Siri Vennela
-
నిశ్శబ్ద పాటల విప్లవం సిరివెన్నెల
‘‘చీకటిలో దారి చూపించే వెన్నెల ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి సాహిత్యం. నిశ్శబ్ద పాటల విప్లవం ‘సిరివెన్నెల’. భాషా ప్రావీణ్యం కన్నా విషయ ప్రావీణ్యం మరింత గొప్పదని ఆయన్ని చూసి తెలుసుకోవచ్చు’’ అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కుటుంబం ఆధ్వర్యంలో ‘సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం’ మొదటి సంపుటి పుస్తకా విష్కరణ సభ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించి, ‘సిరివెన్నెల’ సతీమణి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘సిరివెన్నెల’గారు ఆర్థిక ఆలంబన కోసం కాకుండా అర్థవంతమైన సాహిత్యంతో తనకంటూ ప్రత్యేక రచనా విధానాన్ని కొనసాగించారు. ప్రతి పాటలో, మాటలో సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. నేను రాజకీయాల్లోకి వచ్చాక ప్రతిరోజూ ఉదయాన్నే అన్నమాచార్య కీర్తనలు, ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగార్ల పాటలతో పాటు సీతారామశాస్త్రిగారి సాహిత్యాన్ని వినేవాణ్ణి. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో ఆయనతో కాలక్షేపం చేసేవాణ్ణి. ఉపరాష్ట్రపతి అయ్యాక ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మరిచిపోలేను. కృష్ణశాస్త్రి, దాశరథి, సి.నారాయణ రెడ్డి, వేటూరి, ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు పాటలకు పట్టాభిషేకం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హింస, అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు శృతి మించాయి. ‘సిరివెన్నెల’ వంటి వారు తెలుగు భాషకు గౌరవాన్ని పెంచితే ప్రస్తుత సమాజం తెలుగు భాషను విస్మరిస్తోంది.. ఇంగ్లిష్ మోజులో పడి తెలుగును విస్మరిస్తున్నారు. తెలుగు భాష మన కళ్లు అయితే, ఇతర ప్రపంచ భాషలు కళ్లద్దాలవంటివి. ప్రస్తుతం సమాజంలో వివక్ష పెరిగిపోయింది.. కులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయాలు క్యాస్ట్, క్యాష్, కమ్యూనిటీగా మారాయి’’ అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ–‘‘సీతారామశాస్త్రిగారితో ఎన్నో వెన్నెల రాత్రులు గడిపాను.. ఆయన స్వతహాగా పాడిన పాటలు విని ఆస్వాదించేవాణ్ణి’’ అన్నారు. ‘‘ఆయన పాటలను పుస్తకంగా తీసుకురావడం వెనుక ‘సిరివెన్నెల’గారి సాహిత్యం గొప్పతనం ఉంది’’ అని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. ‘‘సిరివెన్నెల’గారి సినిమా పాటలతో 4 సంపుటాలు, సినిమాయేతర రచనలతో మరో రెండు సంపుటాలు విడుదల చేస్తాం. త్వరలోనే ‘తానా సిరివెన్నెల విశిష్ట పురస్కారం’ కూడా విడుదల చేయనున్నాం’’ అని ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ అధ్యక్షుడు లావు అంజయ్య, మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, తమన్, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సిరివెన్నెలకు ఆ జిల్లా అంటే అమితమైన ప్రేమ..
సాక్షి, విజయనగరం: సప్తస్వర మాంత్రికుడు ఇకలేరన్న విషయం సాహితీలోకానికి తీరనిశోకాన్ని మిగిల్చింది. విద్యలనగరమైన విజయనగరం వచ్చినప్పుడల్లా సాంస్కృతిక నగరంలో అడుగుపెట్టడం తన అదృష్టమంటూనే మాటలను ప్రారంభించేవారు. గురజాడ నడయాడిన నేలపై, వందల ఏళ్లనాటి చరిత్ర కలిగిన సంగీత, నృత్య కళాశాలలో విద్యనేర్చుకున్న ఘంటసాల, సుశీలమ్మలను గుర్తుచేసుకుంటూనే తన ప్రసంగాన్ని జిల్లా వాసులకు అందించేవారు. ఆయన సాహిత్యం నుంచి జాలువారే ప్రతీ పాట ఓ అద్భుతమే. అటువంటి సాహితీ దిగ్గజాన్ని కోల్పోవడం విజయనగర సాహిత్యాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనతో గడిపిన క్షణాలను నెమరువేసుకుంటూ ఆయన మృతికి నివాళులర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు. యాదృచ్ఛికంగా మహాకవి వర్ధంతిరోజునే పాటలబాటసారి అస్తమయం కావడం సాహిత్యలోకాన్ని విషాదంలో ముంచింది. విజయనగరమంటే అమితమైన ప్రేమ.. విశాఖ జిల్లా అనకాపల్లిలో జన్మించిన సిరివెన్నెలకు విద్యలనగరమైన విజయనగరమంటే ఎంతో ఇష్టం. సరిగ్గా నేటికి మూడేళ్ల కిందట 2018లో గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని ఆనందగజపతి ఆడిటోరియంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో దర్శకులు క్రిష్‌కు గురజాడ పురస్కారాన్ని సమర్పించే సందర్భంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రధానవక్తగా పాల్గొని అద్భుతమైన ప్రసంగంతో ఆహుతులను ఆకట్టుకున్నారు. 2017లో ఎస్.కన్వెన్షన్‌లో జరిగిన రోటరీ 60 వసంతాల వేడుకలో విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. బాధాకరం సాహితీ సౌరభం నేలరాలింది. ఆయన రచనలు అజరామరం. ఏ నోట విన్నా ఆయన రాసిన పాటలే. మంచి మనిషిగా, పాటల మాంత్రికునిగా పేరుగాంచి ఎన్నో అవార్డులు పొందిన వెన్నెల అస్తమయం అయిందన్న విషయం బాధాకరం. ఆయన కుమార్తె వివాహానికి విజయనగరంలో పరిచయమున్న బుచ్చిబాబు, ఉసిరికల చంద్రశేఖర్, కాపుగంటి ప్రకాష్, అశోక్ మందాకిని, గంటి మురళీ తదితరులను స్వయంగా ఆహ్వానించారు. గురజాడ సమాఖ్య తరఫున ఆయనకు అంజలిఘటిస్తున్నాం. – కాపుగంటి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య,విజయనగరం -
నట విశ్వరూపం
‘పెళ్లైనకొత్తలో, యమదొంగ, రగడ, శంభో శివ శంభో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కన్నడ బ్యూటీ ప్రియమణి లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సిరివెన్నెల’. వివాహం తర్వాత ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బీ కో ఆర్డినేటర్స్, శాంతి టెలీఫిలిమ్స్ పతాకాలపై కమల్ బోరా, ఏఎన్ భాషా, రామసీత నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నీరజ్ పాండే విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘టీజర్ చాలా బాగుంది. ప్రియమణి కెరీర్లో ఈ చిత్రం విభిన్నమైనదిగా నిలిచిపోతుంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రియమణిగారు చాలా కథలు విన్నప్పటికీ ‘సిరి వెన్నెల’ కథ బాగా నచ్చడం, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో నటించేందుకు ఒప్పుకున్నారు. ఆమె నట విశ్వరూపం ఇందులో మరోసారి చూడబోతున్నాం. మా బ్యానర్‌కు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. ‘సిరివెన్నెల’ టైటిల్ మా సినిమాకు కరెక్ట్‌గా సరిపోయింది. శివరాత్రికి విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. ఇప్పుడు నీరజ్ పాండే విడుదల చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘మహానటి’ ఫేమ్ సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, అజయ్ రత్నం, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఏఎన్‌బీ కోఆర్డినేటర్స్ మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ, సాంగ్స్ కంపోజింగ్: ‘మంత్ర’ ఆనంద్, కమ్రాన్, కెమెరా: కల్యాణ్ సమి. -
వార్షికం
ఈ వార్షికం ప్రతీ యేటా ఇచ్చే పద్మ అవార్డుల గురించి కాదు. ఇవ్వని పద్మ అవార్డుల మీద నా స్పందన గురించి. ‘వార్షికం’ అనే మాటలో వైదికంగా దుర్మార్గమయిన అర్థం. ఇంక కెలకను. చాలాసార్లు ఈ అవార్డులు పూర్తిగా చచ్చిపోయిన వారికో, లేదా సగంసగం పోతున్న వారికో ఇవ్వడం రివాజు. అయితే ఈ సంవత్సరం చాలా కారణాలకి ఆనందించదగ్గ విషయం– మిత్రులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ. సాహితీపరులకిచ్చే సత్సాంప్రదాయం, ఓ సినీ గేయ రచయితకి– అందునా సీతారామశాస్త్రికి ఇవ్వడం చాలా హర్షణీయం. ఈ అవార్డులు సాధారణంగా ఇంత దూరం ప్రయాణం చెయ్యవు. కానీ ఇదేమిటి! శాస్త్రిగారి పేరు పక్కన ‘తెలంగాణ’ అన్న మాట ఉంది. వారి పేరుని తెలంగాణ ప్రభుత్వం సూచించిందా? ఆశ్చర్యం లేదు. ఏపీ ప్రభుత్వానికి అంత తీరిక లేదు. అలనాడు బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పద్మ అవార్డులను తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. వారి సినీ రచయిత వైరముత్తు పద్మభూషణ్. ఏమయినా తెలం గాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. శాస్త్రిగారి గొప్పతనానికి ఒకే ఒక మచ్చుతున కని ఉటంకించాలని ఉంది. 1992లో నేనూ, జేవీ సోమయాజులు, పద్మనాభం, తులసి ప్రభృతులం అమెరికా వెళ్లాం. నేను ‘మనిషి గోతిలో పడ్డాడు’ అనే నాటికని రాశాను. గోతిలో పడిన మనిషిని చూసి రక రకాల సామాజిక స్థాయిలకు చెందిన వ్యక్తులు అతని స్థితిని విశ్లేషిస్తారు. చివరికి అతనికి సహాయం చెయ్యకపోగా పెద్ద బండ రాయితో చంపుతారు. అక్కడొక పాట ఉంటే ముగింపు బాగుంటుందని మాకనిపించింది. ఎలాంటి పాట ఉండాలి? అనుకోలేదు. అప్పుడు మా శ్రీనివాస్ బతికే ఉన్నాడు. నేను పాట చేయిస్తానన్నాడు. సీతారామశాస్త్రి దగ్గరికి పరిగెత్తాడు. కథ చెప్పాడు. న్యాయంగా ఎలాంటి పాట రాయాలి? చచ్చిపోతున్న వ్యక్తి– సమాజ స్వార్థానికి బలి అయిన వ్యక్తి ఆర్తనాదం. శ్రీశ్రీ ఆవేశంగా ‘ఎముకలు కుళ్లిన వయస్సు మళ్లిన....’ అంటారేమో! వేటూరి ‘ఈ అపరభీష్ముల రాజ్యంలో ఎందరో బృహన్నలలు...’ అంటారేమో! ఆత్రేయ ‘ఈ స్వార్థపరుల ప్రపంచంలో తలపగిలిన దీనుడు...’ అంటారేమో! సీతారామశాస్త్రిని నేనెప్పుడూ కలవలేదు. చావు బతుకుల్లో ఉన్న మనిషి– గోతిలో కొన ఊపి రితో ఉన్నాడు. అతని మాట... శాస్త్రి అన్నాడు కదా... ‘నాకెంతో సంతోషంగా ఉంది నాకెంతో ఆనందంగా ఉంది చరిత్ర లోతెంతో కొలవగలిగినందుకు తలెత్తి పాతాళం చూడగలిగినందుకు...’ విశీర్ణమైన మనిషి పాతాళంలో చచ్చిపోతూ– మానవాళి నీచత్వపు లోతుల్ని చూశానని నవ్వుకున్నాడట! నిర్ఘాంతపోయాను. సిరివెన్నెల– ఓ కవితను– పది సాధారణమైన ఆలోచనల స్థాయిని చీల్చి ముందుకు వెళ్తాడు. అక్కడా అతను మొదటి పల్లవి. అతనికి పద్మశ్రీ తెలుగు కవితకి పట్టాభిషేకం. మన తెలుగువారికి మనల్ని చూసి మనం గర్వపడే సహృదయం లేదు. తమిళులకీ, బెంగాలీలకీ అది సొత్తు. ఈ దేశంలో ఓ మహానటి ఉన్నారు. కృష్ణవేణి. ఆమెకి 94 సంవత్సరాలు. మిత్రులు రావికొండలరావుగారు నాకు మెసేజ్ పంపారు. తన ఆరవ యేటనుంచే నటనా రంగంలో కాలుమోపి, మీర్జాపురం రాజావారి ఇల్లాలుగా సినీ నిర్మాత అయి ఓ మహానుభావుడు ఎన్టీఆర్‌నీ, ప్రతినాయక పాత్రలు ధరించిన పద్మవిభూషణ్ అక్కినేనిని హీరోగా ‘కీలుగుర్రం’లో పరిచయం చేసిన విదుషీమణి– నా చిన్నతనంలో ‘లక్ష్మమ్మ’ని తన్మయులమై చూసిన గుర్తు ఇంకా చెరిగిపోలేదు– కృష్ణవేణి గారిని ఇంకా తెలుగుజాతి గౌరవించుకోలేదు. చెన్నైలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రముఖ రచయిత– ఆనాడు పద్మ అవార్డుకి నోచుకోని కన్నదాసన్ విగ్రహం ఉంది. మన ఆత్రేయకీ, పింగళికీ లేదు. ఎన్.ఎస్. కృష్ణన్ విగ్రహం ఉంది. మన రేలం గికీ, శివరావుకీ లేదు. పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి గౌరవానికి సెమ్మంగుడి అభిరుచి పెట్టుబడి అంటారు. మహా గాయకుడు అన్నమాచార్యను ఆకాశంలో నిలిపిన అజరామరమైన కీర్తనలు చేసి, తన జీవితాన్నే ఒక ఉద్యమం చేసుకున్న బాలకృష్ణ ప్రసాద్ వంటి శిష్యుడిని సమర్పించిన నేదునూరిని ఈ జాతి గౌరవించుకోలేదు. మన గొప్పతనాన్ని చూసి మాత్రమే కాదు, చూపి, నెత్తికెత్తుకుని గర్వపడటం జాతి సంస్కారం. ఏపీ ప్రభుత్వం అలాంటి పనిచెయ్యదేం? ఏ కూడలిలోనో ఓ రమణారెడ్డి, ఓ సముద్రాల, ఓ వేటూరి పలకరించరేం? తమిళనాడులో సంగీత కళానిధులూ, పద్మశ్రీలూ ఎటుచూసినా కనిపిస్తారు. ‘మా మహనీయుల్ని ఆకాశంలో నిలిపే ఉపకారం మీరు చేసిపెట్టండయ్యా’ అని చరిత్ర చెప్తూంటే– సిగ్గుతో తలవంచుకుని వారి మధ్యనుంచి నడుచుకుపోతూంటాను. -
పద పద్మం
-
సిరివెన్నెల
తెలుగు తెరపై ప్రియమణి కనిపించి రెండేళ్లయింది. ‘మన ఊరి రామాయణం’ తర్వాత ఆమె వేరే ఏ తెలుగు చిత్రంలో నటించలేదు. గతేడాది ముస్తఫా రాజ్‌ని పెళ్లాడిన ప్రియమణి కెరీర్‌పై కూడా బాగానే ఫోకస్ చేస్తున్నారు. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు అరడజను చిత్రాల్లో నటిస్తున్న ఆమె ఇప్పుడు ‘సిరివెన్నెల’ అనే తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ఏఎన్‌బి కోఆర్డినేటర్స్ బ్యానర్‌పై ఏఎన్ బాషా, రామసీత ఈ సినిమా నిర్మించనున్నారు. తెలుగు చిత్రసీమలో క్లాసిక్ మూవీగా చెప్పుకునే ‘సిరివెన్నెల’ సినిమా టైటిల్‌ని ప్రియమణి సినిమాకి పెట్టడం విశేషం. ఈ చిత్రకథ బాగా నచ్చడంతో పాటు నటనకి ఆస్కారం ఉన్న పాత్ర కావడంతో ప్రియమణి మా సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని దర్శక–నిర్మాతలు చెప్పారు. సాయి తేజస్విని, ‘బాహుబలి’ ప్రభాకర్, సీనియర్ నటుడు అజయ్ రత్నం, ‘రాకెట్’ రాఘవ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించనున్నారు. -
మౌనమే మంత్రమౌతున్న వేళ... ఓ వేణుమాధవా!!
పాట నాతో మాట్లాడుతుంది... తన పెన్నులో సిరా వెన్నెల - నా తండ్రి సిరివెన్నెల. మాట తీరు వెన్నెల - మనసు తీరు వెన్నెల. మనిషి తీరు సిరివెన్నెల సీతారామరాత్రి సారీ... సీతారామశాస్త్రి. ఎంత బాగా చెప్పావు... పాటా! నీ మాటల ముత్యాల పోహళింపులో శాస్త్రిగారి కూతురువనిపించావు... ఇంతకూ నీవు... ‘‘నేను... నేను... ‘నేనున్నాను’ చిత్రంలో గాలి గాంధర్వపు గీతాన్ని... గుర్తించలేదా కవీ..’’ ఓ... నాకిష్టమైన పాటవి. ఎన్నో ప్రదేశాల్లో ఇప్పుడు వస్తున్న పాటల్లో ఆనాటి ఆపాత మాధుర్యమూ లేదు. అత్యంత సాహితీ సౌగంధమూ లేదన్న ఎందరు సాహితీ ప్రియులకో ‘నీ పేరు చెప్పి ఒప్పించేవాణ్ని. నేటి సినీసాహితీ స్రష్టంలో వాసి వసి వాడలేదని నిరూపించేవాణ్ని. సరే... ఇక చెప్పు. ‘నేనున్నాను’ సినిమా - కీరవాణి సంగీతం, పాడింది చిత్ర. సన్నివేశం - తన బతుకును చిగురింపజేస్తున్న కథానాయకుడు నాగార్జునకు ఆత్మనివేదన చేసుకునే సందర్భంలో పాట రాయాలి. ‘కథానాయికని వెదురుగా పోల్చుతూ - హీరో వేణుధరుడైన మాధవునితో ఉపమిసూత శూన్యంగా ఉన్న వెదురుగొట్టంలో మోహనుడి ఊపిరి ఎలా గాంధర్వమైందో... రాయరాదా తండ్రీ’ అన్నాను... అంది. వెన్నెల సిరాక్షరాలుగా మారుతూ... ‘వేణుమాధవా!’ అని పలికింది ‘సాకీ’గా. క్రియారూపంలో పల్లవిని పల్లవింపజేయడం సిరివెన్నెల పెన్నుకవ్వంలో భావాల మీగడ పెరుగును చిలికిన వెన్న తీయడమంత సులువు. వాతావరణంలో ఉన్న వాయువు గోపాలుని ఊపిరిగా మారి, పెదవులతో వేణువునూదగానే ఉల్లము ఝల్లుమనిపించే గాంధర్వంగా మోగడాన్ని తలచుకో- అన్నాను. అంతే! నా తండ్రి సిరివెన్నెల అందుకున్నాడు. సుకుమార సుందరంగా రసబంధురంగా- ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నది- ఆపైన ఆలస్యం లేకుండా రెండో వాక్యం... ‘ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో’ అంటూ దూసుకొచ్చింది. ఆ శ్వాసలో నేను కూడా విలీనమై ఆ పెదవులపై నేను కూడా మంత్రమై నీలోకి చేరని మాధవా’ అని పల్లవి పూర్తించాడు. నా తండ్రి సీతా గీతా రామశాస్త్రి ఇంక తొలి చరణం - మురళిని అనిర్వచనీయంగా - కవితా నిర్వచనీయంగా చరణీకరించడం - ఏ రుషులకు - తాపసులకు - మధుర భక్తులకు అందని మాధవుని పెదవులపై పవ్వళించే యోగం - రసాత్మక భోగం వెదురు మురళిదంటు అందుకోసం - ఎన్ని గాయాలు తొలచుకుంటేనో ఈ అద్వైత యాగ ఫలసిద్ది అంటూ మునులకు తెలియని జపములు జరిపినదా వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువున - నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణా నిన్ను చేరింది (ఓం నమో నారాయణాయ) అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పెన్నిధీ - వెదురు తాను పొందింది వేణుమాధవా నీ సన్నిధీ - ముగించాడు. ఆ పైన రెండో చరణంలో ఏం చెప్పాలి? మురళి శరీరపరంగా తొలి చరణ సరళి ముగిసింది. ఇక ఆ ముదిత శరీరపరంగా చెప్పు తండ్రీ! అన్నాను. నిదుర రాని నడిరాతిరి సిరివెన్నెల కనుపాపల కదలికలో నేను తప్ప ప్రపంచమంతా గాఢనిద్రలో కదా అనే భావం తొణికిసలాడి మరో రూపంలో కాగితంపై ప్రసరించింది. వెన్నెల రేఖలా వెలుగుల వాకలా ‘చల్లని నీ చిరునవ్వులు కనపడక - కనుపాపకీ నలువైపుల నడిరాతిరి ఎదురవదా - అల్లన నీ అడుగుల సడి వినపడక - హృదయానికీ అలజడితో అణువణువూ తడబడదా- ఈ పాదం నడిపేది నువ్వె - నా నాదం పలికించేది నువ్వె - సినిమాలో నాయికకు పుట్టుకతో వచ్చిన గాన కళను ప్రోత్సహించినవాడు నాయకుడు. కనుక - చివరి నాలుగు వాక్యాలను నువ్వే నడుపు పాదమిది - నువ్వే మీటు నాదమిది నివాళిగా నా మది - నివేదించు నిమిషమిది వేణుమాధవా నీ సన్నిధీ... అని సంపూర్ణించాడు సిరివెన్నెల. ఇందులో కథానాయకుని పేరు వేణు అని కవికి తెలుసు. పాట రాసినట్టుగా మాట్లాడటం - మాట్లాడినట్టు పాట రాయడం మీ కవులకు, సినీకవులకు సినారె నుండి సిరివెన్నెల దాక చెల్లిందే. కానీ క్రియాపదాలతో పల్లవించడం - అందమైన అర్థాలను ఊరిస్తూ - అందమైన చెవికీ - మనసుకు - సంగీతానికి ఉచ్చరించటానికి ప్రియంగా ఒదిగే పదాలను అల్లుకుంటూ కాగితంపై చూస్తే అలవోకగా మాటాడుకునే సాదా సీదా మాటలతో ‘పాట బొమ్మ అమ్మాయిల్ని వెన్నెల్లో ఆడించడం’ నా తండ్రి సిరివెన్నెలకు విరించి పెన్నుతో పెట్టిన విద్య. అంటూ... నా విధాత - క‘విధాత’ నా పిత సీతారామశాస్త్రి పాటలూరే రాతిరి రత్న పేటికలోనే నా బస - అంటూ తన శ్వాసలో చేరితే నేను గాంధర్వమయ్యానులే అని పాడుకుంటూ వెళ్లింది. డా॥సుద్దాల అశోక్‌తేజ, పాటల రచయిత -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : కోరస్ (రమణగోగుల): తరరేరా రరిరా తరారరిరా (2) తరరేరా రరిరా తరరేర రా రా రారా (2) తరరేరరే రారా రారారే తారరారిరా అతడు: మనసే ఎదురు తిరిగి మాట వినదే ఆమె: కలిసే ఆశ కలిగి కునుకు పడదే అ: మొదలైన నా పరుగు నీ నీడలో నిలుపు ఆ: తుది లేని ఊహలకు నీ స్నేహమే అదుపు అ: ప్రణయానికే మన జంటనే పద కొత్త మైమరపు చరణం : 1 అ: కలలో మొదటి పరిచయం గురుతు వుందా ఆ: సరిలే చెలిమి పరిమళ ం చెరుగుతుందా అ: చెలివైన చెంగలువా కలలోనే ఈ కొలువా ఆ: చెలిమైన వెన్నెలవా నిజమైన నా కలవా అ: నిను వీణగా కొనగోట మీటితే నిదురపోగలవా చరణం : 2 అ: చినుకై కురిసినది కదా చిలిపి సరదా ఆ: అలలై ఎగసినది కదా వలపు వరద అ: మనసే తడిసి తడిసి అలగా కరిగిపోదా ఆ: తలపే మెరిసి మెరిసి తగు దారి కనపడదా అ: వెతికే జతే కలిసి వయసు మరి ఆగనంది కదా చిత్రం : ప్రేమంటే ఇదేరా (1998) రచన : సిరివెన్నెల సంగీతం : రమణగోగుల గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : ఆమె: దేవతలారా రండి మీ దీవెనలందించండీ నోచిన నోములు పండించే నా తోడును పంపించండీ కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ కనివిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండీ కలలో ఇలలో ఏ కన్యకి ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగ ఇవ్వండీ కనివిని ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండీ చరణం : 1 ఆ: ఓ... శివపార్వతులేమో ఈ దంపతులనిపించాలి ప్రతి సంసారంలోనూ మా కథలే వినిపించాలి అతడు: ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి శ్రీకాంతుల కొలువంటే మా కాపురమనిపించాలి ఆ: మా ముంగిలిలోన పున్నమి పూలవెన్నెల విరియాలి మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి ॥ చరణం : 2 అ: ఆ... తన ఎదపై రతనంలా నిను నిలిపే మొగుడొస్తాడు నీ వగలే నగలంటూ గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళతెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే మణిదీపం నీవంటాడు ఈ పుత్తడిబొమ్మ మెత్తని పాదం మోపిన ప్రతిచోట నిధినిక్షేపాలు నిద్దురలేచి ఎదురొచ్చేనంట ॥ చిత్రం : ఆహ్వానం (1997) రచన : సిరివెన్నెల సంగీతం : ఎస్.వి.కృష్ణారెడ్డి గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : మయ్యా మయ్యా మయ్యా మయ్యా మయ్యా అరేబియా ఒయాసిస్సులా ఎదురైందయ్యా అమ్మాయిలో అదేం మాయో మనసే లాక్కుందయ్యా రూపాయే పాపాయై నాకే దిల్ దే దియా మమ్మాయ మాయ మాయమా మాయా మాయా (2) ॥ హే బాల హే బాల... డూ... (3) చరణం : 1 రెయిన్బో రంగేళి రంభల్లే దిగి వస్తే నా రాంబో నువ్వంటూ రంగంలో దింపేస్తే గోలార్ గోల్డ్ ఎదురై క్యాట్వాకింగ్ చూపెడితే డాలర్ డార్లింగై ఒళ్లో వాలితే నిగనిగలాడే ఆ లేడి నన్నొల్లేసిందయ్యా ధగధగలాడే సొగసంతా నా సొమ్మేనందయ్యా ॥॥ చరణం : 2 భూటాన్ బంపర్ లాట్రీ బుగ్గే కొరికేస్తే లక్ష్మీబాంబ్ గుండెల్లో భమ్మని పేలిందంటే కాబోయే రాణి నా కౌగిట్లో పడితే కాని కుర్రగాణ్ని నన్నే లవ్వాడితే బేజా అంతా బేజారై నే బేహోష్ అయిపోయా ఇంకేం చేస్తాం రాజాలా నేన్ తయ్యారైపోయా ॥॥ చిత్రం : పైసా (2014), రచన : సిరివెన్నెల సంగీతం : సాయికార్తిక్, గానం : విజయ్‌ప్రకాష్ -
గీత స్మరణం
పల్లవి : అతడు: అమ్మాయి నచ్చేసింది ఆహ్వానమిచ్చేసింది ఓ ముద్దమందారంలా ముస్తాబయ్యింది ఆమె: వైశాఖమొచ్చేసింది ఇవ్వాళో రేపో అంది ఓ మంచి ముహూర్తం చూసి సిద్ధం కమ్మంది అ: ఓ ఓ ఓ... ఈ కబురు విన్న ఎదలో ఎన్నెన్ని పొడుపుకథలో ఆ: మనువే కుదిరి కునుకే చెదిరి మురిపెం ముదిరి నా మనసు నిలవనంది కొమ్మల్లో చిలక మోమాటం పడక వచ్చి వాలమ్మా ॥ చరణం : 1 అ: ఈ గాలి రోజూలా వీస్తున్నా ఈవేళ వేరేలే వింటున్నా సన్నాయి రాగాలుగా ఆ: నావైపు రోజూలా చూస్తున్నా ఈనాడే ఏదోలా ఔతున్నా నీ కన్ను ఏమన్నదో... నా ఈడు ఏం విన్నదో అ: ఆశపెట్టి పెట్టి పెట్టి చంపొద్దమ్మా ఇట్టా ఆ: నువ్వు పట్టి పట్టి పట్టి చూస్తూవుంటే ఎట్టా అ: ఎన్నెన్నో అనిపించి ఉక్కిరిబిక్కిరి ఔతున్నా ॥॥ చరణం : 2 ఆ: ముత్యాల మేనాలే రప్పించి మేఘాల వీధుల్లో తిప్పించి ఊరేగనీ హాయిగా అ: అందాల హద్దుల్నే తప్పించి వందేళ్ల కౌగిళ్లే అందించి ఊరించు ఆ వేడుక... ఓ... ఊహించ నీ నన్నిలా ఆ: ఏంటి గిచ్చి గిచ్చి రెచ్చగొట్టేలా నువ్వు అ: ఇంత పిచ్చి పిచ్చి పిచ్చి పెంచేస్తోందే నువ్వు హోయ్ ఆ: కవ్వించి కరిగించి కరిగే వయసును కాపాడు ఆ: కొమ్మల్లో చిలక మోమాటం పడకా వచ్చి వాలమ్మా ॥ చిత్రం : నువ్వే నువ్వే (2002), రచన : సిరివెన్నెల సంగీతం : కోటి, గానం : రాజేష్, కౌసల్య నేడు తరుణ్ బర్త్‌డే నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి పొద్దువాలిపోయే నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడి లేనే లేదయ్యేనే ॥ అలిసిన బొండుమల్లి సరిగా బజ్జోమరి కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే హోయ్ ॥ చరణం : 1 చిరుగాలి పరదాలే గలగలలాడి చెవిలోన లోలాకూ జతగా పాడి ॥ బంగరు దేహం సోలుతుంది పాపం చ ల్లనీపూటా కోరుకుంది రాగం నీవే అన్నావే నే పాడాలంటూ ఊగీ తూగాలి నా పాటే వింటూ హొయ్ ॥ చరణం : 2 ముత్యాల వాడల్లో వెన్నెలే సాగే రేరాణి తాపంలో వెల్లువై పొంగే ॥ చింతలన్ని తీర్చే మంచు పువ్వు నీవే మెత్తగా లాలీ నే పాడుతాలే విరిసే హరివిల్లే ఊరించే వేళా మనసే మరిపించీ కరిగించే వేళా హొయ్ ॥ చిత్రం : తూర్పు సిందూరం (1990); రచన : సిరివెన్నెల సంగీతం : ఇళయరాజా; గానం : ఎస్.పి.బాలు నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
సాకీ: జై జై జై జై... గణేష జై జై జై జై... జైజై జై జై... వినాయక జై జై జై జై... పల్లవి: దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించీ తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా... ఓ... దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చరణం : 1 చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా లంబోదర పాపం కొండంత నీ పెనుభారం ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా హోహోహో జన్మ ధన్యం అంబారిగ ఉండగల ఇంతటి వరం అయ్యారా అయ్యా అంబాసుతా ఎందరికి లభించురా అయ్యారా అయ్యా ఎలుకనెక్కే ఏనుగు కథ చిత్రం కదా దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చరణం: 2 శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం శివుని శిరసు సింహాసనం పొందిన చంద్రుని గోరోజనం నిన్నే చేసింది వేళా కోళం ఎక్కిన మదం దిగిందిగా తగిన ఫలం దక్కిందిగా ఏవైపోయింది గర్వం త్రిమూర్తులే నిను గని తలొంచరా అయ్యారా అయ్యా నిరంతరం మహిమను కీర్తించరా అయ్యారా అయ్యా నువ్వెంతనే అహం నువ్వే దండించరా దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ అరెరెరెరెరే... పిండి వంటలారగించీ తొండమెత్తి దీవించయ్యా తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా... ఓ.... దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవ నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవ చిత్రం : కూలీ నెం.1 (1991) రచన : సిరివెన్నెల సంగీతం : ఇళయరాజా గానం : ఎస్.పి.బాలు, బృందం