జ్ఞానేంద్రప్రసాద్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా, ఐరాల గ్రామానికి చెందిన ముల్లగూరు జ్ఞానేంద్రప్రసాద్ (50). 30 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి ఆల్వీన్ కాలనీలో నివాసముంటున్నారు. బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కీలక నాయకుడిగా గుర్తింపు పొందాడు.
గత జూన్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను శస్త్ర చికిత్స అనంతరం ఫిజియోథెరఫీ చేయించుకుంటూ తన నివాసంలోని పై అంతస్తులో ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. సోమవారం ఉదయం తన పీఏ సురేష్‌ను పిలిచి కాసేపు డిస్ట్రబ్ చేయవద్దని చెప్పి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని పడుకున్నాడు. కొద్ది సేపటి తర్వాత సురేష్ టిఫిన్ ఇచ్చేందుకు రూమ్‌కు వెళ్లి పిలువగా స్పందన లేదు. దీంతో కిటికీలో నుంచి చూడగా జ్ఞానేంద్ర ప్రసాద్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించాడు.
తలుపులు బద్దలు కొట్టి అతడిని కిందకు దింపిన కుటుంబ సభ్యులు సమీపంలోని శ్రీకర్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మియాపూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్య సౌమ్య శ్రీ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జ్ఞానేంద్రప్రసాద్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment