ఆలుమగల డ్యూయెట్‌ | Family problems | Sakshi
Sakshi News home page

ఆలుమగల డ్యూయెట్‌

Published Mon, Nov 6 2017 12:12 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

Family problems  - Sakshi

పొద్దున్నే వచ్చిన న్యూస్‌ పేపర్‌ కనిపించలేదు. వెతగ్గా వెతగ్గా కిచెన్‌లో మిక్సీ పైన ఉంది. ‘ఏంటిక్కడా?’ అనడిగితే ‘ఇవాళ మీకా పేపర్‌ తాకే హక్కు లేదు. అది నాది’ అంది. ‘వై? కైకో?’ అన్నాను రెండు భాషల్లో. ‘అందులో నా రాజా ఉన్నాడు’ అంది. అనుమానం పెనుభూతం అయ్యింది. ‘ఎవడు వాడు? ఎన్నాళ్ల నుంచి సాగుతోంది ఈ భాగోతం’ అన్నాను. ‘నా చిన్నప్పటి నుంచి’ అంది. ‘ఆ... అంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావన్నమాట’ అన్నాను. ‘కాదు... రాజాను త్యాగం చేసి మీచే తాళి కట్టించుకున్నాను’ అంది. పేపర్‌ విసురుగా లాక్కున్నాను. తిరగేశాను. ‘ఎక్కడ నీ ర్రా..జా’ జగ్గయ్యగారిలా బొంగురుగా అడిగాను. ‘కొత్తగా రెక్కలొచ్చేనా గూటిలోని గువ్వపిల్లకి’ అంటూ చూపించింది. ఇళయరాజా ఫొటో. హైదరాబాద్‌లో లైవ్‌ కన్సర్ట్‌ అట. పెద్ద యాడ్‌ ఇచ్చున్నారు.‘ఇతడే నా రాజా. నా పదహారేళ్ల వయసులో పదహారేళ్ల వయసు సినిమా పాట విన్నాను.

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా...’ హమ్‌ చేసింది. ‘వింటే?’ ‘అప్పటి నుంచి మనసు పారేసుకున్నాను. మౌనగీతం పాటలు విని మౌనంగా, మౌనరాగం పాటలు విని మూగగా ఆరాధించాను. చిరంజీవి ‘ఆరాధన’ సినిమా చూసి ‘అరె ఏమైంది... ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది...’ అని నేను మా ఊరికి దూరంగా ఉన్న బీచ్‌కి వెళ్లి అక్కడి అలల్లో రాళ్లల్లో  పాడుతూ ఉంటే బెస్తవాళ్లు పట్టుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టారు. అంత పిచ్చి నాకు రాజా అంటే’ అంది. ఊపిరి కొంచెం పీల్చుకున్నాను. ‘అయితే అతడు నీ హాబీకి  రాజా. కాని దిల్‌ కా రాజా నేనేగా’ అన్నాను. ‘ఆ మాట నిరూపించుకోవాలంటే షోకి రెండు టికెట్లు కొనండి’ అంది. ‘కొనకపోతే?’ ‘నన్ను ఇంట్లో కనలేకపోతారు’ ‘అంత పని చెయ్యొద్దు’ అని బుక్‌ మై షో ఓపెన్‌ చేశాను. టికెట్ల రేట్లు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ‘ఇంత రేట్లా?’ అన్నాను.

‘జిఎస్‌టిని మర్చిపోయారా?’ అంది ‘టీవీలో చూడొచ్చు కదా డాళింగ్‌’ ‘వండిన కూర ఫ్రిజ్‌లో పెట్టి తిన్నట్టుగా ఉంటుంది. నథింగ్‌ డూయింగ్‌. నా రాజాను లైవ్‌లో చూడాల్సిందే.’ ‘అయినా ఆయనేం సింగర్‌ కాదు. పాడుతుంటే చూడటానికి. ఊరికే అలా నిలబడి రెండు కట్టెపుల్లలు ఆడిస్తూ ఉంటాడు. హీ ఈజ్‌ ఓన్లీ ఎ మ్యూజిక్‌ డైరెక్టర్‌ యూ నో  మన పెళ్లి రిసెప్షన్‌లో పాట కచ్చేరి పెట్టించమంటే అన్నీ చక్రవర్తి పాటలే పెట్టించారు. అప్పుడే తెలిసింది మీ టేస్ట్‌ ఏమిటో’ ‘ఏయ్‌ చక్రవర్తి పాటలను ఏమీ అనొద్దు. నేను ఆయన ఫ్యాన్‌ని. నీకు తమిళ ఇళయరాజా అంటే ఎంతటి గొప్పో నాకు తెలుగు చక్రవర్తి అంటే అంత గొప్ప. అయినా సూళ్లూరుపేట అమ్మాయిని చేసుకోవడం తప్పయింది.

అరవ వాసన ఎక్కడికి పోతుంది’ ‘సంగీతానికి కులం మతం ప్రాంతం వైఫై ఏరియా అంటూ ఏమీ ఉండవు మిస్టర్‌ రామ్మోహన్‌రావ్‌. మ్యూజిక్‌ ఈజ్‌ డివైన్‌’ ‘నో.. ఇప్పుడు నాకు వైన్‌ గుర్తు చేయకు’ ‘అంతకు మించి మీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయగలను కనుక’ ‘అలా అనకు. నీ సంతోషం కోసం ఏమైనా చేయగలను పల్లవీ. కావాలంటే ఒక చరణం పాడనా?’ ‘వద్దు’ ‘భార్యభర్తలు కలిసి పాడుకోవడం కన్నా అసలైన కచ్చేరి ఏముంటుంది చెప్పు. నీవేనా నను పిలిచినది... నీవేనా నను తలచినది’ పాడాను. తల పట్టుకుంది. మళ్లీ అందుకున్నాను. ‘నువ్వంటే నాకెందుకో అంత ఇదీ.. అంత ఇదీ’ పాడు ప్లీజ్‌ అన్నట్టుగా కళ్లలో కళ్లు పెట్టి చూశాను. ‘రావోయి చందమామా... మా వింత గాధ వినుమా’ మెల్లగా గొణిగింది. ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు... జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు’ హితబోధ చేశాను.

‘మనసున ఉన్నదీ చెప్పాలని ఉన్నదీ మాటలు రావే ఎలా?’ అంది. ‘ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనమూ ఏలనో’ సర్ది చెప్పడానికి చూశాను. అప్పటికి ఇడ్లీ అయిపోయి చట్నీ రెడీ చేయడానికి కొబ్బరి అందుకుంది. ‘పిలువకురా అలుగకురా నలుగురిలో నను ఓ రాజా’ ఇళయరాజా ఫొటోను చూస్తూ అంది. మనసు చివుక్కుమంది. ఇలాంటి సమయాల్లోనే మగాడు తన మనసులోని ప్రేమ అంతా చెప్పగలగాలి. అందుకున్నాను– ‘నీవు నా పక్కనుంటే హాయి. నీవు లేకుంటే చీకటి రేయి. నీ కన్నులలోన ఎన్నో ఎన్నో ఎన్నో కిరణాలు మెరిశాయి’ అన్నాను. అలా అంటూ రెండు చేతులూ పట్టుకున్నాను. ప్రతి ఉదయమూ భర్త తన భార్య చేతులను మెల్లగా తాకి కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తే తగదాలు రావు అని ఎక్కడో చదివాను. ఇప్పుడు అప్లై చేశాను. తనూ నా కళ్లలోకి చూసింది.

‘ఇలాగే... ఇలాగే... సరాగమాడితే... వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే’...  అన్నాను. ‘ఇళయరాజా పాట కదా’ అంది సంతోషంగా. ‘అవును’ అన్నాను. ‘మీరు ఇళయరాజా పాట పాడారా?’ ఆశ్చర్యపోయింది. ఆగు ఆన్నట్టుగా ఆమె వైపు చెయ్యి అడ్డం చూపించి సెల్‌ ఓపెన్‌ చేసి టకటకా రెండు టికెట్లు ఆన్‌లైన్‌లో కొనేశాను. కన్ఫర్మ్‌ మెసేజ్‌ వచ్చింది. చూపించాను. ఇంకా ఆశ్చర్యపోయింది. ‘ఏంటి... టికెట్లు కొన్నారా?’ ‘ఇప్పుడు ఇంకో ఇళయరాజా పాట పాడతాను చూడు’ అంటూ భుజాల మీద చేతులు వేశాను. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా నీ ముద్దుముచ్చట కాదన్నానా సరదా పడితే వద్దన్నానా హొయ్య’ ‘రామ్మోహన్‌రావ్‌’... అంటూ ముద్దుగా అల్లుకుపోయింది. మిక్సీలో చట్నీ నలుగుతోంది. కాని దానిని పట్టించుకునే టైమా ఇది?

సినిమాలో సంసారం
నా ఇంట్లో చేసిన ఉప్మా
‘అదే టచ్‌’ అంటూ తొలి రాత్రి బ్రహ్మానందానికి షాక్‌ ఇస్తుంది శ్రీలక్ష్మి. ఫ్లాష్‌బ్యాక్‌ కూడా చెప్తుంది. బాబూ మోహన్‌ (గోపి) ‘మానస సంచరరే...’ అని పాడుతుంటాడు, శ్రీలక్ష్మి డాన్స్‌ చేస్తుంటుంది. డాన్స్‌ అయిన తర్వాత కందిపోయిన శ్రీలక్ష్మి పాదాలకు వెన్న రాస్తాడు గోపి. తనను అంతగా ప్రేమించిన గోపి ఓ రోజు నీటిలో మునిగి పాడుతుండగా, మొసలి లాక్కు పోయిందని, గోపీ తన మనసు లాక్కుపోయాడని బాధపడుతుంది. గోపీని కాదని బ్రహ్మానందాన్ని పెళ్లి చేసుకోవడానికి కారణం బామ్మ తన పెళ్లి చూడాలన్న కోరికే కారణమంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో లవ్వే కదా అని సరిపుచ్చుకుంటాడు బ్రహ్మానందం.

ఓ రోజు... శ్రీలక్ష్మి, బ్రహ్మానందం మార్కెట్‌ నుంచి వస్తుంటే ఎదురు పడతాడు గోపి. అతడు బతికే ఉన్నాడని తెలిసి ఉద్వేగానికి లోనవుతుంది శ్రీలక్ష్మి. తన విజిటింగ్‌ కార్డిస్తాడు గోపి.
మరో రోజు... శ్రీలక్ష్మి ఉప్మా చేసి, ఆ ఉప్మాను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. గోపీకి ఉప్మా చాలా ఇష్టమని, ఉప్మా తీసుకెళ్లి గోపీకి ఇవ్వమని భర్తను కోరుతుంది. ఒక ఏడుపు ఏడ్చి అలాగే ఇస్తాను కానీ ఆకలవుతోంది త్వరగా వడ్డించమంటూ డైనింగ్‌ టేబుల్‌ కుర్చీ లాక్కుని కూర్చుంటాడు. ‘నా గోపీ తినకుండా ఎవ్వరూ తినడానికి వీల్లేదు’ అని పట్టుపడుతుంది. ‘నా ఇంట్లో... చేసిన ఉప్మా నేను తినడానికి వీల్లేదా’ అంటూ ఎగిరిపడతాడు బ్రహ్మానందం ఏడుపు, కోపం కలగలిసిన గొంతుతో. ఇంతలో ‘నీ చేత ఉప్మా చేయించుకుని తినాలపించింది రాధా’ బాబూ మోహన్‌ వాళ్లింటికి వస్తాడు ‘మావి చిగురు’ సినిమాలో.

– నిష్ఠల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement