పుస్తకావిష్కరణలో వెంకయ్యనాయుడుతో ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు, త్రివిక్రమ్
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి.
నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment