
జైపూర్: బీజేపీ సస్పెండెడ్ నేత నూపుర్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులకు ఊరట లభించింది. మొయినుద్దీన్ చిష్తీ దర్గా(రాజస్థాన్) పెద్దతో పాటు మరో ఆరుగురిని మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది అజ్మీర్ కోర్టు.
రెండేళ్ల కిందట.. మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే.. మరోవైపు ఆమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ ఇస్లాం గ్రూపులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో..
మొయినుద్దీన్ చిష్తీ దర్గా నిర్వాహకుడు ఖాదీమ్ గౌహర్ చిస్తీ, మరో ఆరుగురు కలిసి నూపుర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి అప్పట్లో వైరల్ కూడా అయ్యింది. దీంతో.. అజ్మీర్ షరీఫ్ దర్గా ఖాదీమ్ గౌహర్ చిస్తీతో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న గౌహర్ చిస్తీని పోలీసులు జూలై 14, 2022న హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసులో అందరినీ కోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ విడుదలకు ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment