ఉప్పుగూడ పారిశ్రామిక వాడల్లో మృతదేహం లభ్యం
వీడిన బాలిక మిస్సింగ్ మిస్టరీ
మియాపూర్: మైనర్ అమ్మాయిని ఇన్‌స్ట్రాగాంలో పరిచయం చేసుకుని హత్యచేసి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ క్రాంతి కుమార్ సోమవారం కేసు వివరాలను తెలిపారు. అశోక్ కుటుంబం మియాపూర్‌లోని టేకు నర్సింహనగర్‌లో నివాసముంటోంది. చిన్న కుమార్తె(17) గత నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని బాలిక తల్లి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటు(22)పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్‌ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బాలికను నగరంలోని ఫలక్‌నుమా దేవాలయంలో పరిచయం చేసుకుని ఇన్‌స్టాలో చాటింగ్ చేసుకునేవారని చెప్పాడు. ఈ క్రమంలో వారు ప్రేమించుకున్నారు. దీంతో అమ్మాయి గత నెల ఇంటినుంచి వెళ్లిపోయింది. విఘ్నేష్ ఆ బాలికను మీర్‌పేట్‌లోని స్నేహితులు సాకేత్, కళ్యాణిల గదిలో ఉంచాడు. అమ్మాయి తరచూ పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో ఈ నెల 8న పెళ్లిచేసుకున్నట్లు దండలు మార్చుకుని ఫోటోలుదిగి అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడు.
అనంతరం బాలికను హత్యచేయాలనే పథకం పన్నాడు. 8న విఘ్నేష్.. అమ్మాయి గొంతు నులిమి మొఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అదేరోజు అర్ధరాత్రి సాకేత్, కళ్యాణిలతో కలిసి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాకేత్.. బాలిక మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి ఉప్పుగూడ దగ్గరలోని పారిశ్రామిక వాడలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి చెత్తాచెదారం కప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విఘ్నేష్ తనకేమి తెలియనట్లు అమ్మాయి తల్లిదండ్రులకు కాల్ చేసి అమ్మాయి మీ దగ్గరకు వస్తుందని చెప్పి ఇక్కడి నుండి వెళ్లిందని, వచి్చందా అని అడిగాడు.
అనుమానించిన తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విఘ్నేష్‌ను విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. పారిశ్రామిక వాడకు వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లిచేసుకోవాలని తరచూ ఒత్తిడి చేయడంతోనే హత్యచేసినట్లు తెలిపారు. హత్యచేసిన విఘ్నేష్, అతనికి సహకరించిన సాకేత్, కళ్యాణిలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment