భర్త అలాంటివాడా? | a real story of homosexual | Sakshi
Sakshi News home page

భర్త అలాంటివాడా?

Published Fri, May 1 2015 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

భర్త  అలాంటివాడా?

భర్త అలాంటివాడా?

‘‘మీ కొడుకు ఇలాంటి వాడని తెలిసి పెళ్లి ఎలా చేశారు?’’ - అత్తమామలని అడిగిన కోడలు

ఆకాశంలో మిగతా సగం మోసమైతే ఏం చేయాలి?
పక్కలో ఉన్నదేమిటో అర్థంకాకపోతే  ఏం చేయాలి?
చెప్పుకోలేని కష్టమొస్తే  ఏం చేయాలి?
సంసార దుఃఖం  ఎవరితో పంచుకోవాలి?

 

పది రూపాయలు పెట్టి కాసిని కూరగాయలు కొనుక్కుంటేనే పదిసార్లు పరీక్షిస్తాం. కూతురిని పదికాలాలపాటు కలిసుండే ఓ అయ్య చేతిలో పెట్టేటప్పుడు ఏంచేయాలి?
 
ఇది ఏ ఆడపిల్లకీ జరగకూడని కథ. చదువు, అందం, సంస్కారం, ఉద్యోగం... అన్నీ ఉండి కూడా ఒక హోమోసెక్సువల్‌కి భార్య అయి  ఇటీవల అర్ధంతరంగా జీవితాన్ని చాలించిన ఓ యువ డాక్టర్ కథ...

ఆమె ఓ పేదింటి బిడ్డ. తండ్రి టైలర్. ఒక అన్న, తమ్ముడి మధ్య గారాల పట్టి. తండ్రి ఆశయానికి తగ్గట్టే చదువుకుంది. అజ్మీర్ మెడికల్ కాలేజ్‌లో చేరి మెరిట్ స్టూడెంట్‌గా నిలిచింది. చదువు పూర్తికాక ముందే రాజస్థాన్‌లోని సికర్ నుంచి మంచి సంబంధం వచ్చింది. కోరి కాళ్ల దగ్గరకు వరుడొస్తే  కాదనడమెందుకు? పైగా పెళ్లికొడుకూ డాక్టరే. ఎయిమ్స్ (ఢిల్లీ)లో ఉద్యోగం... బిడ్డా, అల్లుడూ ఇద్దరూ డాక్టర్లే అన్న ఆనందం ఆమె తండ్రిది. బాజాభజంత్రీలు మోగాయి. ఆ బంధం వాళ్లను ఒకింటి వాళ్లను చేసింది.
 
తొలిరోజులు...

పారాణి ఆరకముందే ఉద్యోగబాధ్యతను సాకుగా చూపి వెంటనే ఢిల్లీ వెళ్లిపోయాడతడు. తన చదువూ మధ్యలోనే ఉంది కాబట్టి పూర్తి చేసుకోవడానికి ఆమె అజ్మీర్ వెళ్లిపోయింది. ఇంట్లో బంధువుల హడావిడి తగ్గక ముందే ఆ ఆలుమగలు చెరోవైపు ప్రయాణమవడంతో ఇద్దరి మధ్య చనువు పెరగలేదు. తర్వాత ఆమెకూ ఎయిమ్స్‌లోని ఎనస్థిషియా డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం దొరికింది. ఇద్దరూ కలిసి ఉండడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కారణమేంటో  కానీ కలహాలు ఆ కాపురాన్ని కలిసుండనివ్వట్లేదు. తను మాత్రం అతనికి దగ్గరకాలేకపోతోంది.
 
 లైబ్రరీలోనే..

అతడు హాస్పిటల్  లైబ్రరీలోనే కాలం గడిపేవాడు. ఆమె అతనిని కలవాలనుకుంటే లైబ్రరీకే వెళ్లి కాసేపు మాట్లాడి డ్యూటీకొచ్చేసేది. అతడు ఏ సోషల్ గ్యాదరింగ్స్‌కీ ఆమెను తీసుకెళ్లేవాడు కాదు. దాంతో వీళ్ల సంసారం స్నేహితుల మధ్య బయటపడలేదు. ఆమె మాత్రం తన స్నేహితులకు, కొలీగ్స్‌కి ఎప్పుడూ ఆయన గురించి గొప్పగా చెప్పేది. తామిద్దరూ దిగిన ఫోటోలను చూపించేది సెల్‌ఫోన్లో. వాట్స్‌ప్‌లో అప్‌డేట్ చేసేది. ఇవన్నీ ఆమె ఫ్రెండ్స్ దగ్గర ఆ జంటకు చిలకాగోరింకల ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి.
 
తప్పటడుగులు


కానీ పెళ్లయి ఆర్నెల్లవుతున్నా భర్తతో ఏ ముద్దూ మురిపెమూ లేదు. ‘అసలు సమయానికి’ ఎప్పుడూ అసహనమే అతడికి. తనంటే ఇంత వికర్షణెందుకు? ఎవరితోనైనా అఫైర్ ఉందా.. ఏమో ఒకేచోట పనిచేస్తున్నాం.. ఏ అమ్మాయితోనూ అంత క్లోజ్‌గా మూవ్ అయినట్టు కనిపించలేదెప్పుడు. పైగా ఎప్పుడూ మగవాళ్లతోనే ఉంటాడు అనుకుంటున్నప్పుడు ఆమె మనసు ఏదో కీడు శంకించింది.  మొదటిసారి అతని సెక్సువాలిటీ మీద అనుమానం వచ్చింది. అప్పటి నుంచి ఆయన ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించసాగింది. నిజం తెలిసింది. తనతో పంచుకోవలసిన చనువును భర్త ఇతర మగాళ్లతో పంచుకుంటున్నట్టు తేలింది. తన భర్త హోమోసెక్సువల్! దిగ్భ్రాంతి.  నిజాన్ని దాచి పెళ్లి చేసుకున్నాడా? మోసపోయిన భావన ఆవేశంగా మారింది. కాలర్ పట్టుకొని అడిగింది. సమాధానం చెప్పే బదులు భార్యను హింసించడం మొదలుపెట్టాడు. చిత్రవధను తట్టుకోలేక అత్తామామలకు ఫోన్ చేసింది. ‘మీ కొడుకు ఇలాంటి వాడని తెలిసీ పెళ్లెలా చేశారు? ’ ‘వాడు అలాంటి వాడని ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే తెలుస్తోంది!’ మామగారి సమాధానం. వాళ్ల కొడుకుకి ఉన్న మగ సంబంధాల గురించి చెప్పింది. తమకేమీ తెలియదనే జవాబు అవతలి నుంచి. నిస్సహాయంగా నిలబడిపోయింది. ఓ రోజు పెద్ద పోట్లాటే అయింది. మళ్లీ అత్తమామలకు ఫోన్ చేసింది ఉన్న పళంగా ఢిల్లీ రమ్మని. కోడలి గొంతులో ఏదో గాభరా, ఆందోళన వినిపించాయి. హుటాహుటిన బయలుదేరారు. వీళ్లు ఢిల్లీ చేరేటప్పటికే కోడలు ప్రాణంలేని బొమ్మలా అయింది.
 
ఫేస్‌బుక్‌లో సంచలనం..

తనపట్ల భర్తకున్న నిర్లిప్తత, తనను అతను వంచించిన తీరు ఆమెను నిస్పృహలోకి నెట్టాయి. అది ఆమెను ఆత్మహత్యకు ఉసిగొల్పింది. ప్రాణం తీసుకునే ముందు భర్త గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ ఒకటి పెట్టింది. తెల్లవారి అది చదివిన ఆమె స్నేహితులు, కొలీగ్స్, అతని కొలీగ్స్ హతాశులయ్యారు. ఈ విషయం గురించి కనీసం తమతో ఓ మాట కూడా పంచుకోలేదని బాధపడ్డారు. ‘మా అబ్బాయికి ఇలాంటి సమస్య ఉందని వాడు మాతో ఎప్పుడూ చెప్పలేదు. అయినా ఇవ్వాళ రేపు ఇవన్నీ  సహజమని తెలిసి కూడా మా కోడలు ఎందుకంత డిస్టర్బ్ అయిందో అర్థం కావట్లేదు’ అన్నారు అత్తమామలు. ‘పెళ్లయిన ఆర్నెల్లకు తెలిసింది అల్లుడు అలాంటి వాడని. ఆ సంబంధాల నుంచి అతణ్ణి బయటకు తేవడానికి చాలా ప్రయత్నించింది’ అంటారు అమ్మాయి అమ్మానాన్నలు. ఇంత జరిగినా  ‘అసలు నేను ఎలాంటి హోమోసెక్సువల్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ కాలేదు’ అనే అంటాడు కటకటకాల్లో ఉన్న భర్త. ఏది ఏమైనా ఆమె ప్రాణాలు తీసుకోవాల్సింది కాదు అంటారు ఆమె బంధువులు.

