ డబ్బుతో ప్యాంటు, షర్టు కొన్న విషయం చెబుతుంది. ‘ఉన్న డబ్బులన్నీ పెట్టి బట్టలు కొనేశావు. మరిప్పుడు సాపాటు?’ అని భర్త ప్రశ్నిస్తే.. అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి అంటుంది స్వప్న. ‘ప్యాంటు, షర్టు కావాలని నేను అడిగానా అని భానుప్రసాద్, నేను మాత్రం చీరలు కావాలని వేధించానా?’ అని స్వప్న వాదించుకుంటారు. ఉన్న డబ్బుతో బట్టలు కొనేస్తే ఇల్లు గడిచేదెలా అనేదే వారి బాధ. భార్యాభర్తల మధ్య ప్రేమకు, ఒకరి పట్ల మరొకరికి ఉండాల్సిన కన్సర్న్కు ప్రతీకగా ఉంటుంది ‘సూర్యవంశం’ సినిమాలోని ఈ సన్నివేశం. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – వి. మల్లికార్జున్ -
సింకులోని కప్పు... వైరులో కరెంటు...
సమ్సారం సంసారంలో సినిమా ‘‘నా పరువు తియ్యకురా మగడా’’ రహస్యంగా పళ్లుకొరుకుతూ అంది మా ఆవిడ. తన పరుపు పోయే పని నేనేం చేశానో అర్థం కాలేదు.ఈ ఒక్క సందర్భంలోనే కాదు... చాలా సార్లు ఆ మాట అర్థం కాలేదు. ఆ కోపమెందుకో అర్థం కాలేదు. ఆ కోపానికి మూలమేమిటో తెలియదు.అర్థం కాకపోవడం ఏముంది. అర్థం కాకపోవడం అనే ఫ్యాక్టూ, ఫ్యాక్టరూ కాపురంలో ఎప్పుడూ నిత్య నూతనమే. ఎప్పుడూ అర్థం కాదు. ఏదీ అర్థం కాదు. బహుశా అర్థం అయినరోజు కాపురం ఉండదు. నాకు చిన్న పని కూడా చేతకాదట. పెళ్లయిన తర్వాత నా మీద వచ్చిన మొదటి అభియోగం ఇది. ఎప్పటికప్పుడు ఈ ఫిర్యాదు రెన్యువల్ అవుతూ ఉంటుంది.‘‘నువ్వు ఎప్పుడూ ఏ పనీ సక్రమంగా చెయ్యలేవు. నీ ప్రతీ పనితో ఆ విషయం తెలిసిపోతుంటుంది’’ అంది మా ఆవిడ.నేను షాక్ తిన్నాను. షాక్ తినడం ఇది మొదటిసారి కాదు. షాకులూ, కేకులు, టేకులూ తినడానికే ఉన్నాయి. సినిమా యాక్టర్లు టేకులూ, బర్త్‌డే రోజున కేకులూ తింటారేమోగానీ... పెళ్లయిన ప్రతివాడూ షాకులే తింటాడు. విషయం ఏమిటంటే... కాస్తంత ప్రాక్టీస్ చేస్తే టేకు తినరేమో. కేకు వద్దనుకుంటే పారేయవచ్చేమో. కానీ షాక్ తినడం మాత్రం తప్పదు. ‘‘కాపురం అంటే ఏమిట్రా?’’ అని పెళ్లికాకముందు ఒక ఫ్రెండ్‌ను అడిగా.‘‘ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎప్పుడో కరెంట్ లేని రోజుల్లో అన్నమాట అది. ఇవి మోడ్రన్ రోజులు కాబట్టి ఇంటి బల్బు ఇల్లాలు అనుకుందాం’’ అన్నాడు వాడు.‘‘ఒరేయ్ బల్బులో కాంతి తక్కువ కదా. కాబట్టి ట్యూబ్‌లైట్ అందామా?’’ వాణ్ణి సవరించబోయా.‘‘నో... నో... ట్యూబ్‌లైట్ అనే ఆ మాట ఎప్పుడో భర్తకు ఫిక్సయ్యింది’’ జవాబిచ్చాడు.‘‘సరే’’ అన్నా. ‘‘ఓకే... ఇంటికి బల్బ్ ఇల్లాలు అనుకున్నాం కదా. మరి కరెంటే కాపురం. అంటే బల్బు కనిపిస్తుంది. అది భార్య. వైరు మీద ఉన్న ఇన్సులేషన్ కనిపిస్తుంది. పైగా అది లోపల ఉన్న వైరుకు రక్షణ ఇస్తుంది. కాబట్టి కనిపించేదీ, రక్షణ ఇచ్చేది ఇన్సులేషనే కాబట్టి అది భర్త. ఇక మనకు కాపురం కనిపించదు. కాబట్టి వైరులోని ఎలక్ట్రిసిటీయే కాపురం. ఇలా భార్య, భర్త కనిపిస్తారు. కానీ కాపురం కనిపించదు కదా. పైగా కాపురం కాపురం అంటారు. అదేమిటో ఎవ్వరికీ కనిపించదు అచ్చం ఎలక్ట్రిసిటీ లాగే. అందుకే కరెంటున్న కాపర్ వైరే... కాపురం. ఆ కరెంటులోంచి కొట్టే షాకులే దాంపత్యం. బహుశా... కాపర్ నుంచి కాపురం అనే మాట వచ్చిందేమో’’ అన్నాడు వాడు. ఇప్పుడు నాకు ఆ కరెంట్ సంగతీ... నాకు పని చేతకాని సంగతీ ఒకేసారి ఎందుకు గుర్తొచ్చాయంటారా? చెబుతా... చెబుతా...కాసేపటి క్రితం మా ఇంటికి అప్పుడెప్పుడో డిగ్రీ చేస్తున్నప్పటి ఫ్రెండ్స్ వచ్చారు. అందరమూ సదరాగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మా ఆవిడ అందరికీ కాఫీ తెచ్చింది. బాగుంది. హాయిగా తాగాం. కాఫీ కాగానే ఎప్పటిలాగే నేను గ్లాసు తీసుకెళ్లి సింక్ దగ్గర పెట్టి వచ్చా. అయితే ఆ టైమ్‌లో కరెంట్ పోయి ఉంది. నేను సింక్ దగ్గర్నుంచి వెనక్కు వస్తున్నప్పుడు కిచెన్ డోర్ వద్ద మిగతా గ్లాసులు తెస్తూ, బయట ఉన్న నా ఫ్రెండ్స్‌కు వినపడనంత రహస్యంగా అరిచిన అరుపే... ‘‘నా పరువు తియ్యకురా మగాడా’’ అన్న మాట. ఆ మాట ఎందుకన్నదో నాకు అర్థం కాలేదు. బహుశా నా గ్లాసు లోపల పెడుతున్నప్పుడు కరెంట్ పోయి ఉంది కదా. అందుకే గ్లాసు పెట్టే సమయంలో కిచెన్‌లో నాకు తెలియకుండా నేనింకైదేనా పగలగొట్టడం వంటిదేమైనా చేశానా? ఏమో అదీ తెలియదు. అయినా... ఆమె ఇంకా కిచెన్ డోర్ దగ్గరే ఉంది కదా. పైగా నేనే పనీ చేయనన్న మాట పట్టుకొని నాకు ఇచ్చిన శిక్షణను కూడా విజయవంతంగా నిర్వహించాను కదా. శిక్షణ ఏమిటని మళ్లీ అడగకండి. ఏ పనీ చేయనని కదా... నా మీద ఉన్న కంప్లయింట్. ఒకవేళ చేసినా చక్కగా చేయననే కదా. ఈ కంప్లెంట్ ఎన్నిసార్లు నమోదయ్యిందో లెక్కేస్తే అది తప్పక గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కి ఉండే ఫ్యాక్టే. ఆమె చేసే ఈ మల్టిపుల్ కామెంట్తోనైనా నేను బోల్డన్ని సార్లు పనిచేస్తున్నాననే విషయం తేటతెల్లం కావడం లేదా అన్నది నా సందేహం.గతంలో నేను ఇక్కడి వస్తువు అక్కడ పెట్టేవాణ్ణి కాదు(ట). అలా మాటిమాటికీ దెప్పి దెప్పీ నేను తాగిన గ్లాసును చక్కగా తీసుకెళ్లి సింకు దగ్గరపెట్టడం అలవాటు చేసింది.గుమ్మంలో పేపర్ వేసీ వెయ్యగానే దాన్ని పట్టుకొచ్చి ఇచ్చేలా మా టైగర్కూ, కాఫీ గ్లాసు సింకు దగ్గర పెట్టేలా నాకూ ఒకేసారి శిక్షణ మొదలైంది. మా వేర్వేరు శిక్షణా కార్యక్రమాల్లో మా టైగర్ కంటే నేనే కాస్త ఆలస్యంగా పాసై ఉండవచ్చు గాక. కానీ... పేపర్ తేవడాన్ని మా టైగర్ ఎప్పుడైనా మరచిపోయిందేమో గానీ, నేను మాత్రం కాఫీ గ్లాసును సింకు దగ్గర పెట్టడం అనే నా విద్యుక్తధర్మాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. అంతెందుకు... ఇప్పుడు కూడా. అందుకే నాకు ఒళ్లు మండింది. ‘‘ఇప్పుడు నేనేం చేశాను? అదీ నీ పరువు తీసే పని?’’ అంటూ నిలదీశాను. ‘‘ఇంకేం చెయ్యాలి. అందరూ తాగుతుండగానే ఇప్పుడేం తొందర వచ్చిందని గ్లాసును సింకు దగ్గరికి తీసుకొచ్చావ్? ఇలా తీసుకొచ్చి నా పరువంతా సింకులో ముంచేశావు’’ అని అంది. ‘‘ఓహో... నా గ్లాసొక్కటే తీసుకెళ్లకుండా... నలుగురి గ్లాసులూ తీసుకెళ్లాల్సిందంటావా’’ అన్నా... అప్పటికీ అర్థం గాక.‘‘ఒరేయ్ నా మొగుడా... నా – ప –రు – వు – తి – య్య – కు. ఇంట్లో గెస్టులున్నారు. ఘోస్టులా బిహేవ్ చెయ్యకు. నా పరువు మళ్లీ మారోసారి తియ్యకు’’ అంటూ వార్నింగ్ ఇస్తూ... పటపటలాడుతుండగా మళ్లీ పళ్లు కొరుకుతూ ఒక్కొక్క మాటనూ ఒత్తి పలుకుతూ అంది మా ఆవిడ. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల వరకూ మా ఇంట్లో కరెంట్ ఉన్నా లేనట్టే. ట్రాన్స్ఫారం పేలిపోయిన తర్వాత బల్బులు ఆరిపోయిన వీధిలా ఉంది చాలా రోజులుగా మా కాపురం.ఎట్టకేలకు బతిమిలాడగా... ఆడగా నాల్రోజుల తర్వాత తొలిసారిగా చిన్న జీరో బల్బు వెలిగినట్టుగా మాట్లాడింది మా ఆవిడ.‘‘గెస్టులు వచ్చినప్పుడు నీ గ్లాసు నువ్వే తీసుకెళ్లి సింకుదగ్గర పెట్టడం అంటే... నేనేదో నిన్ను రాచిరంపాన పెట్టి... నీతోనే గ్లాసులు, కంచాలు తీయిస్తున్నట్లు చెప్పడమే కదా... అందుకే ఎవరైనా వచ్చినప్పుడు నీ గ్లాసు కూడా నేనే తీస్తా. నువ్వు తియ్యకు’’ అంది.నలుగురు ఉన్నప్పుడు నా గ్లాసును ఆమెను తియ్యమంటే పరువు తక్కువ గానీ... అలా నలుగురు ఉన్నప్పుడు నా గ్లాసు ఆమె తియ్యడం అన్నది ఆమె పరువు ఎలా పెంచుతుందో అర్థం కాలేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదు. ఎలాగూ నాకేమీ అర్థం కాదనే స్టేట్మెంట్ నాకు కొత్త కాదు. కాబట్టి నాకొచ్చే నష్టమేమీ లేదు. నాక్కావల్సిందల్లా మా ఆవిడ మళ్లీ ఎప్పటిలాగే బల్బులా వెలగడం. అందుకే ఆ జీరో బల్బును సీఎఫ్ఎల్ బల్బులా వెలిగించుకునే ప్రయత్నంలో భాగంగా ‘‘తియ్యను... తియ్యను. ఈసారి గెస్టులొచ్చినప్పుడు నా గ్లాసూ తియ్యను. నీ పరువూ తియ్యను. అప్పుడు మాత్రం ఓ మంచి ఇల్లాల్లా నా గ్లాసూ నువ్వే తీద్దువుగానీలే’’ అంటూ ఆమెను ఓదార్చాను. అవును... నేనెప్పుడూ ఏ పని చెయ్యను. చెయ్యలేను. చేసినా సరిగా చెయ్యలేను. మా ఆవిడ ప్రవచించినట్టు... కాపురం అంటే ఎప్పుడూ తప్పులో కాలేయడమేనా... సారీ కప్పులో కాలేయడమేనా? కంటిలోని నలుసూ... ఇంటిలోని నలుసు అన్నది వేమన చెప్పిన మాట. మరి చెప్పని మాటేంటో చెప్పనా? ‘సింకులోని కప్పు... వైరులో కరెంటు’! సినిమాలో సంసారం అయితే... ఓకే! పొట్టిరాజు(కొండవలస లక్ష్మణరావు) భార్య సరోజినిది గొట్టాల వ్యాపారం. భర్త ఏ పనీ లేకుండా స్నేహితుల సత్యానందం(జీవా), చిట్టిబాబు (కృష్ణ భగవాన్)తో కాలక్షేపం చేస్తుంటాడు. సత్యానందం ఒకే రూమ్‌ను పగలు అనిల్‌కుమార్(రవితేజ)కి, రాత్రి స్వాతి(కల్యాణి)లకు అద్దెకిచ్చి మేనేజ్ చేస్తుంటాడు. ఓ రోజు స్వాతి త్వరగా వస్తుంది. రూంలో ఉన్న అనిల్‌ని గోనె సంచిలో కట్టి పనసకాయలని కల్యాణికి చెబుతారు. అంతటితో ఆగక ‘ఒరేయ్ పొట్టిరాజూ! రూపాయి కూడా సంపాదించవని నీ వైఫ్ తిడుతుంటది కదా. నాలుగొందలు పెట్టి ఎనిమిది పనసకాయలు తెప్పించాను. డిమాండ్ బాగా పెరిగిపోయింది. కాయ వంద అన్నా కొనేస్తారు. వీటిని కొనుక్కుని తిరిగి అమ్ముకున్నావనుకో... అరగంటలో నాలుగొందలు లాభం. ఈ లాభం తీసుకెళ్లి మీ వైఫ్‌కి చూపించావనుకో చాలా సంతోష పడుతుంది. నీ విలువ పెరిగిపోతుంది’ అంటారు. హుషారుగా భార్య దగ్గరకెళ్లి... ‘ఎందుకూ పనికిరాని ఎదవనీ, సంపాదించడం చేతకాని చవటనీ తిట్టి పోస్తుంటావ్ కదే.. నాలుగొందలు ఇవ్వు. అరగంటలో ఎనిమిది వందలు చేస్తా’ అంటాడు పొట్టిరాజు. భార్య వద్ద నాలుగొందలు తీసుకుని చిట్టిబాబుకిస్తాడు పొట్టిరాజు. ఆ టైంలో పక్కకి పొర్లుకుంటూ వెళ్లి సంచిలోంచి బయటికొచ్చేస్తాడు రవితేజ. విషయం తెలియని పొట్టిరాజు... పనసకాయలు ఏవీ... ఎక్కడ అని అరుస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సరోజినిని చూడగానే ‘అంతా మోసం. దగా. ఇందులో కాయలు లేవు’ అని ఏడుస్తాడు పొట్టిరాజు. కోపంతో సరోజిని తన్నడానికి కాలు ఎత్తగానే ‘నేనొప్పుకోను’ అంటాడు. భార్య తన్నగానే బురదనీళ్లలో పడి ‘అయితే ఓకే’ అంటాడు కొండవలస ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – ఆర్ -
హెల్ప్ చేసేదా సుధా?
సంసారంలో సినిమా సుధ ఒక భార్య. మధు ఒక భర్త. సుధ కూకట్‌పల్లిలో ఉంటున్న ఎవరికో భార్య కాదు. మధు లింగంపల్లిలో ఉంటున్న వేరెవరికో భర్త కాదు. సుధదీ మధుదీ ఒకే ఏరియా. చిక్కడపల్లి. ఇద్దరూ ఉండేది ఒకే ఇంట్లో. అండర్లైన్ ఏంటంటే.. ఇద్దరూ ఒకరికొకరు భార్యాభర్తలు. అయితే ఈ క్షణంలో వాళ్లు కేవలం భార్యాభర్తల్లా లేరు! భర్త గురించి బాగా తెలిసిన భార్యలా.. కోపంగా ఉంది సుధ. భార్య గురించి ఏమీ తెలియని భర్తలా అమాయకంగా పడి ఉన్నాడు మధు. భార్యాభర్తల్లో ఒకరికి బాగా తెలిసి, ఇంకొకరికి ఏమీ తెలియక పోవడం పెళ్లయిన కొత్తల్లో మాత్రమే ఉంటుంది. అన్నీ తెలిసినవాళ్లు ఏమీ తెలియనట్లుగా, ఏమీ తెలియనివాళ్లు అన్నీ తెలిసినట్లుగా.. కాళ్ల పారాణి ఆరే దాకా మాత్రమే ఉంటారు కాబట్టి కొత్తల్లో అలానే ఉంటుంది. మధ్యలో కొన్నేళ్లు ఒకరి గురించి ఒకరికి తెలిసిపోయి.. ‘తెలిసిపోయింది కదా’ అని తెలుసుకోడానికి ప్రయత్నించరు. ఆ తర్వాత కొత్త కొత్త విషయాలు భార్య దృష్టికి వస్తాయి. పాపం.. ఆమె దృష్టి మంచిదే! భర్తే వెళ్లి ఆమె కంట్లో పడతాడు. ఎలా పడకూడదో అలా పడతాడు. తెలిసి పడినా, తెలియక పడినా.. పడడం అతడి కర్మ. ∙ ∙ ‘‘చేతకాని పనులు ఎందుకు చేస్తారో మీరు!’’ అంటోంది సుధ. ‘‘ఏమైంది సుధా?’’ అంటున్నాడు మధు. ‘‘మిమ్మల్ని నేనేమైనా హెల్స్ చెయ్యమన్నానా?’’ ‘‘అరె! ఏమైంది సుధా.. చెప్పు?’’ ‘‘మీరు తెలిసి చేస్తారో, తెలియక చేస్తారో అర్థం కాదు’’ ‘‘ఏమైందో తెలిస్తేనే కదా.. తెలిసి చేశానో, తెలియక చేశానో నాకైనా తెలిసేది!’’ ‘‘మీ మనసుకు తెలీదా?’’ ‘‘అలా తినేయకు.. ఏం చేశానో నాకేం తెలుసు. ఒక వేళ చేశానే అనుకో. తెలిసే చేసుంటానని నువ్వెందుకనుకుంటావ్? నీకు నచ్చనిది నేనెప్పుడైనా చేశానా’’ అన్నాడు మధు. ‘‘నాకేం డౌటు లేదు? మీరు తెలిసే చేసి ఉంటారు’’ అంటోంది సుధ. జనరల్‌గా భార్యలంతా పద్ధతిగా, తెలివిగా ఉంటారనే విషయాన్ని పక్కన పెడితే.. సుధ పద్ధతైన, తెలివైన భార్య. డౌట్ పడకపోవడం ఆమె తెలివిలోని ఒక భాగం. సుధ డౌట్‌కి చోటివ్వదు. ‘నో డౌట్’కి మాత్రమే చోటిస్తుంది. తను అనుకున్నదే నిజం అని తన నమ్మకం. అయినా నిజం కాకపోతే తనెందుకు నమ్ముతుంది అని కూడా అనుకుంటుంది. సుధ ఎప్పుడూ కరెక్ట్. ఆ సంగతి మధుకీ తెలుసు. సుధ.. ఇంటిని పద్ధతిగా ఉంచుతుంది. పిల్లల్ని పద్ధతిగా పెంచుతుంది. భర్తలో ఎవ్రీడే పద్ధతుల్ని పెంచి పోషిస్తుంటుంది. మధు అలాక్కాదు. కొన్నిసార్లే పద్ధతిగా ఉంటాడు. కొన్నిసార్లు ‘అబ్బే మనకు పద్ధతి వర్కవుట్ కాదు’’ అనుకుంటాడో ఏమో... ‘‘ఇన్ని పద్ధతుల మధ్య నేను హాయిగా ఉండలేను సుధా’’ అని పద్ధతుల్ని ఎక్కడివక్కడే... టవల్ని వదిలేసి వెళ్లినట్టుగా వెళ్లిపోతాడు. అయితే ఈ టైప్ ఆఫ్ ‘పద్ధతి లేకపోవడం’ సుధకు కోపం తెప్పించేటంతటిది కాదు. భర్త అనేవాడు ఒంటి మీద స్పృహ లేకుండా అభయారణ్యంలో మృగజీవిలా (సమ్‌టైమ్స్ మూగజీవిలా) ఇంట్లో సంచరిస్తూ ఉండడం ప్రతి ఇంట్లోనూ ఉండేది. ఆ విషయం ఆమెకు తెలుసు. కానీ అతడిప్పుడు.. మధు అనబడే ఆ భర్త ఇప్పుడు.. తెలిసో, తెలీకో ‘కట్టుబాటు’ లోని పద్ధతిని తప్పాడు! దాన్ని పట్టుకుంది సుధ. తను ఎక్కడ, ఎలా కట్టు తప్పాడో అతడికి తెలిసే అవకాశం లేదు. ‘‘నువ్వు కట్టు తప్పావు’’ అని సుధ నేరుగా చెప్పడం లేదు. అసలు అది కట్టుబాటు విషయమా? కట్టుబట్టల విషయమా అనే సంగతీ అతడికి తెలిసే చాన్స్ లేనే లేదు. ఇప్పటికైనా.. తనేం చేశానా అని ఊహిస్తున్నాడు తప్ప, తనేం తప్పు చేశానా అని అతడు ఊహించడం లేదు. ∙ ∙ ‘‘ఊహించని వర్షం కదా!’’ అన్నాడు మధు. ‘‘అవును.. మీ బుద్ధిని కూడా ఊహించలేకపోయాను’’ అంది సుధ. మధు బిత్తరపోయాడు. కాసేపు ఆఫ్‌లైన్ అయ్యాడు. ఆ వెంటనే ఆన్లైన్ లోకి వచ్చాడు. భార్య మూడ్ మార్చేందుకు మళ్లీ ఏదైనా ఒక హెల్ప్ చెయ్యాలనుకున్నాడు మధు. కొన్ని నిమిషాల ముందే ఆమెకు అతడు ఒక హెల్ప్ చేసి ఉన్నాడు. అలా హెల్ప్ చేసే సందర్భం కూడా మధుకు అనుకోకుండా, ఒక మహద్భాగ్యంలా దక్కింది. అంతకుముందే అతడు ఆఫీస్ నుంచి వచ్చాడు. ఎప్పటిలా టైమ్‌కి కాకుండా, టైమ్కన్నా ముందే త్వరగా వచ్చేశాడు. ఇంట్లో చేసే పనిలేదు. బయటికి వెళ్లవలసిన పనీ లేదు. పిల్లలు ఇంకా స్కూల్ నుంచి రాలేదు. సుధ వంటింట్లో ఉంది. పిల్లలు వచ్చేలోపు వాళ్లకు ఏదైనా చేసి పెట్టాలని ఆమె తొందర. ఈ పెద్దమనిషి కూడా వచ్చేశాడు కాబట్టి ఈయనకూ వేరుగా ఏదో చేసే ప్లాన్‌తో కూడా ఉంది. అప్పుడు అడిగాడు మధు.. ‘‘ఏదైనా హెల్ప్ చేసేదా సుధా?’’ అని.. వంటగదిలోకి వెళ్తూ. ‘‘వద్దొద్దు. మీరు వెళ్లి హాయిగా టీవీ చూడండి’’ అంది సుధ. గతంలో మధు ఆమెకు చాలాసార్లు ఇంటి పనిలో హెల్ప్ చేశాడు. ఆ తర్వాత ఆమె తనకు తాను చాలాసేపు హెల్ప్ చేసుకోవలసి వచ్చింది! ‘‘కాదు.. ఇంత కష్టపడుతున్నావు కదా.. చెప్పు.. సరదాగా ఈ ఉల్లిపాయలు తరిగిపెట్టేదా?’’అన్నాడు మధు. ‘‘ఇదేమంత కష్టం కాదు కానీ.. మీకు నేను వేడివేడిగా ఏవైనా ప్లేట్లో వేసి అందించాలంటే.. మీరు నాకు హెల్ప్ చెయ్యకుండా ఉండాలి’’ అంది నవ్వుతూ. మధు హర్ట్ అయ్యాడు. సుధ జాలి పడింది. ‘‘పోనీ, ఈ మూత తీసివ్వండి’’ అని ఉప్పుడబ్బా చేతికిచ్చింది. మధు ఉప్పుడబ్బా అందుకున్నాడు. డబ్బాలో ఉప్పుంది. డబ్బాపై మూత లేదు!‘‘మూత ఏది సుధా’’ అన్నాడు. ‘‘అయ్యో.. ఉందనుకుని ఇచ్చానండీ’’ అంది. మళ్లీ హర్ట్ లాంటిదే ఏదో అయ్యాడు మధు. చాలాకాలం తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికి త్వరగా వచ్చాడు అతను. చాలాకాలం తర్వాత అంటే.. ఓ ఐదారు ఇంక్రిమెంట్లు, రెండుమూడు ప్రమోషన్ల తర్వాత! రోజూ అతడు వచ్చేటప్పటికి సుధ ఇంటిని పద్ధతిగా సర్ది ఉంచుతుంది. అతడికి అన్నీ అమర్చి ఉంచుతుంది. ఇంట్లో అతడికి అలవాటైన దారిని అలవాటైన దారిగానే ఉంచుతుంది. ఇలా చేస్తే భర్త దారి తప్పడని ఆమెకు పెళ్లయిన కొత్తలోనే సీనియర్ సుధ ఎవరో చెప్పారు. ఆఫీసునుంచి వచ్చిన భర్త గేటు తలుపు ఎలా తడతాడో, ఎన్నిసార్లు తడతాడో, తట్టినా తియ్యకపోతే ఎలా లోపలికి చెయ్యిపెట్టి తనే తీసుకుంటాడో, లోపలికి వచ్చాక చెప్పులు ఏమూల వదిలేస్తాడో, ఉన్న రెండు ట్యాపుల్లో ఏ ట్యాపు కింద కాళ్లు కడుగుతాడో, కడిగిన కాళ్లను డోర్ మ్యాట్ మీద ఎన్నిసార్లు రుద్దుతాడో, తర్వాత నేరుగా ఏ గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుంటాడో, మార్చుకున్న బట్టల్ని ఏ హ్యాంగర్‌కి తగిలిస్తాడో, తర్వాత ఎంత సేపటికి స్నానానికి కదులుతాడో, స్నానం అయ్యాక భోజనానికి ఎలా ఆవురావురుమంటాడో, భోజనం అయ్యాక అటొక అడుగు, ఇటొక అడుగు ఎలా వేస్తాడో, వేశాక ఏ మంచంపై వాలిపోతాడో, మంచంపై ఏవైపు తలగడలు ఉంచుకుంటాడో.. ఇవన్నీ మధుకు అలవాటైనట్లే, సుధకూ అలవాటై పోయాయి. ఈ అలవాట్ల ప్రకారమే సుధ ఇంటిని ఎప్పుడూ ఒకే లా భర్తకు అందుబాటులో ఉంచుతుంది. కానీ ఆ ఒక్కరోజు మధు త్వరగా ఇంటికి వచ్చినందుకు.. రోజువారీ అలవాట్లన్నీ తప్పిపోయాయి. సుధ ఇంటినింకా మధు కోసం రెడీ చెయ్యలేదు. దాంతో మధు తనింట్లో తనే దారి తప్పాడు. తడుముకుంటూ నడుస్తున్నాడు. తడబడుతూ నడుస్తున్నాడు. భర్త దారి తప్పడం సుధ చూస్తూనే ఉంది.. అదేమంత విషయం కాదనుకుంది. ఇల్లు సర్దితే అదే సర్దుకుంటుంది అనుకుంది. కానీ అతడు ఇంకో వైపు నుంచి దారి తప్పుతాడని ఆమె ఊహించలేదు! నిజానికి మధు దారి తప్పలేదు. తప్పాడని, లేదా తప్పి ఉంటాడని సుధ అనుకుంది. ∙ ∙ ‘‘చినుకులు పడుతున్నాయ్ సుధా’’ అన్నాడు మధు.. గడపలోంచి తల పైకెత్తి చూస్తూ. ఆవకాయ పెట్టే కాలంలో..ఆకాశంలో మబ్బులు! ‘‘వర్షమా!!..’’ అంది సుధ. మధు పసిగట్టేశాడు! ‘‘మేడ మీద వడియాలు ఎండబెట్టావు కదూ?’’ అన్నాడు. ‘‘కాదండీ... బట్టలు ఆరబెట్టాను’’ అంది సుధ. తను ఎప్పటికీ, ఏదీ పసిగట్టలేనని మధుకు అర్థమయింది. ‘‘అయ్యో!నా బట్టలు కూడా ఉన్నాయా పైన’’ అన్నాడు మధు. మర్నాడు అతడికి ఆఫీసులో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్‌కి వేసుకెళ్లాల్సిన చొక్కా, ప్యాంటు మేడ మీద ఉన్నట్లు అతడికి అనిపించింది. మేడ పైకి పరుగు తీయబోయాడు’’. ‘‘లేవు.. లేవు.. పిల్లలవీ, నావీ ఉన్నాయి. మీరు వెళ్లకండి. నేను తెచ్చేస్తాను. మీవి మాణింగే ఇస్త్రీ చేయించి ఉంచాను’’ అని వంటింట్లోంచే అరిచి చెప్పింది సుధ. ‘‘పర్లేదు.. నేను తెస్తాను’’ అని బడబడా మెట్లెక్కి మేడపైకి వెళ్లిపోయాడు మధు. ‘‘మెట్లు దిగేటప్పుడు జాగ్రత్త’’ అని మళ్లీ అరిచి చెప్పింది సుధ. చినుకులు పెద్దవయ్యాయి. ఇవి ఇంకా పెద్దవి కాకముందే.. మేడపైన దండెం మీద ఉన్న సుధ బట్టల్నీ, పిల్లల బట్టల్నీ క్లిప్పులు తప్పించి.. కుప్పగా కిందికి మోసుకొచ్చాడు మధు. ఆ కుప్పనంతా మంచం మీద పడేశాడు. తడవకుండా తెచ్చినందుకు తనకే తెలియని ఒక çసంతోషంతో ఉన్నాడు మధు. అక్కడేదో చిన్న అచీవ్మెంట్ జరిగినట్లుగా ఉంది అతడికి. ‘‘అయ్యో! నేను తెచ్చేదాన్ని కదండీ. పిల్లల బట్టలంటే పర్వాలేదు, నా బట్టల్నీ మీరు మోసుకొస్తే చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారు?’’ అని నొచ్చుకుంది సుధ. పిల్లలు వచ్చే టైమ్ అయింది, వంటా పూర్తయింది. సింక్ క్లీన్ చేసి చేతులు కడుక్కుంటోంది సుధ. మధు హాల్లో ఉన్నాడు. ఒక పెద్ద పని చేశాక, దొరికిన తీరికను అనుభవిస్తున్నవాడిలా ఉన్నాడు. కాసేపు అటూఇటూ తిరిగాడు. భార్యకు ఇంకా ఏదైనా హెల్స్ చేయాలనిపించింది. మంచం మీద తను వేసిన బట్టల కుప్పల్లోంచి ఒక్కోటీ తీసి మడతపెట్టే పనిలో పనిలో పడ్డాడు. రెండు బట్టలు మడతపెట్టాక లైట్ పింక్ కలర్ లంగా చేతికి వచ్చింది. దాన్ని శ్రద్ధగా మడత పెడుతున్నాడు. అటునుంచి ఒక ఫోల్డ్, ఇటునుంచి ఒక ఫోల్డ్ వేశాడు. మధ్యకు ఇంకో ఫోల్డ్ వేయబోతూ, చిన్నచిన్న మడతల్ని వేళ్లతో సవరిస్తున్నాడు. భర్త వైపు నుంచి సౌండ్ లేకపోవడం కిచెన్ నుంచి నేరుగా భర్త ఉన్న దగ్గరికి వచ్చి చూసింది సుధ. అయితే ఆమెకు భర్త కనిపించలేదు. భర్త చేతిలో ఉన్న లైట్ పింక్ కలర్ లంగా కనిపించింది! ఒక్కసారిగా పెద్దగా అరిచేసింది సుధ. ‘‘ఎందుకు మీకీ పనులు’’ అంటూ అతడి చేతుల్లోంచి లంగా లాగేసుకుని అతణ్ణి దూరంగా నెట్టేసింది. మధు బిక్కమొహం వేశాడు. ‘‘ఏమైంది సుధా’’ అన్నాడు. సుధ చెప్పలేదు. ‘‘ఇంకెప్పుడూ మీరు మేడ పైకి వెళ్లి బట్టలు తేకండి’’ అని మాత్రం అంది. మధు అయోమయంగా ముఖం పెట్టాడు. ∙ ∙ ఆ అయోమయంలో చాలాసేపు అర్థాలు వెతుక్కుంది సుధ. ఎంత వెతుక్కున్నా అందులో అమాయకత్వం తప్ప ఏమీ కనిపించడం లేదు. అనవసరంగా డౌట్ పడ్డాను అనుకుంది. ‘‘నో డౌట్.. హి ఈజ్ గోల్డ్’ అని కూడా అనుకుంది. రాత్రి ఎనిమిదింటికి ఆఫీస్ నుంచి వచ్చిన పక్క పోర్షన్ అమ్మాయి శ్రావణికి ఆ లైట్ పింక్ కలర్ లంగా ఇచ్చి చెప్పింది సుధ.. ‘‘వర్షం పడుతుంటే నేనే దండెం మీద నుంచి కిందికి తెచ్చా... మా బట్టలతో పాటు’’ అని. థ్యాంక్స్ చెప్పింది శ్రావణి. రెండు పోర్షన్లకీ ఒకటే మేడ. తిరిగి తమ పోర్షన్లోకి వచ్చేసింది సుధ. మధు భోజనం చేస్తూ, టీవీ చూస్తున్నాడు.. అమాయకంగా. ఆ అమాయకత్వాన్ని అలానే ఉంచేయదలచుకుంది సుధ. రోజూ భర్త వచ్చేటప్పటికి సుధ ఇంటిని పద్ధతిగా సర్ది ఉంచుతుంది. అతడికి అన్నీ అమర్చి ఉంచుతుంది. ఇంట్లో అతడికి అలవాటైన దారిని అలవాటైన దారిగానే ఉంచుతుంది. ఇలా చేస్తే భర్త దారి తప్పడని ఆమెకు పెళ్లయిన కొత్తలోనే సీనియర్ సుధ ఎవరో చెప్పారు. సినిమాలో సంసారం ఏదో లేంది... డౌటు ఎందుకొస్తుంది? చిత్రం : మావిచిగురు దర్శకత్వం : ఎస్వీ కృష్ణారెడ్డి దంపతులు : ఆమని, జగపతిబాబు ఆమని ఊరి నుంచి ఆటోలో వస్తుంటుంది. ఆటోలోంచి చూసి, ‘మమ్మీ... డాడీ...!’ అంటాడు కొడుకు. ‘ఎక్కడ్రా?’ అంటుంది ఆమని. వేలు చూపిస్తాడు కొడుకు. ‘ఆటో ఆపు’ అంటుంది ఆటో డ్రైవర్‌తో ఆమని. ఆటో ఆగుతుంది.ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్లో జగపతిబాబు, వాళ్ల ఆఫీస్ అమ్మాయి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మూన్లైట్ డిన్నర్ చేస్తుంటారు. ఆ దృశ్యాన్ని చూసి ఆమని ఉడికిపోతుంది. ఆటోని ‘పోనియ్’మంటుంది.తల్లీబిడ్డ ఇంటికి చేరతారు. జగపతిబాబు కోసం కోపంగా బాల్కనీలో ఎదురుచూస్తుంటుంది ఆమని. జగపతి బాబు వస్తాడు. ‘ఏయ్ సీతా... ఎప్పుడొచ్చావ్? బాగున్నావా?’ అంటాడు స్కూటర్ ఆపుతూ. ‘తాతగారికి ఎలా ఉంది?’అని అడుగుతాడు స్కూటర్ స్టాండ్ వేస్తూ.బక్కెట్లో నీళ్లు ఎత్తి జగపతిబాబు తలమీద కుమ్మరిస్తుంది ఆమని. ‘‘ఏయ్... ఏంటిదీ... మతీగితీ పోయిందా నీకు’’ అని బాల్కనీలోకి ఎక్కేస్తాడు.‘‘మీరు చేసిన పనులకి మతిపోవడం ఏం కర్మ! పిచ్చెక్కుతోంది’’ అంటుంది ఆమని.ఇక అక్కడి నుంచి ఈ సంభాషణ :‘‘అయినా ఇక్కడికెందుకొచ్చారూ... దానింటికే వెళ్లకపోయారా?’’‘‘దేనింటికీ!!’’‘ఆహహహా.. ఏమి తెలియనట్టుగా దేనింటికీ అని ఎంత గడుసుగా అడుగుతున్నారో! గుటుకూ గుటుకూమంటూ ఐస్‌క్రీమ్‌లు మెక్కుతున్నారుగా... దానింటికి...’’ ‘‘ఓహో... అందుకా నీ అలక! పిచ్చీ మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ మా ఎండీగారు పార్టీ ఇచ్చారు. స్టాఫ్ మొత్తం ఉన్నారు.’’‘‘పిచ్చిమొహందీ... ఏం చెప్పినా నమ్మేస్తుందనేగా?’’‘‘నీకంతగా అనుమానంగా ఉంటే... రేపు మా ఆఫీస్కొచ్చి మా ఎండీగారినే అడుగూ’’.‘‘ఎందుకూ... ఆఫీస్కొచ్చి పరువు తీస్తావా అని ఈ చెంపా ఆ చెంపా చెళ్లున వాయించడానికా?’’‘‘అబ్బా... లోపలికి పద నువ్వు’’‘‘మీరేం లోపలికి రానక్కర్లేదు. ఈ అరుగు మీదే పడుకోండి’’.‘‘పొద్దున్నే ఆవిడ గారు ఒకచేత్తో ఇడ్డెన్ల పొట్లాం, ఒకచేత్తో కాఫీ ఫ్లాస్కు పట్టుకునీ వయ్యారంగా తిప్పుకుంటూ వచ్చి కొసరి కొసరి తినిపిస్తుంది. ఆ ఇడ్డెన్లు తినేసి, ఆ కాఫీ తాగేసి ఇద్దరూ కలిసి మొగుడూపెళ్లాల్లాగా ఒకే ఆటోలో ఆఫీస్‌కి వెళ్లండి’’.(ఇక్కడ పెద్దగా నవ్వుతాడు జగపతిబాబు).అసలు విషయం చెబుతాడు.ఆమని కన్నీళ్లు పెట్టుకుంటుంది.‘‘అయ్యయ్యో! అసలు విషయం తెలుసుకోకుండా అనవసరంగా కస్సుబుస్సులాడాను. నా గడుసుతనమంతా ఏమై పోయిందో. పాపిష్టిదాన్ని. జ్వరం పడి లేచిన మనిషి మీద నీళ్లు పోశాను. ముందు మీరు లోపలికి రండి... రండి’’ అని భర్తలో పాటు లోపలికి వెళ్తుంది ఆమని.తెలుసుకొనర మగడా! (భార్య... భర్తను అనుమానించిందీ అంటే కారణం ఉంటుంది. భయం ఉంటుంది. ఈ రెండింటినీ మించి భర్తపై ప్రేమ ఉంటుంది). తెలుసు కొనర మగడా! భార్య... భర్తను అనుమానించిందీ అంటే కారణం ఉంటుంది. భయం ఉంటుంది. ఈ రెండింటినీ మించి భర్తపై ప్రేమ ఉంటుంది. ∙భావిక -
ఎవరు నీవారు... ఎవరు నావారు...
సరదా సంసారం ఆ సాయంత్రం మా ఆవిడ నేను అడక్కుండానే ఐస్ వాటర్ తెచ్చిచ్చింది. ‘ఎందుకు?’ అన్నాను. ‘మిమ్మల్ని ఐస్ చేయడానికి’ అంది గోముగా. తెలుగు వీక్లీ నవలల్లో చదవడం తప్ప ఈ గోముగా అనే ఎక్స్ప్రెషన్ను పెళ్లయ్యేదాకా ఎరగను. పెళ్లయ్యాక.. ఇదిగో... ఏవైనా పనులు సాధించుకోవాలంటే మా ఆవిడ నుంచి ఈ ఎక్స్‌ప్రెషనే వస్తుంటుంది. ‘చెప్పు’ అన్నాను. ‘రమణి వస్తానంది’ అంది. ‘రమణి ఎవరు?’ అన్నాను. ‘శేఖర్ కూడా ఫోన్ చేశాడు. టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నారట. పింకీ, బుజ్జీ అయితే యమా హుషారుగా ఉన్నారట. ఇక టామీ అయితే తోక ఊపుతూనే ఉందట’ ‘ఎవరీ దొంగల ముఠా?’ ‘అంతేలేండీ మా వాళ్లనేసరికి దొంగల ముఠా. మీ వాళ్లేమో ఎస్.పి.రంజిత్ కుమార్ వారసులు’... ‘సంగతి ఏడు’ ‘ఏడ్చినా ఎనిమిదించినా ఈ వేసవి సెలవలకు మా చెల్లెలు బావ పిల్లలు కుక్క టామీ వస్తానని ఫిక్స్ అయ్యారు. నేను కూడా అయ్యాను. కనుక మీరు కూడా కావాల్సిందేనని అవక తప్పదని అవనని మొండికేస్తే తగు ప్రత్యామ్నాయాలు గదిలోకి తీసుకెళ్లి వీలైనంత సామరస్యంగా చూపుతానని ఆ విధంగా మనవి చేస్తున్నాను’... నేను కోపంగా చూడటానికి ప్రయత్నించాను. ముక్కు ఎర్రగయ్యింది తప్ప కళ్లు ఎర్రగా కాలేదు. ‘ఈ వేసవికి నావాళ్లను పిలుస్తానని చెప్పాను కదా. మా అన్నయ్య వదిన పిల్లలూ, మా అత్త కొడుకు కన్నబాబు వాడి ఉత్తరాది భార్య చున్నీబాయ్, మా చెల్లెలు సుగుణమణి’.... నేను చెప్తూనే ఉన్నాను... మా ఆవిడ విసవిసా వెళ్లి గుప్పెడు బియ్యం తెచ్చి నిలబడింది. ‘నా మాట వినకపోయారో ఈ బియ్యం తిని చస్తా’... ‘బియ్యం తింటే చస్తారా ఎవరైనా?’ నవ్వాను. ‘పిచ్చి మొగుడా... ఇవి బియ్యం అనుకుంటున్నావా. మన ప్రభుత్వాల అప్రమత్తత వల్ల కల్తీవ్యాపారులకు నూకలు కలిపే వీలులేక పట్టుబడతామన్న భయంతో అసలు బియ్యమే లేకుండా అల్యుమినియం, క్రోమియం, కాడ్మియం, ఘోరేనియం... తీగలను బియ్యంలా కట్ చేసి తయారు చేసిన కృత్రిమ బియ్యం. వీటి ప్రత్యేకత ఏమంటే తిన్నాక ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ఏడు లక్షలా అరవై ఎనిమిది వేల బిల్లు చేయిస్తే తప్ప ఒంట్లో నుంచి బయటకు రావు. అదీగాక బోనస్‌గా తమతో పాటు తిన్న శాల్తీని కూడా పట్టుకుపోతాయి. బోలో... ఖావూ క్యా’... హిందీలో బెదిరించింది. నేను దీనంగా చూశాను. ‘అంటే ఈ దేశంలో ఏ మగాడికైనా వేసవి సెలవల్లో తన వాళ్లను పిలుచుకుని నాలుగు రోజులు ఉంచుకునే భాగ్యం లేదా’ ‘ఎందుకండీ అంతంత కఠినమైన మాటలు అంటారు. విన్నవాళ్లు నేనెంత కఠినాత్మురాలినో అని ఆడిపోసుకోడానికా? పద్నాలుగేళ్ల క్రితమే కదా మీ వాళ్లు వచ్చిపోయారు. అప్పుడు నేను వాళ్లను బాగా చూసుకోలేదా? ఆరు మామిడిపండ్లు తెప్పించి నెలంతా కోసి పెట్టలేదా? ఒక సినిమాకు తీసుకెళ్లి ఇంటర్వెల్లోనే లాక్కొచ్చేశానే? అంతకంటే బాగా ఎవరు చూసుకుంటారు? మనం మంచాల మీద పడుకొని వాళ్లను చాపల మీద పడుకోనివ్వలేదా? హెందుకండీ నన్ను అన్నేసి మాటలంటారు’... నేను ఈ సంభాషణా చాతుర్యాన్ని తట్టుకోలేక టీవీ వాల్యూమ్‌ని పెంచాను. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ‘సాయంత్రం వస్తూ ఐదు వేలు పెట్టి ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ కొనండి. మా రమణికి నాగార్జున సినిమాలన్నీ ఇష్టం. అదొచ్చే సరికి హార్డ్ డిస్క్‌లో అన్నీ కాపీ చేసి రెడీగా పెట్టాలి’... ‘ఇప్పటికప్పుడు ఐదు వేలంటే’... ‘సర్లేండి... మీక్కూడా ఒకటీ రెండు ట్రాజెడీ సినిమాలు లోడ్ చేసి చూపిస్తాను. హ్యాపీయేనా’... ఇక దింపుడుకళ్లెం ఆశే మిగిలింది. ‘ఒక పని చేద్దామా... సెలవుల్లో సగం రోజులు మీ వాళ్లను, రమ్మని సగం రోజులు మావాళ్లని రమ్మందామా’ మా ఆవిడ మళ్లీ కన్నీరు మున్నీరైంది. సపోర్టివ్‌గా కొంచెం కాళ్లూ చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. ‘ఊరుకో... ఊరుకో... ఇప్పుడేమైందని’ కంగారుగా అన్నాను. కొంచెం తమాయించుకుంటూ అంది. ‘మీకు తెలియదా అండీ?.. పెళ్లయిన తొలినాటి రాత్రే మీకు ప్రమాణం చేయలేదా నేనూ?... ఇవాళ్టి నుంచి నా వాళ్లంతా మీవాళ్లనీ... నా వాళ్లంతా నా వాళ్లేనని మీకు ప్రమాణం చేయలేదా... చెప్పండి... చెప్పం...డీ’.... మళ్లీ ఎక్కడ కాళ్లుచేతులు కొట్టుకుంటుందోనని ‘చెప్పావ్... చెప్పావ్’... ఒప్పుకున్నాను. అంతేకాదు... ఆమె కన్నీరుకు నేను మున్నీరవుతూ రాబోయే నావాళ్ల కోసం మటన్ తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టడానికి స్కూటర్ తాళాలు అందుకున్నాను. - భా.బా (భార్యా బాధితుడు) తాజాకలం: గీతాకారుడు ఇలా సెలవిస్తున్నాడు... పార్థా... అత్తమామలను ఆదరింపుము. భార్య మాట చచ్చినట్టు విని బావమరిదికి శ్రీమంతుడు సైకిల్ కొనిపెట్టుము. మరదలి కుటుంబాన్ని స్టేషన్ నుంచి ఊబర్‌లో సలక్షణముగా తోడ్కొని రమ్ము. అప్పుడుగాని నీ ఊర్థ్వలోకముల సంగతి ఎటుల ఉన్నా గృహలోకము యందు మాత్రం తప్పక శాంతి చేకూరును. -
భర్త అలాంటివాడా?
‘‘మీ కొడుకు ఇలాంటి వాడని తెలిసి పెళ్లి ఎలా చేశారు?’’ - అత్తమామలని అడిగిన కోడలు ఆకాశంలో మిగతా సగం మోసమైతే ఏం చేయాలి? పక్కలో ఉన్నదేమిటో అర్థంకాకపోతే ఏం చేయాలి? చెప్పుకోలేని కష్టమొస్తే ఏం చేయాలి? సంసార దుఃఖం ఎవరితో పంచుకోవాలి? పది రూపాయలు పెట్టి కాసిని కూరగాయలు కొనుక్కుంటేనే పదిసార్లు పరీక్షిస్తాం. కూతురిని పదికాలాలపాటు కలిసుండే ఓ అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఏంచేయాలి? ఇది ఏ ఆడపిల్లకీ జరగకూడని కథ. చదువు, అందం, సంస్కారం, ఉద్యోగం... అన్నీ ఉండి కూడా ఒక హోమోసెక్సువల్కి భార్య అయి ఇటీవల అర్ధంతరంగా జీవితాన్ని చాలించిన ఓ యువ డాక్టర్ కథ... ఆమె ఓ పేదింటి బిడ్డ. తండ్రి టైలర్. ఒక అన్న, తమ్ముడి మధ్య గారాల పట్టి. తండ్రి ఆశయానికి తగ్గట్టే చదువుకుంది. అజ్మీర్ మెడికల్ కాలేజ్‌లో చేరి మెరిట్ స్టూడెంట్‌గా నిలిచింది. చదువు పూర్తికాక ముందే రాజస్థాన్‌లోని సికర్ నుంచి మంచి సంబంధం వచ్చింది. కోరి కాళ్ల దగ్గరకు వరుడొస్తే కాదనడమెందుకు? పైగా పెళ్లికొడుకూ డాక్టరే. ఎయిమ్స్ (ఢిల్లీ)లో ఉద్యోగం... బిడ్డా, అల్లుడూ ఇద్దరూ డాక్టర్లే అన్న ఆనందం ఆమె తండ్రిది. బాజాభజంత్రీలు మోగాయి. ఆ బంధం వాళ్లను ఒకింటి వాళ్లను చేసింది. తొలిరోజులు... పారాణి ఆరకముందే ఉద్యోగబాధ్యతను సాకుగా చూపి వెంటనే ఢిల్లీ వెళ్లిపోయాడతడు. తన చదువూ మధ్యలోనే ఉంది కాబట్టి పూర్తి చేసుకోవడానికి ఆమె అజ్మీర్ వెళ్లిపోయింది. ఇంట్లో బంధువుల హడావిడి తగ్గక ముందే ఆ ఆలుమగలు చెరోవైపు ప్రయాణమవడంతో ఇద్దరి మధ్య చనువు పెరగలేదు. తర్వాత ఆమెకూ ఎయిమ్స్‌లోని ఎనస్థిషియా డిపార్ట్మెంట్లో ఉద్యోగం దొరికింది. ఇద్దరూ కలిసి ఉండడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కారణమేంటో కానీ కలహాలు ఆ కాపురాన్ని కలిసుండనివ్వట్లేదు. తను మాత్రం అతనికి దగ్గరకాలేకపోతోంది. లైబ్రరీలోనే.. అతడు హాస్పిటల్ లైబ్రరీలోనే కాలం గడిపేవాడు. ఆమె అతనిని కలవాలనుకుంటే లైబ్రరీకే వెళ్లి కాసేపు మాట్లాడి డ్యూటీకొచ్చేసేది. అతడు ఏ సోషల్ గ్యాదరింగ్స్కీ ఆమెను తీసుకెళ్లేవాడు కాదు. దాంతో వీళ్ల సంసారం స్నేహితుల మధ్య బయటపడలేదు. ఆమె మాత్రం తన స్నేహితులకు, కొలీగ్స్‌కి ఎప్పుడూ ఆయన గురించి గొప్పగా చెప్పేది. తామిద్దరూ దిగిన ఫోటోలను చూపించేది సెల్ఫోన్లో. వాట్స్‌ప్‌లో అప్డేట్ చేసేది. ఇవన్నీ ఆమె ఫ్రెండ్స్ దగ్గర ఆ జంటకు చిలకాగోరింకల ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. తప్పటడుగులు కానీ పెళ్లయి ఆర్నెల్లవుతున్నా భర్తతో ఏ ముద్దూ మురిపెమూ లేదు. ‘అసలు సమయానికి’ ఎప్పుడూ అసహనమే అతడికి. తనంటే ఇంత వికర్షణెందుకు? ఎవరితోనైనా అఫైర్ ఉందా.. ఏమో ఒకేచోట పనిచేస్తున్నాం.. ఏ అమ్మాయితోనూ అంత క్లోజ్‌గా మూవ్ అయినట్టు కనిపించలేదెప్పుడు. పైగా ఎప్పుడూ మగవాళ్లతోనే ఉంటాడు అనుకుంటున్నప్పుడు ఆమె మనసు ఏదో కీడు శంకించింది. మొదటిసారి అతని సెక్సువాలిటీ మీద అనుమానం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించసాగింది. నిజం తెలిసింది. తనతో పంచుకోవలసిన చనువును భర్త ఇతర మగాళ్లతో పంచుకుంటున్నట్టు తేలింది. తన భర్త హోమోసెక్సువల్! దిగ్భ్రాంతి. నిజాన్ని దాచి పెళ్లి చేసుకున్నాడా? మోసపోయిన భావన ఆవేశంగా మారింది. కాలర్ పట్టుకొని అడిగింది. సమాధానం చెప్పే బదులు భార్యను హింసించడం మొదలుపెట్టాడు. చిత్రవధను తట్టుకోలేక అత్తామామలకు ఫోన్ చేసింది. ‘మీ కొడుకు ఇలాంటి వాడని తెలిసీ పెళ్లెలా చేశారు? ’ ‘వాడు అలాంటి వాడని ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే తెలుస్తోంది!’ మామగారి సమాధానం. వాళ్ల కొడుకుకి ఉన్న మగ సంబంధాల గురించి చెప్పింది. తమకేమీ తెలియదనే జవాబు అవతలి నుంచి. నిస్సహాయంగా నిలబడిపోయింది. ఓ రోజు పెద్ద పోట్లాటే అయింది. మళ్లీ అత్తమామలకు ఫోన్ చేసింది ఉన్న పళంగా ఢిల్లీ రమ్మని. కోడలి గొంతులో ఏదో గాభరా, ఆందోళన వినిపించాయి. హుటాహుటిన బయలుదేరారు. వీళ్లు ఢిల్లీ చేరేటప్పటికే కోడలు ప్రాణంలేని బొమ్మలా అయింది. ఫేస్బుక్లో సంచలనం.. తనపట్ల భర్తకున్న నిర్లిప్తత, తనను అతను వంచించిన తీరు ఆమెను నిస్పృహలోకి నెట్టాయి. అది ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ప్రాణం తీసుకునే ముందు భర్త గురించి ఫేస్బుక్లో పోస్ట్ ఒకటి పెట్టింది. తెల్లవారి అది చదివిన ఆమె స్నేహితులు, కొలీగ్స్, అతని కొలీగ్స్ హతాశులయ్యారు. ఈ విషయం గురించి కనీసం తమతో ఓ మాట కూడా పంచుకోలేదని బాధపడ్డారు. ‘మా అబ్బాయికి ఇలాంటి సమస్య ఉందని వాడు మాతో ఎప్పుడూ చెప్పలేదు. అయినా ఇవ్వాళ రేపు ఇవన్నీ సహజమని తెలిసి కూడా మా కోడలు ఎందుకంత డిస్టర్బ్ అయిందో అర్థం కావట్లేదు’ అన్నారు అత్తమామలు. ‘పెళ్లయిన ఆర్నెల్లకు తెలిసింది అల్లుడు అలాంటి వాడని. ఆ సంబంధాల నుంచి అతణ్ణి బయటకు తేవడానికి చాలా ప్రయత్నించింది’ అంటారు అమ్మాయి అమ్మానాన్నలు. ఇంత జరిగినా ‘అసలు నేను ఎలాంటి హోమోసెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ కాలేదు’ అనే అంటాడు కటకటకాల్లో ఉన్న భర్త. ఏది ఏమైనా ఆమె ప్రాణాలు తీసుకోవాల్సింది కాదు అంటారు ఆమె బంధువులు. తప్పెవరిది అన్నది ముఖ్యం కాదు. ఇలాంటి తప్పులు ఎలా నివారించాలి అనేది ముఖ్యం. వ్యక్తిగత స్వభావాలను ఎవరికి వారు సరిదిద్దుకోవాలి. అది వీలుకానప్పుడు వాటి కారణంగా ఎదుటివారి జీవితాలు బలికాకూడదన్న సంస్కారం అన్నా పాటించాలి. ఏమైనా ఈ ఉదంతం ఒక హెచ్చరిక. యువతీ యువకులకూ ఇరువైపులా తల్లిదండ్రులకూ ఇది మేలుకొలుపు కావాలి. - సరస్వతి రమ, ఫ్యామిలీ ప్రతినిధి ఈ కేసులో ఏమంటున్నారు? కౌన్సెలింగ్ తప్పనిసరి.. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ ఒక్క అమ్మాయి, అబ్బాయికే ఇరు కుటుంబాలకు కూడా. పెళ్లంటే ఏంటి, పెళ్లికూతురు, పెళ్లికొడుకు పాత్రలేంటి? సెక్స్ అంటే ఏంటి? సెక్సువాలిటీ అంటే ఏంటి? పెళ్లిలో సెక్స్ పాత్ర ఏంటి? అత్తమామలు వ్యవహరించాల్సిన తీరు, ఈ కౌన్సెలింగ్ ఇండివిడ్యువల్‌గా ఉంటుంది కాబట్టి సెక్సువాలిటీకి సంబంధించి ఏ సమస్యలున్నా బయటపడే అవకాశం ఉంటుంది. - డాక్టర్ సి. వీరేందర్, మనస్తత్వ విశ్లేషకులు. యాక్సెప్టెన్స్ రావాలి.. సెక్సువాలిటీకి సంబంధించిన ఏ స్థితినైనా డిజార్డర్‌గా పరిగణించడం ఎప్పుడో మానేసింది సైకియాట్రిక్ సొసైటీ. అల్లుడిని అత్తమామలు గుర్తించే కన్నా ముందు కొడుకును తల్లిదండ్రులు అర్థంచేసుకోవాలి. పిల్లలతో చనువుగా ఉండాలి. వాళ్లు ఎలా ఉన్నా ఓన్ చేసుకుంటామనే భరోసా ఇవ్వాలి. ఇది ఎయిమ్స్ కేస్‌లో ఉంటే కొడుకు ఎలాంటి వాడో ముందే తెలిసేది. పరిస్థితి పెళ్లిదాకా వచ్చేది కాదు. - డాక్టర్ పద్మాపాల్వాయ్, మానసిక నిపుణులు ఫిజికల్ ఎట్రాక్షన్ బ్లడ్ టెస్ట్‌లతో పాటు బిహేవియరల్ టెస్టూ అవసరమే. అందుకే ఎంగేజ్‌మెంట్‌కూ, పెళ్లికీ మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో అబ్బాయిని అమ్మాయి వాళ్లింటికి, అమ్మాయిని అబ్బాయి వాళ్లింటికీ పంపించి, ఇద్దరి మధ్యా కంపాటబులిటీ కుదురుతుందో లేదో తెలుసుకోవాలి. అన్నిటికన్నా ముందు.. అమ్మాయి, అబ్బాయికి మధ్య అసలు ఫిజికల్ ఎట్రాక్షన్ ఉందో లేదో గమనించాలి. - దేవి, సామాజిక కార్యకర్త కొత్త చట్టాలు కావాలి: అమ్మాయి సూసైడ్ చేసుకోకుండా డైవోర్స్‌కి అప్లయ్ చేసుకోవాల్సింది. అయితే భర్త ‘గే’ అని నిరూపించే సాక్ష్యాన్ని చూపించాలి. అసలు విషయం ఇక్కడిదాకా రాకుండా ఉండాలంటే ‘గేస్’ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించి కొన్ని కొత్త చట్టాలు కావాలి. హోమోసెక్సువల్స్ మధ్య పెళ్లిళ్లు, వాళ్ల రిలేషన్షిప్స్ని సపోర్ట్‌చేస్తూ చట్టాలు వస్తే పేరెంట్స్ ఫోర్స్‌కి, సొసైటీ వేసే ముద్రకి భయపడే అవకాశం ఉండదు. - నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్