సింకులోని కప్పు... వైరులో కరెంటు...
సమ్‌సారం
సంసారంలో సినిమా
‘‘నా పరువు తియ్యకురా మగడా’’ రహస్యంగా పళ్లుకొరుకుతూ అంది మా ఆవిడ. తన పరుపు పోయే పని నేనేం చేశానో అర్థం కాలేదు.ఈ ఒక్క సందర్భంలోనే కాదు... చాలా సార్లు ఆ మాట అర్థం కాలేదు. ఆ కోపమెందుకో అర్థం కాలేదు. ఆ కోపానికి మూలమేమిటో తెలియదు.అర్థం కాకపోవడం ఏముంది. అర్థం కాకపోవడం అనే ఫ్యాక్టూ, ఫ్యాక్టరూ కాపురంలో ఎప్పుడూ నిత్య నూతనమే. ఎప్పుడూ అర్థం కాదు. ఏదీ అర్థం కాదు. బహుశా అర్థం అయినరోజు కాపురం ఉండదు.
నాకు చిన్న పని కూడా చేతకాదట. పెళ్లయిన తర్వాత నా మీద వచ్చిన మొదటి అభియోగం ఇది. ఎప్పటికప్పుడు ఈ ఫిర్యాదు రెన్యువల్ అవుతూ ఉంటుంది.‘‘నువ్వు ఎప్పుడూ ఏ పనీ సక్రమంగా చెయ్యలేవు. నీ ప్రతీ పనితో ఆ విషయం తెలిసిపోతుంటుంది’’ అంది మా ఆవిడ.నేను షాక్ తిన్నాను. షాక్ తినడం ఇది మొదటిసారి కాదు. షాకులూ, కేకులు, టేకులూ తినడానికే ఉన్నాయి. సినిమా యాక్టర్లు టేకులూ, బర్త్‌డే రోజున కేకులూ తింటారేమోగానీ... పెళ్లయిన ప్రతివాడూ షాకులే తింటాడు. విషయం ఏమిటంటే... కాస్తంత ప్రాక్టీస్ చేస్తే టేకు తినరేమో. కేకు వద్దనుకుంటే పారేయవచ్చేమో. కానీ షాక్ తినడం మాత్రం తప్పదు.
‘‘కాపురం అంటే ఏమిట్రా?’’ అని పెళ్లికాకముందు ఒక ఫ్రెండ్‌ను అడిగా.‘‘ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎప్పుడో కరెంట్ లేని రోజుల్లో అన్నమాట అది. ఇవి మోడ్రన్ రోజులు కాబట్టి ఇంటి బల్బు ఇల్లాలు అనుకుందాం’’ అన్నాడు వాడు.‘‘ఒరేయ్ బల్బులో కాంతి తక్కువ కదా. కాబట్టి ట్యూబ్‌లైట్ అందామా?’’ వాణ్ణి సవరించబోయా.‘‘నో... నో... ట్యూబ్‌లైట్ అనే ఆ మాట ఎప్పుడో భర్తకు ఫిక్సయ్యింది’’ జవాబిచ్చాడు.‘‘సరే’’ అన్నా.
‘‘ఓకే... ఇంటికి బల్బ్ ఇల్లాలు అనుకున్నాం కదా. మరి కరెంటే కాపురం. అంటే బల్బు కనిపిస్తుంది. అది భార్య. వైరు మీద ఉన్న ఇన్సులేషన్ కనిపిస్తుంది. పైగా అది లోపల ఉన్న వైరుకు రక్షణ ఇస్తుంది. కాబట్టి కనిపించేదీ, రక్షణ ఇచ్చేది ఇన్సులేషనే కాబట్టి అది భర్త. ఇక మనకు కాపురం కనిపించదు. కాబట్టి వైరులోని ఎలక్ట్రిసిటీయే కాపురం. ఇలా భార్య, భర్త కనిపిస్తారు. కానీ కాపురం కనిపించదు కదా. పైగా కాపురం కాపురం అంటారు. అదేమిటో ఎవ్వరికీ కనిపించదు అచ్చం ఎలక్ట్రిసిటీ లాగే. అందుకే కరెంటున్న కాపర్ వైరే... కాపురం. ఆ కరెంటులోంచి కొట్టే షాకులే దాంపత్యం. బహుశా... కాపర్ నుంచి కాపురం అనే మాట వచ్చిందేమో’’ అన్నాడు వాడు.
ఇప్పుడు నాకు ఆ కరెంట్ సంగతీ... నాకు పని చేతకాని సంగతీ ఒకేసారి ఎందుకు గుర్తొచ్చాయంటారా? చెబుతా... చెబుతా...కాసేపటి క్రితం మా ఇంటికి అప్పుడెప్పుడో డిగ్రీ చేస్తున్నప్పటి ఫ్రెండ్స్ వచ్చారు. అందరమూ సదరాగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మా ఆవిడ అందరికీ కాఫీ తెచ్చింది. బాగుంది. హాయిగా తాగాం. కాఫీ కాగానే ఎప్పటిలాగే నేను గ్లాసు తీసుకెళ్లి సింక్ దగ్గర పెట్టి వచ్చా. అయితే ఆ టైమ్‌లో కరెంట్ పోయి ఉంది. నేను సింక్ దగ్గర్నుంచి వెనక్కు వస్తున్నప్పుడు కిచెన్ డోర్ వద్ద మిగతా గ్లాసులు తెస్తూ, బయట ఉన్న నా ఫ్రెండ్స్‌కు వినపడనంత రహస్యంగా అరిచిన అరుపే... ‘‘నా పరువు తియ్యకురా మగాడా’’ అన్న మాట. ఆ మాట ఎందుకన్నదో నాకు అర్థం కాలేదు. బహుశా నా గ్లాసు లోపల పెడుతున్నప్పుడు కరెంట్ పోయి ఉంది కదా. అందుకే గ్లాసు పెట్టే సమయంలో కిచెన్‌లో నాకు తెలియకుండా నేనింకైదేనా పగలగొట్టడం వంటిదేమైనా చేశానా? ఏమో అదీ తెలియదు. అయినా... ఆమె ఇంకా కిచెన్ డోర్ దగ్గరే ఉంది కదా. పైగా నేనే పనీ చేయనన్న మాట పట్టుకొని నాకు ఇచ్చిన శిక్షణను కూడా విజయవంతంగా నిర్వహించాను కదా.
శిక్షణ ఏమిటని మళ్లీ అడగకండి. ఏ పనీ చేయనని కదా... నా మీద ఉన్న కంప్లయింట్. ఒకవేళ చేసినా చక్కగా చేయననే కదా. ఈ కంప్లెంట్ ఎన్నిసార్లు నమోదయ్యిందో లెక్కేస్తే అది తప్పక గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కి ఉండే ఫ్యాక్టే. ఆమె చేసే ఈ మల్టిపుల్ కామెంట్‌తోనైనా నేను బోల్డన్ని సార్లు పనిచేస్తున్నాననే విషయం తేటతెల్లం కావడం లేదా అన్నది నా సందేహం.గతంలో నేను ఇక్కడి వస్తువు అక్కడ పెట్టేవాణ్ణి కాదు(ట). అలా మాటిమాటికీ దెప్పి దెప్పీ నేను తాగిన గ్లాసును చక్కగా తీసుకెళ్లి సింకు దగ్గరపెట్టడం అలవాటు చేసింది.గుమ్మంలో పేపర్ వేసీ వెయ్యగానే దాన్ని పట్టుకొచ్చి ఇచ్చేలా మా టైగర్‌కూ, కాఫీ గ్లాసు సింకు దగ్గర పెట్టేలా నాకూ ఒకేసారి శిక్షణ మొదలైంది. మా వేర్వేరు శిక్షణా కార్యక్రమాల్లో మా టైగర్ కంటే నేనే కాస్త ఆలస్యంగా పాసై ఉండవచ్చు గాక. కానీ... పేపర్ తేవడాన్ని మా టైగర్ ఎప్పుడైనా మరచిపోయిందేమో గానీ, నేను మాత్రం కాఫీ గ్లాసును సింకు దగ్గర పెట్టడం అనే నా విద్యుక్తధర్మాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. అంతెందుకు... ఇప్పుడు కూడా.
అందుకే నాకు ఒళ్లు మండింది. ‘‘ఇప్పుడు నేనేం చేశాను? అదీ నీ పరువు తీసే పని?’’ అంటూ నిలదీశాను. ‘‘ఇంకేం చెయ్యాలి. అందరూ తాగుతుండగానే ఇప్పుడేం తొందర వచ్చిందని గ్లాసును సింకు దగ్గరికి తీసుకొచ్చావ్? ఇలా తీసుకొచ్చి నా పరువంతా సింకులో ముంచేశావు’’ అని అంది. ‘‘ఓహో... నా గ్లాసొక్కటే తీసుకెళ్లకుండా... నలుగురి గ్లాసులూ తీసుకెళ్లాల్సిందంటావా’’ అన్నా... అప్పటికీ అర్థం గాక.‘‘ఒరేయ్ నా మొగుడా... నా – ప –రు – వు – తి – య్య – కు. ఇంట్లో గెస్టులున్నారు. ఘోస్టులా బిహేవ్ చెయ్యకు. నా పరువు మళ్లీ మారోసారి తియ్యకు’’ అంటూ వార్నింగ్ ఇస్తూ... పటపటలాడుతుండగా మళ్లీ పళ్లు కొరుకుతూ ఒక్కొక్క మాటనూ ఒత్తి పలుకుతూ అంది మా ఆవిడ.
ఈ సంఘటన జరిగిన చాలా రోజుల వరకూ మా ఇంట్లో కరెంట్ ఉన్నా లేనట్టే. ట్రాన్స్‌ఫారం పేలిపోయిన తర్వాత బల్బులు ఆరిపోయిన వీధిలా ఉంది చాలా రోజులుగా మా కాపురం.ఎట్టకేలకు బతిమిలాడగా... ఆడగా నాల్రోజుల తర్వాత తొలిసారిగా చిన్న జీరో బల్బు వెలిగినట్టుగా మాట్లాడింది మా ఆవిడ.‘‘గెస్టులు వచ్చినప్పుడు నీ గ్లాసు నువ్వే తీసుకెళ్లి సింకుదగ్గర పెట్టడం అంటే... నేనేదో నిన్ను రాచిరంపాన పెట్టి... నీతోనే గ్లాసులు, కంచాలు తీయిస్తున్నట్లు చెప్పడమే కదా... అందుకే ఎవరైనా వచ్చినప్పుడు నీ గ్లాసు కూడా నేనే తీస్తా. నువ్వు తియ్యకు’’ అంది.నలుగురు ఉన్నప్పుడు నా గ్లాసును ఆమెను తియ్యమంటే పరువు తక్కువ గానీ... అలా నలుగురు ఉన్నప్పుడు నా గ్లాసు ఆమె తియ్యడం అన్నది ఆమె పరువు ఎలా పెంచుతుందో అర్థం కాలేదు.
నాకు అర్థం కాకపోయినా పర్లేదు. ఎలాగూ నాకేమీ అర్థం కాదనే స్టేట్‌మెంట్ నాకు కొత్త కాదు. కాబట్టి నాకొచ్చే నష్టమేమీ లేదు. నాక్కావల్సిందల్లా మా ఆవిడ మళ్లీ ఎప్పటిలాగే బల్బులా వెలగడం. అందుకే ఆ జీరో బల్బును సీఎఫ్‌ఎల్ బల్బులా వెలిగించుకునే ప్రయత్నంలో భాగంగా ‘‘తియ్యను... తియ్యను. ఈసారి గెస్టులొచ్చినప్పుడు నా గ్లాసూ తియ్యను. నీ పరువూ తియ్యను. అప్పుడు మాత్రం ఓ మంచి ఇల్లాల్లా నా గ్లాసూ నువ్వే తీద్దువుగానీలే’’ అంటూ ఆమెను ఓదార్చాను.
అవును... నేనెప్పుడూ ఏ పని చెయ్యను. చెయ్యలేను. చేసినా సరిగా చెయ్యలేను. మా ఆవిడ ప్రవచించినట్టు... కాపురం అంటే ఎప్పుడూ తప్పులో కాలేయడమేనా... సారీ కప్పులో కాలేయడమేనా? కంటిలోని నలుసూ... ఇంటిలోని నలుసు అన్నది వేమన చెప్పిన మాట. మరి చెప్పని మాటేంటో చెప్పనా? ‘సింకులోని కప్పు... వైరులో కరెంటు’!
సినిమాలో సంసారం
అయితే... ఓకే!
పొట్టిరాజు(కొండవలస లక్ష్మణరావు) భార్య సరోజినిది గొట్టాల వ్యాపారం. భర్త ఏ పనీ లేకుండా స్నేహితుల సత్యానందం(జీవా), చిట్టిబాబు (కృష్ణ భగవాన్)తో కాలక్షేపం చేస్తుంటాడు. సత్యానందం ఒకే రూమ్‌ను పగలు అనిల్‌కుమార్(రవితేజ)కి, రాత్రి స్వాతి(కల్యాణి)లకు అద్దెకిచ్చి మేనేజ్ చేస్తుంటాడు. ఓ రోజు స్వాతి త్వరగా వస్తుంది. రూంలో ఉన్న అనిల్‌ని గోనె సంచిలో కట్టి పనసకాయలని కల్యాణికి చెబుతారు. అంతటితో ఆగక ‘ఒరేయ్ పొట్టిరాజూ! రూపాయి కూడా సంపాదించవని నీ వైఫ్ తిడుతుంటది కదా. నాలుగొందలు పెట్టి ఎనిమిది పనసకాయలు తెప్పించాను. డిమాండ్ బాగా పెరిగిపోయింది. కాయ వంద అన్నా కొనేస్తారు. వీటిని కొనుక్కుని తిరిగి అమ్ముకున్నావనుకో... అరగంటలో నాలుగొందలు లాభం. ఈ లాభం తీసుకెళ్లి మీ వైఫ్‌కి చూపించావనుకో చాలా సంతోష పడుతుంది. నీ విలువ పెరిగిపోతుంది’ అంటారు.
హుషారుగా భార్య దగ్గరకెళ్లి... ‘ఎందుకూ పనికిరాని ఎదవనీ, సంపాదించడం చేతకాని చవటనీ తిట్టి పోస్తుంటావ్ కదే.. నాలుగొందలు ఇవ్వు. అరగంటలో ఎనిమిది వందలు చేస్తా’ అంటాడు పొట్టిరాజు. భార్య వద్ద నాలుగొందలు తీసుకుని చిట్టిబాబుకిస్తాడు పొట్టిరాజు. ఆ టైంలో పక్కకి పొర్లుకుంటూ వెళ్లి సంచిలోంచి బయటికొచ్చేస్తాడు రవితేజ. విషయం తెలియని పొట్టిరాజు... పనసకాయలు ఏవీ... ఎక్కడ అని అరుస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సరోజినిని చూడగానే ‘అంతా మోసం. దగా. ఇందులో కాయలు లేవు’ అని ఏడుస్తాడు పొట్టిరాజు. కోపంతో సరోజిని తన్నడానికి కాలు ఎత్తగానే ‘నేనొప్పుకోను’ అంటాడు. భార్య తన్నగానే బురదనీళ్లలో పడి ‘అయితే ఓకే’ అంటాడు కొండవలస ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో.
ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి.
ఈ మెయిల్: samsaaram2017@gmail.com
– ఆర్