తప్పెవరిది అన్నది ముఖ్యం కాదు. ఇలాంటి తప్పులు ఎలా నివారించాలి అనేది ముఖ్యం. వ్యక్తిగత స్వభావాలను ఎవరికి వారు సరిదిద్దుకోవాలి. అది వీలుకానప్పుడు వాటి కారణంగా ఎదుటివారి జీవితాలు బలికాకూడదన్న సంస్కారం అన్నా పాటించాలి. ఏమైనా ఈ ఉదంతం ఒక హెచ్చరిక. యువతీ యువకులకూ ఇరువైపులా తల్లిదండ్రులకూ ఇది మేలుకొలుపు కావాలి.
 - సరస్వతి రమ, ఫ్యామిలీ ప్రతినిధి
 
ఈ కేసులో ఏమంటున్నారు?
 
కౌన్సెలింగ్ తప్పనిసరి..

 ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ ఒక్క అమ్మాయి, అబ్బాయికే ఇరు కుటుంబాలకు కూడా. పెళ్లంటే ఏంటి, పెళ్లికూతురు, పెళ్లికొడుకు పాత్రలేంటి? సెక్స్ అంటే ఏంటి? సెక్సువాలిటీ అంటే ఏంటి? పెళ్లిలో సెక్స్ పాత్ర ఏంటి? అత్తమామలు వ్యవహరించాల్సిన తీరు, ఈ కౌన్సెలింగ్ ఇండివిడ్యువల్‌గా ఉంటుంది కాబట్టి సెక్సువాలిటీకి సంబంధించి ఏ సమస్యలున్నా బయటపడే అవకాశం ఉంటుంది.
 - డాక్టర్ సి. వీరేందర్, మనస్తత్వ విశ్లేషకులు.
 
యాక్సెప్టెన్స్ రావాలి..

సెక్సువాలిటీకి సంబంధించిన ఏ స్థితినైనా డిజార్డర్‌గా పరిగణించడం ఎప్పుడో మానేసింది సైకియాట్రిక్ సొసైటీ. అల్లుడిని అత్తమామలు గుర్తించే కన్నా ముందు కొడుకును తల్లిదండ్రులు అర్థంచేసుకోవాలి. పిల్లలతో చనువుగా ఉండాలి. వాళ్లు ఎలా ఉన్నా ఓన్ చేసుకుంటామనే భరోసా ఇవ్వాలి. ఇది ఎయిమ్స్ కేస్‌లో ఉంటే కొడుకు ఎలాంటి వాడో ముందే తెలిసేది. పరిస్థితి పెళ్లిదాకా వచ్చేది కాదు.
 - డాక్టర్ పద్మాపాల్వాయ్, మానసిక నిపుణులు
 
ఫిజికల్ ఎట్రాక్షన్


బ్లడ్ టెస్ట్‌లతో పాటు బిహేవియరల్ టెస్టూ అవసరమే. అందుకే ఎంగేజ్‌మెంట్‌కూ, పెళ్లికీ మధ్య కొంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో అబ్బాయిని అమ్మాయి వాళ్లింటికి, అమ్మాయిని అబ్బాయి వాళ్లింటికీ పంపించి, ఇద్దరి మధ్యా కంపాటబులిటీ కుదురుతుందో లేదో తెలుసుకోవాలి. అన్నిటికన్నా ముందు.. అమ్మాయి, అబ్బాయికి మధ్య అసలు ఫిజికల్ ఎట్రాక్షన్ ఉందో లేదో గమనించాలి.
 - దేవి, సామాజిక కార్యకర్త
 
కొత్త చట్టాలు కావాలి: అమ్మాయి సూసైడ్ చేసుకోకుండా డైవోర్స్‌కి అప్లయ్ చేసుకోవాల్సింది. అయితే భర్త ‘గే’ అని నిరూపించే సాక్ష్యాన్ని చూపించాలి. అసలు విషయం ఇక్కడిదాకా రాకుండా ఉండాలంటే ‘గేస్’ లైఫ్‌స్టయిల్‌కి సంబంధించి కొన్ని కొత్త చట్టాలు కావాలి. హోమోసెక్సువల్స్ మధ్య పెళ్లిళ్లు, వాళ్ల రిలేషన్‌షిప్స్‌ని సపోర్ట్‌చేస్తూ చట్టాలు వస్తే పేరెంట్స్ ఫోర్స్‌కి, సొసైటీ వేసే ముద్రకి భయపడే అవకాశం ఉండదు.    - నిశ్చల సిద్ధారెడ్డి, అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement