![Madhya Pradesh High court sets 6-week deadline for MP to clear Union Carbide waste](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/7/bhopal.jpg.webp?itok=FRbEabiz)
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
భద్రతా ప్రమాణాలను అనుసరించాలని స్పష్టికరణ
భోపాల్: భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ కర్మాగారంలోని వ్యర్థాల తొలగింపుపై మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆరు వారాల గడువిచ్చింది. పితంపూర్‌లోని వ్యర్థాల ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో వీటిని భద్రతా ప్రమాణాలకు లోబడి శుద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ విషయమై ఎలాంటి అసత్య వార్తలను వార్తలను ప్రసారం చేయరాదని కూడా ప్రింట్, ఆడియో, విజువల్ మీడియాను ఆదేశించింది. మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాల తరలింపుపై తప్పుడు, నిరాధార వార్తలు ప్రసారం కావడంతో పితంపూర్ వాసులు తీవ్ర నిరసనలకు పూనుకోవడం తెలిసిందే.
జనవరి 2వ తేదీన మూతబడిన కార్బైడ్ కర్మాగారంలోని వ్యర్థాలను 12 సీల్డ్ కంటెయినర్లలో భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని పితంపూర్‌కు తరలించారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆ కంటెయినర్లలోని వ్యర్థాలు అలాగే ఉండిపోయాయి. వీటిని ట్రక్కుల నుంచి కిందికి దించేందుకు మూడు రోజుల సమయం పడుతుందని ప్రభుత్వ న్యాయవాది తెలపగా, భద్రతా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ముందుగా ఆ వ్యర్థాల్లోని విష రసాయనాలు ఎంత మేరకు ప్రమాదకరమో పరీక్షించి, ఆ నివేదికను బహిరంగ పరుస్తామని, ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment