రెండు గుండెల చప్పుడు | samsaram in real life | Sakshi
Sakshi News home page

రెండు గుండెల చప్పుడు

Published Mon, Oct 16 2017 2:26 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

samsaram in real life - Sakshi

సాయంత్రం ఆరవుతోంది. గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఓ పక్కకొచ్చి కూర్చున్నాను. మనసంతా వికలంగా ఉంది. హృదయం ఉప్పెనలా ద్రవిస్తోంది. శ్రావణ్‌ మీద కోపమొచ్చిన ప్రతిసారీ ఈ గుడికే వస్తుంటాను. శ్రావణ్‌... ఒళ్లు మండిపోతోంది తల్చుకుంటేనే. ఫోన్‌ వైపు చూశాను. వాట్సాప్‌లో శ్రావ్‌ టైపింగ్‌ అని వస్తోంది. వెంటనే బ్లాక్‌ చేశాను. అది గమనించి కాల్‌ చేశాడు. ఫోన్‌ స్విచాఫ్‌ చేశాను. తొమ్మిదేళ్లు ప్రేమించుకున్నాం.

ఏడాది క్రితం పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. చచ్చేంత పిచ్చి ఒకరికి ఒకరంటే. ఏం లాభం. ఒక్కరోజు కూడా తను నాకు ‘ఐ లవ్‌ యు’ చెప్పడు. నేను చెబితే ‘ఐ టూ’ అంటాడు. మనసులోని భావాలను అల్లి ఎన్నో లేఖలు రాశాను. చదివి బాగుందని కూడా చెప్పడు. వాట్సప్‌లో మెసేజ్‌ పెడితే చాలాసార్లు చూసి కూడా రిప్లై ఇవ్వడు. స్పెషల్‌ డే వస్తే ఏం ప్లాన్‌ చేసుకుందాం అని కూడా అడగడు.

నేను ఎందుకు కోపగిస్తానో.. ఎందుకు బాధపడతానో అన్నీ తనకు తెలుసు. కానీ దేనికీ ఎక్స్‌ప్లనేషనే ఉండదు. ఇవన్నీ తన దృష్టిలో చిన్న చిన్న విషయాలే. కానీ అవే నా చిన్న చిన్న సంతోషాలు.
నా ప్రేమ తనకి తట్టుకోలేనంత వెగటు.. వదులుకోలేనంత ఇష్టం. ఈ మాటలు నిన్న నైట్‌ తనే నాకు స్వయంగా చెప్పాడు.

‘నీ ప్రేమ షుగర్‌ ఎక్కువగా కలిపిన స్వీట్‌ లాంటిది. కాస్త తింటే ఎక్కువైపోతుంది. అలా అని తినకుండా ఉంటే నీరసించి చచ్చిపోతా. ఎందుకంటే నాకు మరో స్వీట్‌ పడదు’ అంటూ డైలాగ్స్‌ చెప్పాడు. ఎవడడిగాడు ఈ డైలాగ్స్‌ అన్నీ? నేను ఏమైనా వజ్రాల వడ్డాణం చేయించమని గోల చేశానా? కేవలం నా భావాలకి చిన్నగా స్పందించమంటాను.

‘నా మీదే పంచప్రాణాలు పెట్టుకున్న ఓ పిచ్చిది ఉంది కదా. దాని కోసం కాసేపు ఖాళీ చేసుకుందాం. కాసేపు కబుర్లు చెబుదాం’ అని తనకు అనిపించాలి కదా. మరీ పట్టనట్లు ఉంటాడు. అందుకే నిన్న నైట్‌ ఇల్లు వదిలి దగ్గరలోని హాస్టల్‌కి వచ్చేశాను. దూరంగా ఉంటేనైనా నా విలువ తెలిసొస్తుందని! పుట్టింటికే వెళ్లొచ్చు. కానీ నా శ్రావణ్‌ని ఎవరిముందు తక్కువ చెయ్యడం ఇష్టం ఉండదు.


లవ్‌ చేసుకునే మొదట్లో నేను గుంటూర్లో ఇంట్లో ఉండేదాన్ని. తను వైజాగ్‌లో జాబ్‌ చేస్తుండేవాడు. ఓ రోజు కాల్‌ చేసి ‘రేపు ఊరొస్తున్నా.. ఐదారు రోజులుంటాను’ అన్నాడు. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. నా ఆనందాన్ని కనిపించకుండా ‘అయితే’ అని అడిగాను. ‘నిన్ను చూడాలనిపిస్తుందిరా. ఆదివారం నీ ఫ్రెండ్‌ అమ్ముని తీసుకుని బాబా టెంపుల్‌కి రా’ అన్నాడు. నేను సరే అన్నాను. తను ఊరొచ్చి రెండు రోజులు దాటింది. కలుద్దామన్న ఊసే లేదు! ఫోన్స్, చాటింగ్స్‌లోనూ ఆదివారం కలవడం గురించి మాట్లాడలేదు. నాకు బీపీ రైజ్‌ అయింది. ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాను. మరునాడు సాయంత్రం 4 గంటలకి అమ్మ సెల్‌కి అమ్మూ ఫోన్‌ చేసింది.

‘నీ ఫోన్‌ ఎందుకే కలవట్లేదు? శ్రావణ్‌ చాలా సార్లు ట్రై చేశాడంట. ముందు తనకి కాల్‌ చెయ్యి.’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసింది. దాంతో ఫోన్‌ ఆన్‌ చేశాను. వెంటనే కాల్‌ వచ్చింది. లిప్ట్‌ చేస్తే.. ‘ఏమైంది ఫోన్‌ ఆఫ్‌ చేశావు’ అని అడిగాడు ఏం తెలియనట్లు. అంటే నా అన్ని గంటల కోపానికి విలువే లేదు. అనిపించింది. అడిగేయ్యాలనిపించింది కానీ అహం అడ్డొచ్చింది. ‘ఎల్లుండి ౖవైజాగ్‌ వెళ్తున్నా. బస్టాప్‌కైనా రాగలవా?’ అన్నాడు. ఆశ్చర్యమేసింది. కోపం నషాళానికి ఎక్కింది.

‘బుద్ది ఉందా నీకు. ఏం చెప్పావు? ఆదివారం కలుస్తానని చెప్పి కలవాలనే మాటే మరిచిపోయి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా?’ అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేశాను. తనేదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే.. నేను పట్టించుకోకుండా... ‘మరిచిపోకపోతే ఇంకేమైనట్లు? నీ మనసులో కలవాలనే ఆలోచన లేనప్పుడు నా ఆవేదనకు విలువలేదు. అందుకే, నేనే నిన్ను కలవను’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేశాను.

అప్పుడో మెసేజ్‌ వచ్చింది.. ‘సోనా.. లవ్‌ యు సో మచ్‌.. ఊరువచ్చిన నాటి నుంచి నిన్ను కలవాలనిపిస్తుంది. కానీ మీ రిలేటివ్స్‌ ఎవరైనా చూస్తే మనకి ప్రాబ్లమ్‌ అయిపోతుందేమోనన్న ఆలోచనే నన్ను భయపెట్టింది. నీతో ఇదే విషయం చెబితే ఏదైతే అవుతుంది కలుస్తా అంటావ్‌. నాకోసం నువ్వు ఏం చెయ్యడానికైనా సిద్ధమని నాకు తెలుసు. అందుకే నా బాధని నీతో షేర్‌ చేసుకోలేకపోయాను.

సారీరా.. కానీ, ఇప్పుడు నా పెయిన్‌ బాగా ఎక్కువగా ఉంది నిన్ను చూడకుండా వెళ్లలేను ప్లీజ్‌’ అంటూ మెసేజ్‌ చేశాడు. నిజంగానే నా కోపానికి విలువ లేదనిపించింది. అందుకే మరునాడు ఉదయాన్నే అమ్మూని తీసుకుని షాపింగ్‌ మాల్‌లో ఓ రౌండ్‌ వేశాను. నా వెంటే కాస్త దూరంలో తను కూడా నడిచాడు. ఆ విషయం నాకు, తనకి, అమ్మూకి తప్ప మరెవరికీ తెలియలేదు.


నా జ్ఞాపకాలకు అడ్డుపడుతూ... ప్రసాదం తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు గుడి పూజారి. టైమ్‌ చూస్తే ఎనిమిది దాటింది. పైకి లేచి ఆయన పాదాలకు మొక్కాను. ‘దీర్ఘ సుమంగళీభవ’ అని ఆశీర్వదించారు. ఎంత గొప్ప అర్థం. భార్యని దీవిస్తే భర్త రక్షింపబడతాడు. ఎంత గొప్ప దీవెనది!? భార్యాభర్తలు ఇద్దరు కాదు.. ఒక్కటే. ఆ సమయంలో నా కళ్లు మెరుస్తున్నా శ్రావణ్‌ నెగ్లిజెన్స్‌ గుర్తుకొచ్చి మనసు మాత్రం కాస్త భారంగానే నిట్టూర్చింది.

అమ్మవారికి మరోసారి మనసులో మొక్కి హాస్టల్‌కి బయలుదేరాను. గుడి నుంచి హాస్టల్‌ రూట్‌లో నడకందుకున్న నా వేగానికి మరోవేగం అడ్డొచ్చింది. చేతిని వదిలించుకునే ప్రయత్నం చేశాను కానీ ఆ ప్రయత్నంలో ఎప్పుడూ శ్రావణే గెలుస్తాడు. ‘ఏంటి’ అంటూ కళ్లతో బెదిరించే ప్రయత్నం చేశాను. ‘సారీ! అన్నాడు.

‘ఆపింక.. రోడ్డు పక్కనే ఈ పంచాయితీ పెట్టకు’ అని ముందుకు నడవబోయాను. ఆగమన్నట్లు చెయ్యి అడ్డుపెట్టాడు. ‘సోనా సారీ... ఇంకెప్పుడు నెగ్లెక్ట్‌ చెయ్యను. ప్రతీది ముందే చెబుతాను. ఇంటికి వచ్చెయ్‌ ప్లీజ్‌. నువ్వు వెళ్లినప్పటి నుంచీ ఏం తినలేదు. ఆకలేస్తోంది’ అన్నాడు. అంతే! గుండె కరిగిపోయింది. అప్రయత్నంగానే కన్నీళ్లొచ్చాయి. తను ఆకలేస్తుందన్నా నిద్ర వస్తుందన్నా నేను తట్టుకోలేను. మనసు నిండా ఎంత కోపమున్నా ఎంత బాధున్నా అన్నీ వదిలేస్తాను. ఆదరబాదర అయిపోతాను. నా పిచ్చి కోపాన్ని నేనే తిట్టుకుంటూ.. ‘సారీ..’ అన్నాను. తను మౌనంగానే ఉన్నాడు. ఎదురుగా వచ్చిన కారు లైట్‌ వెలుగులో తన కళ్లను చూశాను. తన కళ్లు ఎప్పుడూ అబద్ధం చెప్పవు. తప్పుచేశాననిపించింది.

మారాల్సింది తను కాదు! మారింది నేనే!! ఎందుకంటే ప్రేమను పంచినప్పుడు నాలో స్వార్థంలేదు! తిరిగి తన నుంచి ఆశించడం మొదలు పెట్టిన నాటి నుంచే మొదలైంది. అదే కాబోలు అమ్మ ప్రేమకు.. మిగిలిన ప్రేమలకు ఉన్న తేడా!! వెంటనే బ్యాగ్‌లో ఉన్న ప్రసాదం తీసిచ్చాను. తీసుకుని చాలా ఆత్రంగా తింటూ.. నా నోటికి అందించాడు. ‘రెస్టారెంట్‌లో తినేసి ఇంటికి వెళ్దాం’ అన్నాను.నడక మొదలైంది.


ఇంకా మౌనంగానే ఉన్నాడు కుర్రాడు. తన చేతికి నా చేయి తాకేలా నడిచాను. అప్రయత్నంగానే నా చేయిపట్టుకున్నాడు. మరో కారు మా ఎదురుగా పోయింది. తను నావైపే చూస్తు నడుస్తున్నాడు. నేను కాస్త బెట్టుగా ముఖం తిప్పుకున్నా.చిన్నగా నవ్వు వచ్చింది అయినా.. బుజ్జగించి బ్రతిమాలేవాళ్లు ఉన్నప్పుడే కదా బుంగమూతికి విలువ. సంసారానికి అందమూనూ!
 

సినిమాలో సంసారం
‘నవ మన్మధుడు’ సినిమాలో ధనుష్‌  తన తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆలోచిస్తూ డిప్రెషన్‌ మూడ్‌లో ఉంటాడు. ఆ సమయంలోనే భరత్‌ భార్య సమంత కడుపులో బిడ్డ కదలుతుందని చాలా సంబరపడుతూ భర్తతో చెబుతుంది. దానికి ఓ జీవం లేని నవ్వు నవ్వుతాడు భరత్‌. అది గమనించిన సమంత ‘జరిగింది తలుచుకుంటూ మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను కూడా పట్టించుకోకపోతే ఎలానండి’ అంటుంది.

దానికి బాధపడిన ధనుష్‌ ‘మా నాన్నని అందరూ దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్‌ చూసుకోలేకపోతున్నా’ అంటూ సీరియస్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్‌ చేస్తే...ధనుష్‌ లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్లకుండా పనికి బయలుదేరతాడు. అది గమనించిన భార్య సమంత.. అతడి వెనకే పరుగుపెడుతూ ‘ఏమండీ.. ఏమండీ..’ అని అరుస్తుంది. కంగారు పడిన ధనుష్‌ వెనుతిరిగి ‘హేయ్‌ నీకేమైనా పిచ్చా... కడుపులో బిడ్డతో అలా పరుగుపెడుతున్నావ్‌?’ అంటాడు.

‘మీరు నా మీద కోపంతో.. లంచ్‌ బాక్స్‌ తీసుకెళ్లకుండా వెళ్తున్నారు’ అంటుంది చాలా అమాయకంగా! భార్య ప్రేమను గుర్తించిన భరత్‌... ‘పిచ్చిదానా నీ మీద కోప్పడ్డమే నాకు తెలీదు. ఇంకా నీ మీద కోప్పడి ఎక్కడికి వెళ్తాను చెప్పు?’ అని అడుగుతాడు చాలా ప్రేమగా. ‘ఏమో మీ వాలకం చూస్తే అలా అనిపించలేదు’ అంటుంది సమంత ముభావంగా! ఆ మాటలకు నవ్వుకున్న ధనుష్‌ ‘సరే రా ఇంట్లో దింపేస్తా’ అంటూ రెండు చేతులతో ఎత్తుకుని ఇంటికి నడుస్తాడు. ‘ఏమండీ ఏం చేస్తున్నారు? చూసేవాళ్లంతా ఏం అనుకుంటారు?’ అంటూ సమంత ఆశ్చర్యపోతుంటే.. ‘ఏం నా పెళ్లాన్నేగా ఎత్తుకెళ్తుంది’ అంటాడు ధనుష్‌. నిజమే మరి ప్రేమంటే.. కాలే కడుపుని, తడిసిన మనసుని గుర్తించడమే కదూ!

– సంహిత నిమ్మన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement