ఎవరు నీవారు... ఎవరు నావారు... | middle class family special comedy story | Sakshi
Sakshi News home page

ఎవరు నీవారు... ఎవరు నావారు...

Published Wed, Mar 30 2016 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

ఎవరు నీవారు... ఎవరు నావారు...

ఎవరు నీవారు... ఎవరు నావారు...

 సరదా సంసారం
ఆ సాయంత్రం మా ఆవిడ నేను అడక్కుండానే ఐస్ వాటర్ తెచ్చిచ్చింది.
‘ఎందుకు?’ అన్నాను.
‘మిమ్మల్ని ఐస్ చేయడానికి’ అంది గోముగా.
తెలుగు వీక్లీ నవలల్లో చదవడం తప్ప ఈ గోముగా అనే ఎక్స్‌ప్రెషన్‌ను పెళ్లయ్యేదాకా ఎరగను. పెళ్లయ్యాక.. ఇదిగో... ఏవైనా పనులు సాధించుకోవాలంటే మా ఆవిడ నుంచి ఈ ఎక్స్‌ప్రెషనే వస్తుంటుంది.
‘చెప్పు’ అన్నాను.
‘రమణి వస్తానంది’ అంది.
‘రమణి ఎవరు?’ అన్నాను.
‘శేఖర్ కూడా ఫోన్ చేశాడు. టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నారట. పింకీ, బుజ్జీ అయితే యమా హుషారుగా ఉన్నారట. ఇక టామీ అయితే తోక ఊపుతూనే ఉందట’
‘ఎవరీ దొంగల ముఠా?’
‘అంతేలేండీ మా వాళ్లనేసరికి దొంగల ముఠా. మీ వాళ్లేమో ఎస్.పి.రంజిత్ కుమార్ వారసులు’...
‘సంగతి ఏడు’
‘ఏడ్చినా ఎనిమిదించినా ఈ వేసవి సెలవలకు మా చెల్లెలు బావ పిల్లలు కుక్క టామీ వస్తానని ఫిక్స్ అయ్యారు. నేను కూడా అయ్యాను. కనుక మీరు కూడా కావాల్సిందేనని అవక తప్పదని అవనని మొండికేస్తే తగు ప్రత్యామ్నాయాలు గదిలోకి తీసుకెళ్లి వీలైనంత సామరస్యంగా చూపుతానని ఆ విధంగా మనవి చేస్తున్నాను’...
నేను కోపంగా చూడటానికి ప్రయత్నించాను. ముక్కు ఎర్రగయ్యింది తప్ప కళ్లు ఎర్రగా కాలేదు.
‘ఈ వేసవికి నావాళ్లను పిలుస్తానని చెప్పాను కదా. మా అన్నయ్య వదిన పిల్లలూ, మా అత్త కొడుకు కన్నబాబు వాడి ఉత్తరాది భార్య చున్నీబాయ్, మా చెల్లెలు సుగుణమణి’....
నేను చెప్తూనే ఉన్నాను... మా ఆవిడ విసవిసా వెళ్లి గుప్పెడు బియ్యం తెచ్చి నిలబడింది.
‘నా మాట వినకపోయారో ఈ బియ్యం తిని చస్తా’...

‘బియ్యం తింటే చస్తారా ఎవరైనా?’ నవ్వాను.
‘పిచ్చి మొగుడా... ఇవి బియ్యం అనుకుంటున్నావా. మన ప్రభుత్వాల అప్రమత్తత వల్ల కల్తీవ్యాపారులకు నూకలు కలిపే వీలులేక పట్టుబడతామన్న భయంతో అసలు బియ్యమే లేకుండా అల్యుమినియం, క్రోమియం, కాడ్మియం, ఘోరేనియం... తీగలను బియ్యంలా కట్ చేసి తయారు చేసిన కృత్రిమ బియ్యం. వీటి ప్రత్యేకత ఏమంటే తిన్నాక ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ఏడు లక్షలా అరవై ఎనిమిది వేల బిల్లు చేయిస్తే తప్ప ఒంట్లో నుంచి బయటకు రావు. అదీగాక బోనస్‌గా తమతో పాటు తిన్న శాల్తీని కూడా పట్టుకుపోతాయి. బోలో... ఖావూ క్యా’... హిందీలో బెదిరించింది.

 నేను దీనంగా చూశాను.
‘అంటే ఈ దేశంలో ఏ మగాడికైనా వేసవి సెలవల్లో తన వాళ్లను పిలుచుకుని నాలుగు రోజులు ఉంచుకునే భాగ్యం లేదా’

 ‘ఎందుకండీ అంతంత కఠినమైన మాటలు అంటారు. విన్నవాళ్లు నేనెంత కఠినాత్మురాలినో అని ఆడిపోసుకోడానికా? పద్నాలుగేళ్ల క్రితమే కదా మీ వాళ్లు వచ్చిపోయారు. అప్పుడు నేను వాళ్లను బాగా చూసుకోలేదా? ఆరు మామిడిపండ్లు తెప్పించి నెలంతా కోసి పెట్టలేదా? ఒక సినిమాకు తీసుకెళ్లి ఇంటర్వెల్‌లోనే లాక్కొచ్చేశానే? అంతకంటే బాగా ఎవరు చూసుకుంటారు? మనం మంచాల మీద పడుకొని వాళ్లను చాపల మీద పడుకోనివ్వలేదా? హెందుకండీ నన్ను అన్నేసి మాటలంటారు’...

 నేను ఈ సంభాషణా చాతుర్యాన్ని తట్టుకోలేక టీవీ వాల్యూమ్‌ని పెంచాను.
ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ‘సాయంత్రం వస్తూ ఐదు వేలు పెట్టి ఎక్స్‌ట్రా హార్డ్ డిస్క్ కొనండి. మా రమణికి నాగార్జున సినిమాలన్నీ ఇష్టం. అదొచ్చే సరికి హార్డ్ డిస్క్‌లో అన్నీ కాపీ చేసి రెడీగా పెట్టాలి’...

 ‘ఇప్పటికప్పుడు ఐదు వేలంటే’...
‘సర్లేండి... మీక్కూడా ఒకటీ రెండు ట్రాజెడీ సినిమాలు లోడ్ చేసి చూపిస్తాను. హ్యాపీయేనా’...
ఇక దింపుడుకళ్లెం ఆశే మిగిలింది.
‘ఒక పని చేద్దామా... సెలవుల్లో సగం రోజులు మీ వాళ్లను, రమ్మని సగం రోజులు మావాళ్లని రమ్మందామా’
మా ఆవిడ మళ్లీ కన్నీరు మున్నీరైంది. సపోర్టివ్‌గా కొంచెం కాళ్లూ చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది.
‘ఊరుకో... ఊరుకో... ఇప్పుడేమైందని’ కంగారుగా అన్నాను.
కొంచెం తమాయించుకుంటూ అంది.
‘మీకు తెలియదా అండీ?.. పెళ్లయిన తొలినాటి రాత్రే మీకు ప్రమాణం చేయలేదా నేనూ?... ఇవాళ్టి నుంచి నా వాళ్లంతా మీవాళ్లనీ... నా వాళ్లంతా నా వాళ్లేనని మీకు ప్రమాణం చేయలేదా... చెప్పండి... చెప్పం...డీ’....
మళ్లీ ఎక్కడ కాళ్లుచేతులు కొట్టుకుంటుందోనని  ‘చెప్పావ్... చెప్పావ్’...  ఒప్పుకున్నాను.
అంతేకాదు... ఆమె కన్నీరుకు నేను మున్నీరవుతూ రాబోయే నావాళ్ల కోసం మటన్ తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టడానికి స్కూటర్ తాళాలు అందుకున్నాను.

 - భా.బా (భార్యా బాధితుడు)

 తాజాకలం: గీతాకారుడు ఇలా సెలవిస్తున్నాడు... పార్థా... అత్తమామలను ఆదరింపుము. భార్య మాట చచ్చినట్టు విని బావమరిదికి శ్రీమంతుడు సైకిల్ కొనిపెట్టుము. మరదలి కుటుంబాన్ని స్టేషన్ నుంచి ఊబర్‌లో సలక్షణముగా తోడ్కొని రమ్ము. అప్పుడుగాని నీ ఊర్థ్వలోకముల సంగతి ఎటుల ఉన్నా గృహలోకము యందు మాత్రం తప్పక శాంతి చేకూరును.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement