పరువు కోసం.. కన్నబిడ్డను కడతేర్చాడు | murder For the dignity | Sakshi
Sakshi News home page

పరువు కోసం.. కన్నబిడ్డను కడతేర్చాడు

Published Tue, Feb 14 2017 1:34 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

పరువు కోసం.. కన్నబిడ్డను కడతేర్చాడు - Sakshi

పరువు కోసం.. కన్నబిడ్డను కడతేర్చాడు

నిజామాబాద్‌ జిల్లా అమ్రాద్‌లో ఘోరం
దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి
చదువయ్యాక మళ్లీ పెళ్లి చేస్తామని సర్దిచెప్పిన తండ్రి
మేనత్త ఇంటికి బిడ్డను పంపిన వైనం
భర్తే కావాలనడంతో కూతుర్ని చంపేందుకు కుట్ర
ఇంటికి తీసుకొస్తూ దారి మధ్యలో చున్నీతో ఉరి బిగించి హత్య
ఆపై స్నేహితులతో కలసి పెట్రోలు పోసి తగలబెట్టిన తండ్రి


డిచ్‌పల్లి చిట్టితల్లీ... అంటూ చిన్ననాట చేయి పట్టి నడిపించిన చేతులే ఉరి బిగించాయి..! బంగారు తల్లీ.. అంటూ మురిపెంగా గుండెలకు హత్తుకున్న కన్నతండ్రే కాలయముడయ్యాడు. పరువు ముందు ఓడిపోయిన తండ్రి ప్రేమ.. కూతురినే బలితీసుకుంది. దళితుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందన్న కోపంతో పక్కాగా ప్లాన్‌ చేసి మరీ బిడ్డను చంపేశాడు ఓ తండ్రి! ఇంటికి వెళ్దామని కూతుర్ని తీసుకెళ్లి దారిమధ్యలోనే స్నేహితులతో కలిసి దారుణంగా హతమార్చాడు. ఉరి బిగించి చంపేసి, పెట్రోలు పోసి కాల్చేశాడు. తర్వాత ఏమి తెలియనట్టు ఇంటికి వెళ్లి స్నానం చేశాడు. చివరికి పాపం పండి పోలీసులకు చిక్కాడు. అతడితోపాటు హత్యలో పాలుపంచుకున్నవారంతా ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌ మండలం అమ్రాద్‌లో గ్రామంలో చోటుచేసుకుంది. సోమవారం డిచ్‌పల్లి సర్కిల్‌ కార్యాలయంలో నిజామాబాద్‌ ఏసీపీ ఆనంద్‌కుమార్‌ ఘటన వివరాలను వెల్లడించారు.

రెండేళ్లుగా ప్రేమ.. రహస్యంగా పెళ్లి..
అమ్రాద్‌కు చెందిన కారెడ్డి రాజన్నకు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురుకు పెళ్లయింది. రెండో కూతురు రోజా(20) జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సెకండియర్‌ చదువుతోంది. సుమారు రెండేళ్లుగా అదే గ్రామానికి చెందిన సాయికుమార్‌ అనే యువకుడు, రోజా ప్రేమించుకుంటున్నారు. గతంలో వీరిద్దరి ప్రేమ వ్యవహారం తెలియడంతో రోజా కుటుంబీకులు... సాయికుమార్‌ను పట్టుకుని కొట్టారు. మళ్లీ రోజాను కలవకూడదని హెచ్చరించారు. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఇద్దరు ప్రేమలో మునిగిపోయారు. 2016 డిసెంబర్‌ 23న రోజా, సాయికుమార్‌ భీంగల్‌ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మినర్సింహస్వామి ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వారం రోజుల తర్వాత వారిని వెదికి పట్టుకున్న రోజా కుటుంబీకులు ఇద్దరినీ అమ్రాద్‌కు తీసుకువచ్చారు. రోజా చదువు ముగిసే వరకు కలుసుకోవద్దని, ఆ తర్వాత అందరి ఎదుట పెళ్లి చేస్తామని ఇద్దరికీ నచ్చచెప్పారు. అనంతరం రోజాను ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామంలో ఉంటున్న మేనత్త (రాజన్న సోదరి) వద్దకు పంపించారు. అక్కడికి వెళ్లిన వారం తర్వాత.. తనను సాయికుమార్‌ వద్దకు పంపించాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని రోజా బెదిరించింది. దీంతో మేనత్త ఈ విషయాన్ని రాజన్నకు చెప్పి, రోజాను తీసుకెళ్లాలని కోరింది. రోజా దళితుడిని పెళ్లి చేసుకుని గ్రామంలో తలెత్తుకుని తిరగకుండా చేసిందని, పెళ్లీడుకొచ్చిన చిన్న కూతురుకు పెళ్లి కాదేమోనని రాజన్న మనస్తాపానికి గురయ్యాడు. ఎంత నచ్చ చెప్పినా.. వినకపోవడంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు.

అడవిలో ఆటో నిలిపి..
కూతురును హతమార్చాలని నిర్ణయించుకున్న రాజన్న ఇందుకు గ్రామ సర్పంచ్‌ కీకాయి జలందర్, ఆర్మూర్‌ ఒడ్డెన్న, మరో నలుగురు స్నేహితుల సాయం కోరాడు. వారు కూడా అంగీకరించారు. కిందటినెల 24న రాత్రి తన స్నేహితుడు పాల్ద గంగాధర్‌ ట్రాలీ ఆటోలో జానకంపేట్‌కు వెళ్లిన రాజన్న.. కూతురు రోజాను తీసుకుని ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యలో సారంగపూర్‌ వద్ద పది లీటర్ల పెట్రోలు కొనుగోలు చేశారు. అక్కడ్నుంచి జక్రాన్‌పల్లి మండలం పడకల్‌ శివారులోని గొల్లగుట్టకు చేరుకున్నారు. ట్రాలీ ఆటోలో ముగ్గురు, వెనకాల రెండు బైక్‌లపై నలుగురు మొత్తం ఏడుగురు గొల్లగుట్టకు వచ్చారు. అటవీ ప్రాంతంలో ఆటోను నిలిపి రోజాను కిందకు దించారు. ఆమె ఒంటిపై ఐదు లీటర్ల పెట్రోలు పోశారు. ఈ సమయంలో రాజన్న.. సాయికుమార్‌ను మర్చిపోవాలని లేదంటే చంపేస్తామంటూ కూతురిని బెదిరించాడు. అయితే తాను అతడిని పెళ్లి చేసుకున్నానని, అతడితోనే ఉంటానని ఆమె స్పష్టం చేసింది. అంతేగాకుండా తనకు సాగుభూమి, నివాస గృహంలో వాటా ఉంటుందని చెప్పింది. దీంతో రాజన్న పూర్తిగా విచక్షణ కోల్పోయాడు. ఒడ్డెన్నతో కలిసి చున్నీని రోజా మెడకు చుట్టి చెరోవైపు గట్టిగా లాగి హత్య చేశారు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు తీసివేసి మిగిలిన పెట్రోలు పోసి తగులబెట్టారు. ఆమె దుస్తులు, పెట్రోలు కొనుగోలు చేసిన క్యాన్‌ను మునిపల్లి శివారులో పడేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరింటికి వాళ్లు చేరుకుని స్నానాలు చేశారు. ఈ సమయంలో ఎందుకు స్నానం చేస్తున్నావని రోజా తల్లి అడగ్గా.. పొద్దంతా తిరగడంతో దుమ్ము పట్టి స్నానం చేస్తున్నానని సమాధానం చెప్పాడు.

నిందితులు దొరికారిలా...
జనవరి 27న స్థానికులు ఇచ్చిన సమాచారంతో రోజా మృతదేహం వద్దకు జక్రాన్‌పల్లి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హత్యాస్థలంలో ఆధారాలు లభించక పోవడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. వారమైనా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో పోలీసులు దర్యాప్తును మరో కోణంలో ప్రారంభించారు. కుటుంబ సభ్యులే హత్యకు పాల్పడితే మిస్సింగ్‌ కేసు నమోదు కాదని భావించి.. సమీప గ్రామాల్లో ఎవరైనా యువతి అదృశ్యానికి గురైందా అని రహస్యంగా విచారణ చేపట్టారు. అమ్రాద్‌లో రోజా కొద్దిరోజుల నుంచి కన్పించడం లేదని తెలిసింది. దీంతో సాయికుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తర్వాత గ్రామంలో రహస్యంగా విచారణ చేపట్టారు. రోజాను తండ్రే హత్య చేసి ఉంటాడని కొందరు అనుమానాలు వ్యక్తం చేయడంతో.. రాజన్నను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ జరిపారు. దీంతో పరువు కోసం తానే కూతురిని హత్య చేసినట్లు రాజన్న అంగీకరించాడు. హత్యలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రోజా దుస్తులు, నిందితులు ఉపయోగించిన ట్రాలీ ఆటో, రెండు బైక్‌లు, ఏడు సెల్‌పోన్లు, సిగార్‌ లైటర్, పెట్రోల్‌ క్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన పోలీసులను ఏసీపీ ఆనంద్‌కుమార్‌ ప్రశంసించారు. సీఐ, ఎస్సైలతో పాటు కానిస్టేబుళ్లకు రివార్డులు అందజేయాలని సిఫార్సు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement