నెలసరి సమస్యలపై విస్తృతంగా అవగాహన సదస్సులు
తెలంగాణ, ఏపీ, తమిళనాడులో డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సేవలు
సాక్షి, సిటీబ్యూరో: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం వారి నైజం. పసి పిల్లలకు పాలు, పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ నుంచి మొదలు అనారోగ్యంతో బాధపడుతున్నవారికి అవసరమైన మందులు అందించడం, రక్తదానం చేయడం వరకు.. మహిళలు, విద్యార్థినులు నెలసరి సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అవసరమైన ప్యాడ్స్ ఉచితంగా అందించడం నుంచి మహిళల ఆర్థిక స్వావలంబన వరకు.. ఇలా అన్నింటా మేమున్నామంటున్నారు ’డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్’ సభ్యులు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఫౌండేషన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి.
ఆధునిక వస్త్రధారణతో హైదరాబాద్‌లోని బస్తీకి వెళ్లిన యువతి రెనీ గ్రేస్.. అక్కడున్న ప్రజలను మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని అడిగింది. నాకు చేతనైన సాయం చేస్తానని చెప్పడంతో.. అక్కడున్నవారంతా ఆమెను చూసి నవ్వుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆమె ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ఎంచుకున్న లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. స్నేహితులు నీతోపాటు మేముంటామంటూ మనోధైర్యాన్ని అందించారు. ఆ ధైర్యం ‘డిగ్నిటీ ఫౌండేషన్’ స్థాపన దిశగా నడిపించింది. 2017 నుంచి ఏడేళ్ల ప్రస్థానంలో 5,500 మందికిపైగా వలంటీర్లను ఫౌండేషన్ సొంతం చేసుకుంది. లక్షలాది మందికి సాయం అందిస్తామంటూ.. మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
కేన్సర్ బాధితులకు అండగా..
కూకట్‌పల్లిలోని కుముదినిదేవి హాస్పిటల్‌లో కేన్సర్ బాధితులు చికిత్స పొందుతున్నారు. పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో బాధితులను ఆదుకోవాలని డిగ్నిటీ డ్రైవ్ ఫౌండేషన్ సభ్యులు నిశ్చయించుకున్నారు. అక్కడున్న కేన్సర్ బాధితులకు అవసరమైన పాలు, లిక్విడ్ ఆహారం పంపిణీ చేయాలని సిద్ధమయ్యారు. డిసెంబర్ చివరి వరకు ఏ రోజు ఎవరు సరఫరా చేయాలనేది నిర్ణయించారు. రోజుకు రూ.1,500 నుంచి సుమారు రూ.7,500 వరకు వెచి్చస్తున్నారు.
బాలికలకు అవగాహన కల్పిస్తూ..
పాఠశాలలు, కళాశాలలు, పెద్దపెద్ద సాఫ్ట్‌వేర్ కార్యాలయాల్లో సైతం మహిళలు ఎదుర్కొంటున్న నెలసరి సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేని విద్యార్థినులు, మహిళలకు శానిటరీ న్యాప్కిన్లు ఉచితంగా అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
నిత్యావసరాల పంపిణీ
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని బస్తీలు, దళితవాడల్లో పేద కుటుంబాలకు 2018 నుంచి ఆహారం, ఉప్పు, పప్పు, బియ్యం వంటి నిత్యావసరాలు, కనీస అవసరాలైన దుప్పట్లు, దుస్తులు వంటివి పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది కుటుంబాలకు అండగా నిలిచారు.
చేతనైన సాయం చేస్తున్నాం..
నా స్నేహితులు పూనం శర్మ, సరితా శర్మ, జైశ్రీరామ్, క్రాంతి రెమ్మల, ప్రతిమతో కలిసి ఫౌండేషన్ నడిపిస్తున్నాను. ఉద్యోగరీత్యా ఎవరి పనులు వారికి ఉన్నాయి. అదనంగా సమాజానికి ఏదైనా సేవ చేసేందుకు 2017లో డిగ్నిటీ డ్రైవ్‌ను స్థాపించాం. మహిళల హక్కులు, ఆర్థిక సాధికారత కోసం ప్రయతి్నస్తున్నాం. నెలసరి సమస్యలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరమైన వారికి కిట్స్ అందిస్తున్నాం. ఆకలి బాధలను అధిగమించేందుకు పేద కుటుంబాలకు నిత్యావసరాలు, మందులు పంపిణీ చేస్తున్నాం. నేను షీ టీంలో సభ్యురాలిగా పనిచేస్తున్నా. చివరి స్టేజ్ కేన్సర్‌తో బాధపడుతున్న పిల్లలు పెయిన్ లెస్ డెత్ కోసం మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మహిళలు ఒక ఫౌండేషన్ నడిపించడం అంత సులువు కాదనిపిస్తోంది. 5,500 మందికిపైగా వలంటీర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెడితే వందలాది మంది స్పందిస్తారు. – రెనీ గ్రేస్, డిగ్నిటీ, డ్రైవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు.
Comments
Please login to add a commentAdd a comment