
సాక్షి, న్యూఢిల్లీ: ఏడేళ్లుగా ఈశాన్యభారతంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తులో సాధించబోయే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తోందని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని తెలిపారు. ఈ ప్రాంతంలో తిరుగుబాటు శక్తుల ప్రభావం తగ్గుతూ వస్తోందని ఆయన వెల్లడించారు.
శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. 2014 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధితో పాటు ప్రజాస్వామ్య పునరుద్ధరణ దిశగా ఎంతో కృషి చేస్తున్నాయని ఆయన అభినందించారు. భారతదేశంలో ఇటీవలి కాలంలో చట్టసభల పనితీరును ప్రస్తావిస్తూ, పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించే బదులు, అనవసర వాదులాటల ద్వారా సభా సమయాన్ని వ్యర్థం చేయడం సరికాదన్నారు.
2015–20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా ఆరు రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలన్నారు. ఈశాన్య భారతంలో మౌలిక సదుపాయాల కల్పన విస్తృతంగా జరుగుతోందని, తద్వారా ఈ ప్రాంతాభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. 2014లో ప్రధానమంత్రి ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదన్నారు. అరుణా చల్ ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యేలు ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment