తండ్రీ కొడుకులపై ప్రిన్సిపాల్ దౌర్జన్యం
అరెస్ట్, కేసు నమోదు
మియాపూర్ : తమ బాబును ఎందుకు కొట్టారని అడిగిన పాపానికి ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తండ్రి చెంప చెల్లుమనిపించారు. దీంతో వివాదం చెలరేగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ జనప్రియ వెస్ట్ సిటీలో నివాసముంటున్న రత్నాకర్, రమ్య దంపతులు వారి కుమారుడు జగదీశ్ సాయి (3)ని అదే కాలనీలోని జనప్రియ ఒలంపియాడ్ స్కూల్‌లో నర్సరీలో చేర్పించారు. మంగళవారం ఉదయం పాఠశాలలో టీచర్ శాంతి క్లాస్‌లో చదువు చెబుతుండగా అదే సమయంలో ప్రిన్సిపాల్ శ్రీహరి పరిశీలించడానికి వచ్చారు.
ఆ సమయంలో క్లాస్‌లో అల్లరి చేస్తున్న జగదీశ్‌పై శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చెంప మీద బలంగా కొట్టాడు. దీంతో చిన్నారికి చెంపపై వాతలు ఏర్పడ్డాయి. కొద్ది సేపటి తరువాత చిన్నారిని తీసుకువెళ్ళేందు వచ్చిన తల్లి రమ్య జరిగిన విషయాన్ని తెలుసుకుంది. వెంటనే తన భర్తకు సమాచారం అందించడంతో రత్నాకర్ పాఠశాలకు వెళ్ళి ప్రినిపాల్‌ను ప్రశ్నించారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. తాను ఇలాగే కొడతాను ఏం చేస్తావు అంటూ రత్నాకర్ చెంప చెల్లుమనిపించాడు. దాడిలో గాయపడిన రత్నాకర్ మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు డిమాండ్ చేశారు.