21 సార్లు జాతీయజెండాకు సెల్యూట్ చేయాలి
తీర్పు వచ్చేంతకాలం ఇలాగే కొనసాగాలి
పాక్ అనుకూల నినాదాలిచ్చిన నిందితుడికి కోర్టు ఆదేశాలు
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది.
‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్‌చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment