ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో గ్రూప్ ఫొటో దిగిన రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య
కేవాడియా/సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల విశ్వాసం పొంది, ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభల్లో హుందాగా వ్యవహరిం చాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. పార్లమెంట్‌లో, శాసన సభల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. అన్‌పార్లమెంటరీ పదజాలానికి దూరంగా ఉండాలని కోరారు. క్రమశిక్షణారాహిత్యం, అనుచితమైన పదప్రయోగం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తాయని అన్నారు. రాష్ట్రపతి కోవింద్ బుధవారం గుజరాత్‌లోని కేవాడియా పట్టణంలో 80వ ఆలిండియా ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో మాట్లాడారు. చట్టసభల్లో ఆరోగ్యకరమైన చర్చలు జరిగేలా స్పీకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి సూచించారు.
బడుగుల అభివృద్ధే పరమావధి కావాలి
చట్టసభల పనితీరుపై సామాన్య ప్రజల్లో అవగాహన పెరిగిందని, వారి ఆకాంక్షలు సైతం పెరుగుతున్నాయని రాష్ట్రపతి కోవింద్ గుర్తుచేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన, సహకారం, ఆలోచనలు పంచుకోవడం చాలా అవసరమని వెల్లడించారు. అణగారిన, వెనుకబడిన వర్గాల అభివృద్ధే ప్రభుత్వాల పరమావధి కావాలని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు.
వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమే: ఓం బిర్లా
ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ వ్యవస్థల మధ్య భేదాభిప్రాయాలు సహజమేనని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య నిబంధనలు పాటిస్తూ ఈ భేదాభిప్రాయాలను తొలగించుకోవాలని అన్నారు. ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఒకదానికొకటి సహకరించుకోవాలని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు పనిచేసేలా రాజ్యాంగం పునాదులు వేసిందని అన్నారు. ప్రజాప్రతినిధులుగా మనమంతా ప్రజల బాగు కోసమే పని చేయాలని స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కచ్చితంగా పాటించాలని ఓం బిర్లా పేర్కొన్నారు.
మూడు వ్యవస్థలు కలిసి పని చేయాలి: వెంకయ్య
ప్రజాస్వామ్యం వెలుగులు విరజిమ్మాలంటే శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల మధ్య పరస్పర సహకారం అవసరమని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు వాటి పరిధిలో కలిసి పనిచేయాలని కోరారు. సామాజిక, ఆర్థిక వ్యవహారాల్లో çకోర్టులు చరిత్రాత్మక తీర్పులు వెలువరించాయని అన్నారు. అయితే, శాసన, కార్యనిర్వా హక వ్యవస్థల్లో కోర్టులు అనవసరంగా కలుగజేసుకుంటున్నాయన్న వాదనలు ఉన్నాయని వెల్లడించారు. చట్టసభల్లో తరచుగా జరుగుతున్న ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. మూడు ‘డి’లు.. డిబేట్, డిస్కస్, డిసైడ్‌కు ప్రజాప్రతినిధులు కట్టుబడి ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment