కన్సల్టెన్సీ ఆఫీస్‌లో లా విద్యార్థిని ఆత్మహత్య | Law student suicide in consultancy office at Hyderabad Malakpet: Telangana | Sakshi
Sakshi News home page

కన్సల్టెన్సీ ఆఫీస్‌లో లా విద్యార్థిని ఆత్మహత్య

Published Tue, Nov 26 2024 1:08 AM | Last Updated on Tue, Nov 26 2024 1:08 AM

Law student suicide in consultancy office at Hyderabad Malakpet: Telangana

అత్యాచారం చేసి హత్య చేశారంటూ జాతీయ రహదారిపై గిరిజన సంఘాల రాస్తారోకో  

పోలీసుల అదుపులో కన్సల్టెన్సీ నిర్వాహకులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు  

మలక్‌పేట: ఎల్‌ఎల్‌బీ చదువుతున్న ఓ గిరిజన విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మలక్‌పేట పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. మృతురాలి తల్లిదండ్రులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం తక్రాజ్‌గూడ తండాకు చెందిన ఇస్లావత్‌ రమేశ్‌– కంసీ దంపతులకు శ్రావ్య(20), శ్రుతి, సాయికిరణ్‌ సంతానం. శ్రావ్య ఎల్‌బీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ ఎన్‌టీఆర్‌నగర్‌ మహాత్మాగాంధీ లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. మలక్‌పేటలోని నందిని రెసిడెన్సీలో నవీన్, విజయ్‌లు జయదుర్గా ఎడ్యుకేషన్స్‌ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు. శ్రావ్య మూడు నెలలుగా నవీన్‌ వద్ద పనిచేస్తోంది. ఆదివారం కన్సల్టెన్సీకి వెళ్లిన శ్రావ్య సాయంత్రం తన తమ్ముడు సాయికిరణ్‌కు ఫోన్‌ చేసి రూ.20 వేలు ఫోన్‌ పే చేయాలని కోరింది. సాయికిరణ్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసిన తర్వాత శ్రావ్యకు ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు.

దీంతో అతను హాస్టల్‌లో శ్రావ్యతోపాటు ఉంటున్న శిరీషకు ఫోన్‌ చేశాడు. దీంతో శిరీష తన స్నేహితురాలైన సోనికి విషయం చెప్పింది. దీంతో సోనీ తన స్నేహితుడైన కార్తీక్‌తో కలిసి కన్సల్టెన్సీకి వెళ్లింది. పక్క ఫ్లాట్‌లో ఉన్న రవీందర్, గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న మరో మహిళతో కలిసి ఆఫీస్‌రూమ్‌ వద్దకు వెళ్లారు. ఆఫీసురూమ్‌ బయట శ్రావ్య చెప్పులు ఉండటం గమనించారు. వారు తలుపులు తీసి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో అది సాధ్యం కాలేదు. కిటికీలో నుంచి చూడగా శ్రావ్య సీలింగ్‌ ఫ్యాన్‌కు స్కార్ఫ్‌తో ఉరేసుకొని కనిపించింది.

దీంతో తలుపులు పగులగొట్టి శ్రావ్యను కిందకు దించారు. రవీందర్‌ కారులో మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా, శ్రావ్య మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎస్సై సురేశ్‌ అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఆందోళనకు దిగిన గిరిజన సంఘాలు  
శ్రావ్య మరణవార్త తెలుసుకున్న గిరిజన సంఘాలు, మృతురాలి బంధువులు సోమవారం పెద్ద సంఖ్యలో మలక్‌పేట పీఎస్‌ వద్దకు చేరుకొని ధర్నా చేశారు. అనంతరం కన్సల్టెన్సీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆదివారం సెలవురోజు కన్సల్టెన్సీ నిర్వాహకుడు నవీన్‌ కార్యాలయానికి శ్రావ్యను ఎందుకు పిలిపించారని ప్రశ్నించారు. శ్రావ్యపై అత్యాచారం చేసి హత్య చేశారని, చున్నీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పోలీసులు మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారన్నారు. కన్సల్టెన్సీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

విచారణ కొనసాగుతోంది  
గిరిజన విద్యార్థి మృతి చెందిన విషయంపై ఆదివారం రాత్రి మలక్‌పేట పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ నరేష్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కన్సల్టెన్సీ నిర్వాహకులు నవీన్, విజయ్‌ని అదుపులోకి తీసుకున్నాం. శ్రావ్యను ఆస్పత్రికి తరలించిన కార్తీక్, సోనిలను కూడా విచారిస్తాం. క్లూస్‌ టీమ్‌ కన్సల్టెన్సీ కార్యాలయాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించింది.నిçష్పక్షపాతంగా విచారణ కొనసాగుతుంది.  – శ్యామ్‌సుందర్, మలక్‌పేట ఏసీపీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement