national integrity
-
Madhya Pradesh High Court: భారత్ మాతాకీ జై అనాల్సిందే
జబల్పూర్: మాతృదేశాన్ని మరచి శత్రుదేశాన్ని పొగిడిన వ్యక్తికి మధ్యప్రదేశ్ హైకోర్టు తగిన శిక్ష విధించింది. తుది తీర్పు వచ్చేదాకా నెలకు రెండు సార్లు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి అక్కడి జాతీయ జెండాకు 21 సార్లు సెల్యూట్ చేయాలని, రెండు సార్లు భారత్ మాతా కీ జై అని నినదించాలని ఆదేశించింది. భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫైజల్ అలియాస్ ఫైజాన్ మే నెలలో ‘పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్’ అని నినదించాడు. దీంతో ఇతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 153బీ సెక్షన్ కింద కేసునమోదుచేశారు. సమాజంలో రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా, దేశ సమగ్రతను దెబ్బతీసేలా వ్యవహరించాడని పోలీసులు కేసు నమోదుచేశారు. దీంతో బెయిల్ కోసం మధ్యప్రదేశ్ హైకోర్టును ఫైజల్ ఆశ్రయించాడు. ఈ కేసును జస్టిస్ డీకే పలివాల్ మంగళవారం విచారించారు. రూ.50వేల వ్యక్తిగత బాండు, మరో రూ.50వేల వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు అంగీకరిస్తూ రెండు షరతులు విధించింది. ‘‘ ప్రతి నెలా తొలి, చివరి మంగళవారాల్లో భోపాల్‌లోని మిస్రోడ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లు. అక్కడి భవంతిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి 21 సార్లు సెల్యూట్చేసి రెండు సార్లు భారత్ మాతాకీ జై అని నినదించు. ఈ కేసులో తుదితీర్పు వచ్చేదాకా ఇలా చేయాల్సిందే. ఇలా చేస్తే అయినా నీలో దేశభక్తి కాస్తయినా పెరుగుతుంది’ అని జడ్జి వ్యాఖ్యానించారు. ‘‘ ఇతనికి బెయిల్ ఇవ్వకండి. గతంలోనూ ఇలాగే ప్రవర్తించాడు. ఇతనిపై 14 నేరకేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని ప్రభుత్వ లాయర్ వాదించారు. -
మన సమగ్రతకు ‘మణిపూర్’ తూట్లు
ఎక్కడో దేశానికి ఒక కొసన ఉన్న మణిపూర్‌లో జరిగిన ఒక చిన్న ఘటన రెండు రాష్ట్రాల్లోని తెలుగు కుటుంబాలు, వారి పిల్లలు తల్లడిల్లిపోయేలా చేసింది. మన జాతీయ సమగ్రతకు ఇలాంటి ఘటనలు భంగం కలిగిస్తాయనే ఆందోళన కూడా అందరిలో పెరుగుతోంది. ఒక చిన్న రాష్ట్రమైన మణిపూర్‌లోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (ఎన్ఐటీ) మెస్‌లో కొద్దిమంది విద్యార్థుల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ జాతీయ వార్త కావడం, స్థానిక, స్థానికేతర సమస్యగా మారి రోజుల తరబడి చర్చకు దారితీయడం దుర దృష్టం అనడంకన్నా దేశ దౌర్భాగ్యమనే చెప్పాలి. స్థానికతపై అవసరానికి మించి ఇక్కడ రేగుతున్న వివాదాలకు పై ఘటన తోడవడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. జాతీయ మీడి యా ఈ వార్తలకు ప్రాధాన్యమివ్వడంతో అక్కడేదో ఉత్పాతం జరుగుతోందన్న అనుమానాలు వ్యాపించాయి. ఎన్ఐటీ విద్యా ర్థుల మధ్య ఘర్షణను స్థానికతలో భాగం గా చూడాలా లేక కొందరు విద్యార్థుల మధ్య పరస్పర గొడవగా మాత్రమే చూడాలా అనేది ఇప్పుడు చర్చ. ఈ చిన్న ఉదంతం కొన్ని రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిం చింది. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన జాతీయ సమగ్రత నేటికీ బలమైన పునాదులు వేసుకోకపోవడమే దీనికి కారణమా? ఎన్ఐటీలో గొడవ సద్దుమణిగిందని, భయాందోళనలకు గురికావద్దని మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు ప్రకటించేంతవరకు అక్కడి గొడవ పతాక శీర్షికలకు ఎక్కుతూవచ్చింది. ఆయన మన తెలుగువారు కావడంతో ఆ ప్రకటనకు విశ్వసనీయత కూడా ఏర్పడింది. మణిపూర్‌లోని లాంగోల్ జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో ఈ నెల 11న మెస్‌లో క్యూ పాటించే విషయంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవ జరిగింది. స్థానిక విద్యార్థులు క్యూను పాటించకుండా ముందుకెళ్లడంతో వెనుక ఉన్న స్థానికేతరులు ప్రశ్నించారని, ఇదే ఘర్షణకు దారితీసిందని వార్తలు. బీహార్ విద్యార్థులకు, తెలుగు విద్యార్థులు సహాయంగా వచ్చారని, దీంతో మనవారిని స్థానికులు గదుల్లో వేసి కొట్టా రని, వారున్న గదులపైకి రాళ్లు విసిరారని వార్తలు. ఇటు తెలం గాణ, అటు ఏపీకి చెందిన విద్యార్థులకు తీవ్ర గాయాల య్యాయని మీడియా తెలపడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధిత కుటుంబాలు తల్లడిల్లిపోయాయి. బాత్రూముల్లో వేసి హింసించారని, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండమని, తెలుగు విద్యార్థులు మీడియాకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆగమేఘాల మీద మణిపూర్ సీఎంతో, ప్రభుత్వాధికారులతో మాట్లాడటం, కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ఉన్నఫళాన లాంగోల్‌లోని ఎన్ఐటీ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల రక్షణకు సీఆర్పీ ఎఫ్ బలగాలను కూడా దించారు. అయినా రక్షణ కరువైందన్న తెలుగు విద్యార్థులను మన ప్రభుత్వాలు విమానాల్లో స్వస్థలా లకు చేర్చాయి. కథ సుఖాంతమైంది కాని దేశంలో ఎక్కడ పుట్టినా, ఎక్కడ చదివినా, జీవించినా మనం అందరం ఒక దేశవాసులమనే జాతీయ సమగ్రతా భావానికి మణిపూర్ ఉదంతం మరోసారి తూట్లు పొడిచింది. ఈ ఉదంతంపై వేగంగా సాగిన ప్రచారం మణిపూర్ గౌరవానికి భంగం కలిగించింది. ఈశాన్య భారత విద్యార్థులపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన దాడులు, హత్యలు వంటివి జాతీయ ఉమ్మడి సంస్కృతిని ప్రశ్నార్థకం చేశాయి. ఇప్పుడు మణిపూర్‌లోనే విద్యార్థుల మధ్య గొడవ స్థానికత రంగు పులుముకోవడం జాతీయ విషాదమే. ప్రతిష్టాకరమైన విద్యాసంస్థలో గొడవలేమిటి? మెస్‌లో జరిగిన చిన్న ఘర్షణ అదుపుకోసం సీఆర్పీఎఫ్ బలగాలు రావడమేం టి? ఒక చిన్న సమస్యను ఇంతగా ప్రచారం చేయడమేమిటి? మరోవైపున మణిపూర్ స్థానిక పత్రికలు ఈ గొడవకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. గొడవ జరిగింది మొదలు కుని సమసిపోయేంత వరకూ హాస్టల్లో ఏం జరిగిందో ప్రత్య క్షంగా చూసిన మణిపూర్ ఎన్ఐటీ విద్యార్థులు తమ సంస్థకు చెడ్డపేరు తేవద్దని మీడియాను అభ్యర్థించారు. గొడవ జరిగిన ప్పటి నుంచి సర్ది చెప్పడానికి తాము ప్రయత్నించామని, ఒక గ్రూపు మరో గ్రూపుతో ఘర్షించుకున్న నేపథ్యంలో ఎవరు ఎవరిమీదికి రాళ్లు విసిరింది కూడా తెలియలేదని వీరు ఒక ప్రకటనలో తెలిపారు. హాస్టల్లో చిక్కుకున్న విద్యార్థులు తాత్కాలికంగా తీవ్రంగా ఇబ్బందిపడిన మాట వాస్తవం. కానీ గొడవ ఎంత వేగంగా వ్యాపించిందో అంత త్వరగా సమసి పోయిందన్నారు. కనీస ఆధారం లేకుండా ఈ గొడవపై వార్తలు, కథనాలు ప్రచురించడమే మరింత నష్టకరంగా మారిందని ఎన్ఐటీ తటస్థ విద్యార్థులు వాపోవడం గమనార్హం. నిప్పు లేకుండానే పొగ రావడంపై ఇటీవల వదంతుల వ్యాప్తి కారణంగా ఈ మధ్య కాలంలో ఉద్రిక్తతలు రాజుకోవడం కనబడుతూనే ఉంది. మణిపూర్ గొడవలో కూడా ఈ కోణం ఉన్నదని గ్రహించాలి. జాతీయ ఉన్నత విద్యాసంస్థల్లో కూడా భావి పౌరుల మధ్య ఉమ్మడి భావన అనుకున్నంతగా ఏర్పడటం లేదని ఈ ఘటన రుజువు చేస్తోంది. ఇలాంటి ఘటనలపై కాస్త సంయమనం ప్రదర్శించడం అందరికీ మంచిది. అవసరం కూడా. కె.రాజశేఖరరాజు -
పెడధోరణులపైనే ప్రణబ్ గురి
టి. లక్ష్మీనారాయణ, డెరైక్టర్ నీలం రాజశేఖరరెడ్డి పరిశోధనా కేంద్రం ఒకప్పుడు జనా భా నలభై ఐదు కోట్లుగా ఉన్నప్పుడే దేశాన్ని ఐక్యంగా ఉంచుకోలేక పోయాం. నేడు 125 కోట్ల జనాభాను ఒక్కటిగా ఉంచాలి. ఇది జాతి ముం దున్న అతి పెద్ద సవాలు. రాష్ట్రాల విభజన డిమాండ్లు చాలా ముందుకు వస్తున్నాయి. సవ్యమైన విధానాల రూపకల్పనకు దోహదపడే విధంగా వాస్తవాల ఆధారంగా, హేతుబద్ధమైన క్షేత్రస్థాయి సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత నిఘా సంస్థలపై ఉన్నదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గత నెల 19న అన్నారు. తద్వారా అయన చాలా లోతైన అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలతో పాటూ పలు పెడ ధోరణులు పెచ్చరిల్లుతున్న పర్యవసానంగా జాతీయ ఐక్యత పెను సవాలు ఎదురవుతోందని ప్రణబ్ హెచ్చరించారా? ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర విభజన సమస్య నుంచి ఉత్పన్నమైన పరిస్థితుల కారణంగా పార్లమెంటు అచేతనమై పోవడం పట్ల కలత చెంది అలా వ్యాఖ్యానించారా? ప్రత్యేక తెలంగాణ లోతుపాతులు, పర్యవసానాలపై రాజకీయ విజ్ఞత లోపించిందని భావించారా? ఆ అంశంపై హేతుబద్ధమైన సమాచారాన్ని అందించడంలో నిఘా సంస్థల వైఫల్యాన్ని సూచించారా? ఏది ఏమైనా ఇవన్నీ నిశితంగా పరిశీలించాల్సిన ప్రశ్నలే. ‘విభజన’ మూలాలు: పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణాలకు అనుగుణంగానే మన రాష్ట్ర అభివృద్ధి గమనం ఉన్నది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్‌లో ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు. 1965-75 మధ్య కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, ఐడీపీఎల్ లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. పారిశ్రామిక కేంద్రంగా హైదరాబాద్‌కు (కొంత వరకు విశాఖపట్నానికి) పునాదులు పడ్డాయి. ఏ ఒక్క ప్రభుత్వమూ పారిశ్రామిక వికేంద్రీకరణ వైపు దృష్టి పెట్టలేదు. 1990 దశకం నుంచి ప్రవేశ పెట్టిన సరళీకృత ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ ఫలితంగా పట్టణాలు నగరాలుగా, నగరాలు మహానగరాలుగా ఎదిగి అభివృద్ధి నమూనాలుగా వెలిశాయి. కానీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. ఆర్థిక అసమానతలు అతి వేగంగా పెరిగిపోతుండగా ప్రజల్లో అసంతృప్తి ప్రజ్వరిల్లుతున్నది. ఈ పరిస్థితులు విభజనోద్యమాలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనడంలో సందేహం లేదు. రాష్ట్రాలు బలహీనంగా ఉండాలన్న భావజాలంతో బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉంది. అవకాశవాదాన్ని తలకెక్కించుకొన్న కాంగ్రెస్ ఓట్లు, సీట్లే కొలబద్దగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధానాన్ని అమలు చేస్తున్నది. ‘విభజించి పాలించు’ విధానాన్ని అనుసరిస్తోంది. అస్తిత్వ రాజకీయాల్లో భాగంగా ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు పట్టంగట్టే రాజకీయ శక్తులు ఆ ఆందోళనలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ నేపథ్యంలోని ‘ప్రత్యేక’ డిమాండ్లేవీ దేశ సార్వభౌమత్వానికి హాని కలిగించవని కొందరి వాదన. శాంతియుత సహజీవనం సాగించాల్సిన ప్రజల మధ్య విషబీజాలను నాటుతున్నామనే స్పృహ లోపించడం శోచనీయం. అనుభవాల నుంచి ఏం నేర్చుకొన్నాం? బ్రిటిష్ పాలకులు పోతూ పోతూ కుట్రపూరితంగా దేశాన్ని రెండు ముక్కలు చేసి, సరిహద్దుల్లో రావణ కాష్టాన్ని రగిల్చి పోయారు. మన దేశం అండదండలతో సాగిన తూర్పు పాకిస్థాన్ విముక్తి ఉద్యమం ఫలితంగా బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. దీంతో పాక్ మనపై మరింత కక్ష పెంచుకుంది. కాశ్మీర్ సమస్య సాకుతో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత సార్వభౌమత్వాన్ని సవాలు చేస్తున్నది. అలాంటి సున్నిత రాష్ట్రం జమ్మూ-కాశ్మీర్‌ను జమ్మూ, కాశ్మీర్, లడఖ్ అనే మూడు రాష్ట్రాలుగా విడగొట్టాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ఈశాన్యంలో గ్రేటర్ నాగాలాండ్, బోడోలాండ్, గూర్ఖాలాండ్ వగైరా డిమాండ్లతో నిరంతరం ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూలులో పొందుపరచిన 15 భాషలలో స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేయగలిగే సదుపాయాలు పార్లమెంటులోనే లేని దుస్థితి కొనసాగుతున్నది. జనాభాలో 38 శాతం హిందీ మాట్లాడుతున్నా దాన్ని అందరిపై రుద్దాలని చూస్తే ప్రతిఘటన తప్పదు. రాష్ట్రాల చట్టసభల్లో మాతృభాష అమలుకు సైతం చిత్తశుద్ధి ప్రయత్నించాల్సి ఉంది. పార్లమెంటు కార్యకలాపాలపై హిందీని రుద్దే ప్రయత్నాలకు దక్షిణాది ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం సహజం. దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాది పెత్తనమే సాగుతోందనే అభిప్రాయం ఇప్పటికే బలంగా ఉంది. ఒకటి మాత్రం వాస్తవం... ప్రాంతీయ, భాషాపరమైన సమస్యల వంటి సున్నిత సమస్యలపై వివిధ ప్రాంతాల ప్రజల మనోభావాలు సున్నితంగా, జటిలంగా తయారవుతున్నాయి. అవి ఎప్పుడు ఎలా పరిణమిస్తాయోననే సందేహాలను కలుగజేస్తున్నాయి. రాష్ట్రపతి ఆ కోణాన్నే స్పృశించినట్లుంది. ఇలాంటి సమస్యలపై ఆషామాషీగా తీసుకునే నిర్ణయాల వల్ల పరిణామాలు ప్రమాదకరంగా ఉంటాయని రాష్ట్రపతి చెప్పకనే చెప్పారనిపిస్తుంది. నిఘా వర్గాలు నిష్పాక్షికంగా, వాస్తవాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని విధాన నిర్ణేతలకు అందించి, సముచిత నిర్ణయాల రూపకల్పనకు తోడ్పడాలని ప్రణబ్ ఉపదేశించారు. నేటి సంకీర్ణ రాజకీయాల యుగంలో సైతం అతి పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఏకమై ఎలాంటి లోపభూయిష్టమైన, హానికరమైన చట్టాన్నయినా తీసుకొచ్చి దేశంపై బలవంతంగా రుద్దగలవు. అలాంటి ప్రమాదమే చిన్న రాష్ట్రాల ఏర్పాటు విషయంలో ముంచుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేసి అడ్డగోలుగా రాష్ట్రాల విభజనకు అవి బరితెగించగలవనడానికి తాజా ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు. ఈ విషయంలో కాంగ్రెస్, యూపీఏ ప్రభుత్వం అనుసరించిన పద్ధతులు రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి, సమాఖ్య వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. తెలంగాణ అంశాన్ని నానబెట్టి ఎన్నికలు సమీపిస్తుండగా దుందుడుకుగా వ్యవహరించడంలోని హేతుబద్ధతను, లోపాలను ప్రతిపక్షాలు ప్రశ్నించకపోవడం, ప్రేక్షక పాత్ర పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు.