miyapur police station
-
ప్రేమికుడే కాలయముడు!
మియాపూర్: మైనర్ అమ్మాయిని ఇన్‌స్ట్రాగాంలో పరిచయం చేసుకుని హత్యచేసి మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ సోమవారం కేసు వివరాలను తెలిపారు. అశోక్ కుటుంబం మియాపూర్‌లోని టేకు నర్సింహనగర్లో నివాసముంటోంది. చిన్న కుమార్తె(17) గత నెల 20వ తేదీ నుంచి కనిపించడం లేదని బాలిక తల్లి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్ అలియాస్ చింటు(22)పై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఉప్పుగూడకు చెందిన విఘ్నేష్‌ను మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా బాలికను నగరంలోని ఫలక్‌నుమా దేవాలయంలో పరిచయం చేసుకుని ఇన్‌స్టాలో చాటింగ్ చేసుకునేవారని చెప్పాడు. ఈ క్రమంలో వారు ప్రేమించుకున్నారు. దీంతో అమ్మాయి గత నెల ఇంటినుంచి వెళ్లిపోయింది. విఘ్నేష్ ఆ బాలికను మీర్పేట్లోని స్నేహితులు సాకేత్, కళ్యాణిల గదిలో ఉంచాడు. అమ్మాయి తరచూ పెళ్లిచేసుకోమని ఒత్తిడి చేయడంతో ఈ నెల 8న పెళ్లిచేసుకున్నట్లు దండలు మార్చుకుని ఫోటోలుదిగి అమ్మాయి తల్లిదండ్రులకు పంపించాడు. అనంతరం బాలికను హత్యచేయాలనే పథకం పన్నాడు. 8న విఘ్నేష్.. అమ్మాయి గొంతు నులిమి మొఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. అదేరోజు అర్ధరాత్రి సాకేత్, కళ్యాణిలతో కలిసి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాకేత్.. బాలిక మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి ఉప్పుగూడ దగ్గరలోని పారిశ్రామిక వాడలోని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి చెత్తాచెదారం కప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. విఘ్నేష్ తనకేమి తెలియనట్లు అమ్మాయి తల్లిదండ్రులకు కాల్ చేసి అమ్మాయి మీ దగ్గరకు వస్తుందని చెప్పి ఇక్కడి నుండి వెళ్లిందని, వచి్చందా అని అడిగాడు. అనుమానించిన తల్లిదండ్రులు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విఘ్నేష్‌ను విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. పారిశ్రామిక వాడకు వెళ్లి చూడగా మృతదేహం కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పెళ్లిచేసుకోవాలని తరచూ ఒత్తిడి చేయడంతోనే హత్యచేసినట్లు తెలిపారు. హత్యచేసిన విఘ్నేష్, అతనికి సహకరించిన సాకేత్, కళ్యాణిలను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
Hyderabad: మియాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్య
మియాపూర్: ఓ మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.వైజాగ్‌కు చెందిన బండి స్పందన(29)దీప్తీ శ్రీనగర్ కాలనీలోని సీబీఆర్ ఎస్టేట్‌లో అపార్ట్మెంట్లో తల్లి నమ్రత, సోదరుడితో కలిసి నివాసముంటోంది. ఆమెకు 2022లో వారణాసి వినయ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న స్పందన తల్లి నమ్రత సోమవారం ఉదయం స్కూల్‌కు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా బయటి నుంచి తాళం వేసి ఉంది. దీంతో ఆమె కుమార్తెకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లిచూడగా బెడ్రూమ్లో స్పందన రక్తపు మడుగులో కనిపించింది. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలు ఉన్నాయి. దీంతో ఆమె మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
Hyderabad: హోటల్ మేనేజర్‌పై కాల్పులు
హైదరాబాద్: మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మదీనాగూడలో బుధవారం అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఓ హోటల్ మేనేజర్‌పై గుర్తుతెలియని వ్యక్తి మొత్తం ఆరు రౌండ్లు కాల్చారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. నిందితుడి కోసం ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని డీసీపీ జి.సందీప్ తెలిపారు. కోల్‌కతాకు చెందిన దేవేందర్ గాయన్ (35) ఆరు నెలలుగా మదీనగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. సికింద్రాబాద్ సమీపంలోని సుచిత్ర ప్రాంతంలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకున్న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికీ హోటల్ మూసి వేయకపోవడంతో వినియోగదారుల రాకపోకలు సాగుతున్నాయి. తన ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన దేవేందర్‌కు హోటల్ ముందరే అతడి స్నేహితుడు కనిపించాడు. దీంతో అక్కడే ఆగిన ఆయన స్నేహితుడితో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మదీనగూడ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు. దేవేందర్‌కు సమీపంలోనే ఆగి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొత్తం ఆరు రౌండ్లు కాల్చగా..నాలుగు దేవేందర్ శరీరంలోకి దూసుకుపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పులు జరిపిన అనంతరం చందానగర్ వైపు పారిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో కన్నుమూశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలితో పాటు ఆస్పత్రికి చేరుకున్నారు. దేవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు దేవేందర్ గత చరిత్ర, కుటుంబ నేపథ్యం సహా వివిధ అంశాలు ఆరా తీస్తున్నారు. దేవేందర్‌ను టార్గెట్‌గా చేసుకున్న సదరు వ్యక్తి ఆ హోటల్ వద్ద రెక్కీ చేసి ఉంటాడని, కొద్దిసేపు వేచి చూసి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో గడిచిన వారం రోజులుగా ఆ హోటల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు, మదీనగూడ–సుచిత్ర, మదీనగూడ–చందానగర్ మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరిస్తున్నారు. నిందితుడి కోసం ఎస్ఓటీ పోలీసులు గాలింపు ప్రారంభించారు. -
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా, ఐరాల గ్రామానికి చెందిన ముల్లగూరు జ్ఞానేంద్రప్రసాద్ (50). 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఆల్వీన్ కాలనీలో నివాసముంటున్నారు. బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందాడు. గత జూన్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను శస్త్ర చికిత్స అనంతరం ఫిజియోథెరఫీ చేయించుకుంటూ తన నివాసంలోని పై అంతస్తులో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. సోమవారం ఉదయం తన పీఏ సురేష్‌ను పిలిచి కాసేపు డిస్ట్రబ్ చేయవద్దని చెప్పి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని పడుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత సురేష్ టిఫిన్ ఇచ్చేందుకు రూమ్‌కు వెళ్లి పిలువగా స్పందన లేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా జ్ఞానేంద్ర ప్రసాద్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు. తలుపులు బద్దలు కొట్టి అతడిని కిందకు దింపిన కుటుంబ సభ్యులు సమీపంలోని శ్రీకర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య సౌమ్య శ్రీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జ్ఞానేంద్రప్రసాద్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్రవంతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాలతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్లో స్రవంతి (26) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. భర్త రవి కిరణ్ కూడా సాప్ట్వేర్ ఉద్యోగి. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని స్రవంతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
ట్యాబ్ ఇవ్వలేదని భవనం పైనుంచి దూకాడు
మియాపూర్: అన్నదమ్ముల మధ్య ట్యాబ్ వివాదం అందులో ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైంది. అన్నదమ్ములు ట్యాబ్ కోసం పోట్లాడుకోవడం చూసిన తండ్రి ట్యాబ్‌ను అన్నకు ఇవ్వడంతో తమ్ముడు మనస్తాపానికి గురై భవనం పైనుంచి దూకి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలను ఎస్ఐ లింగానాయక్ మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతులు మదీనాగూడలోని స్వప్న నిర్మాణ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నందకిశోర్, బాల వెంకట సత్యప్రసాద్ (12) ఇద్దరు కుమారులు. సత్యప్రసాద్ కొండాపూర్‌లోని మహర్షి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ ఆడుకునే ట్యాబ్ కోసం గొడవపడ్డారు. ఇది చూసిన శ్రీనివాస్ ట్యాబ్‌ను నందకిశోర్‌కు ఇచ్చాడు. దీంతో సత్యప్రసాద్ మనస్తాపానికి గురయ్యాడు. శ్రీనివాస్ ఉద్యోగానికి వెళ్తుండగా సత్యప్రసాద్ వెళ్లవద్దని మారాం చేశాడు. కుమారుని మాటలు పట్టించుకోకుండా తండ్రి ఉద్యోగానికి వెళ్లాడు. దీంతో సత్యప్రసాద్ క్షణికావేశంలో ఐదు అంతస్తుల భవనం పెంట్‌హౌస్ నుంచి కిందికి దూకాడు. తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఇది చూసిన తల్లిదండ్రులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సింపుల్‌గా చోరీ.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: అర్ధరాత్రి కుటుంబీకులంతా నిద్రిస్తున్న సమయంలో ఇంటి కిటికీలోంచి కర్రతో హ్యాండ్ బ్యాగ్‌ను తస్కరించి అందులో ఉన్న రూ.15 వేల నగదును కాజేసి ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు చెప్పిన వివరాలు.. మియాపూర్ జేపీఎన్ నగర్‌లోని ప్లాట్ నంబర్ 242లో రవి అనే ఫొటోగ్రాఫర్ అద్దెకు ఉంటున్నాడు. (చదవండి: 20 రోజులు.. 2 సార్లు.. రూ.2.2 లక్షలు!) సోమవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ప్లాట్లోని ఇంటి గేటు పైనుంచి దూకిన దొంగ.. ఇంటి వెనక కిటికీ వద్దకు వెళ్లాడు. అక్కడే ఉన్న కర్రను తీసుకొని చివరి భాగంలో ఇనుప వైరును కొక్కెంగా చేసి బిగించాడు. దాని సహాయంతో కిటికిలో నుంచి గోడకు తగిలించిన హ్యాండ్ బ్యాగ్‌ను తస్కరించాడు. అందులో ఉన్న రూ.15 వేలు తీసుకుని పరారయ్యాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇన్స్పెక్టర్ వెంకటేష్, డీఐ మహేష్, ఎస్ఐ ప్రసాద్‌లు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఊరెళ్తున్నారా... ఇల్లు భద్రం) -
హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో ఐదేళ్ల చిన్నారి మృతదేహం
మెదక్: జిల్లాలోని కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో గురువారం ఓ దారుణం వెలుగుచూసింది. జాకీర్ హుస్సేన్ అనే హెడ్‌కానిస్టేబుల్ ఇంట్లో ఐదేళ్ల చిన్నారి మృతదేహం బయటపడింది. బాలిక శరీరంపై గాయాలు ఉన్నట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహన్ని పరిశీలించారు. బాలిక విషయమై జాకీర్ కుటుంబాన్ని పోలీసులు ఆరాతీశారు. మియాపూర్ పోలీసు స్టేషన్లో జాకీర్ హుస్సేన్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అయితే బాలిక మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
తండ్రీ కొడుకులపై ప్రిన్సిపాల్ దౌర్జన్యం
అరెస్ట్, కేసు నమోదు మియాపూర్ : తమ బాబును ఎందుకు కొట్టారని అడిగిన పాపానికి ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తండ్రి చెంప చెల్లుమనిపించారు. దీంతో వివాదం చెలరేగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ జనప్రియ వెస్ట్ సిటీలో నివాసముంటున్న రత్నాకర్, రమ్య దంపతులు వారి కుమారుడు జగదీశ్ సాయి (3)ని అదే కాలనీలోని జనప్రియ ఒలంపియాడ్ స్కూల్లో నర్సరీలో చేర్పించారు. మంగళవారం ఉదయం పాఠశాలలో టీచర్ శాంతి క్లాస్‌లో చదువు చెబుతుండగా అదే సమయంలో ప్రిన్సిపాల్ శ్రీహరి పరిశీలించడానికి వచ్చారు. ఆ సమయంలో క్లాస్‌లో అల్లరి చేస్తున్న జగదీశ్‌పై శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంప మీద బలంగా కొట్టాడు. దీంతో చిన్నారికి చెంపపై వాతలు ఏర్పడ్డాయి. కొద్ది సేపటి తరువాత చిన్నారిని తీసుకువెళ్ళేందు వచ్చిన తల్లి రమ్య జరిగిన విషయాన్ని తెలుసుకుంది. వెంటనే తన భర్తకు సమాచారం అందించడంతో రత్నాకర్ పాఠశాలకు వెళ్ళి ప్రినిపాల్‌ను ప్రశ్నించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాను ఇలాగే కొడతాను ఏం చేస్తావు అంటూ రత్నాకర్ చెంప చెల్లుమనిపించాడు. దాడిలో గాయపడిన రత్నాకర్ మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు డిమాండ్ చేశారు.