జైపూర్: రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో సీఎం అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య చాలాకాలంగా వర్గపోరు నడుసున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిది పతాక స్థాయికి చేరింది. ఇరు నేతల మద్ధతురాలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. అజ్మేర్‌లో డీసీసీ నిర్వహించిన సమావేశం ఇందుకు వేదికైంది.
కాంగ్రెస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శి, రాజస్థాన్ కో-ఇంఛార్జ్ అమృత ధావన్ గురువారం అజ్మేర్ వెళ్లారు. అయితే ఈ సమావేశానికి వచ్చిన అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య సీట్ల అరేంజ్‌మెంట్ విషయంలో గొడవ జరిగింది. ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. అజ్మేర్‌లో సచిన్ పైలట్ మద్దతుదారులు ఎక్కువ ఉండటంతో వారంతా తమ నేతకు అనుకూలంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఇరువర్గాలను శాంతింప చేసేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం అమృత ధావన్.. కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, కార్యకర్తల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని వెళ్లిపోయారు.
కాగా.. అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేత అయిన సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, మాజీ సీఎం వసుందర రాజేతో ఒప్పందాలు కుదుర్చుకున్నారని పైలట్ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే ఐదురోజుల పాదయాత్ర కూడా చేసి నిరసన వ్యక్తం చేశారు.
చదవండి: ముళ్ల కిరీటం కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం.. ఐదేళ్లూ కొనసాగడం కత్తిమీద సామే
Comments
Please login to add a commentAdd a comment