హైదరాబాద్: మియాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మదీనాగూడలో బుధవారం అర్ధరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఓ హోటల్ మేనేజర్‌పై గుర్తుతెలియని వ్యక్తి మొత్తం ఆరు రౌండ్లు కాల్చారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశాడు. నిందితుడి కోసం ఐదు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని డీసీపీ జి.సందీప్ తెలిపారు. కోల్‌కతాకు చెందిన దేవేందర్ గాయన్ (35) ఆరు నెలలుగా మదీనగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు.
సికింద్రాబాద్ సమీపంలోని సుచిత్ర ప్రాంతంలో కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి విధులు ముగించుకున్న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చారు. అప్పటికీ హోటల్ మూసి వేయకపోవడంతో వినియోగదారుల రాకపోకలు సాగుతున్నాయి. తన ఇంటికి వెళ్లడానికి సిద్ధమైన దేవేందర్‌కు హోటల్ ముందరే అతడి స్నేహితుడు కనిపించాడు. దీంతో అక్కడే ఆగిన ఆయన స్నేహితుడితో మాట్లాడుతున్నారు. అదే సమయంలో మదీనగూడ వైపు నుంచి ద్విచక్ర వాహనంపై హెల్మెట్ ధరించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి వచ్చాడు.
దేవేందర్‌కు సమీపంలోనే ఆగి తన వద్ద ఉన్న నాటు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొత్తం ఆరు రౌండ్లు కాల్చగా..నాలుగు దేవేందర్ శరీరంలోకి దూసుకుపోయాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. కాల్పులు జరిపిన అనంతరం చందానగర్ వైపు పారిపోయాడు. అప్రమత్తమైన స్థానికులు సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో కన్నుమూశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలితో పాటు ఆస్పత్రికి చేరుకున్నారు. దేవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన మియాపూర్ పోలీసులు దేవేందర్ గత చరిత్ర, కుటుంబ నేపథ్యం సహా వివిధ అంశాలు ఆరా తీస్తున్నారు. దేవేందర్‌ను టార్గెట్‌గా చేసుకున్న సదరు వ్యక్తి ఆ హోటల్ వద్ద రెక్కీ చేసి ఉంటాడని, కొద్దిసేపు వేచి చూసి ఉంటాడని అనుమానిస్తున్నారు. దీంతో గడిచిన వారం రోజులుగా ఆ హోటల్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు, మదీనగూడ–సుచిత్ర, మదీనగూడ–చందానగర్ మార్గాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫీడ్‌ను సేకరిస్తున్నారు. నిందితుడి కోసం ఎస్‌ఓటీ పోలీసులు గాలింపు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment