చెట్టు స్త్రీలాంటిది.
బీడులోంచి కూడా శక్తిని లాగి, నీడను ఇస్తుంది!
అలాంటి చెట్టును ఏ ఊరు కోరుకోదు?
ఏ ఊరు ఆ చెట్టును మోడువారుస్తుంది?
ఏ ఊరు తన కాళ్లను తానే గొడ్డలితో నరుక్కుంటుంది?
అలాంటి ఊరు ఉండదు.
ఉంటే.. అది మూర్ఖత్వమే.
కాదు.. కాదు.. వివక్ష.
వృక్షాన్ని కూడా నిలవనివ్వకుండా
పడగొట్టేయాలనుకునే వివక్ష!
సర్పంచ్ ఇంటికి పాలుబోస్తే 500 జరిమానా! ఆ ఇంట్లో వాళ్లతో మాట్లాడితే జరిమానా! సర్పంచ్ భర్త బండిమీద ఎక్కితే జరిమానా! వాళ్ల పొలంలోనికి ట్రాక్టర్ తోలితే జరిమానా!
పరువు హత్యల గురించి విన్నాం. ఈ ‘పవరు హత్య’ ఏంటి?! పెళ్లిలో ఎంపిక చేసుకుంటారు. అక్కడ పరువు హత్యలు జరుగుతున్నాయి. పవర్‌లో ఎన్నుకుంటారు. అక్కడ పవర్ హత్యలు జరుగుతున్నాయి. ఒక దళిత మహిళా సర్పంచ్ పవర్‌పై జరిగిన హత్య ఇది. చట్టం కూడా చూస్తూ కూర్చున్న కథ ఇది!
గ్రామ పంచాయతీ వైపు విసురుగా వెళ్లాడు గ్రామ పెద్ద. ‘‘అరేయ్ ఆ కుర్చీ తేరా..’’ పాలేరుని గదిమి అతను తెచ్చిన కుర్చీలో దర్జాగా కూర్చున్నాడు. పంచాయతీ సెక్రటరీని పిలిచి చెప్పాడు. ‘‘ఇక నుంచి ఏ ఫైల్ మీదా సర్పంచ్ సంతకం తీసుకోవద్దు. ఆమె ఏ కార్యక్రమాలకీ హాజరు కాకూడదు. ఆమె ఇంటికెవ్వరూ వెళ్లకూడదు. ఆమెతో ఎవ్వరూ మాట్లాడకూడదు. ఆమె భర్త బండి మీద కూడా ఎవరూ ఎక్కకూడదు..’’ హుకుం జారీ చేసి, కుర్చీలోంచి లేచి వెళ్లిపోయాడు ఆ గ్రామపెద్ద.
స్త్రీ.. ఆపై దళిత స్త్రీ
నిజానికి ఆ గ్రామ సర్పంచి మమత. పంచాయతీలో ఆమె నిర్ణయం ప్రకారమే అన్నీ జరగాలి. ఏ సభ జరిగినా, ఏ మీటింగ్ పెట్టినా ఆమె ఉండి తీరాలి. అలాంటిది.. సర్పంచిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటి నుంచీ గ్రామంలోని అగ్రవర్ణాలవారి నుండి వివక్ష మొదలైంది. దానికి కారణం.. మమత కుటుంబీకుల భూమిపై పెద్దవాళ్ల కన్ను పడటం. దానిని సొంతం చేసుకునేందుకు వారంతా కలిసి మమత కుటుంబంపై వేధింపులు మొదలుపెట్టారు.
పైగా.. ఏకగ్రీవ ఎన్నిక!
భర్త ఎం.పి.పి.గా పని చేసినా, మమత పదవ తరగతి వరకు చదువుకోవడంతో కాస్తో కూస్తో పాలనా వ్యవహారాలను అర్థం చేసుకోగలిగింది. సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. లోకల్‌గా ‘పెద్దవాళ’్ల మాట విన్నంత వరకూ ఆమెకు ఏ ఇబ్బందీ కలగలేదు. అయితే మమత కుటుంబానికి చెందిన భూమిని తమకు రాసివ్వాలనీ, అదెప్పుడో ఆమె తాత ముత్తాతలు తమకు అమ్మేశారనీ మమతను, ఆమె భర్త శ్రీనివాస్‌నీ బలవంతపెట్టారు ఊరి అగ్రవర్ణ పెద్దలు. చప్పుడు చెయ్యకుండా భూమిని అమ్మేసినట్టు సంతకం పెట్టాలని కూడా నయానా భయానా చెప్పి చూశారు. ‘సర్పంచి ఆడమనిషే కదా, మేం చెపితే వినదా’ అన్నది వాళ్ల ధీమా!
గ్రామ బహిష్కారం
భార్యాభర్తలిద్దరూ లొంగకపోవడంతో వాళ్ల అహంకారం బుసలు కొట్టింది. ఆడ సర్పంచినే చెప్పుచేతల్లో పెట్టుకోలేకపోతే, రేప్పొద్దున తమ పెద్దరికాన్ని ఎవరు గౌరవిస్తారు? ఊళ్లో పరువు పోదా? ఏదో ఒకటి చేసి వాళ్లని దారికి తేవాలని అనుకున్నారు పెద్దలు. ఆ రాత్రి అంతా కూర్చొని... సర్పంచిని గ్రామం నుంచి బహిష్కరించాలని నిర్ణయించారు. అలా నిజామాబాద్ జిల్లా, ఆర్మూరు దగ్గరలోని మిండోరా మండలం, బుస్సాపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల మమతను వెలివేశారన్న విషయం చుట్టుపక్కల గ్రామాల్లో గుప్పుమంది.
ఒక్కొక్కరూ దూరం అయ్యారు
‘‘ఆ పదకొండెకరాలు మావేనని సంతకం పెట్టండి. అంతవరకు మిమ్మల్ని గ్రామం నుంచి వెలేస్తున్నాం. ఎవ్వరూ మీతోని మాట్లాడరు. మీరు ఎవ్వరిళ్లకెళ్లొద్దు. మా కట్టుబాటు ధిక్కరిస్తే జరిమానా కట్టాల్సిందే’’ అన్న ఆ ఊరి పెద్ద హెచ్చరిక గుర్తొచ్చింది మమతకి. పొలం దున్నాలని ట్రాక్టర్ మాట్లాడితే రాత్రి వస్తానని చెప్పిన వ్యక్తి పొద్దున్నే ఫోన్ చేస్తే ‘‘నువ్విచ్చే దానికన్నా నీకు ట్రాక్టర్ తోలితే మాకయ్యే ఖర్చే ఎక్కువ’’ అన్నప్పుడు కానీ తనకు అర్థం కాలేదు.. అతను జరిమానాకు భయపడుతున్నాడని. మమతని భోజనానికి పిలిచినందుకు ఆ పిలిచిన కుటుంబంపై కూడా జరిమానా విధించారు.
ఫిర్యాదు చేసినా.. చర్యల్లేవు!
సమానత్వం, రాజ్యాంగం అని పెద్ద పెద్ద మాటలు చెపుతారు. కానీ ఇక్కడేం జరుగుతోంది? భర్తను నెమ్మదిగా పిలిచి చెప్పింది మమత. ‘‘పోలీసు కంప్లైంట్ ఇద్దాం’’ అని. 2018 జనవరి 7వ తేదీన స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేశారు వెలివేత మీద. పాలు కూడా పోయనివ్వడం లేదనీ, పాలుపోసే అతణ్ణి బెదిరించి మాన్పించారని ఫిర్యాదు చేశారు భార్యాభర్తలిద్దరూ. జనవరి 11న ఆర్డీవో, ఏసీపీ సహా వచ్చి గ్రామసభ పెట్టారు. మహిళా సర్పంచ్ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేసినట్టు ఒప్పుకున్నారు పెద్దవాళ్లంతా. అది కుల నిర్ణయం అన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కానీ ఇంతవరకు దోషులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
ఇవ్వరు.. ఇచ్చినా ఉండనివ్వరు!
అవమానమిది. స్త్రీల రాజకీయ సాధికారతను గురించి గొప్పలు చెప్పే రాజ్యాధినేతలు సైతం తలలు దించుకోవాల్సిన ఘటన ఇది. ఏం చేస్తున్నారు పాలకులు? గ్రామసభలో అది నిజమని తేలినా ఎందుకు ఇంకా చర్యలు తీసుకోరు? అంటే నిర్లక్ష్యం. వాళ్లు దళితులన్న నిర్లక్ష్యం. మామూలుగానే మహిళలను రాజకీయాల్లోనికి రానివ్వరు. ఇక దళిత సర్పంచిని వేధించకుండా ఉంటారా? 33 శాతం మహిళా రిజర్వేషన్ అంటారు. కానీ ఇంత వరకు అది చట్టంగా రాలేదు. రిజర్వేషన్లు ఇచ్చిన చోటేమో ఇలా దౌర్జన్యం చేస్తారు. దీనికి ఒకటే పరిష్కారం... దామాషా ప్రాతినిధ్యం. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లనివ్వడం.
– కె.లలిత, సమాజిక కార్యకర్త, ‘యుగాంతర్’ సంస్థ డైరెక్టర్
స్త్రీలు రాజ్యాధికారంలో భాగం కాకూడదా?
ఇది రాజ్యాంగ విరుద్ధం. భారతీయ సమాజంలో కొనసాగుతోన్న వివిధ వివక్షల్లో మహిళల అణచివేత తీవ్రంగా పరిణమిస్తోంది. పురుషాధిపత్య భావజాలం కారణంగానే ఈ అమానుషాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులను కూడా పురుషాధిపత్య పెత్తందారీ సమాజం కాలరాసి, స్త్రీలను అణచివేస్తోంది.
– పి. శంకర్, ప్రెసిడెంట్, దళిత బహుజన ఫ్రంట్, తెలంగాణ
తక్కువ కులపోల్లని చిన్నచూపే కదా..!
ఇప్పటికి నెలదాటింది. ఇంత వరకు దోషులపై చర్య తీసుకోలేదు. ఒక ఆడ మనిషి సర్పంచ్‌గా ఉండబట్టేగదా ఇట్ల జేస్తుండ్రు. అదే మగ సర్పంచ్ అయితే ఇట్ల జేస్తరా? దీనిపైన కంప్లైంట్ ఇస్తే డీఎస్పీ గూడ వచ్చి వెలివేసింది నిజమేనని జెప్పిండ్రు. ఎఫ్‌ఐఆర్ గూడ అయ్యింది. అయిన గూడ వాళ్లపైన ఏమీ చర్యలు దీసుకోలే. దీనికెవ్వరు సమాధానం జెప్తరు? ఇదంతా ఒక ఆడామె ఏం జెయ్యలేదనేగదా? లేకుంటే తక్కువకులపోల్లని చిన్నచూపేగదా?
– మమత, బుస్సాపూర్ గ్రామ సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment