Thugs Murdered Young Man Over Having Affair With Ex Girlfriend In Jagityal, Details Inside - Sakshi
Sakshi News home page

అనుమానించి.. హతమార్చారు

Published Mon, Jun 26 2023 3:24 AM | Last Updated on Mon, Jun 26 2023 10:35 AM

Murder in Jagtial district - Sakshi

సారంగాపూర్‌ (జగిత్యాల): గతంలో ప్రేమించిన ఓ యువతికి పెళ్లయినప్పటికీ మళ్లీ ప్రేమాయణం సాగిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దుండగులు ఆదివారం నరికి చంపిన ఘటన జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం బీర్‌పూర్‌కు చెందిన జువ్వకింది వంశీ (23) తుంగూర్‌లోని ఓ మోటార్‌ డ్రైవింగ్‌ స్కూల్‌లో పనిచేస్తున్నాడు.

పని నిమిత్తం బీర్‌పూర్‌ మండలం కొల్వాయి వెళ్లి మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో బీర్‌పూర్‌ తిరిగి వస్తున్నాడు. అప్పటికే తుంగూర్‌లో మాటు వేసిన కొందరు దుండగులు.. వంశీని ఆపి వెంటతెచ్చుకున్న గొడ్డలి, ఇతర ఆయుధాలతో తలపై నరికారు. తల, నోటికి బలమైన గాయాలు కావడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి జేబులోని మొబైల్‌ఫోన్‌ను తీసు కున్న దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. 

ప్రేమ వ్యవహారమే కారణమా? 
బీర్‌పూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి, వంశీకి మధ్య చాలాకాలం ప్రేమ వ్యవహారం నడిచింది. మరోసారి యువతి జోలికి రావొద్దని ఆమె కుటుంబ సభ్యులు వంశీని అప్పట్లో మందలించారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం ఆ యువతికి మరో యువకుడితో వివాహం జరిపించారు. అయినా వంశీ ఆమెకు తరచూ ఫోన్‌ చేస్తూ మాట్లాడటం, కలవడం చేస్తున్నాడని యువతి కుటుంబ సభ్యులు అనుమానించసాగారు. ఇలా అయితే ఆమె కాపురం కూలిపోయే ప్రమాదం ఉందని భావించి వంశీని హతమార్చేందుకు కుట్రపన్నారు. 

మృతుడి కుటుంబం ధర్నా.. 
వంశీ హత్య సమాచారం తెలిసిన వెంటనే మృతుడి బంధువులు తుంగూర్‌ గ్రామానికి చేరుకొని రోడ్డుపై 2 గంటలపాటు బైఠాయించారు. హంతకులను తమకు అప్పగించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని మృతుడి తల్లి భాగ్య, బాబాయ్‌ అక్కడే ఉన్న లారీ కిందకు వెళ్లారు.

అయితే దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఓ గ్రామానికి చెందిన రమేశ్, విష్ణుపై తమకు అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. మృతుడి తల్లి దినసరి కూలీకాగా తండ్రి శ్రీహరి ఉపాధి కోసం ముంబై వెళ్లాడు. వంశీకి ఓ సోదరుడు ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement