
మియాపూర్: అన్నదమ్ముల మధ్య ట్యాబ్ వివాదం అందులో ఒకరి ప్రాణం పోయేందుకు కారణమైంది. అన్నదమ్ములు ట్యాబ్ కోసం పోట్లాడుకోవడం చూసిన తండ్రి ట్యాబ్‌ను అన్నకు ఇవ్వడంతో తమ్ముడు మనస్తాపానికి గురై భవనం పైనుంచి దూకి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలను ఎస్‌ఐ లింగానాయక్ మీడియాకు వివరించారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతులు మదీనాగూడలోని స్వప్న నిర్మాణ్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నందకిశోర్, బాల వెంకట సత్యప్రసాద్ (12) ఇద్దరు కుమారులు.
సత్యప్రసాద్ కొండాపూర్‌లోని మహర్షి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం అన్నదమ్ములిద్దరూ ఆడుకునే ట్యాబ్ కోసం గొడవపడ్డారు. ఇది చూసిన శ్రీనివాస్ ట్యాబ్‌ను నందకిశోర్‌కు ఇచ్చాడు. దీంతో సత్యప్రసాద్ మనస్తాపానికి గురయ్యాడు. శ్రీనివాస్ ఉద్యోగానికి వెళ్తుండగా సత్యప్రసాద్ వెళ్లవద్దని మారాం చేశాడు. కుమారుని మాటలు పట్టించుకోకుండా తండ్రి ఉద్యోగానికి వెళ్లాడు. దీంతో సత్యప్రసాద్ క్షణికావేశంలో ఐదు అంతస్తుల భవనం పెంట్‌హౌస్ నుంచి కిందికి దూకాడు. తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఇది చూసిన తల్లిదండ్రులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment