Dignity
-
ప్రధానమంత్రి పదవి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు
న్యూఢిల్లీ: దేశంలో 140 కోట్ల మంది ప్రజలకు నరేంద్ర మోదీ పదేపదే డొల్ల హామీలు ఇస్తూ ప్రధానమంత్రి పదవి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గురించి ఆందోళనను పక్కనపెట్టి, ప్రధాని పదవి గౌరవాన్ని పెంచడంపై ఇకనైనా దృష్టి పెట్టాలని మోదీకి హితవు పలికారు. ఈ మేరకు ప్రియాంక శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. సత్యమే దేవుడు, సత్యమేవ జయతే అని జాతిపిత మహాత్మాగాంధీ తరచుగా బోధిస్తూ ఉండేవారని పేర్కొన్నారు. వేలాది సంవత్సరాల మన సంస్కృతికి సత్యమే ఆధారమని ఉద్ఘాటించారు. ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అబద్ధాలు చెప్పడం, డొల్ల హామీలు ఇవ్వడం సరైందని కాదని స్పష్టంచేశారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాయన్ని వెల్లడించారు. గ్యారంటీలతో ప్రజల సొమ్మును ప్రజలకు అందజేస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ ఎన్నో హామిలిచ్చారని, వాటిలో ఎన్ని నెరవేర్చారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ హామీలన్నీ బూటకమేనని తేలిపోయిందన్నారు. ‘అచ్చే దిన్’ ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీశారు. -
'డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్'.. కేన్సర్ బాధితులకు అండగా.. గృహహింసపై పోరాటం!
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారి నైజం. పసి పిల్లలకు పాలు, పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ నుంచి మొదలు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అవసరమైన మందులు అందించడం, రక్తదానం చేయడం వరకు.. మహిళలు, విద్యార్థినులు నెలసరి సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన ప్యాడ్స్ ఉచితంగా అందించడం నుంచి మహిళల ఆర్థిక స్వావలంబన వరకు.. ఇలా అన్నింటా మేమున్నామంటున్నారు ’డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్’ సభ్యులు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఫౌండేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.ఆధునిక వస్త్రధారణతో హైదరాబాద్‌లోని బస్తీకి వెళ్లిన యువతి రెనీ గ్రేస్.. అక్కడున్న ప్రజలను మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అడిగింది. నాకు చేతనైన సాయం చేస్తానని చెప్పడంతో.. అక్కడున్నవారంతా ఆమెను చూసి నవ్వుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. స్నేహితులు నీతోపాటు మేముంటామంటూ మనోధైర్యాన్ని అందించారు. ఆ ధైర్యం ‘డిగ్నిటీ ఫౌండేషన్’ స్థాపన దిశగా నడిపించింది. 2017 నుంచి ఏడేళ్ల ప్రస్థానంలో 5,500 మందికిపైగా వలంటీర్లను ఫౌండేషన్ సొంతం చేసుకుంది. లక్షలాది మందికి సాయం అందిస్తామంటూ.. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.కేన్సర్ బాధితులకు అండగా.. కూకట్‌పల్లిలోని కుముదినిదేవి హాస్పిటల్లో కేన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో బాధితులను ఆదుకోవాలని డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సభ్యులు నిశ్చయించుకున్నారు. అక్కడున్న కేన్సర్ బాధితులకు అవసరమైన పాలు, లిక్విడ్ ఆహారం పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వరకు ఏ రోజు ఎవరు సరఫరా చేయాలనేది నిర్ణయించారు. రోజుకు రూ.1,500 నుంచి సుమారు రూ.7,500 వరకు వెచి్చస్తున్నారు.బాలికలకు అవగాహన కల్పిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు, పెద్దపెద్ద సాఫ్ట్వేర్ కార్యాలయాల్లో సైతం మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థినులు, మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.నిత్యావసరాల పంపిణీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని బస్తీలు, దళితవాడల్లో పేద కుటుంబాలకు 2018 నుంచి ఆహారం, ఉప్పు, పప్పు, బియ్యం వంటి నిత్యావసరాలు, కనీస అవసరాలైన దుప్పట్లు, దుస్తులు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారు.చేతనైన సాయం చేస్తున్నాం..నా స్నేహితులు పూనం శర్మ, సరితా శర్మ, జైశ్రీరామ్, క్రాంతి రెమ్మల, ప్రతిమతో కలిసి ఫౌండేషన్ నడిపిస్తున్నాను. ఉద్యోగరీత్యా ఎవరి పనులు వారికి ఉన్నాయి. అదనంగా సమాజానికి ఏదైనా సేవ చేసేందుకు 2017లో డిగ్నిటీ డ్రైవ్‌ను స్థాపించాం. మహిళల హక్కులు, ఆర్థిక సాధికారత కోసం ప్రయతి్నస్తున్నాం. నెలసరి సమస్యలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరమైన వారికి కిట్స్ అందిస్తున్నాం. ఆకలి బాధలను అధిగమించేందుకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేస్తున్నాం. నేను షీ టీంలో సభ్యురాలిగా పనిచేస్తున్నా. చివరి స్టేజ్ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు పెయిన్ లెస్ డెత్ కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు ఒక ఫౌండేషన్ నడిపించడం అంత సులువు కాదనిపిస్తోంది. 5,500 మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే వందలాది మంది స్పందిస్తారు. – రెనీ గ్రేస్, డిగ్నిటీ, డ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు. -
రష్యా దాడిని తట్టుకుని నిలబడతాం, గెలుస్తాం: జెలెన్ స్కీ
రష్యా దాడిని తట్టుకుని నిలబడటమే గాక కచ్చితంగా విజయం సాధిస్తుంది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ధీమాగా అన్నారు. ఈ మేరకు జెలెన్ స్కీ సోమవారం జరిగిన వార్షిక "ది డే ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్" సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తమ సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్యులు, ఆన్లైన్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, మిలటరీకోసం వంట చేస్తున్న గ్రామస్తులు, యూనిఫాంలు కుడుతున్న టైలర్లు, ప్రమాదం ఉన్నప్పటికీ వ్యవసాయం చేస్తున్న రైతులు తదితరులందర్నీ ఈ యుద్ధ సమయంలో తమ వంతుగా సాయం అందించినందుకు ప్రశంసించారు తరచుగా క్షిపణి దాడులు, విస్తృత విధ్వంసం ఉన్నప్పటికీ వాటన్నింటని తట్టుకుని ఉక్రెనియన్లు తమ వంతుగా సేవలందించారని కొనియాడారు. తాము డబ్బు, పెట్రోల్, వేడి నీరు, వెలుతురు తదితరాలు లేకుండా కూడా ఉండగలం గానీ స్వేచ్ఛ లేకుండా మాత్రం ఉండలేం అని జెలెన్స్కీ అన్నారు. గతేడాది ఇదే రోజున తాను చక్కగా సూటు వేసుకుని, టై కట్టుకుని ఈ డే రోజున ప్రసంగించాను. ఈ ఏడాది యుద్ధ సమయంలో మిలటరీ దుస్తులతో ప్రసంగిస్తున్నాను అన్నారు. అప్పటికి ఇప్పటికీ మన ఉక్రెయిన్ నేల చాలా మారిందని, ప్రస్తుతం ల్యాండ్ మైన్లు, క్రేటర్స్, యూంటీ ట్యాంకుల వంటివి కనిపిస్తున్నాయని అన్నారు. ఎన్ని మార్పులు వచ్చినా.. తమ అంతరాళ్లలో ఉన్న లక్ష్యాన్ని ఎవరూ మార్చలేరు, ఎప్పటికీ మారదని దానికోసం ఎన్ని కష్టాలనైనా తట్టుకుని పోరాడుతాం అని దృఢంగా చెప్పారు. ఈ డే ఆఫ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ అనేది 2013/2014 నాటి యూరోపియన్ యూనియన్ అనుకూల నిరసనలను సూచిస్తుంది. దీన్ని మైదాన్ విప్లవం ఆఫ్ డిగ్నిటీగా కూడా పిలుస్తారు. (చదవండి: ఇరాన్లో ఇద్దరు హీరోయిన్లు అరెస్ట్.. కారణమెంటో తెలుసా?) -
హుందాతనం మరవొద్దు
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్‌పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్‌లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు. బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు. మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు. -
స్వరాజ్య సమరం లోవెలుగు
‘భాష కేవలము మానవ కల్పితము కాదు. అచ్చటి వాయువుల సంచలనము, అచ్చటి కేదారముల రామణీయకము, అచ్చటి ఆకసము యొక్క దీప్తి, అచ్చటి శుక, సారికల ధ్వన్యనుకరణము, అచ్చటి భాషయందు ప్రతిబింబించి యుండును. అప్పుడే అది దేశభాష అగును... ఆ దేశములోని జనులెట్లు ఆ దేశ గర్భము నుండి పుట్టి పెరిగెదరో అటులనే ఆ దేశభాష కూడా ఆ దేశ గర్భము నుంచి పుట్టి పెరుగు భాషౖయె ఉండును... ఆంధ్ర మండలమున పరబాస మాట్లాడుడు. అప్పుడీ ప్రకృతి యంతయు మూకీ భావము వహించి స్తంభించును...’ (దేశ భాషలు–మత భేదములు, 1920, లోవెలుగులు)‘లోవెలుగులు’ పేరుతో కృష్ణాపత్రికలో ఒక శీర్షిక వెలువడేది. అది సాక్షాత్తు ఆ పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావుగారే రాసేవారు. నిద్రాణమై ఉన్న జాతీయ భావనల మీదనే కాదు, వాటి పునాదుల మీద కూడా కృష్ణారావుగారి అక్షరాలు వెలుగులు ప్రసరించాయి. ఆ అక్షరాల వెనుక ఉన్న అంతరాత్మ ఒకతరం స్వాతంత్య్ర సమరయోధులకీ, కవులకీ, కళాకారులకీ, జాతీయవాదులకీ లోవెలుగై దీప్తించింది. ముందుకు నడిపించింది. ఆ భాషలో తీవ్రత, అదే సమయంలో కనిపించే హుందాతనం ఇప్పటి తరాన్ని కూడా మంత్రముగ్ధులను చేస్తాయి. ‘శక్త్యుపాసన’ అన్న రచన కోసం కృష్ణారావుగారి(1879–1945) అంతరాత్మ ఎంతగా దహించుకుపోయి ఉంటుందో, మేధస్సులో ఎంత మథనం సాగి ఉంటుందో ఈ కొన్ని వాక్యాలు చూస్తే తెలుస్తుంది. ‘నీలో సంఘటనా శక్తి ఎక్కడ? స్వతంత్ర సంఘటన చేయలేక పోయినా, ప్రతిఘటన అయినా చేయలేవే. రాతిని కొట్టి చూడు, దానిలో నుంచి అగ్నికణాలు బయలుదేరతాయి. మందుగుండుకు చిచ్చు పెట్టామనుకో– అది ఎట్లా ప్రేలి, నీ గృహాన్ని మంటల్లో పడవేస్తుంది? ఒక ఎలక్ట్రిక్ బొత్తామును ఒత్తావనుకో– చూడు ఎన్ని బల్బులొక్కమారు వెలుగులు గ్రక్కుతాయో! నిన్ను ఒత్తినా, తన్నినా, చంపినా, ఒక అగ్నికణం గాని, ఒక్క ప్రేలుడు గాని, ఒక్క జ్యోతి గాని ప్రకాశించదే! మనం చచ్చుదద్దమ్మలమన్నమాట. మనలో రాతికున్న భౌతికశక్తి లేదు, పశువులకున్న ప్రాణశక్తి లేదు, మానవునకుండదగిన త్యాగశక్తి లేదు. శక్తి యొక్క అభావం మనలో గూడుకట్టుకొన్నది సోదరా. యంత్రాలను కొలుస్తావు, వాని హార్స్పవర్ యింత అని. నీటిని కొలుస్తావు, దాని ‘‘హైడ్రాలిక్ పవర్’’ ఇంత అని. నీ ‘పవర్’ కొలవడానికి ఏమైనా సాధనం ఉంటే బాగుండును. ఇప్పుడు యుద్ధాలు చేస్తున్నవారిని అడిగితే ఏమి చెబుతారు? ఇంగ్లాండుకు ‘‘నావల్ పవర్’’ ఉన్నదంటారు. అమెరికాకు ‘‘ఇండస్ట్రియల్ పవర్’’ ఉన్నదంటారు. రష్యాకూ, చీనాకూ ‘‘మేన్ పవర్’’ ఉన్నదంటారు. అయితే నీకూ, నీ దేశానికీ ఉన్న పవరేమిటి? మృత్యువంటే భయపడే పవర్– స్వాతంత్య్రమంటే వెనుకపడే పవర్– ఐకమత్యమంటే కళ్లు మూసుకునే పవర్. ఇంతేనా?’ అందుకే కృష్ణాప్రతిక స్వాతంత్య్ర ఉద్యమకాలంలో, వలస పాలన తెచ్చిన చీకటియుగంలో ఒక కంచు కాగడా అయింది. కానీ చాలామంది భావిస్తున్నట్టు కృష్ణాపత్రిక కృష్ణారావుగారి పేరు మీద నెలకొల్పినది కాదు. అది ఆవిర్భవించే నాటికి కృష్ణారావుగారు ఆ పత్రికలో లేరు. ఇంకా చెప్పాలంటే కృష్ణానది పేరు మీద ఆ పత్రిక ఆవిర్భవించిందని చెప్పాలి. పత్రిక నెలకొల్పే సమయంలో ఉంటే తాను ‘కృష్ణవేణి’ అని నామకరణం చేయించి ఉండేవాడినని కృష్ణారావు అనేవారట. భారతదేశం పునరుజ్జీవనోద్యమం వైపు అడుగులు వేయడం నేరుస్తున్న సమయంలో, స్వాతంత్య్రోద్యమం రూపు కడుతున్న సమయంలో 20వ శతాబ్దానికి కాస్త ముందు, అంటే 1892లో మచిలీపట్నంలో కృష్ణా జిల్లా సంఘం ఏర్పడింది. అయితే అది ఇప్పటి కృష్ణాజిల్లా కాదు. మొత్తం గుంటూరు ప్రాంతం కూడా కలసి ఉండేది. ఈ మొత్తం ప్రాంతం అభివృద్ధికీ, రాజకీయ చైతన్యానికీ పాటు పడడమే ఆ సంస్థ ఉద్దేశం. ఇందులో సభ్యులు కొండా వెంకటప్పయ్య తదితరులకు వచ్చిన ఆలోచనే కృష్ణాపత్రిక స్థాపన. వెంకటప్పయ్యగారు న్యాయవాది. మరొక న్యాయవాదీ, కవీ దాసు నారాయణరావుతో కలసి ఇలాంటి నిర్ణయానికి వచ్చారాయన. ఈ ప్రాంతంలో ఒక్క తెలుగు పత్రిక కూడా లేకపోవడం వారిని ఇలాంటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకునేటట్టు చేసింది. పైగా రాజకీయ చైతన్యం రేకెత్తించే ధ్యేయంతో పత్రికలు ప్రారంభమవుతున్న కాలం కూడా అదే. వెంకటప్పయ్య, దాసు నారాయణరావు మొత్తానికి అనేక ఇక్కట్ల మధ్య ఆ పక్షపత్రికను ఫిబ్రవరి 1, 1902న ఆరంభించారు (తరువాత వారపత్రిక అయింది). అంతలోనే దాసు హఠాన్మరణం పాలయ్యారు. ఈ పత్రిక ఆనాడే తీవ్రవాద లక్షణాలు కలిగిన పత్రికగా ముద్ర పడిందని వెంకటప్పయ్య తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఒక ఏడాది తరువాత కృష్ణారావుగారు సహాయ సంపాదకులుగా చేరారు. 1905లో బెంగాల్‌ను విభజిస్తూ నాటి వైస్రాయ్ కర్జన్ నిర్ణయం తీసుకున్నాడు. దేశం భగ్గుమంది. తెలుగు ప్రాంతం కూడా ఆ నిరసనలో గళం కలిపింది. కృష్ణారావుగారు బెంగాల్ వెళ్లి విభజన వ్యతిరేకోద్యమ నేత బిపిన్‌చంద్రపాల్‌ను కలుసుకున్నారు. ఆయనతో కలసి బెంగాల్లో పర్యటించారు. పాల్, చిత్తరంజన్‌దాస్, సుబోధచంద్ర మల్లిక్‌లు ఆరంభించిన ‘బందేమాతరం’ పత్రిక పని తీరును పరిశీలించారు. దీనికి అరవింద్‌ఘోష్ సంపాదకుడు. ఘోష్ పేరుతో వెలువడుతున్న వ్యాసాలు నిజానికి కృష్ణారావుగారే రాస్తున్నారని చాలాకాలం ఎందరో విశ్వసించేవారని పొత్తూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. 1907లో బెంగాల్ ఉద్యమం నుంచి తిరిగి వచ్చిన తరువాత కృష్ణారావు పత్రిక సంపాదక బాధ్యతలను తీసుకున్నారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం బిపిన్‌పాల్ వంటి వారి నాయకత్వంలో జరిగితే, విభజనకు వ్యతిరేకంగా పాల్గారు జరిపిన దక్షిణ భారత యాత్ర ముట్నూరి వారి నాయకత్వంలో జరిగింది. బిపిన్‌పాల్‌ను వెంట తీసుకుని విజయనగరం నుంచి రాజమండ్రి, కాకినాడల నుంచి మద్రాస్ దాకా చేయించిన యాత్ర చరిత్రాత్మకమైనది. తరువాత కూడా కృష్ణాపత్రిక ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించేది. 1908లో కృష్ణాపత్రిక సంపాదకునిగా ముట్నూరి స్థిరపడుతున్నారు. అప్పుడే ‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ శీర్షికతో ఒక వ్యాసం అచ్చయింది. కానీ ఎవరి సలహాయో, ఈ సంచికను విడుదల చేయలేదు. మొత్తం ప్రతులన్నీ తగులబెట్టారు. అయినా ఎలాగో ప్రభుత్వానికి తెలిసిపోయింది. వీటి కారణంగానే కృష్ణాజిల్లా కలెక్టర్ నాలుగేళ్ల పాటు ముట్నూరివారిని సంపాదకునిగా అనుమతించలేదు. 1912లో మళ్లీ కృష్ణారావు సంపాదకుడైనారు. ముట్నూరి వారు దూరంగా ఉన్న కాలంలో అవటపల్లి నారాయణరావు, భోగరాజు పట్టాభిసీతారామయ్య పత్రిక వ్యవహారాలను చూశారు. 1912 నుంచి 1945లో తుది శ్వాస విడిచేవరకు కృష్ణారావుగారే సంపాదక బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన కలానికి పది పాళీలని అంటూ ఉండేవారు. ఆయన ప్రతి అంశాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. రాజకీయం, ఉద్యమం, జాతీయ భావాలు, కళలు, శాస్త్ర విజ్ఞానం, తత్వం, మార్మిక రచన అన్నింటిలోను ఆయన కలం విజయ విహారం చేసింది. కృష్ణారావు గొప్ప కళాహృదయుడు. మచిలీపట్నంలోని కృష్ణాపత్రిక కార్యాలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారని తెలిసినవారు చెబుతారు. ఆ కార్యాలయానికి చిన్న ఆవరణ ఉండేదట. అందులోనే అనేక రకాల మొక్కలను నాటారు. తోట మధ్యలో చిన్న జలాశయం. అందులో కార్యాలయం పక్కనే ఉన్న అమ్మవారి ఆలయం నీడ పడేదట. అలాగే ప్రతి మొక్క, లతలకు కుదుళ్ల దగ్గర గుండ్రంగా మట్టి అరుగులు కట్టించి, వాటికి రంగులు వేయించేవారట. కృష్ణారావుగారు అందరికంటే ముందు కార్యాలయానికి వచ్చి మొక్కల మధ్య విహరిస్తూ ఆనందించేవారట. అందుకే ‘తోటానందులు’ అన్న బిరుదు సన్నిహితుల నుంచి అందుకోవలసి వచ్చింది. కృష్ణారావుగారు రాతలో ఎంతో తీవ్రంగా, లోతుగా తన భావాలను వ్యక్తం చేయడం కనిపిస్తుంది. తెల్లని తలపాగాలో గంభీరంగా ఉండేవారాయన. పొడవైన అంగీ, పంచె, తెల్లని దేహచ్ఛాయతో ఉండే కృష్ణారావుగారి ఆకృతిని అడవి బాపిరాజు వంటి కళా మర్మజ్ఞుడు ఎంతో తన్మయంగా వర్ణించారు. కానీ ఆ మౌనం వెనుక సాగర ఘోష ఉండేదని తరువాత తెలిసింది. ఆయనను మౌనముద్రాలంకారుడు అనేవారు. కానీ నోరు విప్పితే, ఆయనలోని గొప్ప హాస్యప్రియుడే దర్శనమిచ్చేవాడు. అందుకు నిదర్శనం– కృష్ణాపత్రిక కార్యాలయంలో అసంఖ్యాకంగా జరిగిన ‘దర్బార్లు’. దీనికి అసంఖ్యాకంగా మహనీయులు హాజరయ్యేవారు. నిజానికి అదొక చిన్న పర్ణశాల. దానికి జమ్ము గడ్డితో కప్పు ఉండేదట. అందుకే దానిని జమ్మా మసీదు అని ముద్దుగా పిలుచుకుంటూ ఉండేవారట. దర్బారుకు అధ్యక్షులు కృష్ణారావుగారే. ఆయన్ని ‘గురు గ్రంథసాహెబ్’ అని గౌరవించుకుంటూ ఉండేవారు. దర్బారు శాయరు పింగళి కాటూరి కవిద్వయంలోని కాటూరి వెంకటేశ్వరరావు. భోగరాజు పట్టాభి వక్తగా తన పాత్రను నిర్వహిస్తూ ఉండేవారు. అడవి బాపిరాజు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, దామరాజు పుండరీకాక్షుడు, భావరాజు నరసింహారావు, బెజవాడ గోపాలరెడ్డి, గొట్టిపాటి బ్రహ్మయ్య వంటివారంతా వచ్చేవారు. విశ్వకవి టాగోర్ రచన చిత్రాంగదకు గోపాలరెడ్డి చేసిన అనువాదాన్ని మొదట ఈ దర్బారులోనే చదివి వినిపించారు. పింగళి లక్ష్మీకాంతం, మునిమాణిక్యం నరసింహారావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, దేవులపల్లి, విశ్వనాథ వంటి వారంతా కూడా దర్బారీయులే. రావూరి వెంకటసత్యనారాయణరావు (వంద చందమామలు సంకలనకర్త, పత్రికా రచయిత, కృష్ణాపత్రికలో వడగళ్లు పేరుతో శీర్షిక నిర్వహించారు), నార్ల వెంకటేశ్వరరావు హాజరయ్యేవారు. టంగుటూరి ప్రకాశం గారికి బిరుదు ఇచ్చిన దర్బారు ఇదే. చెరుకువాడ నరసింహంపంతులు ‘ఆంధ్ర సింహ’ అని బిరుదు ఇవ్వాలని మొదట సూచించారట. కానీ కృష్ణారావు సింహం కంటే కేసరి అనే మాటే అందంగా అమరుతుందనీ, ఆంధ్రకేసరి అంటేనే బాగుంటుందనీ సవరించారట. అభినవాంధ్ర వాగనుశాసన (గిడుగు రామమూర్తి), పరిహాస పారిజాత (భమిడిపాటి కామేశ్వరరావు), ప్రతివాద భయంకర (పట్టాభి), శోకరస గంగాధర (దేవులపల్లి) వంటి బిరుదులన్నీ అక్కడే పురుడు పోసుకుని, బాలసారె కూడా జరుపుకున్నాయి. కృష్ణారావు రసహృదయానికి ఎల్లలు లేవు. మృత్యువులో కూడా ఆయన సౌందర్యాన్ని చూశారు. అందుకే ఎవరైనా మరణిస్తే ఊరికే సందేశాలు ఇవ్వడం జరిగేది కాదు. ఒకసారి ఒక పెద్దాయన కన్నుమూశారు. ఆ రోజుల్లో పత్రికలో ఫొటో పడాలంటే ‘బ్లాకు’ పద్ధతి ఉండేది. ఒక్కొక్క ఫొటో ఒక్కొక్క బ్లాకు. తీరా కన్నుమూసిన పెద్దాయన బ్లాకు (అంటే ఫొటో అన్నమాట) కార్యాలయంలో లేదని తేలింది. ‘ఇంతమంది బ్లాకులు ఉన్నవాళ్లు ఉన్నారు కదా, వాళ్లలో ఎవరో మరణించకుండా, బ్లాకు లేని ఈయనే పోవాలా! బ్లాకు ఉన్నవాళ్లు పోతే మూడంగుళాల స్థలం కలిసొచ్చేది!’ అన్నారట కృష్ణారావు. మరొకసారి ఇంకొక పెద్దాయన తుదిశ్వాస విడిచారు. ‘మీరు విచారిస్తే చాలునా! లేకపోతే నేను కూడా విచారించాలా!’ అన్నారట, కృష్ణారావు. అంటే, వార్తతో సరిపెట్టవచ్చా? లేకపోతే సంపాదకీయం రాయాలా? అన్నదే ఆయన ఉద్దేశం. కృష్ణారావుగారి జ్ఞాన సంపద అమోఘం. గాంధీగారు ఒకసారి బందరు వచ్చినప్పుడు సభలో ప్రసంగిస్తున్నారు. ‘నూలు వడకడం ప్రతివ్యక్తికి ఒక మహా....’ అని మాట కోసం వెతుక్కుంటూ ఉంటే, అదే వేదిక మీద ఉన్న కృష్ణారావుగారు ట్చఛిట్చఝ్ఛn్ట (మతాదర్శం) అంటూ మాట అందించారు. గాంధీజీ ఆ పదాన్నే ప్రయోగించారు. కృష్ణారావుగారు రాతలో విశ్వరూపం చూపేవారు. మాటలో మాత్రం విదూషకుడి విన్యాసాలు చూపేవారు. కానీ ఆ హాస్యం వెనుక చెప్పలేనంత విషాదం ఉంది. కృష్ణారావుగారు పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోయారు. అందుకే అడపా దడపా తాను మాతృహంతకుడినని అనుకుంటూ దీర్ఘ విచారంలో మునిగిపోయేవారు. ఆరో ఏట తండ్రి ఈ లోకాన్ని వీడారు. పినతండ్రి ఇంట పెరిగారాయన. పుట్టింది దివిసీమ ప్రాంతంలోని ముట్నూరు. కృష్ణారావుగారిపై బ్రహ్మసమాజం ప్రభావం ఉండేది. మచిలీపట్నంలో చదువుకునేటప్పుడు రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆయనకు గురువుగా ఉండేవారు. కృష్ణారావుగారికి ఇద్దరు కూతుళ్లు. ఒక కొడుకు. వారిలో ఒక కూతురు, ఒక్కగానొక్క కొడుకు, అల్లుడు కూడా ఆయన కళ్ల ముందే తనువు చాలించారు. అయినా ఆయన స్వాతంత్య్రోద్యమానికి, పత్రికా రచనకు దూరం కాలేదు. చిత్రం, ఆ హాస్య ధోరణి కూడా తుదికంటా వెన్నంటే ఉంది. కృష్ణారావుగారి చివరి దశలో ఆస్పత్రిలో ఉన్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే భార్య వచ్చారు. అంత్యకాలాన్ని ‘మౌన ముద్రాలంకారుడు’ ఎంతో మామూలు విషయంగా తీసుకున్నారు. పాపం, ఆ ఇల్లాలు దుఃఖం ఆపుకోలేక గొల్లుమన్నారు. అందుకు కృష్ణారావుగారు అన్నమాట, ‘అప్పుడే రిహార్సల్స్ మొదలు పెట్టేశావా!’ - డా. గోపరాజు నారాయణరావు -
పవరు హత్య
చెట్టు స్త్రీలాంటిది. బీడులోంచి కూడా శక్తిని లాగి, నీడను ఇస్తుంది! అలాంటి చెట్టును ఏ ఊరు కోరుకోదు? ఏ ఊరు ఆ చెట్టును మోడువారుస్తుంది? ఏ ఊరు తన కాళ్లను తానే గొడ్డలితో నరుక్కుంటుంది? అలాంటి ఊరు ఉండదు. ఉంటే.. అది మూర్ఖత్వమే. కాదు.. కాదు.. వివక్ష. వృక్షాన్ని కూడా నిలవనివ్వకుండా పడగొట్టేయాలనుకునే వివక్ష! సర్పంచ్ ఇంటికి పాలుబోస్తే 500 జరిమానా! ఆ ఇంట్లో వాళ్లతో మాట్లాడితే జరిమానా! సర్పంచ్ భర్త బండిమీద ఎక్కితే జరిమానా! వాళ్ల పొలంలోనికి ట్రాక్టర్ తోలితే జరిమానా! పరువు హత్యల గురించి విన్నాం. ఈ ‘పవరు హత్య’ ఏంటి?! పెళ్లిలో ఎంపిక చేసుకుంటారు. అక్కడ పరువు హత్యలు జరుగుతున్నాయి. పవర్లో ఎన్నుకుంటారు. అక్కడ పవర్ హత్యలు జరుగుతున్నాయి. ఒక దళిత మహిళా సర్పంచ్ పవర్‌పై జరిగిన హత్య ఇది. చట్టం కూడా చూస్తూ కూర్చున్న కథ ఇది! గ్రామ పంచాయతీ వైపు విసురుగా వెళ్లాడు గ్రామ పెద్ద. ‘‘అరేయ్ ఆ కుర్చీ తేరా..’’ పాలేరుని గదిమి అతను తెచ్చిన కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు. పంచాయతీ సెక్రటరీని పిలిచి చెప్పాడు. ‘‘ఇక నుంచి ఏ ఫైల్ మీదా సర్పంచ్ సంతకం తీసుకోవద్దు. ఆమె ఏ కార్యక్రమాలకీ హాజరు కాకూడదు. ఆమె ఇంటికెవ్వరూ వెళ్లకూడదు. ఆమెతో ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆమె భర్త బండి మీద కూడా ఎవరూ ఎక్కకూడదు..’’ హుకుం జారీ చేసి, కుర్చీలోంచి లేచి వెళ్లిపోయాడు ఆ గ్రామపెద్ద. స్త్రీ.. ఆపై దళిత స్త్రీ నిజానికి ఆ గ్రామ సర్పంచి మమత. పంచాయతీలో ఆమె నిర్ణయం ప్రకారమే అన్నీ జరగాలి. ఏ సభ జరిగినా, ఏ మీటింగ్ పెట్టినా ఆమె ఉండి తీరాలి. అలాంటిది.. సర్పంచిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటి నుంచీ గ్రామంలోని అగ్రవర్ణాలవారి నుండి వివక్ష మొదలైంది. దానికి కారణం.. మమత కుటుంబీకుల భూమిపై పెద్దవాళ్ల కన్ను పడటం. దానిని సొంతం చేసుకునేందుకు వారంతా కలిసి మమత కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారు. పైగా.. ఏకగ్రీవ ఎన్నిక! భర్త ఎం.పి.పి.గా పని చేసినా, మమత పదవ తరగతి వరకు చదువుకోవడంతో కాస్తో కూస్తో పాలనా వ్యవహారాలను అర్థం చేసుకోగలిగింది. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. లోకల్‌గా ‘పెద్దవాళ’్ల మాట విన్నంత వరకూ ఆమెకు ఏ ఇబ్బందీ కలగలేదు. అయితే మమత కుటుంబానికి చెందిన భూమిని తమకు రాసివ్వాలనీ, అదెప్పుడో ఆమె తాత ముత్తాతలు తమకు అమ్మేశారనీ మమతను, ఆమె భర్త శ్రీనివాస్‌నీ బలవంతపెట్టారు ఊరి అగ్రవర్ణ పెద్దలు. చప్పుడు చెయ్యకుండా భూమిని అమ్మేసినట్టు సంతకం పెట్టాలని కూడా నయానా భయానా చెప్పి చూశారు. ‘సర్పంచి ఆడమనిషే కదా, మేం చెపితే వినదా’ అన్నది వాళ్ల ధీమా! గ్రామ బహిష్కారం భార్యాభర్తలిద్దరూ లొంగకపోవడంతో వాళ్ల అహంకారం బుసలు కొట్టింది. ఆడ సర్పంచినే చెప్పుచేతల్లో పెట్టుకోలేకపోతే, రేప్పొద్దున తమ పెద్దరికాన్ని ఎవరు గౌరవిస్తారు? ఊళ్లో పరువు పోదా? ఏదో ఒకటి చేసి వాళ్లని దారికి తేవాలని అనుకున్నారు పెద్దలు. ఆ రాత్రి అంతా కూర్చొని... సర్పంచిని గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. అలా నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు దగ్గరలోని మిండోరా మండలం, బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల మమతను వెలివేశారన్న విషయం చుట్టుపక్కల గ్రామాల్లో గుప్పుమంది. ఒక్కొక్కరూ దూరం అయ్యారు ‘‘ఆ పదకొండెకరాలు మావేనని సంతకం పెట్టండి. అంతవరకు మిమ్మల్ని గ్రామం నుంచి వెలేస్తున్నాం. ఎవ్వరూ మీతోని మాట్లాడరు. మీరు ఎవ్వరిళ్లకెళ్లొద్దు. మా కట్టుబాటు ధిక్కరిస్తే జరిమానా కట్టాల్సిందే’’ అన్న ఆ ఊరి పెద్ద హెచ్చరిక గుర్తొచ్చింది మమతకి. పొలం దున్నాలని ట్రాక్టర్ మాట్లాడితే రాత్రి వస్తానని చెప్పిన వ్యక్తి పొద్దున్నే ఫోన్ చేస్తే ‘‘నువ్విచ్చే దానికన్నా నీకు ట్రాక్టర్ తోలితే మాకయ్యే ఖర్చే ఎక్కువ’’ అన్నప్పుడు కానీ తనకు అర్థం కాలేదు.. అతను జరిమానాకు భయపడుతున్నాడని. మమతని భోజనానికి పిలిచినందుకు ఆ పిలిచిన కుటుంబంపై కూడా జరిమానా విధించారు. ఫిర్యాదు చేసినా.. చర్యల్లేవు! సమానత్వం, రాజ్యాంగం అని పెద్ద పెద్ద మాటలు చెపుతారు. కానీ ఇక్కడేం జరుగుతోంది? భర్తను నెమ్మదిగా పిలిచి చెప్పింది మమత. ‘‘పోలీసు కంప్లైంట్ ఇద్దాం’’ అని. 2018 జనవరి 7వ తేదీన స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేశారు వెలివేత మీద. పాలు కూడా పోయనివ్వడం లేదనీ, పాలుపోసే అతణ్ణి బెదిరించి మాన్పించారని ఫిర్యాదు చేశారు భార్యాభర్తలిద్దరూ. జనవరి 11న ఆర్డీవో, ఏసీపీ సహా వచ్చి గ్రామసభ పెట్టారు. మహిళా సర్పంచ్ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసినట్టు ఒప్పుకున్నారు పెద్దవాళ్లంతా. అది కుల నిర్ణయం అన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇంతవరకు దోషులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఇవ్వరు.. ఇచ్చినా ఉండనివ్వరు! అవమానమిది. స్త్రీల రాజకీయ సాధికారతను గురించి గొప్పలు చెప్పే రాజ్యాధినేతలు సైతం తలలు దించుకోవాల్సిన ఘటన ఇది. ఏం చేస్తున్నారు పాలకులు? గ్రామసభలో అది నిజమని తేలినా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోరు? అంటే నిర్లక్ష్యం. వాళ్లు దళితులన్న నిర్లక్ష్యం. మామూలుగానే మహిళలను రాజకీయాల్లోనికి రానివ్వరు. ఇక దళిత సర్పంచిని వేధించకుండా ఉంటారా? 33 శాతం మహిళా రిజర్వేషన్ అంటారు. కానీ ఇంత వరకు అది చట్టంగా రాలేదు. రిజర్వేషన్లు ఇచ్చిన చోటేమో ఇలా దౌర్జన్యం చేస్తారు. దీనికి ఒకటే పరిష్కారం... దామాషా ప్రాతినిధ్యం. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లనివ్వడం. – కె.లలిత, సమాజిక కార్యకర్త, ‘యుగాంతర్’ సంస్థ డైరెక్టర్ స్త్రీలు రాజ్యాధికారంలో భాగం కాకూడదా? ఇది రాజ్యాంగ విరుద్ధం. భారతీయ సమాజంలో కొనసాగుతోన్న వివిధ వివక్షల్లో మహిళల అణచివేత తీవ్రంగా పరిణమిస్తోంది. పురుషాధిపత్య భావజాలం కారణంగానే ఈ అమానుషాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను కూడా పురుషాధిపత్య పెత్తందారీ సమాజం కాలరాసి, స్త్రీలను అణచివేస్తోంది. – పి. శంకర్, ప్రెసిడెంట్, దళిత బహుజన ఫ్రంట్, తెలంగాణ తక్కువ కులపోల్లని చిన్నచూపే కదా..! ఇప్పటికి నెలదాటింది. ఇంత వరకు దోషులపై చర్య తీసుకోలేదు. ఒక ఆడ మనిషి సర్పంచ్‌గా ఉండబట్టేగదా ఇట్ల జేస్తుండ్రు. అదే మగ సర్పంచ్ అయితే ఇట్ల జేస్తరా? దీనిపైన కంప్లైంట్ ఇస్తే డీఎస్పీ గూడ వచ్చి వెలివేసింది నిజమేనని జెప్పిండ్రు. ఎఫ్ఐఆర్ గూడ అయ్యింది. అయిన గూడ వాళ్లపైన ఏమీ చర్యలు దీసుకోలే. దీనికెవ్వరు సమాధానం జెప్తరు? ఇదంతా ఒక ఆడామె ఏం జెయ్యలేదనేగదా? లేకుంటే తక్కువకులపోల్లని చిన్నచూపేగదా? – మమత, బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ -
సౌందర్యం సంస్కారం
ఛిల్లర్ పేరుని చిల్లరగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ గారిది. ఈ చమత్కారానికి తెలుగులో ఒక పేరుంది– అభిరుచి దారిద్య్రం. ఛిల్లర్ సమాధానానికి కాకపోతే ఈ కాలమ్‌లో ఆమెకి ప్రవేశం లభించేది కాదు. ‘మీరు జీవితంలో సాధించి నదేమిటి?’ అని కొందరు నన్ను అడుగుతూ ఉంటారు. ‘రచన ద్వారా నా గొంతు పదిమందికి వినిపిం చడం’అంటాను. ఒక జీవితకాలం కృషికి, పడిన శ్రమకి ఇది చాలా గొప్ప బహుమతి. ‘నన్ను కొడితే వెయ్యిమందిని కొట్టినట్టు’ అనేవారు అల్లు రామలింగయ్య. అది ఆయన సంపాదించుకున్న పరపతి. నేను చెప్తే వెయ్యి మంది వింటారు. కొన్ని వందలమంది స్పందిస్తారు. అది అక్షరం ఇచ్చిన శక్తి. మరి మేరీ కోం మాట్లాడితే? సచిన్ తెందూల్కర్ మాట్లాడితే? నరేంద్ర మోదీ మాట్లాడితే? డొనాల్డ్ ట్రంప్ మాట్లాడితే? మొన్న చైనాలో సాన్యా పట్టణంలో జరిగిన ప్రపంచ సుందరి పోటీలలో– 118 దేశాలు పాల్గొన్న పోటీలో 17 సంవత్సరాల తర్వాత భారతదేశపు అమ్మాయి మానుషీ ఛిల్లర్ కిరీటాన్ని గెలుచుకుంది. ఇంతకు ముందు ప్రియాంకా చోప్రా, యుక్తా ముఖీ, డయానా హేడెన్, ఐశ్వర్యారాయ్, రీటా ఫారియాలకు ఈ కిరీటం దక్కింది. ఈ అందాల పోటీలకు కొందరు మహిళలే అడ్డం పడుతున్నారు. అంగ సౌష్టవాన్ని బజారున పెట్టి ‘నా గొప్పతనం చూడండి’ అని బోర విరుచుకోవడం భారతీయ సంస్కారం కాదని వీరి వాదన. చాలామట్టుకు వాళ్లు రైటే కాని దీనిలో చిన్న పాఠాంతరం ఉంది. ఇది కేవలం శరీరాన్ని విరుచుకుని విరగబడే పోటీ మాత్రమే కాదు. ఒక దేశపు సౌందర్యరాశి– ఆ దేశపు సంస్కారానికి ఎంతగా అద్దం పడుతున్నది? అన్నది ఈ పోటీలో మరొక ముఖ్యమైన ఘట్టం. ఈ సౌందర్యరాశి వర్చస్సులో చాలామందిని జయించాక–మానసిక సౌందర్యానికి కూడా పరీక్ష పెడతారు. ‘ప్రపంచంలోకెల్లా ఏది ఎక్కువ జీతాన్ని పొందగలిగే వృత్తి, ఎందుకు?’ ఇదీ పరీక్షకులు అడిగిన ప్రశ్న. అనుమానం లేదు. లౌకిక జీవనంలో తలమునకలయిన పాశ్చాత్యుల ఆలోచనా సరళికి ఈ ప్రశ్న అద్దం పడుతుంది. దీనికి మానుషీ ఛిల్లర్ సమాధానాన్ని మరో స్థాయికి తీసుకుపోయి నిలిపింది. ‘గొప్ప గౌరవం దక్కాల్సిన వ్యక్తి అమ్మ. అది కేవలం ఉద్యోగం కాదు– ప్రేమా, గౌరవాలతో, ఆత్మీయతతో ఆ స్థానాన్ని గుర్తించాలి’ అంది. ఇది భారతీయ స్త్రీత్వానికి పట్టాభిషేకం. ఛిల్లర్ సౌందర్యానికి పోటీలో కిరీటం పెట్టారు. ఆమె మాతృత్వానికి కిరీటం పెట్టింది. ‘ఈ దేశంలో ప్రతీ వ్యక్తికి నా సమాధానంతో బంధుత్వం ఉంటుంది’ అంది ఛిల్లర్ గర్వంగా. అవునమ్మా అవును. అమ్మ వైభవాన్ని విస్మరించిన మూర్ఖుడు ఇంకా ఈ దేశంలో పుట్టి ఉండడు. అమ్మని ఆదిశంకరులు స్తుతిస్తూ, ‘త్వదీయం సౌందర్యం తుహిన గిరి కన్యే తులయితుం కవీంద్రా’ అంటూ, ‘అమ్మా! నువ్వు సౌందర్యానికి ఆవలిగట్టువి’ అంటారు. 1987లో ఇలాంటి పోటీలో పాల్గొన్న జెస్సినా న్యూటన్ (పెరూ) ‘మా దేశంలో మహిళల మీద జరుగుతున్న హింసకు ప్రతిఘటనగా ఈ కిరీటాన్ని ఆయుధంగా చేసుకుని నా గొంతు వినిపించాలని నా ఉద్దేశం’ అంది వేదననీ క్రోధాన్నీ ఉదాసీనతనీ సమీకరిస్తూ. అంతే. కిరీటం ఆమె తల మీద వాలింది. ఏతావాతా, మానుషీ ఛిల్లర్ ‘అందంతో ఆదర్శం’ ప్రాజెక్టుకి కృషి చేస్తూ – హరియాణాలో మెడిసిన్ చదువుకుంటున్న ఈ అమ్మాయి–స్త్రీల రుతుస్రావ సమయంలో ఆరోగ్యం పట్ల అవగాహనను కల్పించడానికి 20 గ్రామాలలో పర్యటించి , 5000 మంది మహిళలకు ఉపకారం చేసింది. 20 ఏళ్ల ఛిల్లర్ చేపట్టని క్రీడ లేదు. సంప్రదాయ నృత్యం నేర్చుకుంది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో తరిఫీదు పొందింది. పారా గ్లైడింగ్, బంగీ జంప్, స్నార్కలింగ్, స్కూబా డైవింగ్ చేస్తుంది. తండ్రి సైంటిస్ట్. తల్లి న్యూరోకెమిస్ట్. ప్రపంచమంతా అబ్బురంగా చూసే స్థానంలో నిలిచి ఆమె గొంతుని వినే ‘శక్తి’ని ఛిల్లర్ సంపాదించుకుంది. ఇవీ ఆమె మాటలు, ‘నువ్వు కలలు కనడం మరిచిపోతే జీవించడాన్ని నష్టపోతావు. నీ కలలకి రెక్కలు తొడిగి, నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకుంటే ఈ జీవితం జీవన యోగ్యం అవుతుంది.’ ఇంతవరకూ ఎన్నో దేశాల అందమయిన శరీరాలు ఈ కిరీటాన్ని వరించాయి. మానసికమయిన ఉదాత్తత, మన దేశపు విలువలను ఎత్తి చూపే సంస్కారానికి ఇప్పుడు కిరీటం దక్కింది. ఛిల్లర్ సమాధానానికి కాకపోతే ఈ కాలమ్‌లో ఆమెకి ప్రవేశం లభించేది కాదు. దీనికి చిన్న గ్రహణం. మన రాజకీయ నాయకులు ఎటువంటి విజయాన్నయినా భ్రష్టు పట్టించగలరు. ఛిల్లర్ విజయాన్ని అభినందించడానికి బదులు కాంగ్రెస్ నాయకులు శశి థరూర్గారు ఛిల్లర్ పేరుని రాజకీయ రొంపిలోకి లాగి ‘బీజేపీ నోట్ల రద్దు ఎంత పెద్ద పొరపాటు! మనదేశపు ‘చిల్లర’కు కూడా మిస్ వరల్డ్ కిరీటం దక్కింది’ అని చమత్కరించారు. ఛిల్లర్ పేరుని చిల్లరగా మార్చిన ఘనత కాంగ్రెస్ నాయకులు శశి థరూర్ గారిది. ఈ చమత్కారానికి తెలుగులో ఒక పేరుంది– అభిరుచి దారిద్య్రం. - గొల్లపూడి మారుతీరావు -
పరువు హత్య కారకుల అరెస్ట్
అమలాపురం సబ్‌జైలుకు తరలింపు రాజోలు : సంచలనం రేకెత్తించిన పరువు హత్యకు కారకులైన ఇద్దరు వ్యక్తలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. కూతురిని ప్రేమిస్తున్నాడనే కక్షతో మలికిపురం మండలం గూడపల్లి గ్రామానికి చెందిన కానుబోయిన రామాంజనేయులు (23)ను గొల్లపాలేనికి చెందిన కందుల విజయ్‌కుమార్, మట్టా నాగబాబు పథకం ప్రకారం హత్య చేశారని రాజోలు సీఐ క్రిస్టోఫర్ తెలిపారు. ఈ కేసు వివరాలను ఆయన ఇలా తెలియజేశారు. విజయ్‌కుమార్ కూతురిని ప్రేమించాలని తరచూ రామాంజనేయులు వేధించేవాడని, పలుసార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో రామాంజనేయులను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడు మట్టా నాగబాబు ద్వారా రామాంజనేయులును గత నెల 2న గొల్లపాలెంలోని బీచ్ వద్దకు పార్టీ పేరుతో అమ్మాయి తండ్రి పిలిపించాడు. బీచ్ వద్ద ముగ్గురు మద్యం సేవించారు. అక్కడ కూతురిని ప్రేమించడం మానుకోవాలని అతడికి చెప్పాడు. నిరాకరించిన అతడిని చెంప మీద కొట్టాడు. కుప్పకూలిన రామాంజనేయులును నైలాన్ తాడుతో మెడకు బిగించి హతమార్చాడు. ఇందుకు విజయ్‌కుమార్ స్నేహితుడు నాగబాబు సహకరించాడు. అతడి మృతదేహాన్ని వారిద్దరూ సముద్రం ఒడ్డున పూడ్చేశారు. కుమారుడు కనిపించకపోవడంతో రామాంజనేయులు తండ్రి నూకాలరావు మలికిపురం పోలీసులు గత నెల 4న ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా నమోదు చేసి మలికిపురం ఎస్సై విజయ్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విజయ్‌కుమార్ గురించి గ్రామంలో ఆరా తీశారు. అతని స్నేహితుడు నాగబాబు కూడా రామాంజనేయులు అదృశ్యం తరువాత నుంచి కనిపించడం లేదని గుర్తించారు. గ్రామస్తులు, బంధువుల సమాచారం మేరకు వారి కోసం పోలీసులు ముంబాయి వెళ్లారు. అయితే వారు కడప జిల్లా జమ్మలమడుగు, రాజంపేట, హైదరాబాద్ ప్రాంతాల్లో తలదాచుకున్నట్టు సీఐ తెలిపారు. విషయం తెలుసుకున్న వారిద్దరూ రాజోలు చేరుకున్నారు. అక్కడి నుంచి గూడపల్లి వెళ్లేందుకు రాజోలు బస్టాండ్ వద్ద ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటారాగేషన్లో హత్య చేసినట్టు అంగీకరించారు. నిందితులను ఇరువురుని రాజోలు కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించడంతో వారిని అమలాపురం సబ్‌జైలుకు తరలించారు. -
ప్రేమ సుమాలపై పరువు ఖడ్గాలు
కులాంతర ప్రేమలు, వివాహాలను సమ్మతించని తల్లిదండ్రులు పరువు హత్యలకు తెగిస్తున్న తండ్రులు ప్రత్యేక చట్టం చేయాలని మహిళా సంఘాల డిమాండ్ ఆలోచనతో ప్రేమించాలంటున్న సామాజిక వేత్తలు అమలాపురం టౌన్ : పరువు కత్తులకు ప్రేమికులు కడతేరిపోతున్నారు. పరువు పడగ నీడలో ప్రేమికుల ప్రాణాలు సమాధి అవుతున్నాయి. కులాంతర ప్రేమ..పెళ్లి అంటే వారి తల్లిదండ్రులు కట్టలు తెగిన కోపంతో తమ పిల్లలను పథకం ప్రకారం హత్యలు చేయిస్తున్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా ప్రేమించే పిల్లలు విజ్ఞతతో తమ భాగస్వామిని ఎంచుకోవడంతో జరుగుతున్న ఒడిదుడుకు నిర్ణయాలను తల్లిదండ్రులు సమ్మితించకలేకపోతున్నారు. అలాగే మేజర్లై తమ జీవిత భాగస్వామిని ప్రేమ పేరుతో ఎంచుకున్నప్పుడు తమ తల్లిదండ్రులకు విశ్వాసం కల్పించే రీతిలో ముందే తమ నిర్ణయాలను చెప్పలేకపోతున్నారు. ఈ రెండు కారణాల మధ్య అవగాహన, సమన్వయం లేకపోవటం వల్లే పరువు హత్యలకు దారితీస్తున్నాయి. ప్రేమించడం పిల్లల హక్కు.. అభ్యంతరం చెప్పటం తల్లిదండ్రుల హక్కు అన్నట్టుగా తయారై పరువు పేరుతో ప్రాణాలను పాతర వేస్తున్నారు. కులాంతర ప్రేమ.. వివాహమైతే కూకటివేళ్లతో కుట్రతో ఆదిలోనే అంతం చేస్తున్నారు. జిల్లాలో తాజాగా మలికిపురం మండలం గొల్లపాలెంలో జరిగిన పరువు హత్య కేసు మరోసారి జిల్లా ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్య కులాంతర ప్రేమికుల్లోకే కాదు..వారి వారి తల్లిదండ్రులను కూడా భయం పుట్టించేదిలా ఉంది. గతంలోనూ జిల్లాలో పలు గ్రామాల్లో పరువు హత్యలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అందులో వేళ్ల మీద లెక్కపెట్ట తగ్గవే వాస్తవం వెలుగు చూసి పోలీసు కేసులయ్యాయి. చాలా పరువు హత్యలు గట్టు చప్పుడు కాకుండా తల్లిదండ్రులు కట్టిన రహస్య సమాధుల్లోనే సమసిపోయాయి. ఎక్కడెక్కడ.. ఎప్పుడప్పుడు జిల్లాలో 2012, 2015 సంవత్సరాల్లో జరిగిన మూడు పరువు హత్యలు కులాంతర ప్రేమలు, పెళ్లిళ్లు ఎంతటి నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నాయో తెలుస్తుంది. కనిపెంచిన పిల్లలను పెళ్లీడు వచ్చేసరికి వారి భావాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా...వారి ఇష్టాఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా కులం, ధనం వత్యాసంతో పరువు కత్తులతో తెగ నరుకుతున్నారు. పరువు ఉరి కంభంపై దారుణంగా ప్రాణాలు తీసి ఉసురు పోసుకుంటున్నారు. 2012లో మలికిపురం మండలం గూడపల్లిలో కులాంతర యువతీ యువకులు ప్రేమించుకున్నారు. తొలుత అమ్మాయిని హత్య చేశారు. కొద్ది రోజుల తర్వాత ప్రేమికుడిని చంపేశారు. ఈ రెండు హత్యలు పథకం ప్రకారం అమ్మాయి తరపు వారే చేసి పరువు ముసుగులో చేశారు. అప్పట్లో సరైన ఫిర్యాదులు, దర్యాప్తులు లేక ఆ రెండు హత్యలు అనుమానాస్పద కేసులుగానే నమోదయ్యాయి. తల్లీ కూతుళ్లను హత మార్చారు అమలాపురం రూరల్ మండలం ఎ.వేమవరంలో తమ ఇంటి ఆడపిల్ల యువకుడిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకుందన్న అక్కసుతో ఓ అన్న తన చెల్లిని, తన తల్లిని ఒకేసారి హత్య చేశాడు. రౌడీల సహకారంతో ఓ రోజు రాత్రి తల్లీ కూతుళ్లను హతమార్చారు. తొలుతు తన చెల్లిని పెళ్లి చేసుకున్న యువకుడి హత్యకు పథకం పన్నారు. అది పారక యువకుడిని తీవ్రంగా మందిలించి బెదిరించారు కూడా. అయినా తన చెల్లి మాట వినకుండా తన భర్తతోనే వెళతానని తెగేసి చెప్పింది. తల్లి కూడా తన కూతురుకు మద్దతు పలికింది. ఇది కొడుకు సహించలేకపోయాడు. దీంతో చెల్లి, తల్లిని ఒకేసారి మట్టు పెట్టేందుకు పథకం పన్ని పరువు కోసం ఇద్దరీ ప్రాణాలు తీశాడు. ఎవరిది లోపం... ఎవరిది పాపం పరువు హత్యలను మూడు ప్రధాన కారణాలు ప్రేరేపిస్తాయి. తన కూతురు వేరే కులం యువకుడిని లేదా తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమించిదన్న అక్కసు మొదటి కారణమైతే...తన కూతురు ఒకే కులం వాడిని ప్రేమించినప్పుడు ఆ కుర్రాడు పేద కుటుంబానికి చెందిన వాడు... లేదా తన కుటుంబస్థాయికి సరిపోని వాడని పరువు హత్యకు పాల్పడడ రెండో కారణం. చివరి కారణం తమ ఇంటి ఆడపిల్ల పెళ్లిపై తల్లిదండ్రులు తమ తాహతుకు తగ్గట్టుగా గొప్ప సంబంధంతో పెళ్లి చేయాలనుకుంటారు. కూతురు తమ మాటను కాదని తనకు తాను సొంత నిర్ణయంతో పెళ్లి చేసుకుంటుందన్న తప్పుడు ప్రతిష్టకు (పాల్ ప్రెస్టేజ్) పోయి పరువు హత్యకు పాల్పడుతున్నారు. ఇందులో ఎవరిది లోపం.. ఎవరిది పాపం అంటే కూతురు కులాంతర ప్రేమ, పెళ్లి వైపు అడుగులు వేస్తున్నప్పుడు తల్లిదండ్రులు గమనించరు. విషయం తెలిశాక పరువు అని పాకులాడతారు. ఆడ పిల్లలు కూడా తమ జీవిత భాగస్వామిని ప్రేమతో ఎంచుకునేటప్పుడు ఎక్కువగా ఆకర్షణకే ప్రాధాన్యమిస్తున్నారు. ఆలోచనతో అతడికి ఆస్తులు ఎంత... జీవితంలో స్థిరపడే తెలివి తేటలు ఉన్నాయా...? వంటి అంశాలపై ఆలోచించరు. కేవలం ప్రేమకు పెద్ద పీట వేసి తల్లిదండ్రులను ధిక్కరిస్తారు. ఈ లోపంలో చాలా వరకూ ఆడిపిల్లల పాత్ర ఎక్కువగా ఉంటే...హత్యలు చేసే పాపంలో మాత్రం తల్లిదండ్రులదే పూర్తి పాత్ర ఉంటుంది. పరువు హత్యలకు ఏ ఏ చట్టాలు వాస్తవానికి పరవు హత్య జరిగినప్పుడు కేవలం పరువు అనే కోణంలో ప్రత్యేక చట్టం, సెక్షన్ లేదు. పరువు హత్య జరిగినప్పుడు నిందితులపై ప్రధానంగా హత్య కేసు (సెక్షన్–302) నమోదు చేస్తారు. కిడ్నాప్ చేసి ఆధారాలు, మృత దేహాన్ని దాచేందుకు ప్రయత్నిస్తే సెక్షన్ 363 (కిడ్నాపు), సెక్షన్ 201 (ఆధారాలు లేకుండా చేయడం) వంటి కేసులు నమోదు చేస్తారు. అదృశ్యం కేసుల్లోంచే పరువు హత్యలు సాధారణంగా యువతీ యువకులు ప్రేమించుకుని తల్లిదండ్రుల అభ్యంతరాల నుంచి తప్పించుకునేందుకు దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సమయాల్లోనే తల్లిదండ్రుల నుంచి ఆయా పోలీసు స్టేషన్లలో తమ కూతురు లేదా తమ కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదులు చేస్తారు. అవే మిసింగ్ కేసులుగా నమోదు అవుతున్నాయి. ఇలా అదృశ్యం ముసుగులోనే పరువు హత్యలకు పథకాలు పన్నుతారు. జిల్లాలో రోజుకు నెలకు 40 నుంచి 60 అదృశ్యం కేసులు నమోదు అవుతున్నాయి. ఈ కేసులను పోలీసులు అత్యంత పకడ్భందీగా దర్యాప్తు చేసినప్పుడు పరువు హత్యలకు కొంత వరకూ అదుపు చేయవచ్చు. ఇలాంటి కేసులు నమోదైనప్పుడు పోలీసులు ప్రేమికుల రెండు కుటుంబాల స్థితిగతులు, కులాలు, ఆర్థిక అంశాలు పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంది. పరువు హత్యలకు ప్రత్యేక చట్టం తేవాలి పరువు హత్యలు జరిగినప్పుడు హత్య కేసు నమోదు చేయటం కాదు. పరువు హత్యలకు ప్రత్యేక చట్టం తేవాలి. ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకుంటే ప్రోత్సాహక నగదు బహుమతులు ఇవ్వటం కాదు. అలా కులాంతర వివాహాలు చేసుకుంటే జరుగుతున్న పరువు హత్యలను ప్రత్యేక చట్టం చేసి నియంత్రించాలి. అందుకే తమ ఐద్వా పరువు హత్యలకు ప్రత్యేక చట్టం చేయాలని ఉద్యమాలు చేస్తోంది. ఇటీవల అమలాపురంలో జరిగిన ఐద్వా రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో పరువు హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టానికి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాం. –సీహెచ్ రమణి, ఐద్వా, జిల్లా కార్యదర్శి మేజర్ల అభిప్రాయాలకు తల్లిదండ్రులు విలువ ఇవ్వాలి మేజర్లు అయిన తమ పిల్లలు ప్రేమలు, పెళ్లిళ్లు అంటూ కులాంతర వివాహాలు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు విలువ ఇవ్వాలి. పిల్లలు కూడా తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల మనోభావాలకు ఎంతో గౌరవం ఇవ్వాలి. కేవలం ఆకర్షణతో కాకుండా విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి. తమ కూతురు లేదా కొడుకు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ పెళ్లి చేసుకుంటే పెద్దలు, పోలీసులు, కోర్టులు ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని పరువు హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు, శిక్షలు తప్పవు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రేమల్లో పడుతున్నప్పుడు ఆదిలోనే గమినించి వారికి కౌన్సెలింగ్ ఇప్పించడం మంచిది. కళాశాలల్లో కూడా ఈ విషయాలపై ప్రత్యేక కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. – లంక అంకయ్య, డీఎస్పీ , అమలాపురం -
సింకులోని కప్పు... వైరులో కరెంటు...
సమ్సారం సంసారంలో సినిమా ‘‘నా పరువు తియ్యకురా మగడా’’ రహస్యంగా పళ్లుకొరుకుతూ అంది మా ఆవిడ. తన పరుపు పోయే పని నేనేం చేశానో అర్థం కాలేదు.ఈ ఒక్క సందర్భంలోనే కాదు... చాలా సార్లు ఆ మాట అర్థం కాలేదు. ఆ కోపమెందుకో అర్థం కాలేదు. ఆ కోపానికి మూలమేమిటో తెలియదు.అర్థం కాకపోవడం ఏముంది. అర్థం కాకపోవడం అనే ఫ్యాక్టూ, ఫ్యాక్టరూ కాపురంలో ఎప్పుడూ నిత్య నూతనమే. ఎప్పుడూ అర్థం కాదు. ఏదీ అర్థం కాదు. బహుశా అర్థం అయినరోజు కాపురం ఉండదు. నాకు చిన్న పని కూడా చేతకాదట. పెళ్లయిన తర్వాత నా మీద వచ్చిన మొదటి అభియోగం ఇది. ఎప్పటికప్పుడు ఈ ఫిర్యాదు రెన్యువల్ అవుతూ ఉంటుంది.‘‘నువ్వు ఎప్పుడూ ఏ పనీ సక్రమంగా చెయ్యలేవు. నీ ప్రతీ పనితో ఆ విషయం తెలిసిపోతుంటుంది’’ అంది మా ఆవిడ.నేను షాక్ తిన్నాను. షాక్ తినడం ఇది మొదటిసారి కాదు. షాకులూ, కేకులు, టేకులూ తినడానికే ఉన్నాయి. సినిమా యాక్టర్లు టేకులూ, బర్త్‌డే రోజున కేకులూ తింటారేమోగానీ... పెళ్లయిన ప్రతివాడూ షాకులే తింటాడు. విషయం ఏమిటంటే... కాస్తంత ప్రాక్టీస్ చేస్తే టేకు తినరేమో. కేకు వద్దనుకుంటే పారేయవచ్చేమో. కానీ షాక్ తినడం మాత్రం తప్పదు. ‘‘కాపురం అంటే ఏమిట్రా?’’ అని పెళ్లికాకముందు ఒక ఫ్రెండ్‌ను అడిగా.‘‘ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎప్పుడో కరెంట్ లేని రోజుల్లో అన్నమాట అది. ఇవి మోడ్రన్ రోజులు కాబట్టి ఇంటి బల్బు ఇల్లాలు అనుకుందాం’’ అన్నాడు వాడు.‘‘ఒరేయ్ బల్బులో కాంతి తక్కువ కదా. కాబట్టి ట్యూబ్‌లైట్ అందామా?’’ వాణ్ణి సవరించబోయా.‘‘నో... నో... ట్యూబ్‌లైట్ అనే ఆ మాట ఎప్పుడో భర్తకు ఫిక్సయ్యింది’’ జవాబిచ్చాడు.‘‘సరే’’ అన్నా. ‘‘ఓకే... ఇంటికి బల్బ్ ఇల్లాలు అనుకున్నాం కదా. మరి కరెంటే కాపురం. అంటే బల్బు కనిపిస్తుంది. అది భార్య. వైరు మీద ఉన్న ఇన్సులేషన్ కనిపిస్తుంది. పైగా అది లోపల ఉన్న వైరుకు రక్షణ ఇస్తుంది. కాబట్టి కనిపించేదీ, రక్షణ ఇచ్చేది ఇన్సులేషనే కాబట్టి అది భర్త. ఇక మనకు కాపురం కనిపించదు. కాబట్టి వైరులోని ఎలక్ట్రిసిటీయే కాపురం. ఇలా భార్య, భర్త కనిపిస్తారు. కానీ కాపురం కనిపించదు కదా. పైగా కాపురం కాపురం అంటారు. అదేమిటో ఎవ్వరికీ కనిపించదు అచ్చం ఎలక్ట్రిసిటీ లాగే. అందుకే కరెంటున్న కాపర్ వైరే... కాపురం. ఆ కరెంటులోంచి కొట్టే షాకులే దాంపత్యం. బహుశా... కాపర్ నుంచి కాపురం అనే మాట వచ్చిందేమో’’ అన్నాడు వాడు. ఇప్పుడు నాకు ఆ కరెంట్ సంగతీ... నాకు పని చేతకాని సంగతీ ఒకేసారి ఎందుకు గుర్తొచ్చాయంటారా? చెబుతా... చెబుతా...కాసేపటి క్రితం మా ఇంటికి అప్పుడెప్పుడో డిగ్రీ చేస్తున్నప్పటి ఫ్రెండ్స్ వచ్చారు. అందరమూ సదరాగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. మా ఆవిడ అందరికీ కాఫీ తెచ్చింది. బాగుంది. హాయిగా తాగాం. కాఫీ కాగానే ఎప్పటిలాగే నేను గ్లాసు తీసుకెళ్లి సింక్ దగ్గర పెట్టి వచ్చా. అయితే ఆ టైమ్‌లో కరెంట్ పోయి ఉంది. నేను సింక్ దగ్గర్నుంచి వెనక్కు వస్తున్నప్పుడు కిచెన్ డోర్ వద్ద మిగతా గ్లాసులు తెస్తూ, బయట ఉన్న నా ఫ్రెండ్స్‌కు వినపడనంత రహస్యంగా అరిచిన అరుపే... ‘‘నా పరువు తియ్యకురా మగాడా’’ అన్న మాట. ఆ మాట ఎందుకన్నదో నాకు అర్థం కాలేదు. బహుశా నా గ్లాసు లోపల పెడుతున్నప్పుడు కరెంట్ పోయి ఉంది కదా. అందుకే గ్లాసు పెట్టే సమయంలో కిచెన్‌లో నాకు తెలియకుండా నేనింకైదేనా పగలగొట్టడం వంటిదేమైనా చేశానా? ఏమో అదీ తెలియదు. అయినా... ఆమె ఇంకా కిచెన్ డోర్ దగ్గరే ఉంది కదా. పైగా నేనే పనీ చేయనన్న మాట పట్టుకొని నాకు ఇచ్చిన శిక్షణను కూడా విజయవంతంగా నిర్వహించాను కదా. శిక్షణ ఏమిటని మళ్లీ అడగకండి. ఏ పనీ చేయనని కదా... నా మీద ఉన్న కంప్లయింట్. ఒకవేళ చేసినా చక్కగా చేయననే కదా. ఈ కంప్లెంట్ ఎన్నిసార్లు నమోదయ్యిందో లెక్కేస్తే అది తప్పక గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కి ఉండే ఫ్యాక్టే. ఆమె చేసే ఈ మల్టిపుల్ కామెంట్తోనైనా నేను బోల్డన్ని సార్లు పనిచేస్తున్నాననే విషయం తేటతెల్లం కావడం లేదా అన్నది నా సందేహం.గతంలో నేను ఇక్కడి వస్తువు అక్కడ పెట్టేవాణ్ణి కాదు(ట). అలా మాటిమాటికీ దెప్పి దెప్పీ నేను తాగిన గ్లాసును చక్కగా తీసుకెళ్లి సింకు దగ్గరపెట్టడం అలవాటు చేసింది.గుమ్మంలో పేపర్ వేసీ వెయ్యగానే దాన్ని పట్టుకొచ్చి ఇచ్చేలా మా టైగర్కూ, కాఫీ గ్లాసు సింకు దగ్గర పెట్టేలా నాకూ ఒకేసారి శిక్షణ మొదలైంది. మా వేర్వేరు శిక్షణా కార్యక్రమాల్లో మా టైగర్ కంటే నేనే కాస్త ఆలస్యంగా పాసై ఉండవచ్చు గాక. కానీ... పేపర్ తేవడాన్ని మా టైగర్ ఎప్పుడైనా మరచిపోయిందేమో గానీ, నేను మాత్రం కాఫీ గ్లాసును సింకు దగ్గర పెట్టడం అనే నా విద్యుక్తధర్మాన్ని ఎప్పుడూ మరచిపోలేదు. అంతెందుకు... ఇప్పుడు కూడా. అందుకే నాకు ఒళ్లు మండింది. ‘‘ఇప్పుడు నేనేం చేశాను? అదీ నీ పరువు తీసే పని?’’ అంటూ నిలదీశాను. ‘‘ఇంకేం చెయ్యాలి. అందరూ తాగుతుండగానే ఇప్పుడేం తొందర వచ్చిందని గ్లాసును సింకు దగ్గరికి తీసుకొచ్చావ్? ఇలా తీసుకొచ్చి నా పరువంతా సింకులో ముంచేశావు’’ అని అంది. ‘‘ఓహో... నా గ్లాసొక్కటే తీసుకెళ్లకుండా... నలుగురి గ్లాసులూ తీసుకెళ్లాల్సిందంటావా’’ అన్నా... అప్పటికీ అర్థం గాక.‘‘ఒరేయ్ నా మొగుడా... నా – ప –రు – వు – తి – య్య – కు. ఇంట్లో గెస్టులున్నారు. ఘోస్టులా బిహేవ్ చెయ్యకు. నా పరువు మళ్లీ మారోసారి తియ్యకు’’ అంటూ వార్నింగ్ ఇస్తూ... పటపటలాడుతుండగా మళ్లీ పళ్లు కొరుకుతూ ఒక్కొక్క మాటనూ ఒత్తి పలుకుతూ అంది మా ఆవిడ. ఈ సంఘటన జరిగిన చాలా రోజుల వరకూ మా ఇంట్లో కరెంట్ ఉన్నా లేనట్టే. ట్రాన్స్ఫారం పేలిపోయిన తర్వాత బల్బులు ఆరిపోయిన వీధిలా ఉంది చాలా రోజులుగా మా కాపురం.ఎట్టకేలకు బతిమిలాడగా... ఆడగా నాల్రోజుల తర్వాత తొలిసారిగా చిన్న జీరో బల్బు వెలిగినట్టుగా మాట్లాడింది మా ఆవిడ.‘‘గెస్టులు వచ్చినప్పుడు నీ గ్లాసు నువ్వే తీసుకెళ్లి సింకుదగ్గర పెట్టడం అంటే... నేనేదో నిన్ను రాచిరంపాన పెట్టి... నీతోనే గ్లాసులు, కంచాలు తీయిస్తున్నట్లు చెప్పడమే కదా... అందుకే ఎవరైనా వచ్చినప్పుడు నీ గ్లాసు కూడా నేనే తీస్తా. నువ్వు తియ్యకు’’ అంది.నలుగురు ఉన్నప్పుడు నా గ్లాసును ఆమెను తియ్యమంటే పరువు తక్కువ గానీ... అలా నలుగురు ఉన్నప్పుడు నా గ్లాసు ఆమె తియ్యడం అన్నది ఆమె పరువు ఎలా పెంచుతుందో అర్థం కాలేదు. నాకు అర్థం కాకపోయినా పర్లేదు. ఎలాగూ నాకేమీ అర్థం కాదనే స్టేట్మెంట్ నాకు కొత్త కాదు. కాబట్టి నాకొచ్చే నష్టమేమీ లేదు. నాక్కావల్సిందల్లా మా ఆవిడ మళ్లీ ఎప్పటిలాగే బల్బులా వెలగడం. అందుకే ఆ జీరో బల్బును సీఎఫ్ఎల్ బల్బులా వెలిగించుకునే ప్రయత్నంలో భాగంగా ‘‘తియ్యను... తియ్యను. ఈసారి గెస్టులొచ్చినప్పుడు నా గ్లాసూ తియ్యను. నీ పరువూ తియ్యను. అప్పుడు మాత్రం ఓ మంచి ఇల్లాల్లా నా గ్లాసూ నువ్వే తీద్దువుగానీలే’’ అంటూ ఆమెను ఓదార్చాను. అవును... నేనెప్పుడూ ఏ పని చెయ్యను. చెయ్యలేను. చేసినా సరిగా చెయ్యలేను. మా ఆవిడ ప్రవచించినట్టు... కాపురం అంటే ఎప్పుడూ తప్పులో కాలేయడమేనా... సారీ కప్పులో కాలేయడమేనా? కంటిలోని నలుసూ... ఇంటిలోని నలుసు అన్నది వేమన చెప్పిన మాట. మరి చెప్పని మాటేంటో చెప్పనా? ‘సింకులోని కప్పు... వైరులో కరెంటు’! సినిమాలో సంసారం అయితే... ఓకే! పొట్టిరాజు(కొండవలస లక్ష్మణరావు) భార్య సరోజినిది గొట్టాల వ్యాపారం. భర్త ఏ పనీ లేకుండా స్నేహితుల సత్యానందం(జీవా), చిట్టిబాబు (కృష్ణ భగవాన్)తో కాలక్షేపం చేస్తుంటాడు. సత్యానందం ఒకే రూమ్‌ను పగలు అనిల్‌కుమార్(రవితేజ)కి, రాత్రి స్వాతి(కల్యాణి)లకు అద్దెకిచ్చి మేనేజ్ చేస్తుంటాడు. ఓ రోజు స్వాతి త్వరగా వస్తుంది. రూంలో ఉన్న అనిల్‌ని గోనె సంచిలో కట్టి పనసకాయలని కల్యాణికి చెబుతారు. అంతటితో ఆగక ‘ఒరేయ్ పొట్టిరాజూ! రూపాయి కూడా సంపాదించవని నీ వైఫ్ తిడుతుంటది కదా. నాలుగొందలు పెట్టి ఎనిమిది పనసకాయలు తెప్పించాను. డిమాండ్ బాగా పెరిగిపోయింది. కాయ వంద అన్నా కొనేస్తారు. వీటిని కొనుక్కుని తిరిగి అమ్ముకున్నావనుకో... అరగంటలో నాలుగొందలు లాభం. ఈ లాభం తీసుకెళ్లి మీ వైఫ్‌కి చూపించావనుకో చాలా సంతోష పడుతుంది. నీ విలువ పెరిగిపోతుంది’ అంటారు. హుషారుగా భార్య దగ్గరకెళ్లి... ‘ఎందుకూ పనికిరాని ఎదవనీ, సంపాదించడం చేతకాని చవటనీ తిట్టి పోస్తుంటావ్ కదే.. నాలుగొందలు ఇవ్వు. అరగంటలో ఎనిమిది వందలు చేస్తా’ అంటాడు పొట్టిరాజు. భార్య వద్ద నాలుగొందలు తీసుకుని చిట్టిబాబుకిస్తాడు పొట్టిరాజు. ఆ టైంలో పక్కకి పొర్లుకుంటూ వెళ్లి సంచిలోంచి బయటికొచ్చేస్తాడు రవితేజ. విషయం తెలియని పొట్టిరాజు... పనసకాయలు ఏవీ... ఎక్కడ అని అరుస్తుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సరోజినిని చూడగానే ‘అంతా మోసం. దగా. ఇందులో కాయలు లేవు’ అని ఏడుస్తాడు పొట్టిరాజు. కోపంతో సరోజిని తన్నడానికి కాలు ఎత్తగానే ‘నేనొప్పుకోను’ అంటాడు. భార్య తన్నగానే బురదనీళ్లలో పడి ‘అయితే ఓకే’ అంటాడు కొండవలస ‘అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాలో. ప్రతి సంసారంలోనూ కొన్ని ఇబ్బందులుంటాయి. అప్పటికవి పెద్దవే. ఎలాగోలా గట్టెక్కుతాం. వాటివల్లనే సంసారం బలపడుతుంది. ఆ అనుభవంతో చిన్న, పెద్ద ఇబ్బందులను దాటుకుని హాయిగా జీవించడం నేర్చుకుంటాం. కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అదసలు సంకటమే కాదనిపిస్తుంది, పొట్ట చెక్కలయ్యేలా నవ్వొస్తుంది కూడా. అలాంటి సరదా సంఘటనలను అక్షరాలతో కళ్లకు కట్టండి. సాక్షి పాఠకులతో పంచుకోండి. ఈ మెయిల్: samsaaram2017@gmail.com – ఆర్ -
పరువు కోసం.. కన్నబిడ్డను కడతేర్చాడు
-
పరువు కోసం.. కన్నబిడ్డను కడతేర్చాడు
►నిజామాబాద్ జిల్లా అమ్రాద్‌లో ఘోరం ►దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి ►చదువయ్యాక మళ్లీ పెళ్లి చేస్తామని సర్దిచెప్పిన తండ్రి ►మేనత్త ఇంటికి బిడ్డను పంపిన వైనం ►భర్తే కావాలనడంతో కూతుర్ని చంపేందుకు కుట్ర ►ఇంటికి తీసుకొస్తూ దారి మధ్యలో చున్నీతో ఉరి బిగించి హత్య ►ఆపై స్నేహితులతో కలసి పెట్రోలు పోసి తగలబెట్టిన తండ్రి డిచ్పల్లి చిట్టితల్లీ... అంటూ చిన్ననాట చేయి పట్టి నడిపించిన చేతులే ఉరి బిగించాయి..! బంగారు తల్లీ.. అంటూ మురిపెంగా గుండెలకు హత్తుకున్న కన్నతండ్రే కాలయముడయ్యాడు. పరువు ముందు ఓడిపోయిన తండ్రి ప్రేమ.. కూతురినే బలితీసుకుంది. దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందన్న కోపంతో పక్కాగా ప్లాన్ చేసి మరీ బిడ్డను చంపేశాడు ఓ తండ్రి! ఇంటికి వెళ్దామని కూతుర్ని తీసుకెళ్లి దారిమధ్యలోనే స్నేహితులతో కలిసి దారుణంగా హతమార్చాడు. ఉరి బిగించి చంపేసి, పెట్రోలు పోసి కాల్చేశాడు. తర్వాత ఏమి తెలియనట్టు ఇంటికి వెళ్లి స్నానం చేశాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు. అతడితోపాటు హత్యలో పాలుపంచుకున్నవారంతా ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాద్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం డిచ్పల్లి సర్కిల్ కార్యాలయంలో నిజామాబాద్ ఏసీపీ ఆనంద్‌కుమార్ ఘటన వివరాలను వెల్లడించారు. రెండేళ్లుగా ప్రేమ.. రహస్యంగా పెళ్లి.. అమ్రాద్‌కు చెందిన కారెడ్డి రాజన్నకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురుకు పెళ్లయింది. రెండో కూతురు రోజా(20) జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెకండియర్ చదువుతోంది. సుమారు రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన సాయికుమార్ అనే యువకుడు, రోజా ప్రేమించుకుంటున్నారు. గతంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలియడంతో రోజా కుటుంబీకులు... సాయికుమార్‌ను పట్టుకుని కొట్టారు. మళ్లీ రోజాను కలవకూడదని హెచ్చరించారు. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఇద్దరు ప్రేమలో మునిగిపోయారు. 2016 డిసెంబర్ 23న రోజా, సాయికుమార్ భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వారం రోజుల తర్వాత వారిని వెదికి పట్టుకున్న రోజా కుటుంబీకులు ఇద్దరినీ అమ్రాద్‌కు తీసుకువచ్చారు. రోజా చదువు ముగిసే వరకు కలుసుకోవద్దని, ఆ తర్వాత అందరి ఎదుట పెళ్లి చేస్తామని ఇద్దరికీ నచ్చచెప్పారు. అనంతరం రోజాను ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో ఉంటున్న మేనత్త (రాజన్న సోదరి) వద్దకు పంపించారు. అక్కడికి వెళ్లిన వారం తర్వాత.. తనను సాయికుమార్ వద్దకు పంపించాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని రోజా బెదిరించింది. దీంతో మేనత్త ఈ విషయాన్ని రాజన్నకు చెప్పి, రోజాను తీసుకెళ్లాలని కోరింది. రోజా దళితుడిని పెళ్లి చేసుకుని గ్రామంలో తలెత్తుకుని తిరగకుండా చేసిందని, పెళ్లీడుకొచ్చిన చిన్న కూతురుకు పెళ్లి కాదేమోనని రాజన్న మనస్తాపానికి గురయ్యాడు. ఎంత నచ్చ చెప్పినా.. వినకపోవడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో ఆటో నిలిపి.. కూతురును హతమార్చాలని నిర్ణయించుకున్న రాజన్న ఇందుకు గ్రామ సర్పంచ్ కీకాయి జలందర్, ఆర్మూర్ ఒడ్డెన్న, మరో నలుగురు స్నేహితుల సాయం కోరాడు. వారు కూడా అంగీకరించారు. కిందటినెల 24న రాత్రి తన స్నేహితుడు పాల్ద గంగాధర్ ట్రాలీ ఆటోలో జానకంపేట్‌కు వెళ్లిన రాజన్న.. కూతురు రోజాను తీసుకుని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో సారంగపూర్ వద్ద పది లీటర్ల పెట్రోలు కొనుగోలు చేశారు. అక్కడ్నుంచి జక్రాన్‌పల్లి మండలం పడకల్ శివారులోని గొల్లగుట్టకు చేరుకున్నారు. ట్రాలీ ఆటోలో ముగ్గురు, వెనకాల రెండు బైక్‌లపై నలుగురు మొత్తం ఏడుగురు గొల్లగుట్టకు వచ్చారు. అటవీ ప్రాంతంలో ఆటోను నిలిపి రోజాను కిందకు దించారు. ఆమె ఒంటిపై ఐదు లీటర్ల పెట్రోలు పోశారు. ఈ సమయంలో రాజన్న.. సాయికుమార్‌ను మర్చిపోవాలని లేదంటే చంపేస్తామంటూ కూతురిని బెదిరించాడు. అయితే తాను అతడిని పెళ్లి చేసుకున్నానని, అతడితోనే ఉంటానని ఆమె స్పష్టం చేసింది. అంతేగాకుండా తనకు సాగుభూమి, నివాస గృహంలో వాటా ఉంటుందని చెప్పింది. దీంతో రాజన్న పూర్తిగా విచక్షణ కోల్పోయాడు. ఒడ్డెన్నతో కలిసి చున్నీని రోజా మెడకు చుట్టి చెరోవైపు గట్టిగా లాగి హత్య చేశారు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తీసివేసి మిగిలిన పెట్రోలు పోసి తగులబెట్టారు. ఆమె దుస్తులు, పెట్రోలు కొనుగోలు చేసిన క్యాన్‌ను మునిపల్లి శివారులో పడేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరింటికి వాళ్లు చేరుకుని స్నానాలు చేశారు. ఈ సమయంలో ఎందుకు స్నానం చేస్తున్నావని రోజా తల్లి అడగ్గా.. పొద్దంతా తిరగడంతో దుమ్ము పట్టి స్నానం చేస్తున్నానని సమాధానం చెప్పాడు. నిందితులు దొరికారిలా... జనవరి 27న స్థానికులు ఇచ్చిన సమాచారంతో రోజా మృతదేహం వద్దకు జక్రాన్‌పల్లి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యాస్థలంలో ఆధారాలు లభించక పోవడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. వారమైనా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో పోలీసులు దర్యాప్తును మరో కోణంలో ప్రారంభించారు. కుటుంబ సభ్యులే హత్యకు పాల్పడితే మిస్సింగ్ కేసు నమోదు కాదని భావించి.. సమీప గ్రామాల్లో ఎవరైనా యువతి అదృశ్యానికి గురైందా అని రహస్యంగా విచారణ చేపట్టారు. అమ్రాద్‌లో రోజా కొద్దిరోజుల నుంచి కన్పించడం లేదని తెలిసింది. దీంతో సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత గ్రామంలో రహస్యంగా విచారణ చేపట్టారు. రోజాను తండ్రే హత్య చేసి ఉంటాడని కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. రాజన్నను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో పరువు కోసం తానే కూతురిని హత్య చేసినట్లు రాజన్న అంగీకరించాడు. హత్యలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రోజా దుస్తులు, నిందితులు ఉపయోగించిన ట్రాలీ ఆటో, రెండు బైక్‌లు, ఏడు సెల్పోన్లు, సిగార్ లైటర్, పెట్రోల్ క్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన పోలీసులను ఏసీపీ ఆనంద్‌కుమార్ ప్రశంసించారు. సీఐ, ఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లకు రివార్డులు అందజేయాలని సిఫార్సు చేస్తామన్నారు. -
ప్రాణాన్ని బలి తీసుకున్న ‘పరువు’
తండా పరువు తీస్తున్నావని పంచాయతీ పెట్టిన పెద్దలు అవమానంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఒంటరిగా కన్పించినందుకు పంచాయతీ పెట్టారు. తండావాసులందరి సమక్షంలో ఆమెను నిలదీశారు. తండా పరువు తీస్తున్నావని ఆమెను మందలించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. పరువు కోసం పెట్టిన పంచాయతీ నిండు ప్రాణాన్ని బలిగొంది. పెంబి(ఖానాపూర్) : పెంబి మండలం ఇటిక్యాల పంచాయతీ పరిధిలోని కిష్టునాయక్‌తండాకు చెందిన డిగ్రీవిద్యార్థిని ఉమారాణి(20) మనస్థాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కిష్టునాయక్ తండాకు చెందిన దశరత్, లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కుతురు ఉమారాణి(20) ఈ నెల 1న గ్రామశివారు ప్రాంతంలో పలువురు గ్రామస్తులకు ఒంటరిగా కనిపించింది. ఈ విషయమై తండా పరువు తీస్తున్నావంటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ఈ నెల 2న గ్రామంలో పంచాయతీ పెట్టి అందరి సమక్షంలో ఆమెను నిలదీశారు. దీంతో అవమానానికి గురైన యువతి మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు వెంటనే పెంబిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో యువతి మార్గమధ్యలోనే మృతి చెందింది. విద్యార్థి తండ్రి దశరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెంబి ఎస్ఐ కాశవేని సంజీవ్‌కుమార్ తెలిపారు. కాగా పంచాయతీ పెట్టి యువతి మృతికి కారణమైన వారందరిపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి క్వాలిఫై అయి.. కాగా ఉమారాణి అక్లోబర్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ మెయిన్స్‌కు ఎంపికైంది. ఉద్యోగ ఎంపిక పరీక్షలో 86 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నిర్మల్‌ల్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉమారాణి అందరితో కలివిడిగా ఉండేది. ఉమారాణి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులతో పాటు గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. యువతి ఆకస్మికంగా మరణించడంతో పెంబి గ్రామానికి చెందిన నాయకులు పుప్పాల శంకర్, కున్సోత్ రమేశ్ తదితర నాయకులు ఆస్పత్రికి చేరుకొని కుటుంబీకులను పరామర్శించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం గ్రామానికి చేరుకుంది. -
ప్రాణాన్ని బలి తీసుకున్న ‘పరువు’
► తండా పరువు తీస్తున్నావని పంచాయతీ పెట్టిన పెద్దలు ►అవమానంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య ఒంటరిగా కన్పించినందుకు పంచాయతీ పెట్టారు. తండావాసులందరి సమక్షంలో ఆమెను నిలదీశారు. తండా పరువు తీస్తున్నావని ఆమెను మందలించారు. దీంతో ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. పరువు కోసం పెట్టిన పంచాయతీ నిండు ప్రాణాన్ని బలిగొంది. పెంబి(ఖానాపూర్) : పెంబి మండలం ఇటిక్యాల పంచాయతీ పరిధిలోని కిష్టునాయక్‌తండాకు చెందిన డిగ్రీవిద్యార్థిని ఉమారాణి(20) మనస్థాపానికి గురై మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కిష్టునాయక్ తండాకు చెందిన దశరత్, లలిత దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. కుతురు ఉమారాణి(20) ఈ నెల 1న గ్రామశివారు ప్రాంతంలో పలువురు గ్రామస్తులకు ఒంటరిగా కనిపించింది. ఈ విషయమై తండా పరువు తీస్తున్నావంటు గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ఈ నెల 2న గ్రామంలో పంచాయతీ పెట్టి అందరి సమక్షంలో ఆమెను నిలదీశారు. దీంతో అవమానానికి గురైన యువతి మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబీకులు వెంటనే పెంబిలోని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించడంతో యువతి మార్గమధ్యలోనే మృతి చెందింది. విద్యార్థి తండ్రి దశరత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పెంబి ఎస్ఐ కాశవేని సంజీవ్‌కుమార్ తెలిపారు. కాగా పంచాయతీ పెట్టి యువతి మృతికి కారణమైన వారందరిపై విచారణ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి క్వాలిఫై అయి.. కాగా ఉమారాణి అక్లోబర్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ మెయిన్స్ కు ఎంపికైంది. ఉద్యోగ ఎంపిక పరీక్షలో 86 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నిర్మల్‌ల్లోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఉమారాణి అందరితో కలివిడిగా ఉండేది. ఉమారాణి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు, బంధువులతో పాటు గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. యువతి ఆకస్మికంగా మరణించడంతో పెంబి గ్రామానికి చెందిన నాయకులు పుప్పాల శంకర్, కున్ సోత్ రమేశ్ తదితర నాయకులు ఆస్పత్రికి చేరుకొని కుటుంబీకులను పరామర్శించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం గ్రామానికి చేరుకుంది. -
పరువు కోసం అన్న ఆత్మహత్య
చెల్లెలు ప్రేమ వివాహం చేసుకున్నదని.. తూప్రాన్ : చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో ఓ సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోసాన్ పల్లికి చెందిన ములుగు శ్రావణ్‌కుమార్‌రెడ్డి (24) తూప్రాన్ లో కొన్నేళ్లుగా తల్లి రాణి, చెల్లెలితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. చెల్లెలు స్వాతికి నర్సాపూర్ మండలానికి చెందిన వ్యక్తితో ఈనెల 20న నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. చెల్లెలు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోరుు ఆదివారం రాత్రి తూప్రాన్ పోలీసులను ఆశ్రరుుంచింది. చెల్లెలు కులాంతర వివాహం చేసుకోవడంతో మనస్తాపం చెందిన శ్రావణ్ ఆదివారం రాత్రి బ్రాహ్మణపల్లి రైల్వేగేటు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
‘గుత్తా పార్టీ మారితే పరువు పోతుంది’
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే మూడు పార్టీలు మారిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి పార్టీ మారి పరువును పోగొట్టుకోవద్దని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుత్తా సుఖేందర్ పార్టీ మారుతారని తాము అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ మెట్లు ఎక్కకున్నా, పార్టీ సభ్యత్వం లేకున్నా సోనియాగాంధీ చలువతో రెండుసార్లు ఎంపీ అయ్యాడన్నారు. రుణమాఫీకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వడ్డీకే సరిపోవడం లేదని కోమటిరెడ్డి అన్నారు. ఇప్పటికైనా ఒకే విడతలో రుణమాఫీని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకోసం రూ. 300 కోట్లు ఖర్చుచేయడం అవసరమా అని ప్రశ్నించారు.