School Activity
-
‘క్షమించు తల్లి’.. చిన్నారికి స్కూల్ ప్రిన్సిపల్ క్షమాపణలు
ముంబై : ఐదు నిమిషాలు ఆలస్యంగా క్లాస్ వచ్చిన చిన్నారిపై ఓ స్కూల్ యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. చిన్నారితో బలవంతంగా 50 గుంజీలు చేయించింది. దీంతో చిన్నారి అస్వస్థతకు గురైంది. మహరాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన ప్రముఖ స్కూల్‌కు చెందిన 13ఏళ్ల చిన్నారి స్కూల్‌కు ఆలస్యంగా వచ్చింది. దీంతో స్కూల్‌కు ఆలస్యంగా ఎందుకు వచ్చావని ప్రశ్నించిన స్కూల్ ప్రిన్సిపల్ చిన్నారితో 50 గుంజీలు తీయించారు. ఫలితంగా చిన్నారి నొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.స్కూల్ యాజమాన్యం తీరుపై సమాచారం అందుకున్న తల్లిదడడ్రులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపల్‌పై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ప్రిన్సిపల్‌పై చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పిల్లలు కోరారని, పిల్లల విజ్ఞప్తితో తల్లిదండ్రులు కేసును ఉపసంహరించుకున్నట్లు పాల్ఘర్ పోలీస్ స్టేషన్ ఎస్సై అనంత్ పరాడ్ తెలిపారు. తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యంతో మాట్లాడినట్లు చెప్పారు.పాఠశాల యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశామని, భవిష్యత్తులో అలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలని వారికి సూచించామన్నారు. ఇక స్కూల్ ప్రిన్సిపాల్ సైతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. అనంతరం క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!
అక్షరాల రూ.4.27 లక్షలు. ఇదేదో వార్షికవేతనం అనుకుంటే పొరపడినట్లే. ఇది ఎడ్యుకేషన్ ఫీజు. ‘అందులో ఏముంది ఎంబీబీఎస్ చదువుకో. ఇంజినీరింగ్ చదువుకో అంత అవుతుంది కదా’ అంటారా. ఇది కేవలం ఒకటో తరగతిలో చేరడానికి కావాల్సిన ఫీజు. అవును.. మీరు విన్నది నిజమే. వచ్చే కొత్త విద్యా సంవత్సరంలో తన కూతురు ఒకటో తరగతి స్కూల్ ఫీజును రాషబ్ జైన్ అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. దాంతో ఇదికాస్తా వైరల్‌గా మారింది.‘నా కుమార్తె వచ్చే ఏడాది గ్రేడ్ 1లో చేరుతుంది. అందుకోసం మా నగరంలో ప్రముఖ స్కూల్లో అడ్మిషన్ కోసం ప్రయత్నించాం. ఆ స్కూల్ ఫీజు చూసి షాకయ్యాను. ఇతర స్కూళ్లలోనూ సుమారు ఇదే తరహా ఫీజు ఉంది. ఈ స్కూల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు: రూ.2,000, అడ్మిషన్ ఫీజు: రూ.40,000, కాషన్ మనీ (వాపసు): రూ.5,000, వార్షిక పాఠశాల ఫీజు: రూ.2,52,000, బస్ ఛార్జీలు: రూ.1,08,000, పుస్తకాలు, యూనిఫాం: రూ.20,000, మొత్తం రూ.4,27,000! ఇది భారతదేశంలో నాణ్యమైన విద్య ధర. మీరు ఏటా రూ.20 లక్షలు సంపాదించినా దీన్ని భరించలేరేమో’‘మీరు నెలకు 2000 డాలర్లు(రూ.1.68 లక్షలు) సంపాదిస్తే అందులో ఆదాయపు పన్ను, జీఎస్టీ, పెట్రోల్‌పై వ్యాట్, రోడ్డు పన్ను, టోల్ ట్యాక్స్, ఫ్రొఫెషనల్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్, ల్యాండ్ రిజిస్ట్రీ ఛార్జీలు మొదలైన వాటి రూపంలో ప్రభుత్వం దోపిడీ చేస్తోంది. దానికితోడు టర్మ్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా ప్రీమియంలు, వృద్ధాప్య పెన్షన్ కోసం పీఎఫ్, ఎన్పీఎస్ చెల్లించాలి. రూ.20 లక్షల ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేరు. ఎలాంటి ఉచితాలు లేదా రుణ మాఫీలు పొందలేరు. అన్ని ఖర్చులు పోను మిగిలిన డబ్బుతో ఫుడ్, బట్టలు, అద్దె, ఈఎంఐలు, స్కూల్ ఫీజులు.. దేనిపై ఖర్చు చేయాలో నిర్ణయించుకోండి’ అంటూ పోస్ట్ చేశారు.Good education is a luxury - which middle class can not affordMy daughter will start Grade 1 next year, and this is the fee structure of one of the schools we are considering in our city. Note that other good schools also have similar fees.- Registration Charges: ₹2,000-… pic.twitter.com/TvLql7mhOZ— RJ - Rishabh Jain (@rishsamjain) November 17, 2024ఇదీ చదవండి: వణికిస్తున్న బంగారం ధర! తులం ఎంతంటే..ఈ పోస్ట్‌కు నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఈ ఫీజు ఇలాగే కొనసాగితే 12 సంవత్సరాలలో దాదాపు రూ.కోటి-1.2 కోట్లు ఖర్చు చేయాల్సి ఉటుంది. మధ్యతరగతి వారు ఇంత అధిక ఫీజులను భరించలేరు. ఇది తీవ్రమైన సమస్య. దీనిపై ప్రభుత్వ నియంత్రణ అవసరం’ అని రిప్లై ఇస్తున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో పనులు
-
వివేక్ రామస్వామి 21 ఏళ్ల నాటి వీడియో వైరల్
వాషింగ్టన్ డీసీ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) బాధ్యతల్ని అప్పగించారు. ఈ తరుణంలో నాడు విద్యార్థిగా ఉన్న వివేక్ రామస్వామి బ్యూరోక్రసీని వ్యతిరేకిస్తూ ప్రసంగించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.2003లో 18 ఏళ్ల రామస్వామి ఒహాయోలోని సెయింట్ జేవియర్ స్కూల్లో తన జర్నీని ఉద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగం ఇప్పుడు వైరల్ కావడంపై వివేక్ స్పందించారు. విద్యార్థిగా ఉన్న తాను బ్యూరోక్రసీని వ్యతిరేకించాను అని నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశారు. ప్రస్తుతం తాను అనుసరిస్తోన్న భావజాలం ఆనాటి నుంచే ఉందనే ఉద్దేశంలో రాసుకొచ్చారు.కాగా, ఒహియోలోని సిన్సినాటిలో పుట్టి పెరిగిన రామస్వామి జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు. అతని హైస్కూల్ వాలెడిక్టోరియన్. హార్వర్డ్ నుంచి బయోలజీలో గ్రాడ్యుయేషన్ యేల్ లా స్కూల్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. Vivek Ramaswamy, 18 years old. his High School Graduation Speech of 2003. pic.twitter.com/sG4kGLbqtL— Brian Roemmele (@BrianRoemmele) November 13, 2024 -
పాఠశాల విద్యార్థులకు బిగ్ షాక్..
-
Nigeria: స్కూలు బిల్డింగ్ కూలి 22 మంది విద్యార్థులు మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్‌లు ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదం బారినపడినవారిలో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు.నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘటన జరిగివుంటుందని అధికారులు అంటున్నారు. ప్రమాదం సంగతి తెలియగానే గ్రామస్తులు ముందుకు వచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి విద్యార్థులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బందికి సహకారం అందించారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో భవనాలు తరచూ కూలిపోతుండటం గమనార్హం. గత రెండేళ్లలో ఇలాంటి పలు ఘటనలు నమోదయ్యాయి. -
హోమ్‌వర్క్ ఎవరికి కష్టం?
‘పిల్లలు హోమ్‌వర్క్ చేయరు.. తల్లిదండ్రులే చేస్తారు.. ఇది తెలిసీ టీచర్లు హోమ్‌వర్క్ ఇవ్వడంలో అర్థం లేదు’ అని ఒక భారతీయ తల్లి విడుదల చేసిన వీడియో చర్చ లేవదీసింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే జపాన్ తల్లిదండ్రులు వారంలో రెండున్నర గంటలే పిల్లల హోమ్‌వర్క్‌కు కేటాయిస్తుంటే భారతీయులు వారానికి 12 గంటలు కేటాయిస్తున్నారు. కొందరు ఇది భారం అంటున్నా పిల్లలకు హోమ్‌వర్క్ లేకపోతే కలత పడే తల్లిదండ్రులే మన దగ్గర ఎక్కువ. హోమ్‌వర్క్ మంచి–చెడు...‘పిల్లలు హోమ్‌వర్క్ చేయరనీ తల్లిదండ్రులే దానిని పూర్తి చేస్తారని టీచర్లకు తెలుసు. అయినా సరే వారు హాలిడే హోమ్‌వర్క్ ఇస్తారు. పిల్లలు హాలిడే ఎంజాయ్ చేస్తుంటే తల్లిదండ్రులు మాత్రం గంపెడు హోమ్‌వర్క్‌ను ముందేసుకుని కూచోవాల్సి వస్తోంది. ఇక మీదటైనా పిల్లలు సొంతగా ఎంత హోమ్‌వర్క్ చేయగలరో అంతే ఇవ్వండి’ అని ఒక తల్లి చేసిన వీడియో ఇన్‌స్టాలో జూన్ 30న విడుదలైంది. ఈ వీడియోకు చాలామంది స్పందిస్తున్నారు.‘ఎనిమిదవ తరగతి వచ్చే వరకు పిల్లలకు హోమ్‌వర్క్ ఇవ్వరాదు’ అని ఒకరంటే ‘అవును. టీచర్లు మరీ అన్యాయంగా ఉన్నారు. రెండో తరగతి చదువుతున్న మా అబ్బాయిని మానవ శరీరంలోని భాగాలను గీసుకు రమ్మని చె΄్పారు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘నేను వేసవి సెలవుల్లో మా అమ్మాయి హోమ్‌వర్క్‌ను పూర్తి చేయడమే సరిపోయింది’ అని మరొక తల్లి అంది. ‘ఇది మరీ విడ్డూరం. తల్లిదండ్రులకు పిల్లలతో సమయం గడిపే వీలు ఉండటం లేదు. వారితో సమయం గడిపే వీలు హోమ్‌వర్క్ ఇస్తుంది. పిల్లలతో కూచుని సరదాగా ఎంజాయ్ చేస్తూ చదివించాలి. హోమ్‌వర్క్ చేయించాలి’ అని మరొక తల్లి అంది.మన దేశంలోనే..హోమ్‌వర్క్ ఇవ్వడం, తల్లిదండ్రులు పిల్లలతో కూచుని సాయం పట్టడం ప్రతి దేశంలో ఉంది. అయితే మనంత మాత్రం లేదు. హోమ్‌వర్క్‌కు తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తున్నారని 29 దేశాల్లో అధ్యయనం చేస్తే చిట్టచివరి స్థానంలో జపాన్ రెండున్నర గంటలతో నిలిస్తే భారత్ మొదటిస్థానంలో 12 గంటలతో నిలిచింది.అమెరికాలో ఆరు గంటలు, చైనాలో ఏడు గంటలు, ఫ్రాన్స్‌లో నాలుగు గంటలు తల్లిదండ్రులు వెచ్చిస్తున్నారు. అయితే అన్నీ దేశాల్లోని తల్లిదండ్రులు ప్రభుత్వ/ఉచిత బడులలో అందే విద్య మీద విశ్వాసం కనపరచలేదు. అంటే డబ్బు కట్టి చదివించడం, మళ్లీ స్కూల్లో చెప్పే చదువు మీద నమ్మకం లేక తామే చదివించడం, అందుకు హోమ్‌వర్క్‌ను ఒక మార్గంగా ఎంచుకోవడం అన్నీ దేశాల్లో ఉన్నా మన దేశంలో అత్యధికంగా ఉంది.బండెడు హోమ్‌వర్క్..పిల్లలకు ఎంత ఎక్కువ హోమ్‌వర్క్ ఇస్తే అది అంతమంచి స్కూల్ అనే అభి్రపాయం చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొచ్చాక ఆడుకుంటూ ఉంటే వారు సమయం వృ«థా చేస్తున్నారని, హోమ్‌వర్క్ చేస్తూ ఉంటే కనుక బుద్ధిమంతులని అనుకోవడం దాదాపు అందరు తల్లిదండ్రుల్లో ఉంది. ‘మన దేశంలో చదువు ద్వారా వచ్చే ఉద్యోగాల గురించే తల్లిదండ్రుల బెంగ. అందుకే స్కూల్లో, ఇంట్లో చదువు గురించి ఒత్తిడి తెస్తారు.దీనివల్ల పిల్లల్లో సహజంగా ఉంటే కళాభిరుచి, క్రీడాప్రతిభ, ఇతర టాలెంట్లు నశించిపోతున్నాయి’ అని కొందరు నిపుణులు అంటున్నారు. ‘హోమ్‌వర్క్ అనేది క్వాలిటేటివ్‌గా ఉండాలి. ‘క్వాంటిటేటివ్గా కాదు. చదివిన పాఠాల గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవడం గురించి హోమ్‌వర్క్ ఉండాలి కాని గుడ్డిగా సమయం వెచ్చించేలా ఉండకూడదు’ అని నిపుణులు అంటున్నారు.ఏది... ఎంత?హోమ్‌వర్క్‌లు పిల్లలకు అధికమైనా దానివల్ల తల్లిదండ్రుల సమయం అవసరానికి మించి ఇవ్వాల్సి వచ్చినా ఆ తీరును నిరోధించాల్సిందే. హోమ్‌వర్క్‌లు బడిలో చదివింది మరింత బాగా అర్థం చేయించేలా ఉండాలి... అలాగే తల్లిదండ్రుల ధోరణి ఆ పాఠాలు పిల్లలకు ఏ మాత్రం అర్థమయ్యాయో చూసి అర్థం చేయించడంలో సాయం పట్టేలా ఉండాలి. ఇక ్రపాజెక్ట్ వర్క్ లాంటివి పిల్లలతో పాటు తల్లిదండ్రుకూ ఆటవిడుపుగా ఉండాలి.నిజానికి కుదురు లేని పిల్లలు తల్లిదండ్రుల పక్కన సమయం చేసుకుని కూచోడానికి ఒక మంచి సాధనం హోమ్‌వర్క్. ఆ వంకతో తల్లిదండ్రులు పిల్లలతో కూచోవాలి. వారు ఎలా చదువుతున్నారు, క్లాస్‌రూముల్లో ఏం జరుగుతోంది, ఏ విషయాలకు సంతృప్తిగా ఉన్నారు... ఏ విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి, ఏ సబ్జెక్ట్‌లు వారికి ఇష్టం, కష్టంగా ఉన్నాయి... ఇవన్నీ తెలుసుకోవడానికి హోమ్‌వర్క్ సమయం సాయం చేస్తుంది.హోమ్‌వర్క్ ఒక తప్పనిసరి భారం చేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి ఇంటి నుంచి పారిపోవాలని చూసిన పిల్లలూ ఉన్నారు. అలాగే పిల్లలకు సాయం చేయడానికి సమయంలేక వారి మీద చికాకు పడి ఇంట్లో అశాంతి రేపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ పీటీఎమ్లలో టీచర్లతో చర్చిస్తూ హోమ్‌వర్క్ సమయాలను విజ్ఞాన, వినోదదాయకంగా పిల్లలతో గడిపే క్వాలిటీ సమయాలుగా మార్చుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.‘మన దేశంలో చదువు ద్వారా వచ్చే ఉద్యోగాల గురించే తల్లిదండ్రుల బెంగ. అందుకే స్కూల్లో, ఇంట్లో చదువు గురించి ఒత్తిడి తెస్తారు. దీనివల్ల పిల్లల్లో సహజంగా ఉంటే కళాభిరుచి, క్రీడాప్రతిభ, ఇతర టాలెంట్లు నశించిపోతున్నాయి’ అని కొందరు నిపుణులు అంటున్నారు. -
పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..!
వేసవి సెలవులు అయిపోవచ్చాయి. స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. మళ్లీ తరగతి గదులు, ట్యూషన్లు, హోమ్ వర్కులు ఇలా పిల్లల్లో హంగామా మొదలైపోయింది. యూనిఫామ్, టెక్స్›్టబుక్స్ ఇలా అన్నీ మారుతుంటాయి. ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు కూడా పరీక్షే! కొత్త స్కూల్ బ్యాగ్ కొనడం దగ్గర నుంచి కొత్త పుస్తకాలకు అట్టలు వేయడం వరకూ ప్రతి పనీ పేరెంట్స్‌కి హైరానా కలిగిస్తుంది. అయితే పిల్లల్లో పాత ఫ్రెండ్స్‌ని కలుసుకుంటున్నామని, కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని, క్లాస్ రూమ్ మారబోతుందని, కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి.అయితే పిల్లలు తిరిగి స్కూల్ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు? బాక్సుల్లో ఏం పెట్టాలి? వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి. మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న పిల్లల విషయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆల్రెడీ స్కూల్ అలవాటున్న పిల్లలను హాలిడేస్ మూడ్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? అవన్నీ ఇప్పుడు చూద్దాం.మొదటిసారి స్కూల్‌కి పంపుతున్నారా..?ప్రీస్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు వారిని పేరెంట్స్ చాలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ మార్పును ఆనందంగా అంగీకరిస్తారు. కానీ మరికొందరికి అలవాటు పడటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యిందంటే తల్లిదండ్రులకు టెన్షన్ ్స మొదలైపోయినట్లే! మరి దానిని సులభం చేయడానికి ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.చిన్నచిన్న పిల్లలకు స్కూల్ ఎలా ఉంటుందో చూపించడానికి ’టాయ్ స్కూల్’ని తయారు చెయ్యాలి. బొమ్మలతో చిన్న నమూనా పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి. మామూలుగా పాఠశాల రోజున ఏమి జరుగుతుందనే దాని గురించి చిన్నగా మాట్లాడుతూనే వారితో కలిసి ఆడుకోవాలి.పాఠశాల ప్రారంభానికి ముందు పిల్లలకు వీలయినన్ని ఎక్కువ పుస్తకాలను చదివి వినిపించాలి. లేదా వారితో చదివించాలి. పిల్లలు వారి కొత్త పాఠశాలలో చేయగలిగే సంగతులు గురించి చర్చించాలి. వారు కలుసుకోబోయే స్నేహితులు, అక్కడుండే వినోదం గురించి మాట్లాడుతూ ఉండాలి.క్లాస్ రూముల్లో పిల్లలు స్వయంగా చెయ్యగలిగే పనులను ఇంట్లో ఉన్నప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్ చేయించాలి. లంచ్ బాక్స్, జ్యూస్ లేదా వాటర్ బాటిల్ మూతలు తెరవడం, తిరిగి మూతలు పెట్టడం.. తమంతట తామే షూస్ తియ్యడం, తిరిగి తొడుక్కోవడం, స్పూన్‌తో అన్నం తినడం ఇలాంటి సాధారణ పనులను నేర్పించాలి.స్కూల్లో ఏదైనా విషయం గురించి పిల్లలు ఇబ్బంది పడితే ఆ విషయం గురించి టీచర్‌కి ఎలా చెప్పాలి? ఎలా పర్మిషన్ అడగాలి? వంటివి కూడా అలవాటు చెయ్యాలి.స్కూల్ ప్రారంభమయ్యే ముందురోజుల్లో పిల్లలను తీసుకుని షాపింగ్ వెళ్తే మంచిది. ఆ షాపింగ్‌లో వాళ్లకు నచ్చిన స్కూల్ బ్యాగ్, పెన్సిల్ కేస్, యూనిఫాం, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా అన్నీ కొనిస్తే వారిలో ఉత్సాహం పెరుగుతుంది.ఇక చిన్నారులను స్కూల్‌కి పంపించే నాటికి స్వయంగా టాయిలెట్‌కి వెళ్లగలరా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే కనీసం టాయిలెట్ వస్తుందని టీచర్‌కి చెప్పడం అయినా నేర్పించాలి.చిన్న పిల్లలకు షేరింగ్ కూడా అలవాటు చెయ్యాలి. స్కూల్లో ఇతర పిల్లల దగ్గర లాక్కోకుండా ఉండటంతో పాటు పక్కపిల్లలకు తమ దగ్గరున్నది షేర్ చేసే విధానం నేర్పాలి. స్కూల్లో ఏదైనా పంచిపెడుతున్నప్పుడు తమ వంతు వచ్చే వరకూ వేచి చూడటం గురించి వివరించాలి. దాని వల్ల పిల్లలకు స్నేహితులు పెరుగుతారు.ఇక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్ పాఠశాలకు వెళ్లడం, స్కూల్ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్‌ని పరిశీలించడం, వారి క్లాస్ టీచర్‌తో, ఇతర విద్యార్థులతో మాట్లాడటం మంచిది. ఆ సమయంలోనే పిల్లలకు వారి తరగతి గదిలో ఏది బాగా నచ్చుతుందో తెలుసుకోవచ్చు.పాఠశాలలో మొదటి రోజు ఒత్తిడి లేకుండా పిల్లలను సిద్ధం చేయడానికి స్కూల్ తెరిచే ముందే మీ పిల్లల తరగతిలో జాయిన్ కాబోతున్న ఇతర పిల్లలకు మీ పిల్లలను పరిచయం చెయ్యాలి. అవసరం అయితే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలుసుకోవాలి. దాని వల్ల స్కూల్లో జాయిన్ అయిన రోజు క్లాసులో మీ పిల్లలకు తెలిసి వ్యక్తి ఒకరైనా ఉంటారు. దాంతో ఆ స్కూల్ తమకు తెలియని చోటు అనే బెరుకు తగ్గుతుంది.కొద్ది సమయం పాటు మీ నుంచి దూరంగా ఉండేలా వారికి ముందే అలవాటు చెయ్యాలి. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు లేదా మీరు విశ్వసించే పెద్దవారితో మీరు లేకపోయినా మీ పిల్లలు కలిసి ఉండేలా చూసుకోవాలి.పై తరగతులకు వెళ్లే పిల్లల కోసం..చదువులో కాస్త డల్‌గా ఉండి టీచర్స్‌కి భయపడే పిల్లలకు స్కూల్స్ ప్రారంభం అంటే కాస్త బెరుకు ఉంటుంది. అలాంటి పిల్లలతో పేరెంట్స్ మనసు విప్పి మాట్లాడాలి. వారిలో మానసిక ధైర్యాన్ని కలిగించాలి.పిల్లలు మొదటిరోజు కోసం ఎదురుచూడటంలో సానుకూల అంశాల గురించి పేరెంట్స్ చర్చించాలి. వారి పాత ఫ్రెండ్స్‌ని గుర్తు చేస్తూ, కొత్త ఫ్రెండ్స్ వస్తే ఎలా కలుస్తారో తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడాలి.పిల్లలు స్కూల్‌కి నడిచి వెళ్తున్నా, బస్సు లేదా ఆటోలో ప్రయాణిస్తున్నా వారితో పాటు ఉండే వారి స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం మంచిది. మొదటిరోజు మాత్రం వీలైతే స్వయంగా స్కూల్లో డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం మంచిది. వారిలోని ఒత్తిడికి దూరం చేసినట్లు అవుతుంది.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్ షెడ్యూల్‌ని బట్టి వారి నిద్ర వేళలను నిర్ణయించి, అలానే నిద్రపోయేలా చెయ్యాలి. సరైన నిద్ర అందకపోతే స్కూల్లో వారు యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే వారికి స్నానం చేయించడం, స్కూల్‌కి రెడీ చేయించడం, స్కూల్ నుంచి రాగానే స్కూల్లో సంగతులు అడిగి తెలుసుకోవడం, అవసరం అయితే వారి ఆలోచనలను సరిచేయడం, హోమ్ వర్క్ చేయించడం వంటి పనుల్లో వారి కోసం సమయాన్ని కేటాయించాలి. అలాగే పిల్లలు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి.పిల్లలు స్కూల్‌కి వెళ్లే దారిల్లో ఏ షాపులు ఎక్కడ ఉన్నాయి? ఎటు వెళ్తే స్కూల్ వస్తుంది? అలాగే స్కూల్ నుంచి ఇంటికి ఏయే దారుల్లో రావచ్చు.. అవన్నీ ప్రాక్టీస్ చేయించాలి. వారితో కూడా వెళ్తున్నప్పుడు వారినే దారి చెప్పమని అడగటం, లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి ఆ దారి గురించి చర్చించడం లాంటివి చెయ్యాలి. అలా చేయడం వల్ల వారు ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు.బస్సులు లేదా ఆటోలు ఎక్కుతున్నప్పుడు ఆగి దిగాలని, నిదానంగా ఎక్కాలని పిల్లలకు సూచించాలి. అలాగే పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్‌తో కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టమని చెబుతుండాలి. మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? ఎలా కూర్చుంటారు? అన్నీ డ్రైవర్ని ఆరా తియ్యాలి.అలాగే స్కూల్‌కి వెళ్తున్న పిల్లలకు రోడ్డు దాటే సమయాల్లో ఇరువైపులా చూసుకోవడం నేర్పించాలి. ఏవైనా వాహనాలు వస్తుంటే పక్కకు ఆగి, అవి వెళ్లిన తర్వాతే నడవడం గురించి చెప్పాలి. ఇవన్నీ దగ్గరుండి ప్రాక్టీస్ చెయ్యించాలి.ఏది తిన్నా రోడ్డు మీద ఆరుబయట తినొద్దని, ఇంటికి తెచ్చుకునైనా, లేదా స్కూల్లోనైనా తినాలని చెప్పాలి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాతే తినడం అలవాటు చెయ్యాలి. లేదంటే అలర్జీలు, జలుబులు వస్తుంటాయని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి ముందుగానే ఆ స్కూల్ టీచర్స్‌తో, ఆయాలతో వివరంగా చెప్పి అత్యవసర పరిస్థితిల్లో సమాచారం ఇవ్వమనాలి.ఇక స్కూల్‌కి సైకిల్ మీద వెళ్లే పిల్లల(టీనేజ్ వారు) విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. రద్దీప్రదేశాల్లో వెళ్తుంటే హెల్మెట్ తప్పసరి ధరించేలా చూడాలి.అపరిచితులు ఇచ్చిన ఆహారం తినొద్దని పిల్లలకు చెప్పడంతో పాటు తింటే దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పాలి. అవసరమైతే కొన్ని ఉదాహరణలను వివరించాలి. అపరిచితులు పిల్లలను కిడ్నాప్ చేస్తారని.. తిరిగి ఇంటికి రాకుండా తీసుకునిపోతారని డైరెక్ట్‌గా చెప్పకుండా.. కొన్ని పేర్లు ఊహించి చెబుతూ.. ఓ కథ రూపంలో వారికి చెబుతుండాలి. అలా చేస్తే వారి మనసుల్లో నాటుకునిపోతుంది.పిల్లలు స్కూల్లో లేదా బయట లేదా బస్సుల్లో ఏవైనా బెదిరింపులకు లోనవుతున్నా, ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గమనించు కుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా చెప్పాల్సిందే. సమస్యను మీదకు తెచ్చుకోకుండా ఎలా ఉండాలో చెప్పడంతో పాటు సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా నేర్పించాలి. ఒకవేళ ఇతర పిల్లలకు మీ పిల్లల వల్లే సమస్య ఏర్పడుతుంటే దాన్ని కూడా సున్నితంగానే తీసుకోవాలి. పిల్లల దూకుడు ప్రవర్తనకు కొన్ని పరిమితులు విధించి వారిని నెమ్మదిగా మార్చాలి.హోమ్‌వర్క్ సమయంలో టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ ఆపెయ్యాలి. పెద్దవారు అవుతున్న పిల్లల విషయంలో ఇంటర్నెట్ వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి.పిల్లల్లో కళ్లు, మెడ, తల అలసటకు గురవుతుంటే దాన్ని గుర్తించి, చదువుతున్నప్పుడు వారికి కాసేపు విరామం ఇస్తుండాలి. కనీసం ఒక పది నిమిషాలు వారికి నచ్చినట్లుగా ఉండనివ్వాలి.పిల్లలు ఇష్టంగా తినే ఈజీ రెసిపీలు..పిల్లలు ఆకలికి ఎక్కువగా ఆగలేరు. పైగా బయట చూసిన తినుబండారాలను చూస్తే అసలు ఆగరు. అందుకే వారికి కావాల్సిన భోజనంతో పాటు స్నాక్స్ కూడా సిద్ధం చేసి బాక్సుల్లో పెట్టడం మంచిది. ఒకవేళ మధ్యాహ్నం భోజనాన్ని స్కూల్లో ఉచితంగా అందిస్తున్నా, ఇలాంటి స్నాక్స్ బాక్స్‌ల్లో పెడితే పిల్లలు దృఢంగా పెరుగుతారు. ఈజీగా సిద్ధమయ్యే కొన్ని రెసిపీస్ ఇప్పుడు చూద్దాం.రాగి కుకీలు..కావాల్సినవి..రాగి పిండి– ఒకటిన్నర కప్పులుఏలకుల పొడి– అర టేబుల్ స్పూన్గుడ్డు– 1ఉప్పు– తగినంతఅల్లం పొడి– కొద్దిగాకొబ్బరి పాలు, రైస్ బ్రాన్ ఆయిల్ – పావు కప్పు చొప్పునతయారీ..ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్ లో రాగి పిండి, ఏలకుల పొడి వేసుకుని దోరగా వేయించాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి.. దానిలో గుడ్డు, అల్లం పొడి, రైస్ బ్రాన్ ఆయిల్, కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టాలి. దాని వల్ల ఆ మిశ్రమం మొత్తం ముద్దలా మారిపోతుంది. అనంతరం కుకీస్‌లా చేసుకుని.. ఓవెన్ లో 180 డిగ్రీలసెల్సియస్‌లో.. 8 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది.ఓట్స్ ఇడ్లీ..కావాల్సినవి..ఓట్స్– 2 కప్పులు (దోరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి)నూనె– అర టేబుల్ స్పూన్మినప పొడి– 1 టేబుల్ స్పూన్శనగపిండి– అర టేబుల్ స్పూన్పెరుగు– 2 కప్పులుపసుపు, కారం– కొద్దికొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, నూనె, మినప పొడి, శనగపిండి, పెరుగు వేసుకుని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని, ఇడ్లీ రేకుల్లో కొద్దికొద్దిగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. అభిరుచిని బట్టి ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము కూడా కలుపుకోవచ్చు.ఖర్జూరం– జీడిపప్పు లడ్డూ..కావాల్సినవి..ఖర్జూరాలు, జీడిపప్పు– 1 కప్పు,కొబ్బరి తురుము– అర కప్పు,ఉప్పు– తగినంత,నూనె– 1 టేబుల్ స్పూన్‌తయారీ..ముందు ఖర్జూరాలను ఒక గంట నీటిలో నానబెట్టి, గింజ తీసి.. ఆరబెట్టాలి. అనంతరం ఒక మిక్సీ బౌల్లో ఖర్జూరాలు, జీడిపప్పు, కొబ్బరి కోరు, తగినంత ఉప్పు, నూనె వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, నేయి రాసుకున్న చేతులతో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవచ్చు.హెర్బ్డ్ పొటాటోస్..కావాల్సినవి..బంగాళదుంపలు– 2 పెద్దవి(తొక్క తీసి.. కడగాలి, వాటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి),ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్,వెల్లుల్లి తురుము– కొద్దిగాతులసి ఆకుల తురుము – కొద్దిగా(అభిరుచిని బట్టి),చిల్లీ ఫ్లేక్స్– అర టేబుల్ స్పూన్ఒరేగానో తురుము– 1 టేబుల్ స్పూన్ (మార్కెట్లో దొరుకుతుంది)తేనె– 2 టేబుల్ స్పూన్లుఉప్పు– తగినంతతయారీ..ఒక బౌల్లో బంగాళాదుంప ముక్కలు వేసుకుని చిల్లీ ఫ్లేక్, ఆలివ్ నూనె, వెల్లుల్లి తురుము, తులసి ఆకుల తురుము, తేనె, ఒరేగానో తురుము ఇలా అన్నీ కలిపి గిన్నెను బాగా కుదపాలి. అనంతర వాటిని బేకింగ్ ట్రేలో పెట్టి.. 200 డిగ్రీల సెల్సియస్‌లో 10–15 నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది.స్టీమ్డ్ ధోక్లా..కావాల్సినవి..శనగపిండి – 1 కప్పు,ఓట్స్, జొన్నపిండి – పావు కప్పు చొప్పున,పంచదార – 1 టేబుల్ స్పూన్,పసుపు– 1 టీస్పూన్,నిమ్మరసం– 1 టేబుల్ స్పూన్,ఉప్పు– తగినంత,బేకింగ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్నీళ్లు– సరిపడా,నూనె– 1 టీ స్పూన్‌తయారీ..శనగపిండి, ఓట్స్, జొన్నపిండి, పంచదార, పసుపు, నిమ్మరసం, బేకింగ్ పౌడర్, నూనె వేసుకుని బాగా కలిపి.. కొద్దిగా ఉప్పు తగినంత నీళ్లు పోసుకుని బాగా మిక్స్ చెయ్యాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని ఆవిరిపై ఉడికించాలి. ఆవాలు, కొత్తిమీర తాళింపు వేసుకుని.. కొత్తి మీర చట్నీతో కలిపి బాక్స్‌లో పెడితే సరిపోతుంది.మొత్తానికి పిల్లలకు నచ్చేవిధంగా, వారు మెచ్చే విధంగా స్కూల్‌కి పంపించగలిగితే వారి వ్యక్తిత్వ వికాసం బాగుంటుంది. వారిలో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది. దాంతో వారు పెద్దల మాటను వినడంలో, శ్రద్ధగా చదవడంలో, వినయ విధేయలతో పెరగడంలో నంబర్ వన్ అవుతారు. -
ఎండకు సొమ్మసిల్లిన 50 మంది విద్యార్థినులు.. ఆస్పత్రికి తరలింపు
ఉత్తరాదిన ఎండలు దంచికొడుతున్నాయి. తాజాగా బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎండ వేడిమికి తాళలేక 50 మందికి పైగా విద్యార్థినులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో పాఠశాలలో కలకలం చెలరేగింది.అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వ ఆరోగ్య శాఖను సంప్రదించారు. ఎంతసేపటికి అంబులెన్స్ రాకపోవడంతో ఆ విద్యార్థినులందరినీ పాఠశాల సిబ్బంది ప్రైవేట్ వాహనాల్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యాన్ని నిరసిస్థూ స్థానికులు రోడ్డుపై ధర్నాకుదిగారు.బీహార్‌లోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంతటి ఎండ వేడిమిలోనూ రాష్ట్రంలోని పాఠశాలలు పనిచేస్తున్నాయి. బుధవారం ఉదయం మండుటెండల కారణంగా అరియారి బ్లాక్‌లోని మన్కౌల్ మిడిల్ స్కూల్లో విద్యార్థినులు అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు.ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రార్థనల అనంతరం పదుల సంఖ్యలో చిన్నారులు స్పృహతప్పి పడిపోయారని తెలిపారు. దీంతో పిల్లలందరినీ ప్రైవేట్ వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఈ చిన్నారులంతా డీహైడ్రేషన్ బారిన పడ్డారని వైద్యుడు సత్యేంద్ర కుమార్ తెలిపారు. పిల్లలకు చికిత్స అందిస్తున్నామన్నారు. -
జీడీ గోయెంకా స్కూల్ సమ్మర్ క్యాంప్ విజయవంతం (ఫొటోలు)
-
రాష్ట్రపతి భవనంలో గదులెన్ని? లోపల ఏ విద్యాలయం ఉంది?
ఢిల్లీలోని రాష్ట్రపతి భవనానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ భవనం దాదాపు లక్ష చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని నిర్మాణం 1912లో ప్రారంభమై, 1929లో పూర్తయింది. ప్రముఖ వాస్తుశిల్పి ఎడ్విన్ లుటియన్స్ ఈ భవనానికి రూపకల్పన చేశారు.రాష్ట్రపతి భవనంలో 340 గదులు ఉన్నాయి. ఈ గదులలో హిమాలయ బెడ్రూమ్ అద్భుతమైన లగ్జరీ బెడ్రూమ్గా గుర్తింపు పొందింది. లోపల ఒక పాఠశాల కూడా ఉంది. దీనిని తొలుత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ అని పిలిచేవారు. ఇది 1946లో నిర్మితమయ్యింది. 1962లో కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలను ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకి తెచ్చింది.2019లో ఢిల్లీ ప్రభుత్వం దీనిని కేంద్రీయ విద్యాలయంగా మార్చింది. నాటి నుండి దీనిని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయం అని పిలుస్తున్నారు. మిగిలిన కేంద్రీయ విద్యాలయాల మాదిరిగానే రాష్ట్రపతి భవనంలోని కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -
‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూరీడు కనిపించి ఏడురోజులైంది’ అని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద తలదాచుకుంటున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం గ్వాలియర్‌లో జనవరి 6న అన్ని ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. చలి తీవ్రత కారణంగా ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు నడుస్తున్న అన్ని పాఠశాలలకు జనవరి 6వ తేదీ శనివారం సెలవు ప్రకటించినట్లు గ్వాలియర్ కలెక్టర్ అక్షయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆరు నుంచి 12వ తరగతి వరకు అన్ని క్లాసులను మునుపటిలానే నిర్వహిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గ్వాలియర్‌లో గత వారం రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉంది. జనవరి 2 నుండి రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుండి 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. వాతావరణశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గ్వాలియర్ ప్రజలు సూర్యుడిని చూసేందుకు మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సివుంటుంది. ప్రస్తుతం జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండనుంది. ఒకటి రెండు రోజుల్లో చినుకులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్వాలియర్-చంబల్‌లో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. -
100 మందితో గర్ల్స్ హాస్టల్.. రాత్రుళ్లు 89 మంది మిస్సింగ్..
లక్నో: 100 మంది ఉన్నట్లు రిజస్టర్ చేసిన బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో రాత్రిళ్లు 89 మంది మిస్ అయ్యారు. ఈ మేరకు రాత్రిపూట అధికారులు తనిఖీలకు వెళ్లగా.. విషయం వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన బాలికలపై ప్రశ్నించగా.. హాస్టల్ వార్డెన్ సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని పరాస్‌పూర్ ప్రాంతంలో ఉన్న కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మా సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. రిజిస్టర్లో 100 మంది పేర్లు నమోదు చేయగా.. కేవలం 11 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ సరైన సమాధానం ఇవ్వేలేకపోయారు. దీంతో దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా బేసిక్ శిక్షా అధికారి ప్రేమ్ చంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఓ టీచర్, హాస్టల్ వార్డెన్, వాచ్మెన్, ఓ జవాన్ పేర్లను నమోదు చేశారు. డిపార్టెమెంట్ కూడా సదరు వ్యవహారంపై చర్యలు తీసుకుంటోందని ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు. ఇదీ చదవండి: Onion Price Hike: ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా!
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ పోలీసులు ఇద్దరు నకిలీ టీచర్లను అరెస్టు చేశారు. వీరు నకిలీ డాక్యుమెంట్ల సహాయంతో 14 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఈ టీచర్లిద్దరూ కాన్పూర్‌లోని దేహాత్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇంతేకాదు వీరిద్దరికీ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించి, హెడ్మాస్టర్లను చేసింది. ఈ విషయం వెల్లడికావడంతో అటు విద్యావిభాగంతో పాటు ఇటు సామాన్యులలోనూ కలకలం చెలరేగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2009లో నకిలీ విద్యార్హతల ధృవపత్రాలతో అనిల్ కుమార్, బ్రజేంద్ర కుమార్‌లు టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. దేహాత్ పరిధిలోని ఝీంఝక్లో ఉంటున్న అనిల్ ములాయి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్. అలాగే బ్రజేంద్ర కుమార్ షాహ్పూర్ మోహ్రా ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్గా ఉన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బర్రా పోలీస్ ఇన్స్పెక్టర్ నూర్య బలిపాండే మీడియాతో మాట్లాడుతూ బర్రాకు చెందిన సందీప్ రాథౌడ్ ఏడాది క్రితం అంటే 2022లో గ్వాలియర్‌లో ఉంటున్న అతని బంధువు రాజీవ్ తనను మోసగించాడంటూ ఫిర్యాదు చేశాడన్నారు. రాజీవ్‌తో పాటు అతని తల్లి, సోదరి కలసి తనకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 34 లక్షలు తీసుకున్నారనని సందీప్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ పనిలో కాన్పూర్‌కు చెందిన రామ్‌శరణ్, అతని దగ్గర పనిచేసే ధర్మేంద్రల హస్తం కూడా ఉన్నదని పేర్కొన్నాడు. వీరంతా తాను టీచర్ అయ్యేందుకు కావలసిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని తెలిపాడు. అయితే ఇలా దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం చేసేందుకు సందీప్ నిరాకరించాడు. ఫలితంగా తన డబ్బు కూడా తిరిగి రాలేదని సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. రాజీవ్ నకిలీ ధృవపత్రాలతో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు. వారు అనిల్ కుమార్, బ్రజేంద్రలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 14 ఏళ్లుగా కాన్పూర్‌లోని దెహాత్ పాఠశాలలో టీచర్లుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పోలీసులు వీరికి సంబంధించిన రికార్డులు చెక్ చేయగా, వీరి దగ్గరున్నవి దొంగ సర్టిఫికెట్లని గుర్తించారు. దీంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీసీపీ అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారని, వారు నకిలీ పత్రాలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు పొందారని గుర్తించామని తెలిపారు. అయితే వీరికి ఉద్యోగాలు ఇప్పించిన రాజీవ్ సింగ్ హైకోర్టు నుంచి అరెస్టు వారెంట్‌పై స్టే తెచ్చుకున్నాడన్నారు. ఈ ఉదంతంతో ప్రమేయం ఉన్న రామ్ కశ్యప్‌ను కొద్ది రోజుల క్రితమే అరెస్టు చేసి, జైలుకు తరలించామన్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
వ్యవసాయంపై పిల్లలకు అవగాహన కల్పిస్తున్న పాఠశాల
-
బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య
రాంచీ: ఝార్ఖండ్‌లోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. నుదుటిపై బొట్టు పెట్టుకుని వచ్చిందని బాలికను ఉపాధ్యాయుడు కొట్టాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అమానవీయ ఘటన ధన్‌బాద్‌లోని తెతుల్ మరిలో జరిగింది. ఈ ఘటనపై బాలల హక్కుల జాతీయ కమిషన్ ఛైర్పర్సన్ ప్రియాంక్ కనుంగో స్పందించారు. దర్యాప్తు నిమిత్తం తమ టీం ధన్‌బాద్‌కు వెళ్తుందని ట్వీట్ చేశారు. చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ చీఫ్ ఉత్తమ్ ముఖర్జీ కూడా ఈ ఘనటపై స్పందించారు. పాఠశాలకు సీబీఎస్ఈ బోర్డు గుర్తింపు కూడా లేదని చెప్పారు. బాలిక ఆత్మహత్యకు కారణమైన టీచర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇది తీవ్రమైన ఘటన అని అన్నారు. జిల్లా విద్యాశాధికారిని కలిసి ఆయన దృష్టికి తెచ్చామని చెప్పారు.బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించామని ఆయన చెప్పారు. బాలిక మృతిపై బాధిత తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల యాజమాన్యంపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. 15 రౌండ్ల కాల్పులు.. కస్టడీలోనే ఖతం చేశారు -
నేడు విద్యార్థులకు సీఎం జగన్ సన్మానం
-
స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు..! వయసేమో 11.. షాకైన టీచర్లు
సాధారణంగా మాటలు రాని చిన్నపిల్లలకు డైపర్లు వేస్తుంటారు. వారు టాయిలెట్ వచ్చేటప్పుడు చెప్పలేరనే భావనతో డైపర్లు వాడుతుంటారు. అయితే వారు పెరిగేకొద్దీ డైపర్ల వినియోగాన్ని మానేస్తారు. సాధారణంగా పిల్లలకు 3 లేదా 4 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడతారు. అలాగే ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా డైపర్లు వాడతారు. అయితే 11 ఏళ్ల పిల్లలు కూడా డైపర్లు వాడటాన్ని ఎక్కడైనా చూశారా? పిల్లలకు 2 లేదా మూడేళ్లు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు వారికి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తుంటారు. అప్పటి నుంచి వారే స్వయంగా టాయిలెట్‌కు వెళుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఆ దేశంలోని పిల్లలు 11 లేదా 12 ఏళ్లు వచ్చినా ఇంకా డైపర్లు వాడుతూనే ఉన్నారు. డైపర్లు పెట్టుకునే స్కూలుకు వెళుతుంటారు. పెద్దపిల్లలు కూడా డైపర్లు పెట్టుకుని స్కూలుకు వెళ్లే దేశం స్విట్జర్లాండ్. ఈ దేశం ఎంతో అందమైనదిగా పేరుగాంచింది. అభివృద్ధి పరంగానూ వేగంగా ముందుకు సాగుతోంది. అయితే అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను డైపర్ల పెట్టి స్కూలుకు పంపుతుంటారు. ఇన్సైడర్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద వయసుకలిగి, అన్నిరకాలుగా ఆరోగ్యవంతుతైన పిల్లలు కూడా డైపర్లు ధరించి స్కూలుకు రావడాన్ని స్విట్జర్లాండ్ టీచర్లు గమనించారు. నాలుగేళ్లు దాటి, మాటలు వచ్చిన పిల్లలకు కూడా డైపర్లు పెట్టి, వారి తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తున్నారు. 11 ఏళ్ల పిల్లలు కూడా.. స్విట్జర్లాండ్‌కు చెందిన పిల్లల మానసిక వైద్య నిపుణులు రీటా మెస్మర్ మాట్లాడుతూ ఒక 11 ఏళ్ల బాలిక తన దగ్గరకు వచ్చిందని, తాను డైపర్ పెట్టుకుని స్కూలుకు వెళతానని తెలిపిందన్నారు. ఆ చిన్నారికి తల్లిదండ్రులు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతున్నదన్నారు. స్విట్జర్లాండ్‌లోని చాలామంది పిల్లలకు టాయిలెట్ ఎలా వినియోగించాలో తెలియదన్నారు. పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా వారి తల్లిదండ్రులకు టైమ్ ఉండటం లేదన్నారు. టీచర్లు ఏమంటున్నారంటే.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక ఎడ్యుకేషనల్ సైంటిస్ట్ మాట్లాడుతూ డైపర్లు మార్చడం అనేది టీచర్ల పని కాదన్నారు. టాయిలెట్ ట్రైనింగ్ అనేది తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతీతల్లిదండ్రులూ పిల్లలకు సరైన సమయంలో టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. పెద్ద పిల్లలు డైపర్లు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. -
ఏం పిల్లలండీ బాబు..! స్కూల్ జైల్ అట! ఏకంగా అమ్మేసేందుకు ప్లాన్
స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేకపోతే.. ఏదో ఓ కారణం చెప్పి పిల్లలు బడి ఎగ్గొట్టేస్తారు. పోనీ టీచర్ చదువులు చెప్పకపోతే కంప్లైంట్ చేస్తారు. అదీ కాకపోతే మౌళిక సదుపాయాలు సరిగా లేకపోతే అమ్మనాన్నలకు చెబుతారు. కానీ అమెరికాలో ఓ స్కూల్ పిల్లలు చేసిన పనికి అందరూ ముక్కుమీద వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ పిల్లలు చేసిన పనేంటంటే..! అమెరికాలోని మేరీలాండ్‌లో మీడే సీనియర్ హై స్కూల్ అనే పేరు గల పాఠశాల ఉంది. ఇందులో పిల్లలకు ఏం అనిపించిందో తెలియదు కానీ స్కూల్‌నే అమ్మకానికి పెట్టారు. స్థానిక రియల్ ఎస్టేట్ వెబ్సైట్ 'జిల్లో'లో రూ.34.7లక్షలకు బేరం పెట్టారు. 12,458 గజాల స్కూల్ బిల్డింగ్ 'సగం పని చేసే జైల్' గా పేర్కొని లిస్టింగ్ చేశారు. ఈ జైళ్లో 15 బాత్రూమ్లు, ప్రత్యేకమైన కిచెన్, ప్రైవేట్ బాస్కెట్ బాల్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంతేకాదు అక్కడక్కడ సగం నిర్మాణంలో ఉన్న గోడలు ప్రాణాలను తీస్తాయని తెలిపారు. ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాతపూర్వకంగా వెబ్సైట్లో తెలిపారు. ఈ వినూత్నమైన లిస్టింగ్‌ను చూసి తాము ఆశ్చర్యపోయినట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలిపారు. ఇంత మంచి ఆస్తిని ఇంత తక్కువకు అమ్ముతున్నారేంటని ఆశ్చర్యపోయినట్లు వెల్లడించారు. కొనుగోలుదారులు ఇలాంటి అవకాశాలను వదలుకోబోరని తెలిపారు. పిల్లలు చేసిన కొంటె పనితో స్కూల్ యాజమాన్యానికి చెమటలు పట్టినంత పనైంది. లిస్టింగ్ చేసిన కొద్ది గంటల్లోనే వెబ్సైట్ నుంచి ఆ లిస్టింగ్‌ను తొలగించినట్లు తెలిపింది. తమ పిల్లలు క్రియేటివిటీకి ఆశ్చర్యపోయినప్పటికీ.. మరీ ఇంత తక్కువ డబ్బులకు లిస్టింగ్ చేయడం వింత కలిగించిందని ఓ ఉపాధ్యాయుడు చిరునవ్వుతో తెలిపారు. ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్.. ఎంత తాగాడో తెలుసా? -
ఆ పాటను ఇక వినలేమా?
డూన్ స్కూల్లో పిల్లలందరూ సమావేశమయ్యే వేళ తరుచుగా పాడే పాట నా బాల్య జీవితంలోనే అత్యంత మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచింది. మాలో కొద్దిమందిమి మాత్రమే ఆ పాటలోని పదాలను అర్థం చేసుకునేవాళ్లం. ఎందుకంటే, ఆ పాట ఉర్దూలో ఉండేది. కానీ దాని వెంటాడే శ్రావ్యత మమ్మల్ని కట్టిపడేసేది. యాభై సంవత్సరాల తర్వాత కూడా ఆ పాటను ఎవరైనా మర్చిపోయి ఉంటారంటే నాకు సందేహమే. ‘‘లబ్ పే ఆతీ హై దువా బన్కే తమన్నా మేరీ’’మాకెంతో ఇష్టమైనది. దశాబ్దాల తర్వాత మాత్రమే ఆ పాటను రాసింది సుప్రసిద్ధ కవి ఇక్బాల్ అని నేను తెలుసుకున్నాను. ఆయనే రాసిన ‘‘సారే జహా సె అచ్ఛా హిందూస్తాన్ హమారా’’ స్థాయిలో నేను దీన్ని కూడా ఇష్టపడతాను. గత నెలలో, ఈ పాటను బరేలీ(ఉత్తరప్రదేశ్)లోని ఒక పాఠశాలలో పాడినప్పుడు, విశ్వహిందూ పరిషత్‌కు చెందిన సోంపాల్ సింగ్ రాథోడ్ దానిమీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘హిందువుల మనోభావాలను గాయపర్చే ఉద్దేశంతో ఉపాధ్యాయులు పాఠశాల పిల్లల చేత ముస్లిం పద్ధతిలో పఠింపజేస్తున్నారు... ఇస్లాం వైపు పిల్లలను ఆకర్షించడానికే ఇలా చేస్తున్నారు... ఉపాధ్యాయులు హిందువుల మనో భావాలను గాయపరుస్తూ విద్యార్థులను మతమార్పిడికి సిద్ధం చేస్తున్నారు’’ అని ఆయన ఆరోపించారు. మనోభావాలను గాయపర్చే ఆ పదాలు ఏవంటే... ‘‘మేరే అల్లా బురాయీ సే బచానా ముర్nుకో’’. దీనికి వెంటనే స్పందించిన విద్యాశాఖ ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసింది. ఈ సంఘటన నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నిజానికి అది ఒక వెర్రి మాట. ఇది నన్ను విచారపడేలా, కలవరపడేలా చేసింది. ఇది మన దేశంలో మనం ఎలా మారు తున్నామో చూపుతున్న ఒక విచారకరమైన ప్రతిఫలనమా? లేక నేను యుగాల వెనుకటి మర్చిపోదగిన డైనో సార్లా ఉంటున్నానా? నాలో నేను ఈ ప్రశ్నలను వేసుకుంటున్న ప్పుడు, డూన్ స్కూల్లో మాకు మరో ఇష్టమైన గీతం అయిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ సుప్రసిద్ధ ప్రార్థనా గీతం గుర్తుకొచ్చింది. ‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగు తారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, ఎక్కడ సంసారపు గోడల భాగాల కింద ప్రపంచం విడిపోలేదో... ఆ స్వేచ్ఛా స్వర్గానికి, తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు!’’ కానీ మన దేశంలో ఇలాంటిది ఇప్పుడు జరుగుతోందా? అలా జరగాలని నేను ఆశిస్తున్నాను. కానీ నా భయాలు అతిశయోక్తులని నేను భావించడం లేదు. క్రిస్మస్ పర్వదినానికి కొన్ని రోజుల ముందు న్యూఢిల్లీలో ఒక పాస్టర్ ప్రజలను మతమార్పిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వచ్చాయి. నిజానికి, ఆయన అధ్యక్షత వహించిన ఆ సమూహం క్రిస్మస్ గీతాలను పాడింది. నిరసనకారులు ఆ సమావేశం జరుగుతున్న ప్రాంతానికి వెలుపల పోగయ్యి ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు ఇవ్వడం ప్రారంభించారని పత్రికలు నివేదించాయి. దీంతో వెంటనే అది హిందూ వర్సెస్ క్రిస్టియన్ ఘర్షణగా మారిపోయింది. మహాత్మాగాంధీకి ఎంతో ఇష్టమైన ‘ఎబైడ్ విత్ మి’ కీర్తనను గణతంత్ర దినోత్సవం ముగింపు వేడుకల్లో భాగంగా సైన్యం నిర్వహించే బీటింగ్ రిట్రీట్‌లో వినిపించేవారు. ఎంతో మంది ఇష్టంగా ఎదురుచూసే దీన్ని ఏడు దశాబ్దాలపాటు వినిపిస్తూ వచ్చారు. అనేకమంది ప్రజలు ఈ కీర్తనను వింటూ ప్రత్యేకించి ముందుకు సాగేవారు. ఎందుకంటే వెంటాడే ఈ రాగం నార్త్ బ్లాక్ నుండి గంటల గణగణ శబ్దంతో ప్రతిధ్వనించేది. కానీ గత సంవత్సరం ఈ సుప్రసిద్ధమైన బీట్‌ను తొలగించారు. దశాబ్దాలుగా సైనిక సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చిన దీని స్థానంలో ‘యే మేరే వతన్ కే లోగో’ పాటను చేర్చారు. ఇది వలస సామ్రాజ్య వారసత్వం నుంచి ‘‘విముక్తి పొందుతున్న నవ భారతం’’ అంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా ‘బీబీసీ’కి వెల్లడించారు. ‘‘బ్రిటిష్ వారు ప్రారంభించిన ట్యూన్లను మన మిలిటరీ బ్యాండులు 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత కూడా ఆలపించడంలో ఏ అర్థమూ లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఎబైడ్ విత్ మి’ పాటను తీసివేయడం అనేది భారత్‌ను నిర్వలసీకరించే కొనసాగింపు ప్రక్రియలో భాగమేనని ఆయన అభి ప్రాయపడ్డారు. నిజమే కావచ్చు. కానీ మహాత్మా గాంధీ దీనిగురించి ఏం అనుకునేవారు? ఈరోజు నుంచి 11 రోజులపాటు నేను ఎదురుచూస్తుంటాను... అధికారుల మనస్సు మారుతుందని కోరుకుంటూ, వేడుకుంటూ ఈ సంవత్సరం బీటింగ్ రిట్రీట్ను నేను తిలకిస్తాను. అయితే నా అభిప్రాయం తప్పవుతుందని నా నిశ్చితాభిప్రాయం. మార్పు అనివార్యమనీ, ప్రపంచం పరిణమించడం తప్పనిసరనీ నాకు తెలుసు. కానీ, మనం నిలబెట్టుకోవలసిన సంప్రదాయాలు అంటూ ఏమీ లేవా? ‘ఎబైడ్ విత్ మి’ అనేది వలసవాద నమూనా అయితే, బీటింగ్ రిట్రీట్ మాటేమిటి? సమాధానం లేదు. అయితే దానికి కూడా ప్రమాదం పొంచి ఉందా? దీపావళికి ఆరతి, పటాసులు; ఈద్‌కు సేమియాతో చేసే ఖీర్ ఎలాగో క్రిస్మస్కు ప్రార్థనా గీతాలు అలాగా! కానీ మనం ఏం పాడాలో, ఏవి అట్టిపెట్టుకోవాలో, ఏవి వదిలేయాలో ఇప్పుడు మతమే నిర్ణయిస్తుందా? ప్రశ్నకు సమాధానం తెలీనప్పుడు మా నానమ్మ తరచుగా ‘రబ్ జానే’ అని చెప్పేది. దేవుడి కోసం వాడే ఆ ఉర్దూ పదం ఈరోజు ముస్లింలకు ప్రతీకగా గుర్తించబడుతోంది. కాబట్టి అది హిందువులకు నిషిద్ధమైపోయిందా? ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అయితే చాలా కొద్ది మంది ప్రజలు మాత్రమే దానిగురించి మాట్లాడటం నేను వింటున్నాను. నా భయాలు తప్పు అని నేను కేవలం ఆశించగలను. 2023 సంవత్సరం ఇంకా దాదాపుగా 350 రోజులు సాగుతుంది. నేను ప్రేమిస్తున్న, గుర్తుపెట్టుకుంటున్న భారత దేశం మరింతగా మతి పోగొట్టుకుంటుందా? ఇప్పటినుంచి 12 నెలలు భారంగా సాగుతాయా? లేదా కొత్త ఉషోదయాల వైపు మనం సాగిపోతున్నప్పుడు మన గతంలోని ఉత్తమమైన అంశాలను అదరించి, అక్కున చేర్చుకుంటామా? కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
అహోబిలాపురం స్కూల్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
వాళ్లు అలా అనేసరికి లతా మంగేష్కర్ ఒక్కరోజే బడికెళ్లింది
ముంబై: పదినెలల చెల్లిని బడిలోకి తీసుకురావద్దన్నారన్న కోపంతో బడి ముఖమే చూడకూడదని పంతం పట్టింది ఒక చిన్నారి. అలా బడి మానేసిన చిన్నారి భారతరత్నగా ఎదగడంలో స్వయం కృషి ఎంతో ఉంది. లతా మంగేష్కర్ చిన్నతనంలో చెల్లెలు ఆశాను తీసుకొని స్కూలుకు వెళ్లింది. అయితే పసిపిల్లను బడిలోకి తేవద్దంటూ టీచర్ అభ్యంతరం పెట్టడంతో కోపంతో వెనక్కు వెళ్లిన లత మళ్లీ బడి ముఖం చూడలేదు. చిన్నప్పుడు మరాఠీ అక్షరాలు చదవడం, రాయడం ఇంట్లోనే పనిమనిషి సాయంతో నేర్చుకున్నట్లు లతా మంగేష్కర్.. ఇన్ హర్ ఓన్ వాయిస్ పుస్తకంలో చెప్పారు. మరీ పసితనంలో నర్సరీ క్లాసులకు వెళ్లానని, బోర్డు మీద రాసిన శ్రీ గణేశ్ జీ అనే అక్షరాలను అచ్చుగుద్దినట్లు దింపినందుకు అప్పుడు తనకు పదికి పది వచ్చాయని చెప్పారు. తన బంధువు వసంతి మ్యూజిక్ క్లాసులకు వెళ్లేదని, ఆమెతో పాటు వెళ్లిన తనను పాట ఆకర్షించిందని ఆమె చెప్పారు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన ఆసక్తిని గమనించి అందరు టీచర్ల ముందు మ్యూజిక్టీచర్ పాడమన్నారని, అప్పుడు హిందోళంలో పాట పాడానని చెప్పారు. ఆ తర్వాత తనను బడికి రమ్మన్నారని, అక్కడకు ఆశాను తీసుకొని వెళ్లిన తనను టీచర్ అడ్డుకోవడంతో వెనక్కు వచ్చానని వివరించారు. కాలక్రమంలో బంధువులు, ప్రైవేట్ టీచర్ల సాయంతో హిందీ నేర్చుకున్నానన్నారు. తర్వాత కాలంలో ఉర్దూ, బెంగాలీ, కొంత మేర పంజాబీ నేర్చుకున్నానని, సంస్కృతం అర్థమవుతుందని, తమిళ్ అవగాహన చేసుకునే యత్నం చేశానని లత చెప్పారు. -
పునీత్ పేరుతో పాఠశాల, ఆస్పత్రి
సాక్షి బళ్లారి(కర్ణాటక): అద్భుత నటనతో పాటు సామాజిక సేవలో తనదైన శైలిలో గుర్తింపు పొందిన పునీత్‌రాజ్‌కుమార్ మరణం యావత్తు కర్ణాటక ప్రజలను దుఃఖ సాగరంలో నింపిందని, ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువేనని కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన బెళగల్ క్రాస్‌లోని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమంలో పునీత్‌రాజ్‌కుమార్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బళ్లారి నగరంలో పునీత్‌రాజ్‌కుమార్ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామన్నారు. తమ సొంత నిధులతో పేదలకు ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వినయ విధేయతలకు పునీత్ మారుపేరుగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలిసోమశేఖరెడ్డి, బుడా చైర్మన్ పాలన్న, గాలిజనార్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇకపై బళ్లారిలోనే ఉంటా: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకపై బళ్లారిలోనే ఉంటానని కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను పర్మనెంటుగా బళ్లారిలోనే ఉండవచ్చునని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బళ్లారిలోనే ఉంటూ సేవా కార్యక్రమాలను చేపడుతామన్నారు. రాయల్ బస్టాండుకు పునీత్ పేరు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలిసోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పునీత్ మరణం తీరనిలోటని, పునీత్‌తో తమకు ఎంతో అవినాభవ సంబంధం ఉందని గుర్తు చేసుకొన్నారు. నగరంలోని రాయల్ బస్టాండ్‌కు పునీత్ పేరు పెడతామని అన్నారు. -
97 శాతం బడుల్లో.. బాలికలకు మరుగుదొడ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితాల ప్రభావం కనిపిస్తోంది. 2018–19తో పోల్చి చూస్తే 2019–20లో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. అంతేగాక విద్యుత్ సౌకర్యం, కంప్యూటర్ల లభ్యత, ఇంటర్నెట్ సదుపాయం కలిగిన పాఠశాలల సంఖ్య 2019–20లో గణనీయంగా పెరిగిందని యూడీఐఎస్ఈ ప్లస్ నివేదిక వెల్లడించింది. భారతదేశంలో పాఠశాల విద్యపై రూపొందిన యునైటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్ఈ ప్లస్) 2019–20 నివేదికను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గురువారం విడుదల చేశారు. 2019–20 సంవత్సరానికి సంబంధించి యూడీఐఎస్ఈ విధానంలో సేకరించిన సమాచారం ఆధారంగా ప్రస్తుత నివేదికను సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల పాఠశాలలు, 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు, 26.45 కోట్ల మంది విద్యార్థుల సమాచారాన్ని యూడీఐఎస్ఈ పర్యవేక్షిస్తోంది. 2019–20లో మొత్తం 26.45 కోట్ల మంది విద్యార్థులు ప్రీప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ క్లాసుల వరకు పాఠశాలల్లో చదువుతున్నారని నివేదిక వెల్లడించింది. 2018–19తో పోలిస్తే 42.3 లక్షల మంది విద్యార్థులు పెరిగారు. 90% పాఠశాలల్లో హ్యాండ్ వాష్ సదుపాయం 2019–20లో 12.50 కోట్లకు పైగా బాలికలు ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని మాధ్యమిక, ఉన్నత విద్యలో నమోదు చేసుకున్నారని నివేదికలో పేర్కొన్నారు. 2018–19తో పోలిస్తే బాలికల నమోదు సంఖ్య గణనీయంగా 14.08 లక్షలకు పైగా పెరిగింది. అంతేగాక పాఠశాల విద్యా రంగంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పీటీఆర్) సైతం మెరుగుపడిందని నివేదిక వెల్లడించింది. దేశంలో స్వచ్ఛతా అభియాన్ ప్రచారం పెరగడంతో విద్యార్థులు చేతులను శుభ్రం చేసుకునే సౌకర్యం గల పాఠశాలల సంఖ్యలో మెరుగుదల నమోదైంది. 2019–20 సంవత్సరంలో దేశంలో 90% కంటే ఎక్కువ పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ సౌకర్యాన్ని కల్పించారు. ఏపీలో 95% పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం 2019–20 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 63,824 పాఠశాలల్లో 83,23,103 మంది విద్యార్థులు ఉండగా, 3,17,430 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 90% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 89% పాఠశాలల్లో లైబ్రరీ, 68% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 95% విద్యుత్ సౌకర్యం, 90% తాగునీటి సరఫరా, 84% హ్యాండ్ వాష్ సదుపాయం, 87% మెడికల్ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణలో 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు తెలంగాణలో 42,575 పాఠశాలల్లో 69,37,640 మంది విద్యార్థులు ఉండగా, 3,05,597 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. రాష్ట్రంలోని 96% పాఠశాలల్లో బాలికల మరుగుదొడ్లు, 93% పాఠశాలల్లో లైబ్రరీ, 85% పాఠశాలల్లో అన్ని రకాల పుస్తకాలతో ఉన్న లైబ్రరీలు, 96% విద్యుత్ సౌకర్యం, 96% తాగునీటి సరఫరా, 88% హ్యాండ్ వాష్ సదుపాయం, 86% మెడికల్ ఫెసిలిటీ ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. యునైటెడ్ ఢిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఎస్ఇ +) 2019–20 నివేదిక ముఖ్యాంశాలు: 2019–20లో పాఠశాల విద్యలో ప్రీ–ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య 26.45 కోట్లు దాటింది. 20 18–19తో పోలిస్తే ఇది 42.3 లక్షలు ఎక్కువ. 2018–19తో పోలిస్తే 2019–20లో అన్ని స్థాయిలలో పాఠశాల విద్య స్థూల నమోదు నిష్పత్తి మెరుగుపడింది. స్థూల నమోదు నిష్పత్తి 2018–19తో పోలిస్తే 2019–20లో అప్పర్ ప్రైమరీ స్థాయిలో 87.7% నుంచి 89.7% కి, ప్రాథమిక స్థాయిలో 96.1% నుంచి 97.8%కి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.9%కి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 50.1% నుంచి 51.4%కి పెరిగింది. 2019–20లో పాఠశాల విద్యారంగంలో 96.87 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేయగా, 2018–19తో పోలిస్తే ఇది సుమారు 2.57 లక్షలు ఎక్కువ. 2019–20లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి (పిటిఆర్) ప్రైమరీ విద్యలో 26.5 గా, అప్పర్ ప్రైమరీ–సెకండరీలో పిటిఆర్ 18.5 గా, హయ్యర్ సెకండరీలో పిటిఆర్ 26.1 గా ఉంది. వికలాంగులకు సార్వత్రిక విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి. 2018–19తో పోలిస్తే దివ్యాంగులైన విద్యార్థుల నమోదు 6.52% పెరిగింది. 2019–20లో ప్రైమరీ నుంచి హయ్యర్ సెకండరీ వరకు చేరిన బాలికల సంఖ్య 12.08 కోట్లకు పైగా ఉంది. 2018–19తో పోలిస్తే ఈ సంఖ్య 14.08 లక్షలకు పైగా పెరిగింది. 2018–19 నుంచి 2019–20లో బాలికల స్థూల నమోదు నిష్పత్తి అప్పర్ ప్రైమరీ స్థాయిలో 88.5% నుంచి 90.5%నికి, ఎలిమెంటరీ స్థాయిలో 96.7% నుంచి 98.7%నికి, సెకండరీ స్థాయిలో 76.9% నుంచి 77.8%నికి, హయ్యర్ సెకండరీ స్థాయిలో 50.8% నుంచి 52.4%కి పెరిగింది. 2019–20లో సెకండరీ, హయ్యర్ సెకండరీ స్థాయిలలో లింగ సమానత్వ సూచిక (జిపిఐ) మెరుగుపడింది. జిపిఐ మెరుగుదల హయ్యర్ సెకండరీ స్థాయిలో ఎక్కువగా కనిపించింది. 2019–20లో 1.04 కు చేరింది. కంప్యూటర్ సౌకర్యం ఉన్న పాఠశాలల సంఖ్య 2019–20లో 5.2 లక్షలకు చేరగా, 2018–19లో 4.7 లక్షల పాఠశాలలు కంప్యూటర్ సౌకర్యాన్ని కలిగి వున్నాయి. ఇంటర్నెట్ సదుపాయం ఉన్న పాఠశాలల సంఖ్య 2018–19లో 2.9 లక్షలు ఉండగా, 2019–20లో 3.36 లక్షలకు పెరిగింది. 2019–20 నాటికి 83% కంటే ఎక్కువ పాఠశాలలు విద్యుత్తు కలిగి ఉన్నాయి. 2018–19తో పోలిస్తే దాదాపు 7% వరకు పెరిగింది. 2019–20లో 82% కి పైగా పాఠశాలలు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించాయి. ఇది 2018–19తో పోలిస్తే 4% కంటే ఎక్కువ. భారతదేశంలో 2019–20 నాటికి 84%కి మించి పాఠశాలల్లో లైబ్రరీ/రీడింగ్ రూమ్/రీడింగ్ కార్నర్ సౌకర్యం ఉంది. చదవండి: ఆ కిడ్నాపర్‌కు జీవితకాల జైలు శిక్ష విధించలేం: సుప్రీంకోర్టు -
తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే పాఠశాలకు
-
పేరెంట్స్ అంగీకారం ఉంటేనే పాఠశాలకు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి 6,7,8 తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆదేశాలకు అనుగుణంగా తరగతులను ప్రారంభించాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. స్థానిక ఏర్పాట్లను బట్టి 6,7,8 తరగతులను రేపటి నుంచి మార్చి ఒకటవ తేదీ వరకు ప్రారంభించుకోవచ్చని మంత్రి సూచించారు. 6,7,8 తరగతుల ప్రారంభోత్సవంపై బుధవారం విద్యా శాఖ అధికారులతో తన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, డైరెక్టర్ దేవసేన, సత్యనారాయణరెడ్డి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల అంగీకారం ఉంటేనే విద్యార్థులను తరగతులకు అనుమతించాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాలకు హాజరు కావాలన్న వత్తిడి విద్యార్థులపై చేయకూడదని ఆయా యాజమాన్యాలకు మంత్రి స్పష్టం చేశారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్ మార్గదర్శకాలను విధిగా పాటించాలని మంత్రి కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లోనూ ప్రత్యేకంగా శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటించాలని మంత్రి కోరారు, 6,7,8 తరగతులకు ఇప్పటి వరకు ఆన్లైన్లో పాఠాలను బోధించడం జరిగిందని, ఇకపై ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థుల కోసం ఆ తరగతుల బోధన కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల 17.10 లక్షల మంది విద్యార్థులు తరగతులకు హాజరు అయ్యే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విద్యా శాఖ పరిధిలోని 8,891 పాఠశాలల్లో 8,88, 742 మంది, 10,275 ప్రైవేట్ పాఠశాలల్లోని 8,28,516 మంది విద్యార్థులు, వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న 1157 గురుకుల విద్యా సంస్థల్లో 1,98, 853 మంది విద్యార్థులు 6,7,8 తరగతులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖాధికారులను ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో రాజీపడకూడదని మంత్రి స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు కూర్చునేందుకు తరగతి గదులు తక్కువగా ఉంటే షిప్ పద్దతిలో పాఠశాలను నడుపుకునేందుకు అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించడంలో రాజీపడకూడదని మంత్రి స్పష్టం చేశారు -
పండగలా చదువులు
-
అన్‌లాక్ 4.0: స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవు!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా అన్‌లాక్ చేస్తూ వస్తుంది. వచ్చే వారంలో అన్‌లాక్ 4.0 ప్రక్రియ మొదలు కానుంది. తాజాగా ఈ విషయానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరణనిచ్చారు. కేంద్ర హోంశాఖ ప్రకటించబోయే సడలింపులలో స్కూళ్లు ఉండవబోవని వెల్లడించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి పాఠశాలలు తెరిచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. (24 గంటల్లో.. 60,975 కరోనా కేసులు) అదేవిధంగా మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్రాల నుంచి మెట్రో సేవలపై డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు, బస్సులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సినిమా థియేటర్లు, బార్లు తెరవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంటైన్మెంట్ జోన్లలలో ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి. అన్‌లాక్ 4.0లో ఆంక్షలు వేటిపై ఉన్నాయన్న దానిని మాత్రమే కేంద్ర హోం శాఖ వివరించింది. చదవండి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెబ్సైట్ హ్యాక్ -
మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతున్నాం
-
తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు
-
పాఠశాల కాదు పానశాల
ఔరంగాబాద్: మందుబాబులకి ఎక్కడా చోటు దొరకనట్టుంది. సరస్వతీ నిలయమైన పాఠశాలని ఏకంగా పానశాల కింద మార్చేశారు. రాత్రి పూట పాఠశాలలో పూటుగా మందు తాగుతూ చిందులేస్తున్నారు. ఈ ఘోరం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్లో జరుగుతోంది. ఉదయం పాఠశాలకి వచ్చే విద్యార్థులు, టీచర్లకు పాఠశాల ప్రాంగణంలో చెదురుమదురుగా విసిరేసిన లిక్కర్ సీసాలు కనిపిస్తున్నాయి. వాళ్లు అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత తరగతులు మొదలు పెట్టాల్సి వస్తోందని స్కూలు అధికారి ఒకరు చెప్పారు. నాందేడ్‌లో ముక్రామాబాద్ పోలీసు స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఉన్న స్కూల్లో గత కొద్ది రోజులుగా మందుబాబులు పాఠశాలనే తమకు అడ్డాగా మార్చుకున్నారు. అయినప్పటికీ పట్టించుకునే నాథుడే లేడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని పాఠశాల అధికారి ఒకరు చెప్పారు. ‘‘ఉదయం పాఠశాలకి వచ్చేసరికి లిక్కర్ బాటిల్స్ కనిపిస్తాయి. కొన్ని బాటిల్స్ విరిగి పడి ఉంటాయి. మా స్కూలుకి ప్యూన్ లేడు. రిటైర్ అయిపోయాడు. దీంతో విద్యార్థులు, టీచర్లే పాఠశాల ఆవరణని శుభ్రం చేయాల్సి వస్తోంది. తరచూ ఈ ఘటన జరుగుతూ ఉండడంతో పోలీసులకి ఫిర్యాదు చేశాము’’ అని ఆ అధికారి చెప్పారు. పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఈ సమస్య ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. ఇలాంటి చర్యలు పాఠశాలలో చదువుకునే వాతావరణాన్ని పాడు చేస్తాయని ముక్రామాబాద్ పోలీసు స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ కమలాకర్ అంగీకరించారు. ఇక నుంచి ఆ స్కూలుపై నిరంతర పర్యవేక్షణ జరుపుతామని చెప్పారు. -
కశ్మీర్లో పాఠాలు షురూ
శ్రీనగర్/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్/వాషింగ్టన్: కశ్మీర్లో సోమవారం పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే చాలా పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. శ్రీనగర్‌లో 190 ప్రాథమిక పాఠశాలలు తెరుచుకున్నప్పటికీ శాంతిభద్రతల భయంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపలేదు. అయితే బెమినాలోని పోలీస్ పబ్లిక్ స్కూల్, ఇతర కేంద్రీయ విద్యాలయాల్లో మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. కశ్మీర్లో ఆంక్షలు సడలించినప్పటికీ బలగాల మోహరింపు మాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా బారాముల్లా జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ..‘పట్టన్, పల్హలాన్, సింఘ్‌పొరా, బారాముల్లా, సోపోర్ పట్టణాల్లో ఆంక్షలు యథాతథంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పాఠశాలలు తెరుచుకున్నాయి’ అని చెప్పారు. శ్రీనగర్‌లో గత 3 రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నందున పాఠశాలలు తెరుచుకోలేదని వ్యాఖ్యానించారు. అయితే నగరంలో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లను తొలగించి ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేలా అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని ఈ నెల 5న రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లదాఖ్ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా జమ్మూకశ్మీర్‌లో భారీగా బలగాలను మోహరించారు. భారత రాయబారికి పాక్ సమన్లు భారత డిప్యూటీ హైకమిషనర్‌గా గౌరవ్ అహ్లూవాలియాకు పాక్ ప్రభుత్వం సోమవారం సమన్లు జారీచేసింది. అహ్లూవాలియాను ఇస్లామాబాద్‌లోని తన కార్యాలయానికి పిలిపించుకున్న సార్క్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఫైజల్.. భారత్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భారత బలగాల తీరుపై తీవ్ర నిరసన తెలియజేశారు. ఆదివారం ఛిక్రీకోట్, హాట్‌స్ప్రింగ్ సెక్టార్లపై భారత ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2017 నుంచి ఇప్పటివరకూ భారత్ 1,970 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిందని విమర్శించారు. ట్రంప్ పాక్‌వైపు మొగ్గు చూపొద్దు భారత్–పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పొరపాటున కూడా పాక్‌వైపు మొగ్గుచూపరాదని అగ్రరాజ్యానికి చెందిన కౌన్సిల్ ఫర్ ఫారిన్ రిలేషన్స్(సీఎఫ్ఆర్) సంస్థ అధ్యక్షుడు రిచర్డ్ ఎన్ హాస్ సూచించారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌వైపు ఏమాత్రం మొగ్గుచూపినా భారత్ దూరమైపోతుందని హెచ్చరించారు. ఈ విషయమై రిచర్డ్ స్పందిస్తూ..‘భారత్‌ను ఎదుర్కోవడానికి కాబూల్(అఫ్గానిస్తాన్)లో తన మిత్రులు అధికారంలో ఉండాలని పాక్ కోరుకుంటోంది. కాబట్టి పాక్‌ను శాసించే సైనిక, నిఘా వ్యవస్థలు తాలిబన్లను నియంత్రిస్తాయనీ, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాయని నమ్మేందుకు చాలాతక్కువ అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో భారత్‌కు అమెరికా దూరం జరగడం అంత తెలివైన నిర్ణయంకాదు. ప్రజాస్వామ్య భారత్ జనాభా త్వరలోనే చైనాను దాటేస్తుంది. అంతేకాకుండా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించబోతోంది. కాబట్టి అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే ఇండియావైపు మొగ్గడమే శ్రేయస్కరం. ఆసియాలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ అమెరికాకు సహకరిస్తుంది’ అని తెలిపారు. మరోవైపు కశ్మీర్ సమస్య కారణంగా తాలిబన్–అమెరికాల మధ్య శాంతిచర్చలకు విఘాతం కలుగుతుందన్న పాక్ వ్యాఖ్యలపై అఫ్గానిస్తాన్ ప్రభుత్వం మండిపడింది. జమ్మూకశ్మీర్ భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యనీ, దాన్ని అఫ్గాన్‌తో ముడిపెట్టడం పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని స్పష్టం చేసింది. అమిత్ షాతో దోవల్ భేటీ జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లోయలో దాదాపు 10 రోజులపాటు పర్యటించిన దోవల్.. అక్కడి పరిస్థితిని షాకు వివరించారు. ఈ సందర్భం గా జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రస్తుతం కొనసాగుతున్న ఆంక్షలపై చర్చించారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌గౌబాతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
విద్యార్థులకు వివాదాస్పద ప్రశ్నలతో పరీక్ష
కోల్‌కతా: ‘జైశ్రీరామ్’ నినాదం వల్ల సమాజంపై పడుతున్న ప్రతికూల ప్రభావం గురించి రాయండి? ‘కట్ మనీ’ వల్ల సామాన్య ప్రజలకు జరిగే మేలు ఎలాంటిదో వివరించండి.. ఎంటివి అనుకుంటున్నారా. బెంగాల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు అడిగిన ప్రశ్నలివి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పైన పేర్కొన్న నినాదాలు ఎంత ప్రభావాన్ని చూపెట్టాయో తెలిసిందే. అప్పటి వరకు బెంగాల్లో నామమాత్రంగా ఉన్న బీజేపీ ఈ నినాదాలతో ఏకంగా 22 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అప్పటి నుంచి బెంగాల్లో బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్‌ల మధ్య రాజకీయాలు తీవ్ర స్థాయిలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుగ్లీ జిల్లాలో అక్నా యూనియన్ హై స్కూల్ విద్యార్థులకు పై రెండు ప్రశ్నలతో ఈ నెల 5న పరీక్ష నిర్వహించారు. ఈ విషయం తెలియడంతో స్థానిక బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుబీర్ నాగ్ మాట్లాడుతూ.. ‘మా పార్టీ, విద్యను కాషాయీకరణ చేస్తుందని విమర్శించే వాళ్లు దీనికి ఏమని సమాధానం చెబుతారు. అధికార పార్టీకి డప్పు కొట్టే బాధ్యతను ఇప్పుడు ఉపాధ్యాయులు చేపట్టారని స్పష్టమైంది. రాష్ట్ర ప్రజలంతా ఈవిషయాన్ని గమనించాలని’ ఆయన కోరారు. చిన్న పిల్లల మెదళ్లలో ఇలాంటి విద్వేష భావాలను నింపుతున్న వారిని ఖండించడానికి బలమైన పదాలు దొరకడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ గతంలో సింగూర్‌లో టాటా నానో కారు ప్లాంటుకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాన్ని 2017లో పాఠ్యాంశంగా చేర్చడాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ రోహిత్ షైన్ స్పందిస్తూ ‘ఈ విషయంపై ఎవ్వరూ ఫిర్యాదు చేయకపోయినా మేం నివారణ చర్యలు తీసుకొని ప్రశ్నలను రద్దు చేశాం. విద్యార్థులు వాటికి సమాధానం రాయకపోయినా పర్వాలేదు. ఒకవేళ ఎవరైనా రాసుంటే మాత్రం పూర్తి మార్కులు ఇవ్వబడతాయి. ఈ ప్రశ్నలను రూపొందించిన ఉపాధ్యాయుడు ఇప్పటికే క్షమాపణ కోరాడు’ అని తెలిపారు. అంతేకాక ఈ ప్రశ్నలను స్థానిక దినపత్రిక కోసం రూపొందించామనడం కొసమెరుపు. ఈ ఘటనను స్థానిక టీఎంసీ నాయకులు కూడా సమర్థించడం లేదు. పాఠశాల స్థాయి పిల్లలకు ఇలాంటివి ఎందుకని వారు తిరిగి ప్రశ్నించారు. జిల్లా విద్యాధికారి గోపాల్‌రాయ్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఇందులో వివాదాస్పదం ఏమీ లేదనీ, ఒక వర్గం వారు కావాలనే వివాదాన్ని రేకెత్తిస్తున్నారని అభిప్రాయపడ్డారు. మరోవైపు టీఎంసీ సీనియర్ నాయకులు ఎవరూ కూడా ఈ ఘటనపై స్పందించడానికి ఇష్టపడలేదు. -
హెల్దీ టేస్టీ లంచ్ బాక్స్
ఇక వచ్చే వారం నుంచి మళ్లీ పిల్లలకు స్కూళ్లు మొదలవ్వబోతున్నాయి. వేసవి సెలవుల వల్ల ఇప్పటివరకూ ఇంట్లోనే కళ్ల ముందు ఉన్న పిల్లలు నేడో రేపో బడికి వెళ్లక తప్పదు. బాక్స్ కట్టి ఇచ్చినా అక్కడ వాళ్లేం తింటారో ఎలా తింటారో అసలు తింటారో లేదో అన్న బెంగ తల్లులకు వారం రోజుల ముందునుంచే మొదలైపోతుంది. ఇప్పటివరకూ ఇంట్లో ఉంటేనే ఎన్నోసార్లు బతిమిలాడితేగానీ పిల్లలు ఇంతన్నా తినరు. అలాంటి ఆ లంచ్ టైమ్‌లో ఎంత తింటారో తెలియదు. అందుకే స్కూల్ మొదలయ్యాక... మన ఎదిగే పిల్లలకు పోషకాలేమీ మిస్ కాకుండా ఇవ్వాల్సిన ఆహారం ఎలా ఉండాలో తెలుకునేందుకే ఈ కథనం. స్కూలుకు బయలుదేరేముందు పిల్లలు చాలా హడావుడిగా ఏదో తినేస్తుంటారు. బడికి టైమ్ అవుతుందన్న తొందరలో ఇంత నోట్లో వేసుకొని బయలుదేరుతారు. పైగా చాలా స్కూళ్లు ఎనిమిదింటికల్లా మొదలైపోతుంటాయి. దాంతో పిల్లలు నింపాదిగా, నిమ్మళ్లంగా తినడానికే టైమ్ ఉండదు. అయితే స్కూల్‌కు వెళ్లే ముందర కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడం పిల్లలకు చాలా మేలు చేస్తుంది. వాళ్లు ఆరోగ్యకరంగా ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు... అలా పొద్దున్నే టిఫిన్ తిన్న పిల్లల్లో ఏకాగ్రత, విజయసాధన అవకాశాలు చాలా ఎక్కువని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. వివిధ వయసుల్లోని స్కూలు పిల్లలకు ఏయే పోషకాలు అవసరమో తెలుసుకుందాం. ప్రోటీన్ ఇవ్వడం మరవద్దు రోజును మంచి ప్రోటీన్‌తో ప్రారంభించడం పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఎదిగే వయసు పిల్లల విషయంలో ప్రోటీన్లను ‘బిల్డింగ్ బ్లాక్స్’గా చెబుతుంటారు ఆహార నిపుణులు. అంటే భవన నిర్మాణానికి ఇటుకలు ఎలాగో... శరీర నిర్మాణానికి ప్రోటీన్లు అలాగన్నమాట. పైగా ప్రోటీన్లు మన కండరాల్లో అయిన గాయాలను ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తుంటాయి.అందుకే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పిల్లలకు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్డు పెట్టవచ్చు. దాంతోపాటు వెన్న, పెరుగు వంటి వాటిల్లోనూ ప్రోటీన్ ఎక్కువగానే ఉంటుంది. అలాగే పప్పులో కూడా ప్రోటీన్ ఎక్కువ. అందుకే పూరీ/చపాతీతో పాటు పప్పు లేదా శనగల వంటివి ఇవ్వడం వల్ల అటు పూరీ/చపాతీలోని కార్బోహైడ్రేట్లతో పాటు ఇటు పప్పు, శనగలు, గుడ్డు వంటి వాటి నుంచి ప్రోటీన్ కూడా సమకూరుతుంది. స్కూల్ నుంచి రాగానే... పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ‘‘పవర్’’ శ్నాక్స్ ఇవ్వడం మంచిది. అంటే ఇందులో భాగంగా పొట్టు తీయని ధాన్యంతో తయారు చేసిన బ్రెడ్ ముక్కలకు వెన్న, చీజ్ వంటివి పుష్కలంగా రాసి, ఆ బ్రెడ్ ముక్కల మధ్యన తాజా ఆకుకూరలు, కీర, టొమాటో వంటి కాయగూరలు నింపి శాండ్విచ్లు తయారు చేసి ఇవ్వాలి. వీటితో పాటు అరటిపండ్లు ఇవ్వడం మంచిది. పిల్లలు స్కూల్ల్లో బాగా ఆటలాడి వచ్చినా లేదా స్కూల్ నుంచి రాగానే ఆటలకు వెళ్లాలనుకున్నా ఈ తరహా శాండ్విచ్లు వారికి అవసరమైన పోషకాలను, తక్షణ శక్తిని ఇస్తాయి. రాత్రి వేళలో ద్రవాహారాలు ఇవ్వండి పిల్లల రాత్రి భోజనం సమయంలో వారికి ద్రవాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఉదయం నుంచి స్కూలుకు వెళ్లడం, ఆటలాడటం వంటి కార్యకలాపాలతో వారు చేసిన శారీరక శ్రమ వల్ల వారు కోల్పోయిన వారి ఒంట్లోని లవణాలు, ద్రవాలు మళ్లీ భర్తీ చేయాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల లంచ్‌బాక్స్ ఎలా ఉండాలంటే... పిల్లలు స్కూల్లో దాదాపుగా ఒక పూట లేదంటే రెండు పూటలు తింటారు. ఆ బాక్స్ ఈ కిందివిధంగా ఉండటం వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.పిల్లల లంచ్–బాక్స్ ఎలా ఉండాలనేందుకు చాలా సింపుల్ ఫార్ములా ఉంది. అదేమిటంటే... వారి లంచ్‌బాక్స్‌లో సగం... రంగురంగుల తాజా పండ్ల ముక్కలతో నింపండి. (ఇందులో కనీసం రెండు నుంచి మూడు రకాలు ఉండాలి). ఆ తర్వాత మరో పావు భాగం దంపుడు బియ్యం (పాలిష్ చేయని బియ్యం)తో వండిన అన్నం లేదా పొట్టు తీయని ధాన్యాలతో చేసిన చపాతీలు నింపండి. ఇక మిగతా పావు భాగాన్ని ప్రోటీన్ పుష్కలంగా ఉండే కూరలతో నింపండి. అంటే శాకాహారులైతే బీన్స్, కిడ్నీ–బీన్స్, ఛోలే వంటి వాటితో వండిని కూరలు గానీ... మాంసాహారులైతే చికెన్, చేపలతో వండిన కూరలను ప్రతిరోజూ మార్చి మార్చి వారికి ఇస్తుండాలి. ఇక వారు రోజూ తగినన్ని నట్స్ కూడా తినేలా చూడాలి. ఇక అన్నం, చపాతీలకు బదులుగా తమకు అందుబాటులో ఉన్నవారు హోల్‌గ్రెయిన్ పాస్తా, క్వినోవా వంటి వాటినీ వండి ఇవ్వవచ్చు. ►అరబాక్స్ పండ్లలో ఏమేం ఉండాలంటే... తాజా ద్రాక్ష, ఆపిల్స్, పుచ్చపండు ముక్కలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, అరటిపండ్లు వంటివి ►రంగురంగుల పచ్చికాయగూరల్లో... క్యారట్, దోస, కీర, బ్రాకలీ, బెల్‌పెప్పర్ (బెంగుళూరు మిర్చీల పేరిట ఇవి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగుల్లో లభ్యమవుతుంటాయి), టొమాటోల వంటి వాటిని ముక్కలుగా కోసి పండ్ల ముక్కలతో పాటు కలిపి కొన్ని ఇవ్వాలి ►ప్రోటీన్లు పుష్కలంగా ఉండే ఆహారాలివే... బీన్స్, శనగలు, పీనట్ బటర్, చికెన్, చేపలు, ఉడకబెట్టిన గుడ్లు ►ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఏమిటంటే... పొట్టు తీయని పాస్తా, పొట్టు తీయని ధాన్యాలతో చేసిన బ్రెడ్, ముడిబియ్యంతో వండిన అన్నం, ఓట్స్ వంటివి ►ద్రవాహారాలుగా పాల ఉత్పాదనలివి... పాలు, ఫ్లేవర్డ్ మిల్క్, పెరుగు, వెన్న, కాటేజ్ చీజ్, సోయా పాలు, (అందుబాటులో ఉన్నవారు సోయా యోగర్ట్ వంటివి తీసుకోవచ్చు). వీటిలో పిల్లల ఎముకలను బలంగా చేయడానికి, వారు ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడే క్యాల్షియమ్, విటమిన్–డి పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్లు కూడా ఉండనే ఉంటాయి. ఇక పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి మీరే భోజనం ఎలాగూ పెడతారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువ సార్లు మీరు ఇంట్లో తినే ఆరోగ్యకరమైన భోజనం పెట్టండి. వేర్వేరు వయసుల పిల్లలకు లంచ్ బాక్స్ ఇలా... మూడున్నర ఏళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల లంచ్‌బాక్స్ : ఇప్పుడు పిల్లలు మూడున్నర ఏళ్ల నుంచే ప్రీ–స్కూల్ అంటూనో, ఎల్కేజీ, యూకేజీ అంటూనో స్కూలుకు వెళ్తున్నారు. ఆ వయసు నుంచి ఆరేళ్ల లోపు వారి లంచ్ బాక్స్ ఈ కింద ఉన్న పదార్థాలతో ఉండటం మంచిది. వారి బాక్స్‌లో పొట్టు తీయని ధాన్యాలతో చేసిన రొట్టెలు (రోటీ–పప్పు), ముడిబియ్యంతో వండిన అన్నం (దాల్–చావల్), శాండ్విచ్ పరాఠాలు వంటివి ఇవ్వవచ్చు. ఈ వయసు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కొన్ని ఆప్షన్స్ చూద్దాం 1 క్యారట్ రైస్ + బీన్స్ కూర + ఆకుకూరలతో చేసిన కూర+ పెరుగు + పండ్లు 2 పాలక్ రైస్ + పప్పు (1 కప్పు) + ఏదైనా ఆకుకూర/కాయగూర (1 కప్పు) + పెరుగు + పండ్లముక్కలు 3 బీట్రూట్ రోటీ + ఏదైనా ఆకుకూర/కాయగూర (ఒక కప్పు) + ఒక ఉడకబెట్టిన గుడ్డు + పెరుగు + పండ్లముక్కలు 4 మిక్స్డ్ వెజిటబుల్ రైస్ గ్రీన్‌పీస్ పనీర్ కూర లేదా చిక్కుళ్ల వంటి ప్రోటీన్ కూర + పెరుగు + పండ్ల ముక్కలు. 6 – 12 ఏళ్ల పిల్లల లంచ్ బాక్స్: ఈ పిల్లల్లో ఎదుగుదల చాలా వేగంగా జరగుతుంటుంది. వాళ్లకు అవసరమైన రోజువారీ శక్తి (ఎనర్జీ) కూడా ఎక్కువే. ఈ రెండు అవసరాలు తీరేలా వారి ఆహారం ఉండాలి. వారి ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉండాలి. అయితే వారికి చాలా ఎక్కువ శక్తి అవసరం కాబట్టి వారి ఆహారంలో అధిక క్యాలరీలను ఇచ్చే ఆరోగ్యకరమైన పదార్థాలే ఉండాలి తప్ప... ఎక్కువ క్యాలరీలను ఇచ్చే చక్కెర పదార్థాలు (కోలా డ్రింక్స్‌లో ఉండే షుగర్స్ వంటివి), చెడు కొవ్వు పదార్థాలు (ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వాడే మార్జరిన్ వంటి నూనెలతో చేసిన పదార్థాలు) ఉండకూడదు. అందుకే వారికి సాఫ్ట్‌డ్రింక్స్, చిప్స్, క్యాండీలు, తియ్యటి డెజర్ట్స్ చాలా తక్కువగా/పరిమితంగా మాత్రమే ఇవ్వాలి. ఎప్పుడో ఒకసారి రుచికోసం మాత్రమే ఇవి అని వారు గుర్తుంచుకునేలా వారికి మంచి ఆహారపు అలవాట్లను మప్పాలి. ఈ వయసు పిల్లల్లో ముడి బియ్యం, పొట్టుతీయని ధాన్యాలతో వండిన పదార్థాల వల్ల వారికి కార్బోహైడ్రేట్లతో పాటు పీచుపదార్థాలు, విటమిన్–బి కాంప్లెక్స్ వంటివి దొరుకుతాయి. ఇక తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరల నుంచి విటమిన్–ఏ, విటమిన్–సి, పొటాషియమ్, పీచుపదార్థాలు లభ్యమవుతాయి. అందుకోసం వారి రాత్రి భోజనంలో అన్నంతో పాటు కరకర నమిలి తినే క్యారట్లు, ఆపిల్స్ ఇవ్వాలి. డిన్నర్లో వారి కూరల్లో బ్రాకలీ, బెల్‌పెప్పర్, మొక్కజొన్న గింజలు, గ్రీన్‌సలాడ్స్ అందేలా చూడాలి. ఆరెంజ్ వంటి తాజా పండ్లు ఇవ్వాలి. పిల్లల ఎదిగే అవసరాల కోసం క్యాల్షియమ్, పొటాషియమ్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటివి బాగా అందేలా చూడాలి. ఇందుకోసం వీలైతే మూడు పూటలా లేదా కనీసం రెండు పూటలా పాలు, పాల ఉత్పాదనలు తీసుకునేలా చూడాలి. ఒకవేళ పాలు తాగని వారు సోయామిల్క్, సోయా పెరుగు, క్యాల్షియమ్ సెట్ టోఫూ తీసుకునేలా చూడాలి.వారి ప్రోటీన్ అవసరాల కోసం కొవ్వు తక్కువగా ఉండే చికెన్, తాజా చేపల కూర, బీన్స్, నట్స్, ఇవ్వాలి. అలాగే ఆ మాంసాహారం వల్లనే వారికి ఐరన్, జింక్‌తో పాటు బి–విటమిన్‌లోని బి12 వంటివీ సమకూరతాయని గుర్తుంచుకోండి. ఈ వయసులోని పిల్లలకు వారంలో వీలైనన్ని సార్లు గుడ్లు ఇవ్వవచ్చు. రోజుకో గుడ్డు తప్పక ఇవ్వడమూ వారికి మేలు చేస్తుంది. అలాగే ఈ వయసు పిల్లలు ఆటలు ఎక్కువ ఆడతారు. కాబట్టి వారు తరచూ వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగేలా చూసుకోవాలి ఈ వయసులో పిల్లలు చాలా వేగంగా ఎదుగుతుంటారు. వాళ్ల ఎదుగుదలకు తగ్గట్లుగా పోషకాలు అందేలా వాళ్ల లంచ్ బాక్స్ ఉండాలి. ఒకవేళ అన్ని పోషకాలు అందక వాళ్ల ఎదుగుదల తగినంత వేగంగా జరగకపోయినా లేదా అనీమియా వంటి లోపాలు కనిపించినా డాక్టర్ సలహాలతో న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడటం మంచిది. ఎందుకంటే ఈ వయసులో ఆహార లోపాలవల్ల భవిష్యత్తులో వాళ్లకు హార్మోన్ సమస్యలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 13–18 ఏళ్ల పిల్లల లంచ్‌బాక్స్... ఈ వయసు పిల్లల్లో పెరుగుదల చాలా ఎక్కువ. పైగా మిగతా అన్ని దశలతో పోలిస్తే ఆహారం, పోషకాల అవసరం ఈ దశలో చాలా ఎక్కువ. ఫ్రెండ్స్ ప్రభావాలతో ఆహారపు అలవాట్లు మారిపోయే అవకాశం కూడా ఉంది. తమ స్నేహితులతో కలిసి తినేందుకు వారు లంచ్ బాక్స్‌ను కూడా స్కిప్ చేస్తుంటారు. ఇలాంటి వారు జంక్‌ఫుడ్‌కు అలవాటు పడే ప్రమాదం ఉంది. స్వీట్స్, బాగా ప్రాసెస్ చేసిన ఆహారం, వేపుళ్లు, ఫాస్ట్ఫుడ్స్ వైపు మొగ్గుచూపి ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. చిప్స్, పిజ్జా, బర్గర్స్కు సాధ్యమైనంత దూరంగా ఉంచి అన్ని రకాల ఆకూకూరలు, కూరగాయలు, మాంసాహారంతో ఆరోగ్యకరమైన సమతుల ఆహారం అందేలా చూడాలి. 6–12 ఏళ్ల పిల్లలకు ఇచ్చే ఆహారాలే మరింత ఎక్కువ మోతాదుల్లో వీరి లంచ్‌బాక్స్‌లో ఉండాలి. ఈ వయసు పిల్లలు లంచ్ బాక్స్ తీసుకెళ్లేలా పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలి. ఏయే ఆహారాలలో ఎన్నెన్ని క్యాలరీలు ►ఆరు అంగుళాల వ్యాసంతో ఉన్న రోటీలో దాదాపు 85 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు దాదాపు 0.5 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల మినప్పప్పులో 154 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు 6 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల శనగలు / రాజ్మా లో 153 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు 5 గ్రాముల వరకు ఉంటాయి ►150 గ్రాముల మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ (కూరలో) 142 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 15 గ్రాముల కొవ్వులు ఉంటాయి. (ఈ కొవ్వుల పాళ్లు కూర కోసం వాడిన నూనె పరిమాణం మీద ఆధారపడిఉంటాయి) ►100 గ్రాముల చికెన్ కర్రీలో 300 క్యాలరీలు ఉంటాయి. ఇందులో 15–35 గ్రాముల కొవ్వుల వరకు ఉండవచ్చు. (ఇది స్కిన్‌తో ఉన్న చికెనా, స్కిన్లెస్నా, ఇక అందులో వాడిన నూనె ఎంత అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది) ∙ఒక సాధారణ ప్లెయిన్ దోశ లో 125 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది ∙రెండు సాధారణ సైజ్ ఇడ్లీల్లో 132 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 3 గ్రాముల కొవ్వు ఉంటుంది ∙100 గ్రాముల పెరుగన్నం (కర్డ్ రైస్)లో 190 క్యాలరీలు ఉంటాయి. కొవ్వులు దాదాపు 7 గ్రాముల ఉంటాయి ∙100 కోకోనట్ రైస్‌లో 369 క్యాలరీలు ఉంటాయి. దాదాపు 15 గ్రాముల కొవ్వు ఉంటుంది. కంటి నిండా నిద్ర పోనివ్వండి చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకోవాలని, ఈ వయసులోనే కష్టపడాలంటూ ఉదయం చాలా త్వరగా నిద్రలేపేస్తుంటారు. ఎదిగే వయసులోని ఏ పిల్లలైనా సరే... ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోయేలా చూడండి. ఆ నిద్రే లేకపోతే వారు చదివేదంతా మెదడులో సరిగా నిక్షిప్తం కాదు. మంచి నిద్ర సమయంలోనే చదివిందంతా పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుందని గుర్తుంచుకోండి. సుజాతా స్టీఫెన్, చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట, హైదరాబాద్ -
ఇలా అయితే.. ఆటలు సాగేదెలా..
సాక్షి, పెగడపల్లి: మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆట స్థలాలు, వ్యాయామ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. మండలంలోని మెజార్టీ పాఠశాలల్లో ఈ రెండు సౌకర్యాలు లేక విద్యార్థులు వికాసానికి దూరమవుతున్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బాల్యంలోనే దాన్ని వెలికితీస్తే వారిలో నైపుణ్యాలు మెరుగయ్యే అవకాశాలుంటాయి. కానీ ఆప్రతిభను తీసి ప్రోత్సహించే వారులేరు. విద్యార్థుల్లో దాగి ఉన్నా ప్రతిభను గుర్తించి వారిని ఆయా క్రీడల్లో సుశిక్షితులుగా చేయాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉంటుంది. అందుకు అనుగుణంగా ఆట స్థలాలు కూడా ఉండలి. కానీ చాలా పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులు, మైదానం లేక పోవడంతో వారికున్న ప్రతిభ మరుగున పడిపోవడమే కాకుండా చిన్నారులు ఆటలకు దూరమవుతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వారిలో మంచి ప్రతిభ దాగి ఉంటుంది. వారికి తగిన శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దే వారులేరు. వ్యాయామ ఉపాధ్యాయులను నియమించి తగిన శిక్షణ ఇస్తే మేము కూడా ఆటల్లో రాణిస్తామని విద్యార్థులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మండలంలో ఒకే ఒక్కరు మండలంలో 6 యూపీఎస్, 6 హైస్కూల్లున్నాయి. మండలంలోని నంచర్ల పాఠశాలలో మినహా మరెక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు లేరు. బతికపల్లి, పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులున్నా భర్తీ కావడం లేదు. గతంలో ఈపాఠశాలల్లో పని చేసిన వ్యాయామ ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లి ఏళ్లు గడుస్తున్న వారి స్థానంలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచన కూడా చేయడం లేదు. మిగితా పాఠశాలల్లో అసలు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టుల మంజూరు లేదు. పీఈటీల సమస్య ఇలా ఉంటే విద్యార్థులకు తెలిసిస ఆటలు ఆడుకుందామని ఉన్న అందుకు సరిపడు ఆటస్థలం కరువైంది. అన్ని పాఠశాలల్లో ఆట స్థలాలు ఏర్పాటు చేసి విద్యార్థులు క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మండలంలోని బతికపల్లి, నంచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటున్న వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రతి ఏటా సంబంధిత అధికారులను ఈవిషయమై కోరుతున్నా ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆయా పాఠశాలల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసతులు కల్పించాలి ఆటలు ఆడాలని ఉన్నా స్థలంతో పాటు సరైన శిక్షణ లేక క్రీడల్లో రాణించ లేక పోతున్నాం. సరైన శిక్షణ ఉంటే జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను వెలికి తీయాలి. చాలా చోట్ల పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ లేదు. గ్రౌండ్ స్థలం కేటాయించి వసతులు కల్పించాలి. – రాగళ్ల హరీశ్ బతికపల్లి ప్రోత్సాహం కరువు ఆటలు ఆడేందుకు ఆసక్తి ఉన్నా ఆడించే వారులేరు. దీనికితోడు మైదానం కూడా లేదు. ఆటల్లో ప్రోత్సాహం కరవైంది. క్రీడలకు కావాల్సిన వసతులు లేక క్రీడల్లో రాణించలేక పోతున్నాం. ఫలితంగా ఆటలకు దూరమవుతున్నాం. మాకు వ్యాయామ ఉపాధ్యాయుడు, మైదానం ఏర్పాటు చేయాలి. – రాజ్‌కుమార్ 10వ, తరగతి పెగడపల్లి సమాచారం సేకరిస్తున్నాం పాఠశాలల్లో మైదానాలు ఏర్పాటు, పీఈటీల నియామకంపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. యూడైస్ నివేదిక ఆధారంగా హెచ్ఎంల ద్వారా పాఠశాలల్లో పూర్తి సమాచారం సేకరిస్తున్నాం. ఆటస్థలం, పీఈటీల కొరతపై వివరాలు యూడైస్ నివేదికలో చేర్చుతాం. – శ్రీనివాస్, ఎంఈవో -
క్రీడాకారిణులపై కత్తి వేటు
ఒంగోలు టౌన్: ఆ పాఠశాలలో చదువుకుంటున్న బాలికలు కత్తి యుద్ధం (ఫెన్సింగ్) పోటీల్లో ప్రావీణ్యం సాధించారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నారు. అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన ఆ పాఠశాల పీఈటీ ఏకంగా కత్తి యుద్ధం పోటీలకు వెళ్లద్దంటూ ఆదేశించింది. తన భర్త నేర్పిస్తున్న కబడ్డీ క్రీడకు మాత్రమే వెళ్లాలంటూ హుకుం జారీ చేసింది. తమకు కబడ్డీ రాదని, ఫెన్సింగ్ పోటీలకు వెళతామని ఆ బాలికలు చెప్పిన నాటి నుంచి వెదురు బొంగుతో కొట్టడం మొదలుపెట్టింది. కత్తి యుద్ధం వీడి కబడ్డీకి వెళతామని చెప్పేవరకు వారిని ప్రతిరోజూ కొట్టడం ప్రారంభించింది. ఈ బాధలు తట్టుకోలేని బాలికలు తాము పాఠశాల మానివేస్తామంటూ తమ తల్లిదండ్రుల వద్ద వాపోయారు. ఎందుకు ఇలా చెబుతున్నారంటూ వారిని దగ్గరకు తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటపడింది. దీంతో శుక్రవారం ఆ బాలికలు వారి తల్లిదండ్రులను తీసుకొని నేరుగా ఆ పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీస్తే నీళ్లు నమిలింది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరుగురు బాలికలు ఫెన్సింగ్ పోటీల్లో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపించి ఇద్దరు జాతీయ పోటీలకు కూడా ఎంపికయ్యారు. అలాంటి బాలికలను అభినందించాల్సిన ఆ స్కూల్ పీఈటీ జ్యోత్నానదేవి వారిపై కత్తి కట్టింది. పీఈటీ కోర్సు చేíసి కబడ్డీ శిక్షణ ఇస్తున్న తన భర్త వద్దకు ఫెన్సింగ్ మానుకొని కబడ్డీ ప్రాక్టీసుకు వెళ్లాలంటూ హుకుం జారీచేసింది. తాము వెళ్లమని ఆ బాలికలు చెప్పడంతో వెదురుబొంగుకు పని చెప్పింది. గత కొన్ని రోజుల నుండి వెదురుబొంగుతో విచక్షణారహితంగా వారిని కొడుతుండటంతో ఆ బాధలు తట్టుకోలేని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడం, వారు మీడియా, చైల్డ్‌లైన్ సమక్షంలో నేరుగా పాఠశాలకు వెళ్లి పీఈటీని నిలదీయడంతో ఆ పీఈటీ తనకే పాపం తెలిదన్నట్లుగా వ్యవహరించి తప్పించుకునే ప్రయత్నం చేశారు. షాడో పీఈటీ.. పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీగా జ్యోత్సా్నదేవి పనిచేస్తున్నప్పటికీ, ఆమె భర్త షాడో పీఈటీగా వ్యవహరిస్తున్నాడు. పాఠశాల జరుగుతున్న సమయంలోనే షాడో పీఈటీగా వ్యవహరిస్తూ బాలికలపై పెత్తనం చేస్తున్నట్లు పలువురు బాలికలు మీడియా వద్ద వాపోయారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జరుగుతున్న స్కూల్ గేమ్స్‌లో భాగంగా జిల్లాకు చెందిన ఫెన్సింగ్ బాలికల జట్టు నెల్లూరులో సెప్టెంబర్ 29వ తేదీ జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరింది. అందులో పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు బాలికలు కూడా ఉన్నారు. ఆ బాలికలతోపాటు పీఈటీ జ్యోత్న్సాదేవి వెళ్లాల్సి ఉంది. కానీ, ఆమె వెళ్లకుండా తన భర్తను పంపించింది. బాలికలను రైలులో ఎక్కించి షాడో పీఈటీగా వ్యవహరిస్తున్న ఆమె భర్త మోటార్ బైక్‌పై నెల్లూరు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కూడా అదేమాదిరిగా వచ్చాడు. ఆ రోజు పీఈటీ జ్యోత్సా ్నదేవి రిజిస్టర్లో ఆన్ డ్యూటీ(ఓడీ)గా సంతకం చేశారు. అంటే ఆమె విధుల్లో ఉండి బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకువెళ్లకుండా, ఆమె భర్తను పంపించడం వివాదాస్పదమైంది. బాలల సంక్షేమ కమిటీ దృష్టికి.. పీవీఆర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న బాలికల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న పీఈటీ జ్యోత్న్సాదేవిపై బాలల సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధులు దేవకుమారి, కోటేశ్వరరావు విలేకరులకు చెప్పారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కమిటీ దృష్టికి తీసుకుళ్లున్నట్లు వివరించారు. -
పచ్చని ఒడి.. సర్కారు బడి
సాక్షి,పెద్దవూర : పచ్చని చెట్లు.. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే ఎవరికైనా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. స్వచ్ఛమైన పైరగాలి వీస్తుంటే పచ్చదనం పందిళ్ల మధ్యలో ప్రకృతిని ఆస్వాదిస్తూ పాఠాలను నేర్చుకోవడం ఎవరికైనా ఇష్టమే. పాఠశాలల్లో ఇలాంటి వాతావరణమే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మొక్కలు పెట్టినట్లుగా ఫొటోలకు ఫోజిచ్చి మరుసటి నాటినుంచి వాటి సంరక్షణను పూర్తిగా మరిచిపోతున్నారు అధికారులు. దీంతో నాటిన మొక్కలు నాటినట్లుగానే ఎండిపోతున్నా యి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్న నినాదంతో ప్రభుత్వం ప్రతి సంవత్సరం లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ వన నర్సరీలను ఏర్పాటు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుంది. లెక్కల్లో మాత్రం ఈ సంవత్సరం ఇన్ని లక్షల మొక్కలు నాటాము అని గొప్పలు చెప్పుకుంటూ చేతులు దులుపుకోవడం తప్ప ఆచరణలో మాత్రం అమలుకు నోచుకో వడం లేదు. ఒక మంచి పనిని పక్క వ్యక్తితో చే యించాలంటే ఆ పని తాను చేసి చూపించి ఆదర్శవంతంగా ఉంటేనే ఆ పని విజయవంతం అవుతుందనే విషయాన్ని నమ్మి ఆచరణలో పెట్టారు మండలంలోని చలకుర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం త్రిపురనేని లక్ష్మీప్రభ. అలాంటి వా తావరణాన్ని కోరుకోవడటమే కాదు దానిని సాకా రం చేసుకుని ఆస్వాదిస్తున్నారు విద్యార్థులు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల ఆవరణను పచ్చదనంతో నింపారు. నాటిన మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకుని వాటిని సంరక్షించారు. గత నాలుగేళ్లుగా హరితహారం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు పెరిగి పెద్దవై నీడను ఇవ్వడంతో పాటు పచ్చదనం పర్చుకుంది. రకరకాల మొక్కలు పాఠశాల ఆవరణలో హెచ్ఎం లక్ష్మీప్రభ, ఉపాధ్యాయులు ఔషద మొక్కలు, పూల మొక్కలు గాని కనిపిస్తే చాలు వాటిని కొనుగోలు చేసి పాఠశాలకు తీసుకువచ్చి వాటిని విద్యార్థులచే నాటిం చి విద్యార్థులకు దత్తత ఇస్తుంటారు. నాటిన మొక్కలను సైతం ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ గావిస్తూ సంరక్షిస్తుంటారు. ఇష్టంతో పెంచుతున్నా .. మేడంలు, సార్లు మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను చెప్పటంతో ప్రతి ఒక్కరము తలా రెండు మొక్కలను దత్తత తీసుకున్నాము. ఒకరికి ఒకరు పోటీపడుతూ పాఠశాల సెలవుదినాలలోనూ స్కూలుకు వచ్చి మొక్కలకు నీటిని పోసి పెంచుతున్నాము. ఇప్పుడు నేను పెంచుతున్న మొక్కలు చెట్లు అయ్యాయి. – బూరుగు అనూష, 4వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.. మొక్కలు నాటి వాటిని పెంచడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణను విద్యార్థులకు అప్పగించాము. నిత్యం వారికి సలహాలు ఇస్తూ విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచుతూ మొక్కలను సంరక్షిస్తున్నాము. – కె.నాగరాజు, ఉపాధ్యాయుడు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నాం.. పచ్చదనం అంటే నాకు ఎంతో ఇష్టం. పాఠశాలను పచ్చదనంతో నింపాలని అనుకున్నాను. హరితహారంలో భాగంగా నీడనిచ్చే కొన్ని మొక్కలను నాటాము. పూలమొక్కలు, పండ్ల మొక్కలు, ఔషద మొక్కలను బయటినుంచి కొనుగోలు చేసి నాటించాను. – త్రిపురనేని లక్ష్మీప్రభ, హెచ్ఎం, పీఎస్ చలకుర్తి -
విద్యార్థిని చితగ్గొట్టిన ఉపాధ్యాయుడు
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : ర్యాంకుల కోసం కార్పొరేట్ పాఠశాలల్లో పెడుతున్న ఒత్తిడికి ఎంతో మంది విద్యార్థులు బలవుతున్నా వారిలో మార్పు రావడం లేదు. ఇదే కోవలో మార్కులు తక్కువగా వచ్చాయన్న కారణంతో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయుడు విచక్షణా రహితంగా దాడి చేయగా ... విషయాన్ని ప్రిన్సిపల్‌కు తెలిపేందుకు వెళ్ళిన విద్యార్థిపై ప్రిన్సిపల్ సైతం చేయిచేసుకున్నాడు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో బంధువులతో కలిసి వచ్చి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. మంగళవారం పట్టణంలోని నారాయణ స్కూల్లో జరిగిన ఈ సంఘటనకు సంబం«ధించి వివరాల్లోకి వెళితే.. స్థానిక విద్యానగర్‌కు చెందిన డి.రమణ, రత్నమ్మల కుమారుడైన డి.వెంకటసాయి తెలుగుగంగకాలనీరోడ్డులోని నారాయణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఓ సబ్జెక్టులో వెంకటసాయికి మార్కులు తక్కువ వచ్చాయి. దీనిపై ఉపాధ్యాయుడు సాయికుమార్ అందరిలో నిలబెట్టి దూషిస్తుండటంతో మీరే మార్కులు తక్కువ వేశారంటూ సదరు ఉపాధ్యాయుడిని ఆ విద్యార్థి ప్రశ్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఉపాధ్యాయుడు ఇష్టమొచ్చినట్లు కొట్టడంతో పాటు కడుపు భాగంలో కాలితో కూడా తన్నినట్లు విద్యార్థి ఆరోపిస్తున్నాడు. ఇదే విషయంపై ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేస్తానని ప్రిన్సిపల్ రూముకు వెళ్లగా చెప్పేది వినకుండానే ప్రిన్సిపల్ కూడా తనపై చేయిచేసుకున్నట్లు విద్యార్థి తెలిపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ ఆందోళనను నిర్వహించారు. తప్పు చేసినా, చదువులో వెనుకబడినా కొట్టడంలో తప్పులేదని, అలా కాకుండా అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ కాలితో తన్నుకుంటూ బయటకు తీసుకురావడం ఏమిటని, ఉపాధ్యాయులుగా కాకుండా వీధిరౌడీలుగా ప్రవర్తించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థితో, పాఠశాల యాజమాన్యంతో వేరువేరుగా మాట్లాడారు. ఏదైనా సమస్య ఉంటే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని తెలపడంతో విద్యార్థి తల్లిదండ్రులు వెళ్లి అర్బన్ స్టేషన్లో ఉపాధ్యాయుడిపై, ప్రిన్సిపల్‌పై ఫిర్యాదు చేశారు. -
విద్యార్థులతో ఆటలా
ఆరోగ్యకరమైన దేశం కావాలంటే యువకులు, విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాల ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిస్తున్నా ఆ దిశగా క్రీడాభివృద్ధి కోసం ఆశించిన స్థాయిలో నిధులను మంజూరు చేయకపోవడం శాపంగా పరిణమించింది. ఫలితంగా క్రీడల్లో ఆసక్తి ఉన్నా మౌలిక వసతులు లేని మైదానాలు, తగిన ప్రోత్సాహం, శిక్షణ లేక ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. పదో తరగతి వరకు కాస్తోకూస్తో నేర్చుకున్న ఆటలకు ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి గుడ్‌బై చెప్పాల్సి వస్తోంది. జూనియర్ కళాశాలల్లో పీఈటీలు, పీడీలను ప్రభుత్వం నియమించకపోవడం, వివిధ ఆట వస్తువులు లేకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. క్రీడలను అభివృద్ధి చేస్తామని, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా దానికనుగుణంగా ప్రణాళికల రూపకల్పన చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడల పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం. చిత్తూరు ఎడ్యుకేషన్: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో క్రీడల అభివృద్ధికి 2015–16లో రూ.60 లక్షలు మంజూరు చేసింది. ఈ అరకొర నిధులు క్రీడల అభివృద్ధి ఏమాత్రం సరిపోతాయో ముఖ్యమంత్రికే ఎరుక. ఒక క్రీడలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన జట్టుకు క్రీడాదుస్తులు, రవాణా చార్జీలు మొదలైనవి కలిపి రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలో క్రీడాపోటీల నిర్వహణకు రూ. 2.50 లక్షల వరకు, అధికారిక ఖర్చులు, మరో రూ. 50 వేలు మొత్తం కలిపి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్లను ఎంపిక చేసేందుకు రూ. 3 లక్షల వరకు వెచ్చించాలి. వీటిని నిధుల వ్యయం భారమనే భావనతో ప్రభుత్వం క్రీడాపోటీల నిర్వహణ జోలికి వెళ్లడం లేదు. గత నాలుగేళ్లలో ఇప్పటివరకు రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ సాయంతో రాజీవగాంధీ ఖేల్ అభియాన్, ఖేలో ఇండియా పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన పోటీలంటూ లేకపోవడం గమనార్హం! క్రీడలు అభివృద్ధి చెందాలంటే గ్రామీణ స్థాయిలో క్రీడా మైదానాలు లేవు. ఇక, జిల్లా క్రీడామైదానంలో క్రీడలకు కోచింగ్ ఇవ్వడానికి రెగ్యులర్ కోచ్‌లు లేరు. నాలుగేళ్లుగా కోచ్‌లను నియమించకపోవడం చూస్తే ప్రభుత్వానికి క్రీడలపై ఏపాటి నిబద్ధత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పుట్టగొడుగుల్లా గుర్తింపు లేనిక్రీడా అసోసియేషన్లు! ఇదిలా ఉంటే పుట్టగొడుగుల్లా పలు క్రీడా అసోసియేషన్లు పుట్టుకొచ్చి ప్రాధాన్యత లేని క్రీడలను ఆడిస్తున్నాయి. నాలుక కూడా గీసుకోవడానికి అవి ఇచ్చే సర్టిఫికెట్లు పనికిరావు. మరోవైపు– కరాటే క్రీడను వచ్చే ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టనుండటం, ఈ క్రీడకూ గుర్తింపునివ్వడంతో దీనిపై పలువురు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒలింపిక్స్ అసోసియేషన్ గుర్తింపు లేని పుట్టగొడుగుల్లా ఉన్న వివిధ కరాటే అసోసియేషన్లు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. కరాటే పోటీలు, బెల్ట్ టెస్టులు (వైట్, ఎల్లో, ఆరెంజ్, బ్రౌన్ బెల్ట్ మొదలు బ్లాక్ బెల్ట్ వరకూ) ఒక్కో దానికి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేసి వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి గుంజుతున్నాయి. బ్లాక్‌బెల్ట్‌కు అయితే ఏకంగా రూ.20వేల నుంచి రూ.25వేలు దండుకుంటు న్నారు. ఒకసారి జిల్లా స్థాయి కరాటే పోటీలు అంటే ఎంతతక్కువ లేదన్నా 150–200మంది పైచిలుకు వివిధ కేటగిరీల్లో తలపడుతుంటారు. ఇవన్నీనూ ప్రైవేటు టోర్నీలే కావడం గమనార్హం! దీనిని బట్టి లెక్కవేసుకోవచ్చు ఎంతగా దండుకుంటున్నారో. అంతేకాకుండా గుర్తింపు లేని ఈ అసోసియేషన్లు తాము ఇచ్చే సర్టిఫికెట్లు అటు విద్య, ఉద్యోగాలకు ఏమాత్రమూ ఉపయోగపడవనే విషయం దాచి విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాయి. అంతేకాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో జరిగే జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలకు తమ అసోసియేషన్ల తరఫున జిల్లా నుంచి తీసుకెళ్లే క్రీడాకారుల నుంచి నిర్వాహకుల దోపిడీ మరిం త ఎక్కువగా ఉంటోంది. గుర్తింపు లేని క్రీడా అసోసియేషన్లు, ఈ దోపిడీకి చెక్ పెట్టాల్సిన జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించిన పాపానపోలేదు. వాస్తవానికి ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇప్పటివరకూ కరాటే పోటీలు నిర్వహించిన దాఖలాలు లేవు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అయినా వీటిని నిర్వహించే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తే కొంతవరకైనా జిల్లాలో ప్రతిభావంతులైన కరాటే క్రీడాకారులకు ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది. విద్యాశాఖపై చిన్నచూపే.... క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఫెడరేషన్ క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేస్తుంది. ఆ నిధుల్లో రూ. 2 ను స్థానిక పోటీలకు, తక్కిన రూ. 8 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించేందుకు వినియోగించాల్సి ఉంది. ప్రతి ఏడాది స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ద్వారా సెక్రటరీలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి క్రీడలను నిర్వహించాల్సిన దుస్థితి వస్తోంది. మండల, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించే స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్‌కు నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా ప్రతి ఏటా మండల, జోనల్, ఇంటర్ జోనల్, జిల్లా స్థాయి క్రీడలకు నిధుల లేమి పీడిస్తూండటంతో దాతల సాయం కోసం దేబిరించాల్సి వస్తోందని వ్యాయామోపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్‌కు కూడా నిధులు కేటాయించాని కోరుతున్నారు. స్టేడియం నిర్మాణం కోసం ఆకాశం కేసి చూస్తున్న పిల్లర్లు మదనపల్లెటౌన్: మదనపల్లె డివిజన్లో రూ.1. 20లక్షల మంది విద్యార్థులు చదువుతున్నా సరైన క్రీడామైదానాలు లేవు. సగానికి పైగా స్కూళ్లలో క్రీడామైదానాలు లేవు. అరకొర మైదానాల్లోనే ప్రాక్టీస్ చేస్తూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన వారూ ఉన్నారు. క్రీడామైదానాలను ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పిస్తే ప్రతిభకు సానపెట్టేందుకు అవకాశం ఉంటుంది. మదనపల్లె డివిజన్లో జెడ్పీ 113, జీహెచ్ఎస్ 5, ఎయిడెడ్ 6, ఏపీఎంస్ 9, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ 4, కేజీబీవీ 10,ఏపీఆర్ఎస్1, ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ఎస్ 1 చొ ప్పున మొత్తం 156 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 70 శాతం స్కూళ్లకు క్రీడామైదానాలు లేవు. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో వ్యాయామోపాధ్యాయులు కూడా లేకపోవడంతో క్రీడలపై ఆసక్తి ఉన్నా విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వారు లేరు. వాస్తవానికి మండలంలోని ప్రభుత్వ, ప్రైవే టు ఉన్నత పాఠశాలల్లో 2000 చదరపు మీటర్లతో, అదే పట్టణ, మున్సిపాలిటీల్లో అయితే వెయ్యి చదరపు మీటర్లతో ప్రతి స్కూలు క్రీడామైదానం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు ఉన్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక, బీటీ కళాశాలలో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణం పిల్ల్లర్లకే పరిమితమై, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది. చెరువులో ఆటలు! పలమనేరు: పలమనేరు నియోకవర్గంలో 513 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 45వేల మందికిపైగా విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు.ఈ స్కూ ళ్లలో సగానికి పైగా బడులకు క్రీడామైదానాలు లేవు. కొన్ని చోట్ల ఉన్నా అవి అంతంతమాత్రమే. మరికొన్ని పాఠశాలల్లో చెరువుల్లోనూ, బీడుగా ఉన్న చేలల్లోనూ పిల్లలు ఆటలాడుకోవాల్సి వ స్తోంది. పాఠశాలలకు క్రీడా పరికరాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో దాతలు స్పందించి ఏదైనా సాయం చేయాల్సిందే. బైరెడ్డిపల్లె ఉన్నత పా ఠశాల విద్యార్థులు వాలీబాల్ కోసం ఆందోళన చేశారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే బోధపడుతుంది. ఇక, ప్రతి పాఠశాలలోనూ క్రీడా మైదానాల అభివృద్ధికి రెండేళ్ల క్రితం రూ.5లక్షల చొప్పున ఉపాధి నిధులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఏమండలంలో నూ ఈ పనుల ఊసేలేదు. దీంతో పలు పాఠశాలల్లో మైదానాలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ పిచ్చిమొక్కలు, ఎత్తుపల్లాలతో ఉన్నాయి. క్రీడాకారులకు ప్రోత్సాహం శూన్యం చిత్తూరు రూరల్: చిత్తూరు నియోజకవర్గంలో 27ఉన్నత, ప్రాథమికోన్నత 18, ప్రాథమిక పాఠశాలలు 148ఉన్నాయి. వీటిలో వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో కొందరు క్రీడల్లో రాణిస్తున్నా తగినప్రోత్సాహం లభించడం లేదు. నియోజకవర్గంలో వ్యాయోమాధ్యాయుల కొరత సైతం వేధిస్తోంది. ప్రధానంగా పాఠశాలలకు ఆటస్థలాలులేవు. నియోజకవర్గవ్యాప్తంగా మొ త్తం 92 పాఠశాలకు ఆటస్థలాలు లేవని విద్యాశా ఖ అధికారులు గుర్తించారు. ఈకారణంగా చాలా మందివిద్యార్థులుక్రీడలకు దూరమవుతున్నారు. స్టేడియం నిర్మాణం మరిచారు పీలేరు: పీలేరు నియోజకవర్గంలో 27 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలున్నాయి. ఇందులో సగం పాఠశాలల్లో క్రీడామైదానాలు లేవు. ఐదు గురుకుల పాఠశాలల్లో నాలుగు పాఠశాలల్లో ఎలాంటి ప్లేగ్రౌండ్ లేదు. పీలేరుతోపాటు నియోజకవర్గంలో నాలుగు ఇండోర్ స్టేడియంల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు, కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలకు ఇండోర్ స్టేడియంలు మం జూరు చేశారు. వాటి నిర్మాణానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో 2011 జూలై 22న శిలాఫలకం వేశారు. నిర్మాణానికి రూ. 8.40 కోట్లు మంజూరు చేశారు. అయితే, ఏడేళ్లుగా గడచినా వాటి నిర్మాణం ఊసే లేదు. -
ప్లీజ్ సార్..వెళ్లొద్దు
అనంతపురం, కళ్యాణదుర్గం: ఉపాధ్యాయుడంటే...ఏ విద్యార్థికైనా భయమే..కానీ ఆ ప్రిన్సిపాల్ అంటే మాత్రం ఆ పాఠశాలందరికీ గౌరవం..కాదు..ప్రేమ...ఆ ప్రిన్సిపాల్‌కు కూడా విద్యార్థులంటే ప్రాణం..తండ్రిలా బిడ్డలపై వాత్సల్యం. అందుకే బదిలీపై ఆ ప్రిన్సిపాల్ పాఠశాల వదిలివెళ్తుంటే విద్యార్థులంతా చుట్టుముట్టారు..వెళ్లవద్దు సార్..ప్లీజ్..అంటూ అడ్డుపడిపోయారు. దీంతో ఉద్వేగానికిలోనైన సదరు ప్రిన్సిపాల్ కూడా ఇక్కడి నుంచి వెళ్లలేకపోయారు..ఈ ఘటన గురువారం కళ్యాణదుర్గంలో మోడల్ స్కూల్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల క్రితం ఎఫ్ఏసీపై వచ్చి... ఐదేళ్ల క్రితం కళ్యాణదుర్గంలో మోడల్ పాఠశాల తరగతులు ప్రారంభమయ్యాయి. ఎఫ్ఏసీ ప్రిన్సిపాల్‌గా వరప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. అరకొర వసతులతో మొదట్లో పాఠశాలను నడుపుకొచ్చారు. విద్యార్థులను తండ్రిలా చూశారు. పేద విద్యార్థులకు ఫీజులు సైతం చెల్లించారు. బాలురకు భోజన వసతి లేకపోతే... సొంత డబ్బులతో భోజనం పెట్టారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు ముందు నెలరోజులు ప్రత్యేక స్టేడీ హవర్స్ నిర్వహించి భోజన వసతి కల్పించారు. సుదూర ప్రాంతాల్లో రెజ్లింగ్, జూడో, హ్యాండ్‌బాల్ లాంటి పోటీలకే వెళ్లే క్రీడాకారులకు ఖర్చులు భరిస్తు సౌకర్యాలు కల్పించారు. అందువల్లే వరప్రసాద్‌తో విద్యార్థులకు విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంతటి అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ప్రిన్సిపాల్ వరప్రసాద్‌ను పామిడి ఆదర్శ పాఠశాలకు బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులందాయి. దీంతో గురువారం ఆయన ఈ విషయం విద్యార్థులకు చెప్పడంతో వారంతా అడ్డుపడ్డారు. కన్నీటి పర్యంతమయ్యారు. ఫ్లీజ్‌సార్...వెళ్లొద్దు ఇక్కడే ఉండండి అంటూ విద్యార్థిని, విద్యార్థులు ఆయనను చుట్టుముట్టారు. భావోద్వేగానికి గురైన వరప్రసాద్ కూడా కంటతడి పెట్టారు. ప్రిన్సిపాల్ వెళ్లకూడదంటూ ధర్నా అనంతరం విద్యార్థులంతా తమ ప్రిన్సిపాల్‌ను మరోచోటకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ప్రిన్సిపాల్ పాఠశాల దాటకుండా అడ్డుకుని చుట్టుముట్టారు. ప్రిన్సిపాల్ వెళ్లకూడదూ... ఉండాలి ప్రిన్సిపాల్ ఇక్కడే ఉండాలి... అంటూ నినాదాలతో హోరెత్తించారు. మధ్యాహ్నం 1.00 గంట నుంచి 4.30గంటల వరకు ఆందోళన జరిగింది. అనంతరం ర్యాలీగా విద్యార్థులంతా ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి ఇంటికి వెళ్లి ప్రిన్సిపాల్ బదిలీ ఆపాలని విజ్ఞప్తి చేశారు. నాకు అన్నం పెట్టాడు నాకు తల్లిలేదు. మా నాన్న సురిబాబు వ్యవసాయం చేస్తున్నారు. ఇక్కడ వసతి గృహం సౌకర్యం లేనప్పుడు ప్రిన్సిపాల్ సార్ భోజన సౌకర్యం కల్పించారు. – మాతశ్రీ, 8వ తరగతి విద్యార్థిని లోటు లేకుండా చూసుకున్నారు 8వ తరగతి నుంచి ఇక్కడే చదువుతున్నా. ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నారు. ఏ ఇబ్బంది ఉన్నా పరిష్కరించారు. మా సార్‌ను బదిలీ చేయకూడదు.– బాలాంజలి, ఇంటర్ విద్యార్థిని క్రీడాకారులకు ప్రోత్సహించారు రాష్ట్రంలో ఏ ప్రాం తానికి వెళ్లినా క్రీడకారుల ఖర్చంతా సారే భరించేవారు. విజయం తో తిరిగి రావాలంటూ ఉత్సాహపరిచేవారు. అలాంటి సార్‌ను బదిలీ చేయడం అన్యాయం.–మౌర్య, 9వ తరగతి విద్యార్థి -
టార్గెట్ సూర్యుడు..
వైస్సార్ కడప ,సుండుపల్లె: మన సౌరవ్యవస్థ రారాజు సూర్యుడికి మీ పేరు చెప్పాలనుకుంటున్నారా..అదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా..అందుకే మీ పేరు సూర్యుడికి అందజేస్తాం..వివరాలు పంపించండని నాసా సువర్ణావకాశం కల్పించింది. పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో భానుడి వాతావరణం తెలుసుకునేందుకు శనివారం నాసా ప్రయోగం చేయనుంది. అంతరిక్షనౌక దాదాపు 63కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యుడి కాంతివలయం వద్దకు చేరుకుం టుంది. అక్కడి నుంచి సౌరమంట నక్షత్రానికి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేస్తోంది.అందువల్ల పనిలో పనిగా ఓమైక్రోచిప్లో భూవాసుల పేర్లు పంపాలని నిర్ణయించింది. ఈ పేర్లలో సుండుపల్లె మండలానికి చెందిన గిరిజన గురుకుల విద్యార్థి భరత్‌కుమార్, సైన్స్ ఉపాధ్యాయుడు బాషా పేర్లు వచ్చాయి. వీరికి ప్రిన్సిపల్ చలపతి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. సంతోషంగా ఉంది: నా పేరు భరత్‌కుమార్ నాయక్.అమ్మ అమ్మణ్ణి, తండ్రి రాజానాయక్. సుండుపల్లె మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె గ్రామపంచాయతీ మిట్టబిడికి కాలనీ, సామాన్యరైతు కుటుంబం. నాసాకు ఎంపికకావడం సంతోషంగా ఉంది. సూర్యుని ఎవరు తాగగలరనే బృహత్తర కార్యక్రమంలో భాగంగా నాపేరు మైక్రోచిప్‌లో ఉంచడం, వారి నుంచి సర్టిఫికెట్ పొందడం ఆనందంగా ఉంది. బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదిగి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తా. – భరత్‌కుమార్ నాయక్, 5వ తరగతి, గిరిజన గురుకుల విద్యార్థి -
గురి తప్పిన గాండీవం
కనిగిరి(ప్రకాశం): క్రీడాభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రాజెక్టు గాండీవం లక్ష్యాన్ని గురిపెట్టడం లేదు. ఎంతో ప్రచార ఆర్భాటంగా చేపడుతున్న ఈ పథకం లక్ష్యం మంచిదే అయినా క్షేత్ర స్థాయిలో కనీస వసతుల సమకూర్చలేదు. దీంతో విద్యార్థుల్లో క్రీడాభివృద్ధి మాటల గారడిగానే మారనుందనే విమర్శలున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లో మొత్తం 2,985 పాఠశాలలుండగా, అందులో 2,411 ప్రాథమిక, 179 ప్రాథమికోన్నత, 395 ఉన్నత పాఠశాలలున్నాయి. వాటికి సంబంధించి గతేడాది లెక్కల ప్రకారం 4,78,050 లక్షల మంది విద్యార్థులున్నారు. జిల్లాలో 150 మంది పీడీలు, 250 మంది పీఈటీలున్నారు. నియోజక వర్గంలోని ఆరు మండలాల్లో 464 ప్రభుత్వ పాఠశాలుండగా అందులో సుమారు 29,226 మంది విద్యార్థులున్నట్లు అంచనా. కనిగిరి మండలంలో సుమారు 10 వేల మంది విద్యార్థులున్నారు. జూలై 1 నుంచి 12 వరకు పాఠశాల స్థాయిలో.. 13 నుంచి నెలాఖరు వరకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. వీరిలో ప్రతి పాఠశాలలో 6–10 తరగతి తరగతి విద్యార్ధులను 20 మందిని ఎంపిక చేసి మండలానికి 250 మందిని క్రీడా ప్రతిభ కలిగిన వారిని జిల్లా స్థాయికి పంపారు. జిల్లా మొత్తంలో సుమారు 12 వేల మంది ఉన్నారు. వీరిలో కొందరిని జల్లెడపట్టి ప్రతిభ కలిగిన వారిని వెయ్యిమందిని గాండీవం క్రీడలకు వెలికితీసి క్రీడా శిక్షణ ఇస్తారు. మిగతా వారిని పాంచజన్యకు (రెండో విడతకు) ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది. ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 100 శిక్షణ కేంద్రాలను ఎంపిక చేయగా, జిల్లాలో 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో కనిగిరి మండలం కంచర్లవారిపల్లి, ఇంకొల్లు, కరేడు, యద్దనపూడి, కొత్తపట్నం, ఉలవపాడులలో శిక్షణా కేంద్రాలు నిర్వహించనున్నారు. వాస్తవికత ఇదీ.. క్రీడాకారుల ఎంపికలో క్షేత్ర స్థాయిలో 9 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఎత్తు, బరువు, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబులిటీ, షటిల్ రన్, స్పీడ్‌రన్, స్టాండింగ్ జంప్, మెడిసిన్‌బాల్, 200 మీటర్స్ రన్ వీటిలో జిల్లాలోని 56 మండలాల్లో ఐదు, ఆరు మండలాల్లో తప్పా ఎక్కడా 200 మీటర్ల పరుగుపందెం నిబంధన ప్రకారం జరగలేదు. ఎందుకంటే ఎక్కడా రన్ ట్రాక్ లేదు. అంతేగాక టెన్వీక్స్ సంస్థ నిర్దేశించిన సమయంలో 200 మీటర్ల పరుగును 10 ఏళ్ల విద్యార్థి 30 సెకండ్లల్లో, 16 ఏళ్ల విద్యార్థి 25 సెకండ్లలో పరుగు పెట్టడం అసాధ్యం. దీన్ని బట్టి చూస్తే లక్ష్యం అనుకున్న స్థాయిలో నెరవేరే అవకాశం లేదు. క్రీడా మైదానాలకు గ్రహణం.. జిల్లాలో క్రీడా మైదానాల అభివృద్ధికి గ్రహణం ఏర్పడింది..ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ కింద జెడ్పీ ఉన్నత పాఠశాలల గ్రౌండ్ల అభివృద్ధికి గతేడాది పనులు చేపట్టింది. (ఎన్ఆర్ఈజీఎస్, ఉపాధి కూలీలు) లేబర్ వర్క్ తో సగం, మెటీరియల్ కాంపోనెంట్‌తో సగం ఫిప్టి, ఫిఫ్టిగా ఒక్కో పాఠశాల ప్లే గ్రౌండ్ అభివృద్ధికి రూ.5 లక్షల అంచనా విలువతో మంజూరు చేశారు. అందులో రన్నింగ్ ట్రాక్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ కోర్ట్లు తయారు చేయాల్సి ఉంది. అంచనా విలువలు తగ్గించడం.. రాజకీయ జోక్యాలు.. ఇలా కారణాలు ఏమైనా జిల్లాలో 15 శాతం క్రీడా మైదానాలు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో జిల్లాలో వేలాది మంది క్రీడా విద్యార్థులు ఆట స్థలాలకు దూరంగా ఉన్నారు. గతేడాది లెక్కల ప్రకారం జిల్లాలోని జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 82,321 మంది విద్యార్థులు చదువుతున్నారు. వేలాది మంది విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తితో చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని 56 మండలాల్లోని 290 జెడ్పీ, ఉన్నత పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా మొదటి విడతగా..232 స్కూల్స్‌ను అనుమతి ఇచ్చారు. వాటిలో 20 శాతం కూడా ప్లే గ్రౌండ్లు పూర్తికాలేదు. కొన్ని చోట్ల ఆరంభానికే నోచుకోలేదు. కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కనిగిరిలో 6, హెచ్‌ఎంపాడులో 5, పామూరులో 5, సీఎస్‌పురంలో 5, వెలిగండ్లలో 6, పీసీపల్లిలో 5 జెడ్పీ ఉన్నత పాఠశాలలకు ప్లే గ్రౌండ్లు మంజూరు కాగా వాటిలో 10 శాతం మాత్రమే పనులు ప్రారంభమై ఆరంభం శూరత్వంగా నిలిచాయి. హెచ్‌ఎంపాడు మండలంలో మొహమ్మదాపురం పాఠశాలలో కొన్ని పనులు జరిగాయి. కారణాలు ఏమైనా కనిగిరి మండలంలో పాతపాడు, ఏరువారిపల్లి, గురువాజీపేట, దిరిశవంచలో అసలు మొదలు కాలేదు. తాళ్లూరు, కంచర్లవారిపల్లిలో గ్రౌండ్‌ను తవ్వి వదిలేశారు. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యార్ధులు ఆటకు అనేక అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా ఆయా పాఠశాలల్లో కనీస నడిచే పరిస్థితి లేదు. -
12 పాఠశాలలను తగలబెట్టిన ఉగ్రవాదులు
ఒక ఆడపిల్ల (మలాలా) చదువుకుంటేనే.. ఆకాశమంత ఎత్తు ఎదిగి, నోబెల్ అవార్డు అందుకునే స్థాయికి చేరుకుంది. మూఢాచారాలపై, మతఛాందసవాదులపై ఏకంగా యుద్ధమే చేస్తోంది. మరి దేశంలోని మిగతా ఆడపిల్లలంతా చదువుకుంటే... అమ్మో, ఇంకేమైనా ఉందా? ఉగ్రవాదాన్ని, మూఢాచారాల్ని కూకటివేళ్లతో పెకలించేయరూ..! అందుకేనేమో.. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలను తీవ్రవాదులు తగలబెట్టేస్తున్నారు. విద్య మనిషిని సంస్కరిస్తుంది... జ్ఞానాన్ని పెంచుతుంది... అజ్ఞానాన్ని తుంచేస్తుంది. ఆధునికతవైపు నడిపిస్తుంది... మూఢాచారాలపై పోరాడే శక్తినిస్తుంది. అందుకేనేమో.. మతఛాందసవాదులైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఆ విద్యకు ఆలవాలమైన పాఠశాలలపై కన్నేశారు. ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో చాటిచెప్పి.. నోబెల్ అవార్డును అందుకునే స్థాయికి ఎదిగిన మలాలా పుట్టిన గడ్డపైనే.. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలను తగులబెడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. పూర్తిగా ధ్వంసం: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్–బాల్టిస్తాన్‌లో గుర్తుతెలియని ఉగ్రవాదులు 12 స్కూళ్లను తగలబెట్టారు. ఇందులో ఆరు బాలికల పాఠశాలలే ఉన్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు.. స్కూళ్లకు తగిన రక్షణ కల్పించాలని ఆందోళన చేపట్టారు. గిల్గిత్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలాస్ టౌన్లో గురువారం రాత్రి మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. 12 స్కూళ్లను తగలబెట్టి, పూర్తిగా ధ్వంసం చేశారని స్థానిక డైమర్ జిల్లా ఎస్పీ రాయ్ అజ్మల్ వెల్లడించారు. దీనిపై విచారణ మొదలుపెట్టామని, నిందితులను పట్టుకోవడానికి భద్రత దళాలు వేట మొదలుపెట్టాయని చెప్పారు. స్కూళ్లపై ఎలాంటి బాంబు దాడీ జరగలేదని డైమర్ ప్రాంత కమిషనర్ అబ్దుల్ వహీద్ చెప్పారు. నిర్మాణంలో ఉన్న పాఠశాలలపైనా..: మిలిటెంట్లు దాడి చేసిన స్కూళ్లలో కొన్ని ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయని, భవిష్యత్తులో పాఠశాలలేవీ నిర్మించకుండా ఉండేందుకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ దాడులకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్రాంతంలో గతంలోనూ తాలిబన్లు స్కూళ్లపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. బాలికల పాఠశాలలపైనే ఎక్కువగా ఈ దాడులు జరిగేవి. మళ్లీ ఆ రోజులను గుర్తుచేస్తూ ఘటనలు జరుగుతుండడంపై గిల్గిట్–బాల్టిస్తాన్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
స్కూల్ ఆటో దగ్ధం.. విద్యార్థులు క్షేమం
సాక్షి, నిర్మల్ : రోడ్డుపై వెళ్తున్న స్కూల్ ఆటోలో మంటలు చెలరేగిన ఘటనలో ఆటో డ్రైవర్ అప్రమత్తత వల్ల ఆటోలో ఉన్న విద్యార్థులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన బుధవారం నిర్మల్ జిల్లాలోని అక్కాపూర్ వద్ద చోటుచేసుకుంది. 10మంది విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సరైన సమయానికి ఆటోడ్రైవర్ స్పందించి ఆటోలో ఉన్న పిల్లలను కిందకు దించేశాడు. అయితే మంటలు ఆర్పటానికి డ్రైవర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆటో పూర్తిగా కాలిపోయినా అందులోని పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. -
బూట్లు.. సరదా..ఓ రికార్డు
1251 రోజులపాటు...రోజుకో కొత్త షూ తొడుక్కొని స్కూల్‌కు వెళ్లిందో విద్యార్థిని. ఆరేళ్లపాటు సాగిన ఈ సరదా రికార్డుకు చేరువైంది. సాక్షి, సిటీబ్యూరో : ఓ తండ్రి రికార్డుల కల కన్నాడు.అందుకు చిన్నప్పటి నుంచి నాణేలుసేకరించాడు. అయితే ఇందులో కొత్తేం ఉంది? అందరూ సేకరిస్తారు కదా అనుకున్నాడు. ఏదైనా కొత్తగా చేయాలని తపించాడు.తాను సాధించలేనిది.. తన కూతురితోనైనా సాధించాలని నిర్ణయించుకున్నాడు. కుమార్తెకు రోజుకో కొత్త షూ, సాక్సుల జతను కొనిచ్చి స్కూల్‌కు పంపించాడు. అలా 1997–2003 వరకు ఆరేళ్లు ఇలా చేశాడు. అయితే మధ్యలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో మానేశాడు.ఆ షూలు, సాక్సుల జతలను భద్రపరిచి, వివిధ సంస్థలకు పంపించగా ఇన్నేళ్లకువరల్డ్ రికార్డులు వరించాయి. మొత్తానికిఆ తండ్రి కల ఫలించింది. పాతబస్తీలోని శాలిబండకు చెందిన డాక్టర్ అలీం ఖాద్రి రికార్డు కథ ఇది. తన కుమార్తె అస్ఫియాను 1997లో గన్‌ఫౌండ్రీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చేర్పించాడు. ఆ రోజు జూన్ 16. అస్ఫియా తొలి రోజు స్కూల్‌కు వెళ్తోంది. కొత్త యూనిఫామ్, కొత్త షూలు ధరించింది. మరుసటి రోజు మరో కొత్త జత షూలు, సాక్సులతో వెళ్లింది. ఇలా 1997లో ఎల్కేజీ నుంచి 2003లో నాలుగో తరగతి పూర్తి చేసే వరకు మొత్తం 1251 షూ, సాక్సుల జతలు ధరించింది. వాటన్నింటినీ భద్రపరిచిన అలీం ఖాద్రి... వాటి ఫొటోలను వివిధ సంస్థలకు పంపించగా రికార్డులు వచ్చాయి. గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సహా మరిన్ని రికార్డులు వరించాయి. ఎంకరేజ్ చేశారు.. ‘నేను ప్రతిరోజు స్కూల్‌కు కొత్త షూలు ధరించి వెళ్తే టీచర్లు, స్నేహితులు చాలా ఎంకరేజ్ చేసేవారు. అలా ఎల్కేజీ నుంచి నాల్గో తరగత వరకు కొత్త షూలు వేసుకున్నాను. ఆ షూస్, సాక్సులు, వాటిని తీసుకొచ్చిన కవర్లు, స్టికర్లు... ఇలా ప్రతిదీ షూ బాక్స్‌లో వేసి భద్రపరిచాం. మొత్తం 1251 షూ సహా 9,368 వస్తువులు ఉన్నాయ’ని అస్ఫియా తెలిపారు. తాను ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసి, ఎంఎస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. అలా ఆలోచన... ‘నేను చిన్నప్పటి నుంచి వివిధ దేశాల, ప్రాంతాల్లోని నాణేలు సేకరించేవాడిని. కానీ ఎంతో మంది దేశవిదేశాల నాణేలు సేకరిస్తుంటారు. నాణేలకు హద్దు ఉండదు. నాణేలు సేకరించినా ఎలాంటి రికార్డులు సాధించలేమని, ఏదైనా కొత్తగా చేయాలని ఉండేది. మా అమ్మాయి అస్ఫియాను అప్పుడే స్కూల్లో చేర్పించాం. అమ్మాయి కోసం కొత్త పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్, షూలు కొన్నాను. అస్ఫియా మొదటి రోజు స్కూల్‌కు వెళ్లినప్పుడు నాకొక ఆలోచన తట్టింది. ప్రతిరోజు ఓ కొత్త షూ జతను మా అమ్మాయికి కొనివ్వాలని అనుకున్నాను. అలా 1997 జూన్ 16 నుంచి 2003 జూన్ 14 వరకు స్కూల్‌కు వెళ్లే ప్రతిరోజు ఓ కొత్త షూ జతను వేసుకునేద’ని వివరించారు అలీం ఖాద్రీ. ⇒ ఆరేళ్లు రోజుకో షూ, సాక్సుల జత ⇒ పాతబస్తీలోని డాక్టర్ అలీం ఖాద్రీ వినూత్న ప్రయత్నం ⇒ రికార్డు సాధించాలనే తపనతోకూతురికి కొనిచ్చిన తండ్రి ⇒ ప్రతిరోజు కొత్త షూలతో స్కూల్కువెళ్లిన కూతురు అస్ఫియా ⇒ మొత్తం 1251 షూలు, సాక్సులను భద్రంగా దాచిన వైనం ⇒ ఇది 1997–2003లో జరిగిన విషయం ⇒ ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసిన అస్ఫియా ⇒ ఇన్నేళ్లకు వరల్డ్ రికార్డులు సొంతం ⇒ ఈ నెల 20న అవార్డుల ప్రదానం భార్య, కూతురుసహకారంతో... ‘నా భార్య, కూతరు సహకారంతో నా కల నెరవేరింది. అందరం కలిసి షాపింగ్‌కు వెళ్లేవాళ్లం. కొన్ని సందర్భాల్లో మా అమ్మాయి షూ నంబర్ లభించేది కాదు. దీంతో ముందస్తుగానే షూలు కొనుగోలు చేశాం. షూల కోసం ఇంటిలోని ఓ గదిని కేటాయించాం. మొత్తం షూల కొనుగోలుకు దాదాపు రూ.2లక్షలు ఖర్చు అయ్యాయి. డబ్బు ఖర్చు అయినందుకు ఎలాంటి బాధ లేదు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినందుకు ఎంతో సంతోషంగా ఉంద’ని చెప్పారు అలీం ఖాద్రి. ఆలస్యానికి కారణమిదీ... ‘అప్పట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండడంతో సరదాగా ప్రతిరోజు కొత్త షూలు కొనిచ్చాను. అయితే అమ్మాయి ఐదో తరగతిలో రాగానే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో షూలు కొనలేకపోయాను. ఆ తర్వాత నేను భద్రపరిచిన షూల ఫొటోలతో రికార్డుల కోసం పలు సంస్థలకు పంపించాను. అయితే షూలు డిస్ప్లే చేస్తూ వీడియో రికార్డింగ్ పంపించుమన్నారు. తదితర కారణాలతో అది ఆగిపోయింది. 2016 నుంచి తిరిగి ప్రయత్నాలు చేస్తున్నాను. గతేడాది షూలు మొత్తం ఒకే దగ్గర డిస్ప్లే చేసి.. వీడియో రికార్డింగ్, ఫొటోలు పంపించాం. దీంతో గోల్డెన్ బుక్ వరల్డ్ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సహా మరిన్ని రికార్డులు వరించాయి. అందరూ ఒకేసారి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించార’ని చెప్పారు అలీం ఖాద్రి. వీటిని ఈ నెల 20న నయాపూల్ మినార్ గార్డెన్స్‌లో ప్రదానం చేయనున్నారు. -
హవ్వ! అవ్వేది?
ఎనిమిది తొమ్మిదేళ్లు వచ్చేసరికి, పల్లెటూరి కుర్రాడు, పెద్దవాళ్లు చేసే పనుల్లో సగానికి పైగా సాయపడుతూ ఉంటాడు– కలుపు తియ్యడం, చేలకి నీరు పెట్టడం, కోసిన పంట కట్టలు కట్టడం, ఇల్లు కట్టుకున్నప్పుడు యిటికలూ తాటి కమ్మలూ అందివ్వడం యిలాంటివి. వాడిమీద యింకే ఆశా పెట్టుకోకుండా, అలాంటి కుర్రవాణ్ని పగలంతా బడికి పంపించాలంటే ఏ తండ్రి ఒప్పుకుంటాడు? కాని యీ పెద్దవాళ్ల యిష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, ప్రభుత్వం ఓ హుకుం ప్రకటించింది – ఆరేళ్లు పైబడ్డ కుర్రాడ్ని బడికి పంపకపోతే ఆ కుటుంబం పెద్దవాళ్లలో ఎవరో ఒకరు జైలుకి వెళ్లవలసి వస్తుందని. అదుగో ఆ కారణంగా మన పల్లెటూరి కుర్రాణ్ణి బడికి పంపించాల్సి వచ్చింది. బడికి వెళ్లిన తొలినాడు వాడు యెనిమిది పుస్తకాలు పట్టుకుని యింటికి వచ్చేడు. వాడి తాతయ్యా, నాయనమ్మా, తండ్రీ, తల్లీ అంతా వాడి చుట్టూ మూగి, ఆ పుస్తకాల్లో బొమ్మలూ అవీ యెంతో ఆశ్చర్యంగా చూడ్డం మొదలెట్టేరు. ‘‘మన దేశం నాలుగు ప్రాచీన గ్రంథాల్లోనూ యిలాంటి బొమ్మల్లేవు’’ అన్నాడు తాతయ్య. అంతవరకూ పరకాయించి చూస్తూన్న తండ్రి హఠాత్తుగా ఓ కేక పెట్టేడు– ‘‘ఆ బొమ్మల్లో ఉన్నవాళ్లు చైనావాళ్లు కాదు. జాగర్తగా చూడండి– ఒక్కడికయినా మనదేశం బట్టలున్నాయా? మన వీధి చివరి ముసలి ఫాదరీ గుర్తు వస్తున్నాడు’’ ఆలోగా కుర్రాడు, లోపల భయపడుతున్నా, ధైర్యం చిక్కబట్టుకొని గబుక్కున అనేశాడు. ‘‘ఈ పుస్తకాలు రూపాయిన్నరట’’. ఆ మాట విని, పిడుగు పడ్డట్టు, అందరూ కొయ్యబారి పోయారు. కాస్సేపటికి తేరుకుని, నాయనమ్మ విసుక్కుంది. ‘‘పనికి వచ్చే కుర్రాణ్ని పట్టుకుపోవడమే కాకుండా, ఇంకా పుస్తకాలకి డబ్బు కావాలా? దిక్కుమాలిన చదువులూ వీళ్లూనూ! ఈ లెక్కని ఏడాదికి సగం రోజులు పస్తుండాలి’’. ‘‘కాకపోయినా, ఒక్కసారిగా అన్ని పుస్తకాలెందుకో. ఒక్కటి అయ్యాక మరొకటి మొదలుపెడితే బావుణ్ను’’ అన్నాడు తాతయ్య. కుర్రాడి తల్లి తన చెవుల పోగులు అమ్మి డబ్బు యివ్వడానికి సిద్ధపడింది. తండ్రి కుర్రాడికి గట్టిగా బోధపర్చాడు. ‘‘నీకు తొమ్మిదేళ్లు వొచ్చేయి. మన యింటి సంగతులు తెలుసు కదా. ఇది మనవల్ల అయే పనికాదు. అయినా నిన్ను చదువులకి పంపుతున్నాం. నువ్వు బుద్ధిగా చదువుకుని జాగర్తగా పాఠాలు నేర్చుకోకపోతే, బతికి ఉన్నన్నాళ్లూ మేం యేడవ్వలసి వస్తుంది’’. మర్నాడు యింకా తూర్పు తెల్లవారకముందే లేచి, పరిగెత్తుకుని బడికి వెళ్లేడు కుర్రాడు. తీరా అక్కడికి చేరుకునేసరికి స్కూలు బంట్రోతు తప్ప యింకెవ్వరూ కంటపళ్లేదు. ఆ బంట్రోతు చెప్పేడు. ‘‘తొమ్మిదింటికిగాని బడి తెరవరు. ఇప్పుడింకా ఆరయినా కాలేదు. మేస్టరుగారు యింకా నిద్ర లేవలేదు. ఇంటికి పోయి మళ్లీ రా.’’ చేసేది లేక యింటి మొహం పట్టేడు. వీడు యింటికి చేరుకునే వేళకి, పాలు తియ్యడానికి కాబోలు, తాత ముంత పట్టుకు వస్తున్నాడు. ‘‘ఇవాళకి రెండోరోజు. అప్పుడే క్లాసులు యెగ్గొట్టేస్తున్నాడు వెధవ.’’ కుర్రవాడు యీ కోపానికి బిక్క చచ్చి పోయేడు. తల్లి వొచ్చి ఆ చెంపా యీ చెంపా వాయించింది. ‘‘పెరట్లో తగలబడి పశువులకి కుడితి పెట్టు’’ అని అరిచింది. కుర్రాడు చల్ది తిని స్కూలుకు వెళ్లేసరికి మేస్టరుగారు అప్పుడే కుర్చీలో కూచున్నారు. బడికి ఆలస్యంగా రాకూడదని పిల్లలకి ఉద్బోధన చేస్తున్నారు, అందరికన్నా ఎవరు ముందుగా వస్తే వాళ్లకి విద్యా దేవత ధనాలు రాసియిస్తుందని. సాయంకాలం నాలుగున్నరకి తండ్రి పొలం పనికి వెళ్లబోతూ ఉంటే, యింటికి వస్తూన్న కుర్రాడు కంటపడ్డాడు. అదృష్టవశాత్తూ తతిమ్మా కుర్రాళ్లు కూడా రావడమూ, మేస్టరుగారు విలాసంగా బెత్తం ఊపుకుంటూ షికారు వెళ్లడమూ కూడా కంటబడి, తన కొడుకు క్లాసులు యెగ్గొట్టలేదని స్థిమిత పడ్డాడు. మొదటి వారం రోజులూ మొట్టమొదటి పాఠంతోనే గడిచేయి. ఆ పాఠం ‘ఇది అమ్మ’, కుర్రాడు చదువులో అశ్రద్ధగా ఉన్నాడనడానికి యెంత మాత్రం వీల్లేదు. స్కూలు నుంచి వచ్చింది మొదలు చీకటి పడేదాకా ‘ఇది అమ్మ, ఇది అమ్మ’ అని అలా చదువుతూనే ఉండేవాడు. ఎడం చేత్తో పుస్తకం పట్టుకుని, కుడి చేతి చూపుడు వేలుతో ఒక్కొక్క అక్షరమే చూపించుకుంటూ, వేలు తీసేస్తే అక్షరాలు ఎక్కడ యెగిరిపోతాయో అన్నట్టు అతి శ్రద్ధగా చదివేవాడు. కాని వాడు ‘ఇది అమ్మ’ అని చదివినప్పుడల్లా వాడి తల్లి కంగారు పడిపోయేది. అయిదు రోజులు అలా ఓపిగ్గా వింది. ఆరోనాడు ‘ఏదీ మీ అమ్మ, చూడనీ’ అంటూ కొడుకు చేతులోంచి పుస్తకం లాక్కుంది. తల్లి కుతూహలంతోనే అడుగుతోందనుకుని, కుర్రాడు పుస్తకంలో బొమ్మ చూపించి, ‘‘తోలు జోళ్లూ, కత్తిరింపు జుట్టూ, గౌనూ తొడుక్కున్నది. ఇది అమ్మ’’ అని అందులో వాక్యం చదివేడు. తల్లి దయ్యం పట్టినదానిలా గుండెలు బాదుకుంటూ గోలుమని యేడ్చింది. ఆ గోలకి తండ్రీ, తాతా, నాయనమ్మా పరిగెత్తుకుంటూ వచ్చారు. ‘‘నేనిక్కడ ఉండగానే, వీడికి దయ్యం అమ్మ ఎక్కడ్నుంచి వచ్చింది?’’ తండ్రి కాస్త నిదానించి, అన్నాడు: ‘‘వీడిని ఆ మేష్టార్నే అడగమందాం. అదెవరి అమ్మో– బహుశా మేష్టారు గారి అమ్మో యేమిటో.’’ ఆ రాత్రి తల్లి నిద్ర పోలేదు. మర్నాడు పొద్దున్నే కొడుకుని లేపి, బడికి వెళ్లినప్పుడు, అ అమ్మ యెవరో మరిచిపోకుండా కనుక్కురమ్మని హెచ్చరించింది. కుర్రాడు బుద్ధిగా బడికి వెళ్లేసరికి అక్కడ యెవ్వరూ లేరు. ఆ వేళ ఆదివారం– బడికి సెలవు! ‘‘అమావాస్యకీ పున్నానికీ అంటే బావుంది కాని, ఆదివారాలు సెలవులెందుకో’’ విసుక్కుంది తల్లి. సోమవారం క్లాసులో మనవాడు లేచి నుంచున్నాడు. ‘‘ఇది అమ్మ అని వుంది కదా– ఆమె అసలు యెవరమ్మ అండి?’’ టీచరు శాంతంగా బోధపరిచాడు– ‘‘ఎవరి అమ్మ యేమిటి నాయనా? పుస్తకం ఎవరు చదివితే వాళ్ల అమ్మ అన్నమాట. బోధపడిందా?’’ కుర్రాడు తల అడ్డంగా ఊపేడు. ‘‘ఇందులో బోధపడక పోడానికేముందిరా?’’ ‘‘మరీ, మరీ– బాల్డీ కూడా యిది చదువుకున్నాడు కదా. వాళ్లమ్మ యిలా ఉండదే మరి?’’ అంతలో, హ్సియోలిన్ లేచి ‘‘బాల్డీ అమ్మకి ఓ చెయ్యి సొట్టా, ఓ కన్ను గుడ్డిన్నీ’’ అన్నాడు. బాల్డీకి ఉడుకుమోత్తనం వచ్చింది. ‘‘నీకు అమ్మే లేదుగా.’’ మేస్టరు గారు బెత్తంతో టేబిలు మీద కొట్టి – ‘‘ఇప్పుడు రెండో పాఠం మొదలెడుతున్నాం. ‘ఇది నాన్న’. అందరూ చూడండి’’ అన్నాడు. కుర్రాడి తల్లికి ఆ అమ్మ ఎవరా అన్న సందేహం తీరనే లేదు. ‘ఇది నాన్న’ అంటూ వల్లెవెయ్యడం చెవిని పడింది. అది కాస్తా భర్త చెవిని కూడా పడిందంటే, ‘‘నీ కొడుక్కి రెండో తండ్రి యెక్కణ్నుంచి వచ్చేడే’’ అని విరుచుకు పడతాడని భయం వేసి నోరు నొక్కేసుకుంది. పార్కు, పిక్నిక్కు, డాన్సు యిలాంటివి యెన్నో తను యెన్నడూ కనీ వినీ యెరుగనివి పుస్తకంలో చదివి అవి ఏమిటా అని ఆశ్చర్యపోతూ ఉండేవాడు కుర్రాడు. తరువాత పుస్తకంలో ‘టీ పార్టీ’ అన్న పాఠం చదివి, టీ పార్టీ చేసుకుందాం అని నలుగురు పిల్లలు అనుకున్నారు. కానీ అడిగితే ఇంట్లో డబ్బులిస్తారా? దస్తా కాగితాలు కావాలంటేనే నాయనమ్మ ఈ చదువులతో యిల్లు గుల్లయిపోతోందని కోప్పడేది. దగ్గుతున్న తాతయ్య కోసం అని చెప్పి ఏపిల్ పళ్లు తింటే బలం వస్తుందన్న సంగతిని పుస్తకంలో చూపించి అమ్మను డబ్బు అడిగాడు కుర్రాడు. తీరా విషయం బయటపడి తండ్రి రుద్రావతారం దాల్చాడు. బడి మానిపించేస్తే సరి అనుకున్నారు. పైగా నాయనమ్మకు, తన కొడుకు తన నుంచి దూరం అవుతున్నాడేమో అని భయం పట్టుకుంది. కోడలు రాకముందు ఉన్న స్థానం మాయం అయిపోతున్నట్టనిపించింది. ఈ భయానికి తోడు, కుర్రవాడు కొత్త పాఠం చదువుతూ ఉండగా వింది. ‘‘మా కుటుంబంలో నాకు తల్లీ తండ్రీ ఓ తమ్ముడూ చెల్లెలూ ఉన్నారు’’. దాంతో ముసలావిడ భయం రూఢి అయిపోయింది. ఎంతసేపు తల్లీ తండ్రీ అంటాడేగానీ, తాతయ్యా నాయనమ్మా అనడే గుంట వెధవ? ‘‘ఆహా! ఈ ఇల్లు నీది. నీకు తల్లీ తండ్రీ వున్నారు. నాయనమ్మ చచ్చిపోయింది. ఈ యింట్లో యింక నాకు చోటెక్కడుంది?’’ అని అరుస్తూ పులుసు గిన్నె కాస్తా దభాల్న పడేసిందామె. తండ్రి ప్రాణం చివుక్కుమంది. ‘‘కోపం తెచ్చుకోకమ్మా. ఇక ఇలాంటి పుస్తకాలు వీడ్ని చదవనివ్వను. అంతగా యిదయితే నేను జైలుకి వెళ్తాను, మరేం ఫరవాలేదు’’. ఆ మర్నాడు తండ్రి, ఓ పాలికాపుని మానిపించేసేడు. మేష్టారు కుర్రాడికి ‘ఆబ్సెంటు’ మార్కు చేసేరు! ‘లావో షి’ కలంపేరుతో రాసిన షు కింగ్చున్ (1899–1966) ఇరవయ్యో శతాబ్దపు చైనా సాహిత్యంలో చెప్పుకోవాల్సిన రచయిత. ‘రిక్షా బాయ్’ ఆయన ప్రసిద్ధ నవల. పైది, ఆయన కథ ‘పల్లె కుర్రాడి బడి చదువు’ సంక్షిప్త రూపం. తగిన పాఠ్యగ్రంథాలు లేక, ‘విద్యా వ్యాప్తికి పూనుకున్న అనేక దేశాలకి, ఇంగ్లీషులోనూ యితర విదేశీయ భాషల్లోనూ ఉన్న పాఠ్యగ్రంథాలని తమ భాషలోకి అనువదించి ఉపయోగించుకోవడం తప్ప వేరే గత్యంతరం’ లేని పరిస్థితిని ఈ కథ హాస్యంగా చర్చించింది. 1930 ప్రాంతంలో రాసిన దీన్ని క్రొవ్విడి లక్ష్మన్న తెలుగులోకి అనువదించగా, ప్రగతి వారపత్రిక లో 1974లో అచ్చయింది. సౌజన్యం: kathaaprapancham.in -
మార్నింగ్ వాక్ వెళ్లిన విద్యార్థిని దారుణంగా...
డెహ్రాడున్ : మార్నింగ్ వాక్కు వెళ్లిన విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం...దినేశ్ సింగ్ బిస్త్ అనే విద్యార్థికి ప్రతిరోజు మార్నింగ్ వాక్‌కి వెళ్లే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం కూడా తన ఇంటి నుంచి బయల్దేరాడు. కొద్ది దూరం వెళ్లగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. దినేశ్ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు గమనించి అతడి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. దినేశ్‌పై జరిగిన దాడికి ప్రత్యక్ష సాక్షులెవరూ లేకపోవడంతో అతడి హత్యా లేదా ఆత్మహత్యా అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. తోటి విద్యార్థుల పనేనా..? ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో... ఇద్దరు అబ్బాయిలు తనపై కిరోసిన్ పోసి నిప్పంటినట్లు దినేశ్ చెప్పినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. గతంలో కూడా ఇటువంటి కేసులు నమోదయ్యాయని, దినేశ్‌ను తోటి విద్యార్థులే హత్య చేశారా అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్లు డీఎస్పీ వీర్ సింగ్ తెలిపారు. ఈ విషయమై దినేశ్ చదువుతున్న పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించగా.. దినేశ్ యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ ఎప్పుడూ కూడా ఒత్తిడికి లోనయ్యేవాడు కాదని, అందరితో కలివిడిగా ఉండేవాడని చెప్పారని ఆయన పేర్కొన్నారు. -
లవ్ లెటర్ చించేశాడని పెట్రోల్ పోసి నిప్పంటించాడు
అర్ధవీడు(గిద్దలూరు): ఓ యువతికి ఇచ్చిరమ్మన్న లవ్ లెటర్‌ను చించేశాడనే కోపంతో పాఠశాల విద్యార్థిపై ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణం శనివారం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అర్ధవీడు మండలం అంకభూపాలేనికి చెందిన మెట్ల శేఖర్, వెంకటలక్ష్మమ్మ దంపతుల కుమారుడు రవితేజ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం భోజనం తరువాత స్కూలులో నిరుపయోగంగా ఉండే గదిలోంచి రవితేజ పెద్దగా కేకలు వేయడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పరుగున అక్కడికి వెళ్లారు. మంటల్లో కాలుతున్న రవితేజ ఒంటిపై దుప్పటి కప్పి నీళ్లు చల్లి మంటలార్పారు. అనంతరం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ఘటనపై అనుమానాలెన్నో... గాయపడిన రవితేజ కంభం ప్రభుత్వ వైద్యశాలలో విలేకర్లతో మాట్లాడుతూ తాను మూత్ర విసర్జన కోసం పాఠశాల బయటకి రాగా రంజిత్ అనే ఇంటర్ విద్యార్థి తనకు ఒక చీటీ (లవ్‌లెటర్)ఇచ్చాడని, స్కూలు ప్రాంగణంలోనే ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే ఓ యువతికి ఇచ్చిరమ్మన్నాడని చెప్పాడు. తాను ఆ కాగితాన్ని చించి వేయడంతో రంజిత్ తన వెంట తెచ్చుకున్న బాటిల్లోని పెట్రోల్‌ను తనపై పోసి, నిప్పంటించాడని తెలిపాడు. ఇదిలా ఉండగా రవితేజ ఇంటి నుంచే పెట్రోలు తెచ్చుకున్నాడని, తనే కాల్చుకొని ఉండొచ్చని స్కూలు హెచ్ఎం వెంకటేశ్వర్లు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఆయన మాటలను బాధితుడి తల్లిదండ్రులు ఖండిస్తున్నారు. తమ కుమారుడికి ఏదైనా జరిగితే టీచర్లే బాధ్యత వహించాలని చెప్పారు. నిందితుడి గుర్తింపు.. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ రవీంద్రారెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిందితుడు అదే ప్రాంగణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదవుతున్న మాదార్సు రంజిత్‌కుమార్‌గా గుర్తించారు. సీఐ భీమానాయక్ నిందితుడిని అదుపులోకి తీసుకుని మార్కాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా పెట్రోల్ రంజిత్ పోశాడా.. రవితేజ తెచ్చాడా..? లేదా ఆ యువతిపై పోసేందుకు రంజితే తెచ్చాడా..? అనే అంశాలపై విచారణ చేస్తున్నారు. -
నేటి నుంచి మూడు రోజులు స్కూళ్లు బంద్
అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50 శాతం ఫీజులు తగ్గించాలనే డిమాండ్‌తో రిజర్వేషన్ల విద్యార్థి ఫెడరేషన్ (ఆర్వీఎఫ్) బుధవారం నుంచి మూడు రోజుల పాటు విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందుకు సంబంధిచిన వాల్‌పోస్టర్లను మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు జి.నాగరాజు మాట్లాడుతూ, కరువుకు నిలయంగా మారిన అనంతపురం జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజుల పేరుతో కోట్లాది రూపాయలు దండుకుంటున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆయా స్కూళ్లలో 50 శాతం ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేశారు. స్కూళ్ల బంద్‌కు ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్వీఎఫ్ జి.ఓబులేసు, ఆర్పీఎస్ సుధాకర్‌యాదవ్, జీవీఎస్ మల్లికార్జుననాయక్, ఆర్వీఎస్ సీమకృష్ణ, నిరుద్యోగ ఐక్య వేదిక రామన్న, టీఎస్ఎఫ్ రవి, రాధాకృష్ణ, ఎస్వీఎస్ఎఫ్ అశ్వర్థ, ఆర్వీఎఫ్ అశోక్, విద్యార్థి సత్తా అమర్‌యాదవ్, ఆర్పీఎస్ అశోక్, గణేష్, సుబ్బరాయుడు, బోనాల రఫీ, బాబా, యశ్వంత్ పాల్గొన్నారు. -
టాయ్లెట్లో విద్యార్థి అనుమానాస్పద మృతి
బెంగళూరు: గుజరాత్లో తొమ్మిదో తరగతి విద్యార్థి హత్య ఘటన మరువక ముందే మరో విద్యార్థి అనుమానాస్పద మృతి కర్ణాటకలో కలకలం రేపింది. కొడగు జిల్లాలోని సైనిక పాఠశాల్లోని టాయ్లెట్లో తొమ్మిదో తరగతి విద్యార్థి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడగులో సైనిక పాఠశాలలో తొమిదో తరగతి విద్యార్థి(14) శనివారం సాయంత్రం టాయ్‌లెట్ వద్ద అపస్మారకస్థితిలో పడివుండటాన్ని గమనించిన పాఠశాల యాజమాన్యం అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే విద్యార్థి మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. విద్యార్థి తండ్రి అదే పాఠశాలలో హాకీ కోచ్‌గా పనిచేస్తున్నారు. పాఠశాలలోని కొంత మంది ఉపాధ్యాయులు తన కొడుకుని వేధించినట్లు విద్యార్థి తండ్రి ఆరోపించారు. ఈ విషయంపై పాఠశాల వైస్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమ కొడుకు మృతికి వైస్ ప్రిన్సిపాల్ కారణం మృతుడి తల్లిదండ్రులు ఆరోపించారు. స్థానికులతో కలిసి పాఠశాల ఎదుట నిరసన చేపట్టారు. కాగా పాఠశాల ప్రిన్సిపాల్, మరో నలుగురు ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
బడికి వేళాయె
అనంతపురం ఎడ్యుకేషన్: ఇన్నాళ్లూ వేసవి సెలవుల్లో ఆటపాటలతో సరదాగా గడిపిన చిన్నారులంతా నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యార్థులు కూడా నూతనోత్సాహంతో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఇప్పటికే యూనిఫాంతో పాటు ఆయా విద్యా సంస్థలు పుస్తకాలు సరఫరా చేశాయి. దీంతో వారంతా పాఠశాల తొలిరోజే యూనిఫాంతో సీతాకొక చిలుకల్లా పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంతవరకూ పాఠ్య పుస్తకాలు సిద్ధం చేయలేదు. యూనీఫాం ఊసే లేదు. మరోవైపు ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతులు వెక్కిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమస్యల నడుమ బడిగంట మోగనుంది. మౌలిక సదుపాయాలు కరువు జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలు 5,034 ఉన్నాయి. వీటిలో 3043 ప్రాథమిక, 1003 ప్రాథమికోన్నత, 988 ఉన్నత పాఠశాలలున్నాయి. జిల్లాలోని అన్నిపాఠశాలల్లో 5,61,495 మంది పిల్లలు చదువుతున్నారు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేవు. తాగునీరు, మరుగుదొడ్ల సమస్య విద్యార్థులను వెంటాడుతోంది. ముఖ్యంగా విద్యార్థినులు మరుగుదొడ్ల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి సెలవుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు. ప్రభుత్వ చర్యలు తీసుకోకపోవడం విద్యార్థులకు శాపంగా మారుతోంది. ప్రస్తుతం దాదాపు ప్రతి పాఠశాలలోనూ మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే నిర్వహణ లేక సగం స్కూళ్లలో పని చేయడం లేదు. అంతంత మాత్రంగానే పాఠ్య పుస్తకాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కూళ్లు తెరిచే నాటికి పంపిణీ చేసేందుకు ఆయా స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉంచాలి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి రాష్ట్రస్థాయిలోనే ఆలస్యం జరుగుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, కన్నడ, ఉర్దూ మీడియం 1–10 తరగతుల విద్యార్థులకు సుమారు 23,80,250 పాఠ్యపుస్తకాలు అవసరం. మిగులుస్టాకు 2,74,621 పుస్తకాలు ఉన్నాయి. ఇవిపోను 21,05,629 పుస్తకాలు అవసరం. ఇటీవల మిగులుస్టాకు మాత్రం కొన్ని మండలాలకు పంపారు. ముద్రణా సంస్థ నుంచి ఇప్పటిదాకా ఆశించినస్థాయిలో పాఠ్యపుస్తకాలు రాలేదు. పూర్తిస్థాయిలో జిల్లాకు చేరి ఇక్కడి నుంచి మండల పాయింట్లకు అక్కడి నుంచి పాఠశాలలకు వెళ్లేలోపు ఎన్ని రోజులవుతుందో ఎవరికీ తెలియడం లేదు. యూనీఫాం ఇప్పట్లో లేనట్లే ఒకటి నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలకు ఉచితంగా ఇచ్చే యూనిఫాం ఇప్పట్లో అందేలా లేదు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో సుమారు 2,99,632 మంది విద్యార్థులు 1–8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,99,264 జతల యూనిఫాం అవసరం. స్కూళ్లు ప్రారంభం నాటికి పిల్లలకు యూనిఫాం అందజేస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పిన మాటలు ఆచరణకు నోచుకోవడం లేదు. యూనిఫాం రెడీ చేసే బాధ్యతను రాష్ట్రస్థాయిలోనే ఆప్కోకు అప్పగించిన అధికారులు... ఇప్పటిదాకా రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. దీంతో యూనిఫాం విద్యార్థులకు అందేలోపు నెలలు పట్టే అవకాశముందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
ఉరివేసుకుని బాలుడి ఆత్మహత్య
పశ్చిమగోదావరి ,టి.నరసాపురం: జీడి చెట్టుకు ఉరి వేసుకుని 16 ఏళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన మండలంలోని తిరుమలదేవిపేటలో ఆదివారం జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన వసంతవాడ గణేష్ (16) తన తల్లి విజయలక్ష్మి మందలించిందని మనస్తాపానికి గురై శనివారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆదివారం గ్రామానికి చెందిన అబ్బదాసరి చిన వెంకటేశర్వరరావు, వసంతవాడ వెంకట దుర్గారావులు జీడిగింజలు ఏరుకోవడానికి వెళ్లారు. వీరికి దోసగట్టుపై జీడిచెట్టు కొమ్మకు తాడుతో గణేష్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. వారు గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గణేష్ జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 8వతరగతి పూర్తి చేశాడు. తొమ్మిదో తరగతిలో చేరాల్సి ఉంది. గురుకుల పాఠశాలలో 9వ తరగతిలో చేరేందుకు జంగారెడ్డిగూడెం పాఠశాలకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకోమని శనివారం గణేష్‌కు చెప్పి తల్లి విజయలక్ష్మి కూలిపనికి వెళ్లింది. కూలి పని నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి గణేష్ జంగారెడ్డిగూడెం వెళ్లకుండా ఇంటివద్దే ఉండటం చూసి తల్లి మందలించింది. దాంతో గణేష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. స్వతహాగా గణేష్ కోపిష్టి కావడంతో గతంలో కూడా పలుసార్లు ఇంటి నుంచి వెళ్లిపోయి కోపం తగ్గాక తిరిగి వచ్చేవాడు. అలాగే తిరిగి వస్తాడని తల్లి ఎదురు చూస్తుండగా గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలిసింది. తల్లి విజయలక్ష్మి ఫిర్యాదుతో ఎస్సై వి.రాంబాబు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చింతలపూడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అనుమానాస్పద స్థితిలో హెచ్ఎం మృతి
గద్వాల క్రైం: అనుమానాస్పద స్థితిలో ఓ హెచ్ఎం మృతి చెంది న ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం లో శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న వై.వెంకట్రామయ్య న్యూహౌసింగ్‌బోర్డు కాలనీలో అద్దెలో గదిలో ఉండేవాడు. అయితే, రెండు రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుండగా గురు, శుక్రవారాల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా హెచ్ఎం విధులకు హాజరు కాకపోవడంతో వెంకట్రామయ్య నివాస గృహం వద్దకు అటెండర్ వెళ్లాడు. తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోనుంచి చూడగా ఎలాంటి చలనం లేకుండా పడి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా వచ్చిన వారు వెంకట్రామయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. -
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
-
బడికి రెడీ
ఇక రాత్రి వేళ పొద్దుపోయేంతవరకు టీవీలకు అతుక్కుపోవడం కుదరదు. ఉదయం తొమ్మిదింటి వరకు నిద్రపోవడం అసలే జరగని పని. అమ్మమ్మలు.. నాన్నమ్మలు, తాతయ్యలతో కబుర్లు కట్టేయాల్సిందే. ఆటపాటలు, అల్లరి చేష్టలకు టాటా చెప్పాల్సిన సమయం వచ్చింది. వేసవి సెలవులకు ఇక సెలవే. గురువారంతో హాలీడేస్ ముగిశాయి. శుక్రవారం బడిగంటలు మోగనున్నాయి. ఇప్పటికే తల్లిదండ్రులు తమ పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు, షూస్, లంచ్ బాక్స్‌లు తదితర సామగ్రి కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. శుక్రవారం నుంచి బడికి పంపించేందుకు సన్నద్ధం చేస్తున్నారు. కొండాపూర్(సంగారెడ్డి): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలల గేట్లు తిరిగి తెరుచుకోనున్నాయి. ఉత్సాహంగా.. ఉల్లాసంగా, నిన్నామొన్నటి వరకు ఆటపాటల్లో మునిగి తేలిన విద్యార్థులు బడిబాట పట్టేందుకు సిద్ధమయ్యారు. జూన్ 1న బడిగంట మోగనుండడంతో ఇక పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. సుమారు 50 రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభకానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడులకను ఘనంగా నిర్వహిం చేందుకు జూన్ 1న పాఠశాలలను పునః ప్రారంభించనున్నారు. సమస్యలతో స్వాగతం.. జిల్లా వ్యాప్తంగా 1,733 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సర్కారు స్కూళ్లు 1,350 కాగా ప్రైవేటు పాఠశాలలు 383 ఉన్నాయి. సర్కారులో ప్రాథమిక పాఠశాలలు 864, ప్రాథమికోన్నత 198, ఉన్నత పాఠశాలలు 205తో పాటు తెలంగాణ గురుకుల పాఠశాలలు, మైనార్టీ గురకుల పాఠశాలలు, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. లక్షా 50 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో,మరో 1,19,677 మంది ప్రైవేటులో విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీనికి తోడు మౌలిక సౌకర్యాలు కరువై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు నిర్మించినా రన్నింగ్ వాటర్ లేకపోవడంతో చాలా పాఠశాలల్లో ప్రయోజనం లేకుండా పోయింది. పాఠశాలలకు ప్రహరీలు, ఆటలు ఆడుకునేందుకు మైదానాలు కరువయ్యాయి. ఇన్చార్జీల పాలనలోనే.. విద్యా వ్యవస్థను గాడిన పెట్టాలంటే పర్యవేక్షణ తప్పనిసరి. పాఠశాలలను పర్యవేక్షించాల్సి మం డల విద్యాదికారుల పోస్ట్‌లు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో 26 మండలాలకు గాను 18 మండలాల్లో మాత్ర మే మండల విద్యాధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. 8 మండలాలల్లో విద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 18 మండలాల్లో కంగ్టి, జిన్నా రం మండలాల్లో మాత్రమే రెగ్యులర్ విద్యాధికారులు కాగా మిగతా 16 మంది ఇన్‌చార్జులుగానే విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు మండలాలకు గానూ జిన్నారం ఎంఈఓ జూన్ చివరి నాటికి పద వీ విరమణ చేస్తుండడంతో అక్కడ కూడా ఇన్చార్జి నే నియమించే అవకాశం ఉంది. ఇన్చార్జి ఎంఈఓలుగా విధులు నిర్వర్తిస్తున్న ప్రధానోపాధ్యాయులకు కూడా ఒకొక్కరికి రెండు మండలాలు ఉండడంతో పాఠశాలల్లో బోధన కుంటుపడుతోందన్న విమర్శలు ఉన్నాయి. అటు పాఠశాలల్లో విద్యాబోధన చేయలేక, ఇటు పాఠశాలలను పర్యవేక్షించలేక ఇన్చార్జి ఎంఈఓలు సతమతమవుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 250 పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని 34 పాఠశాలల్లో ఉపాధ్యాయులే లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తగ్గని ఉష్ణోగ్రతలు రుతు పవనాల రాక ఆలస్యం కావడం, ఉష్ణోగ్రతలు నేటికీ 40 డిగ్రీల నుంచి తగ్గకపోవడంతో 4 నుంచి 8వ తేదీ వరకు ఒంటిపూట మాత్రమే బడులు నిర్వహించనున్నారు. ఆ ఒక్కపూట కూడా విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే జూన్ రెండో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభిస్తే బాగుండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం : జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఆర్వీఎం కార్యాయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జూన్ 1న పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నాయని, అదే రోజున ప్రతి విద్యార్థికి పుస్తకాలతో పాటు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు మొత్తం 7,20,740 పుస్తకాలు అవసరం కాగా వంద శాతం వచ్చాయని, ఇప్పటికే ప్రతి మండలంలోని మానవ వనరుల కేంద్రం ద్వారా సంబంధిత పాఠశాలలకు చేరవేయడం జరిగిందన్నారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫాంలను అందజేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన 95,315 యూనిఫాంలను పాఠశాలలకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు రేడియో పాఠాలతో పాటు డిజిటల్ తరగతుల ద్వారా విద్యా బోధన ఉంటుందన్నారు. జూన్ 4నుంచి బడిబాట ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేదుకు గానూ జూన్ 4 నుంచి 8వ తేదీ వరకు బడిబాట చేపడుతున్నట్లు డీఈఓ వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ రోజు ఉదయం 7 నుంచి 11 గంటలకు వరకు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలతో పాటు సన్నబియ్యంతో కూడిన మధ్యాహ్న భోజనం తదితరాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా 15,000 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించినట్లు చెప్పారు. ఐదు కేజీబీవీల్లో ఇంటర్‌కు అవకాశం బాలికల విద్యను బోలపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 17 కేజీబీవీలకు గానూ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 5 కేజీబీవీల్లో ఇంటర్ అవకాశం కల్పిస్తున్నట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. జహీరాబాద్, సదాశివపేట, జిన్నారం, అందోల్, నారాయణఖేడ్ కస్తూర్బాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించడం జరుగుతందన్నారు. కేజీబీవీల్లో సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు గానూ 80 సీట్లు మాత్రమే కేటాయించడం జరిగిందన్నారు. బడి బయట పిల్లలపై ప్రత్యేక దృష్టి జిల్లావ్యాప్తంగా మెప్మా సంస్థ వారు జనవరిలో నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో ఒకటి నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలు 448 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. బడి బయట ఉన్న పిల్లలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి వివరించారు. -
తొలిరోజే విద్యార్థులకు పుస్తకాలు
సాక్షి, హైదరాబాద్ : బడి తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. జూన్ ఒకటో తేదీన పాఠశాలలు పున:ప్రారంభమవుతాయని, ఆ రోజుకల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదో తరగతి వరకే యూనిఫాం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, ఈ ఏడాది నుంచి 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా యూనిఫాం ఇస్తామని స్పష్టం చేశారు. పాఠశాలల పున:ప్రారంభం నేపథ్యంలో శుక్రవారం కడియం శ్రీహరి ఎస్ఎస్ఏ భవన్లో జిల్లా విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కొత్త విద్యాసంవత్సరాన్ని విజయవంతంగా నడిపించాలని, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఉన్నందున వేసవి సెలవులను ముందుకు జరిపామని పేర్కొన్నారు. దీంతో ఈ ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులు పాల్గొనే అవకాశముంటుందని చెప్పారు. 8 లక్షల మంది విద్యార్థినులకు ‘కిట్స్’ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారి 85 కోట్ల రూపాయల ఖర్చుతో ఎనిమిది లక్షల మంది విద్యార్థినులకు హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందిస్తున్నట్లు కడియం శ్రీహరి చెప్పారు. జెడ్పీ స్కూళ్లు, ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులందరికీ ఈ కిట్లు అందిస్తామన్నారు. ఈ కిట్లలో విద్యార్థినులకు అవసరమైన కాస్మొటిక్ వస్తువులు ఉంటాయని, అవన్నీ బ్రాండెడ్ వస్తువులేనని చెప్పారు. ఒక్కో కిట్ ధర రూ.400 వరకు ఉంటుందని, ప్రతి కిట్‌లో మూడు నెలలకు సరిపోయేలా వస్తువులుంటాయన్నారు. ఏటా నాలుగుసార్లు ఈ కిట్లు సరఫరా చేస్తామన్నారు. కిట్ల పంపిణీలో స్థానిక నేతలను కూడా భాగస్వామ్యం చేయాలని అధికారులకు సూచించారు. జూలైలో అన్ని పాఠశాలల్లో హరితహారం జూలైలో అన్ని పాఠశాలల్లో పెద్ద ఎత్తున హరితహారం నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఈసారి విద్యా వాలంటీర్ల అవసరం లేకుండా కొత్త ఉపాధ్యాయులతో పాఠశాలలు నిర్వహిద్దామని అనుకున్నామని.. కానీ కోర్టు కేసుల వల్ల మళ్లీ వాలంటీర్లను నియమించుకోవల్సి వస్తోందని వివరించారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. విద్యా సంవత్సరం అకడమిక్ కేలండర్పై జూన్ మొదటి వారంలో వర్క్‌షాప్ నిర్వహిస్తామన్నారు. ఈ వర్క్‌షాప్‌లో సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం)పై కూడా సమీక్ష చేస్తామని, ఇందులో వచ్చిన ప్రతిపాదనలను అమలు చేస్తామన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు
కెరమెరి : ఈ నెల 15 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. మండలంలోని కెరమెరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడి ఆశ్రమ ఉ న్నత పాఠశాలల్లో మొత్తం 302 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ప్రారంభం నుంచి చివరి వరకు ఎలాంటి అటుపోట్లకు తావు లేకుండా నిర్వహించారు. రెబ్బెన : మండలంలో గత 15వ తేదీన ప్రారంభం అయిన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు గంగాపూర్ జెడ్పీ హైస్కూల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా మండలంలో 418 మంది విద్యార్థులు పరీక్షలకు హాజర య్యారు. తిర్యాణి: పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. పరీక్ష కేంద్రంలో 234 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. బుధవారం పరీక్ష కేంద్రాన్ని స్క్వాడ్ జబ్బార్ ఖాన్ తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు ముగియడంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఇళ్లకు తరలివెళ్లారు. దీంతో విద్యార్థులు హుషారుగా తమ ఇళ్లకు పయనమయ్యారు. -
ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం
యర్రగొండపాలెం:జిల్లాలో 1028 పంచాయతీలను కలుపుకొని మొత్తం 4,686 గ్రామాలున్నాయి. వీటిలో పంచాయతీకి ఒకటి ప్రకారం ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో శ్మశానాలు అభివృద్ధి పరిచే చర్యలు చేపట్టారు. అందుకుగాను రూ. 67.84 కోట్లు కేటాయి ంచారు. ఒక్కొక్క శ్మశానం అభివృద్ధికి రూ. 6.60 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుం ది. ఈ నిధులు ముఖద్వారం, స్నానా లగది, దహనం చేయటానికి ఒక ప్లాట్‌ఫాం నిర్మాణాలకే సరిపోతుండటంతో వాటిని చేపట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దాతలు (ఎన్ఆర్ఐలు) ముందుకొచ్చి రూ. 3 లక్షల విరాళం ఇచ్చినట్లయితే కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని చేపడతారు. కారణాలు ఏమైనా శ్మశానాల అభివృద్ధి పనులు మండలానికి ఒకటి రెండు మాత్రమే పూర్తి చేయగలిగారు. జిల్లాలో అనేక ప్రాంతాల్లో శ్మశానాలు ఆక్రమణకు గురవుతూనే ఉన్నాయి. కబ్జాదారులు శ్మశానాలను సైతం వదలడం లేదు. ఇందుకు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. పాఠశాల ఆవరణలో దహన సంస్కారాలు:పెద్దారవీడు మండలంలోని మద్దెలకట్టలో శ్మశానం లేకపోవడంతో పాఠశాల ఆవరణలోనే దహన సంస్కారాలు చేస్తున్నారు. గ్రామానికి ఒక పక్కన ఉన్న పాఠశాలకు కాంపౌండ్‌వాల్ లేదు. అక్కడ చెట్లు నీడ ఉంటుంది. ఈ నీడను ఆసరాగా తీసుకొని మృతదేహాలను దహనం చేయడం, ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహించడంలాంటివి చేస్తున్నారు. గ్రామంలో ఎవరైనా మృతి చెందితే పిల్లలు ఆ రోజు పాఠశాలకు వెళ్లరు. దహన కార్యక్రమాలు జరిగేవి చూసి అనేకమంది పిల్లలు భయపడిన సంఘటనలు ఉన్నాయని ఆ గ్రామస్తులు తెలిపారు. ఒకే గుంతలో 17 మృతదేహాలు ఖననం:2010లో పెద్దదోర్నాల మండలంలోని చిన్నదోర్నాల గ్రామానికి చెందిన కొంతమంది కూలీలు వరికోతల కోసం గుంటూరు జిల్లా మాచర్లకు వెళ్లారు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి చేరటానికి సిమెంటు లోడు లారీ ఎక్కారు. మార్గమధ్యంలో లారీ బోల్తాపడటంతో ఆ గ్రామానికి చెందిన 17 మంది మృతి చెందారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాలు శవాలను గ్రామంలోనే ఉంచి ఆందోళన చేపట్టారు. మూడు రోజులపాటు శవాలు ఖననం చేయకుండా ఉంచడంతో అవి కుళ్లిపోయి దుర్వాసన వచ్చాయి. సమస్య పరిష్కారం అయిన తరువాత ఆ మృతదేహాలను ఖననం చేయటానికి శ్మశానవాటిక లేకుండా పోయింది. ఈ కారణంగా ఒకే చోట జేసీబీతో పెద్దగుంత తీయించి 17 శవాలను ఆ గుంతలో ఖననం చేశారు. వెంటనే శ్మశాన వాటిక కోసం ఎకర స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అయినా ఆ స్థలానికి రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ నాయకులు సిఫార్సు చేస్తేనే పనులు.. అధికార పార్టీకి చెందిన నాయకులు శ్మశానాలు సైతం వదలడం లేదు. వారు సిఫార్సు చేస్తేనే శ్మశాన వాటికల అభివృద్ధి పనులు అప్పచెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు ఈ పనులను అప్పచెప్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఆ పార్టీకి చెందిన ముఖ్యనాయకుడు సిఫార్సు చేయాల్సి ఉంది. జన్మభూమి కమిటీలు ఈ శ్మశాన రాజకీయాల్లో ముఖ్యపాత్ర వహిస్తున్నట్లు తెలుస్తుంది. పలు గ్రామాల్లో నేటికీ కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబ సభ్యుల చావుకొస్తుంది. ఆ మృతదేహాన్ని ఎక్కడ ఖననం లేక దహనం చేయాలన్నదే పెద్ద సమస్య. అప్పటికప్పుడు శ్మశాన వాటికలను వెతుక్కోవాల్సిన పరిస్థితి జిల్లాలో నెలకొంది. పట్టణాల్లో అరకొరగా శ్మశాన వాటికలు ఉన్నాయి. అధిక భాగం గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక మృతదేహాలను రోడ్లపక్కన, పాఠశాల స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్న దుస్థితి నేడు ఉంది. శ్మశానాల కోసం నిధులు మంజూరైనా రాజకీయ జోక్యంతో పలు చోట్లు అభివృద్ధి కుంటుపడుతోంది. -
బాలికపై ముగ్గురు యువకులు దారుణం
గౌహతి : ఐదో తరగతి చదువుతున్న బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. ముగ్గురు యువకులు లైంగిక దాడి చేసి, అనంతరం కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ దుర్ఘటన అస్సాంలోని నాగోన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న బాలిక స్కూల్ అయిపోగా ఇంటికి తిరిగొచ్చింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరు. దాంతో అదే పాఠశాలకు చెందిన ముగ్గురు ఇంట్లోకి చొరబడి బాలికపై లైంగికదాడి చేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. అది గమనించిన ఇరుగుపొరుగువారు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మరణ వాంగ్మూలం తీసుకున్నారు. అప్పటికే 90శాతం కాలిన గాయాలు అవడంతో ప్రాణాలు పోయాయి. కాగా, ఇంతటి దారుణానికి పాల్పడిన ఆయన ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు జువైనల్స్ అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినవారని ,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
చనిపోయిన విద్యార్థినిపై ప్రిన్సిపాల్ చెత్త కామెంట్లు
న్యూఢిల్లీ : నోయిడాలో విద్యార్థిని ఆత్మహత్య సంఘటనపై ప్రిన్సిపాల్ బాధ్యతా రహితంగా షాకింగ్ కామెంట్లు చేశాడు. ఒక మహిళా టీచర్ విద్యార్థినిని ఎలా లైంగికంగా వేధిస్తుందంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే, మరో ఉపాధ్యాయుడు తమ వద్ద 25 ఏళ్లుగా పనిచేస్తున్నారని, ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి లైంగిక పరమైన ఆరోపణలు రాలేదంటూ వారిని వెనుకేసుకొచ్చాడు. దీంతో ఆ స్కూల్ వద్ద తీవ్ర దుమారం రేగింది. ప్రిన్సిపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. నోయిడాలోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్కూలులో సోషల్, సైన్స్ టీచర్లు తమ కూతురును వేధించారని, అకారణంగా, ఉద్దేశ పూర్వకంగా ఫెయిల్ చేశారని, ఆ అవమానాలతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్ 'ఆరోపణలు చేసిన టీచర్లలో ఒకరు మహిళ ఉన్నారు.. ఒక టీచర్ మా వద్ద 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఒక మహిళా టీచర్ విద్యార్థినిపై ఎలా లైంగిక వేధింపులకు పాల్పడుతుంది. 25 ఏళ్లుగా మా వద్ద పనిచేస్తున్న టీచర్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు. ఆ అమ్మాయి సగటు విద్యార్థిని. ఏనాడు ఆమె తల్లిదండ్రులు ప్యారెంట్స్ మీటింగ్‌లకు వచ్చేవారు కాదు. బాగా చదవలేదు.. అయితే, మంచి డ్యాన్సర్. ఆమె ఇంకా ఫెయిల్ కాలేదు.. రెండోసారి పరీక్ష రాయాల్సి ఉంది' అంటూ బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేశారు. -
వైరల్ అవుతున్న పోలీసు కమీషనర్ వీడియో
-
వైరల్ అవుతున్న ఆ పోలీస్ సెల్యూట్..!
సాక్షి, బెంగుళూరు : కనిపించని నాలుగో సింహం పోలీస్ అంటే మనలో చాలా మందికి భయం. ఇంక వారితో మాట్లాడాలంటే కొంతమంది బెంబేలెత్తిపోతారు. కానీ ఓ విద్యార్థి మాత్రం పోలీసు అధికారిని చూడగానే గౌరవంతో సెల్యూట్ చేశాడు. సిబ్బందితో కలిసి వెళ్తూ.. హడావిడిలో ఉన్న ఆ అధికారి కూడా హుందాగా స్పందించాడు. ఆ విద్యార్థి సెల్యూట్‌ను గమనించి.. వెంటనే ప్రతి సెల్యూట్ చేశాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. నగరంలోని మాల్య ఆస్పత్రి వద్ద ఈ అరుదైన ఘటన జరిగింది. బెంగుళూరు పోలీసు కమిషనరు టీ. సునీల్ కుమార్ మాల్య ఆస్పత్రి ముందు నుంచి వెళ్తున్నారు. కమిషనర్‌ను గమనించిన ఓ పాఠశాల విద్యార్థి గౌరవ సూచకంగా ఆయనకు సెల్యూట్ చేశాడు. తన సిబ్బందితో కలసి వెళ్తున్న కమిషనర్ ఇది గమనించి.. వెంటనే ఆ బాలునికి ప్రతి సెల్యూట్ చేశారు. ఇదంతా అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డయ్యింది. ‘ఒక యూనీఫామ్ మరో యూనీఫామ్కి ఇచ్చిన గౌరవం క్రమశిక్షణను సూచిస్తుంది’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 1500 మంది షేర్ చేశారు. 80,000 వ్యూస్ వచ్చాయి. -
ఆలస్యం ఖరీదు ఓ నిండు ప్రాణం
దాచేపల్లి:108 వాహనం సిబ్బంది సకాలంలో స్పందించకపోవటంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దాచేపల్లిలోని స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్న వి. తులసీ భర్త వేణుగోపాల్ నాయర్(62) గురువారం ఉదయం గుండెనొప్పిగా ఉందని చెప్పారు. 108 వాహనం ద్వారా పిడుగురాళ్లకు తరలించేందుకు కాల్ సెంటర్‌కు సమాచారం అందించారు. అక్కడ నుంచి సకాలంలో వాహన సిబ్బందికి సమాచారం అందలేదు. దీంతో కంగారుపడి ఆటోలో గుండెనొప్పితో బాధపడుతున్న వేణుగోపాల్‌నాయర్‌ను ఎక్కించుకుని వాహనం పార్కింగ్ చేసిన తహసీల్దార్ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. వాహనాన్ని తీసుకు రావాలని స్థానికులు, తులసి కోరినా పట్టించుకోలేదు. వాహనం బాగోలేదని, జీతాలు ఇవ్వటం లేదని, డ్రైవర్ లేడని సిబ్బంది సాకులు చెప్పారు. తర్వాత వేణుగోపాల్ నాయర్‌ను కారులో పిడుగురాళ్లకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. 108 వాహనం సకాలంలో వచ్చి ఉంటే తన భర్త బతికేవాడని తులసి వాపోయారు. వాహనం రాకపోకవటం వల్లే వేణుగోపాల్ నాయర్ మృతి చెందాడని స్థానికులు కూడా ఆరోపించారు. ఆయన భౌతికకాయాన్ని స్కూల్ చైర్మన్ జి.పి.రెడ్డి, డైరెక్టర్ పకీరారెడ్డి, ఇన్చార్జి ఎం. మల్లారెడ్డితో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సందర్శించి నివాళ్లర్పించారు. వేణుగోపాల్ నాయర్ అంత్యక్రియల కోసం స్వస్థలం కేరళకు అంబులెన్స్‌లో తరలించే ఏర్పాట్లు స్కూల్ యజమాన్యం చేసింది. -
విద్యార్థిపై పోలీసుల ప్రతాపం
ప్రొద్దుటూరు క్రైం : తిట్టుకోవడం.. తిట్టుకోవడం.. మళ్లీ కొద్దిసేపటికే ఒకరికొకరు కలిసి తిరగడం ఇవన్నీ పాఠశాలల్లో విద్యార్థుల మధ్య రోజూ కనిపిస్తుంటాయి. విద్యార్థుల మధ్య చిన్న పాటి ఘర్షణ జరిగినా, వాగ్వాదం చోటు చేసుకున్నా వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక ప్రైవేట్ స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన స్పల్ప ఘర్షణ పోలీస్ స్టేషన్‌కు చేరింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాములపేటకు చెందిన పసుపులేటి ఆంజనేయులు, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో రెండో కుమారుడు శ్రీరాం నెహ్రూరోడ్డులోని ఆదిత్య స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. సోమవారం పాఠశాలకు వెళ్లిన బాలుడు సాయంత్రం 4.30 గంటల సమయంలో రూ.100 కోసం సుకుమార్ అనే విద్యార్థితో గొడవ పడుతుండగా విద్యార్థులందరూ గుంపు అయ్యారు. దీంతో పాఠశాల ఎదురుగా నివాసం ఉంటున్న కానిస్టేబుల్ నాగరాజుకు ఉపాధ్యాయుడు సమాచారం అందించాడు. నాగరాజు అక్కడికి చేరుకొని గొడవ పడుతున్న విద్యార్థులిద్దరిని మందలించారు. అంతటితో ఆగక శ్రీరాంను సాయంత్రం 5 గంటల సమయంలో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొని వెళ్లాడు. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల వరకూ విద్యార్థి త్రీ టౌన్లోనే ఉండాల్సి వచ్చింది. బాలుడు తన తండ్రి ఊళ్లో లేకపోవడంతో పోలీసులకు తాత సెల్ నెంబర్ ఇచ్చాడు. పోలీసులు తాతకు ఫోన్ చేయగా ఆయన ద్వారా విషయం తెలుసుకున్న తల్లి పద్మావతి, తాత ఇద్దరు స్టేషన్ వద్దకు వెళ్లగా రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు వదిలి పెట్టారు. నా కుమారుడు క్రిమినలా..! నా కుమారుడు ఏమైనా క్రిమినలా అని పద్మావతి పోలీసులను ప్రశ్నించారు. గాయ పడిన కుమారుడ్ని ఆమె జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాఠశాల నుంచి తన కుమారుడ్ని పోలీసులు స్టేషన్‌కు తీసుకొని వెళ్తే పాఠశాల యాజమాన్యం ఎందుకు తమకు సమాచారం ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఔట్‌పోస్టు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. మా పాఠశాలలో గొడవ జరగలేదు మా పాఠశాలలో విద్యార్థుల మధ్య ఎలాంటి గొడవ జరగలేదు. పాఠశాలకు దూరంగా ఉన్న రిషీ అపార్ట్మెంట్ సమీపంలో జరిగింది. బయట విద్యార్థులు గొడవ పడుతుంటే పోలీసులు పట్టుకొని వెళ్లినట్టు ఉన్నారు. ఈ గొడవతో మా పాఠశాలకు ఎలాంటి సంబంధం లేదు. విద్యార్థిని మేం పోలీసులకు అప్పగించామని చెప్పడంలో వాస్తవం లేదు.– మోహన్‌రావు, కరస్పాండెంట్, ఆదిత్య హైస్కూల్. ఆమె భర్తపై కేసులు పెట్టామనే కారణంతోనే.. గత ఏడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరిలోనూ విద్యార్థి తండ్రి ఆంజనేయులుపై ఓ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కృష్ణంరాజునాయక్ తెలిపారు. ఈ రెండు కేసుల్లోనూ అతన్ని రిమాండుకు పంపించామని, బయటికి వచ్చాక రౌడీషీట్ కూడా ఓపెన్ చేశామన్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని వారి కుమారుడ్ని పోలీసులు కొట్టారంటూ ఆస్పత్రిలో పడుకోబెట్టారని, విద్యార్థిని పోలీసులు ఎవ్వరూ ఒక్క దెబ్బ కూడా కొట్టలేదని ఎస్ఐ వివరణ ఇచ్చారు. -
ఉలిక్కిపాటు.. స్కూళ్లలో తుపాకుల కలకలం
వాషింగ్టన్ : అమెరికాలోని పలు పాఠశాలలో తుపాకులు లభ్యం కావటం కలకలం రేపుతోంది. ఫ్లోరిడా మారణహోమం తర్వాత అప్రమత్తమైన అధికారులు పలు స్కూళ్లలో సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో తుపాకులను కలిగి ఉన్న పలువురు విద్యార్ధులను అరెస్ట్ చేయగా.. తల్లిదండ్రులు ఉలిక్కి పడ్డారు. గురువారం ఉత్తర టెక్సాస్‌లోనే ఇద్దరు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్లవర్ మౌండ్ మర్కస్ హైస్కూల్లో తుపాకీ, మందు గుండు సామాగ్రితో ఉన్న ఓ విద్యార్థి(16)ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తోటి విద్యార్థులు అందించిన సమాచారం మేరకు ప్లానో వెస్ట్ హై స్కూల్లో ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా వారిని అరెస్ట్ చేశామని అధికారులు తెలియజేశారు. గార్లాండ్‌లో చోటు చేసుకున్న ఘటనలో మరో విద్యార్థిని అరెస్ట్ చేశారు. సౌత్ గార్లాండ్ హైస్కూల్లో సెల్ ఫోన్ దొంగతనం అయినట్లు ఫిర్యాదు అందగా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి బ్యాగ్‌లో తుపాకీ దొరికింది. ఇక మరో రెండు చోట్ల దాడులకు పాల్పడతామని బెదిరించిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. అర్లింగ్టన్లోని నికోలస్ జూనియర్ హైస్కూల్లో ఓ విద్యార్థి(13)ని, వెదర్ఫోర్ట్ హైస్కూల్లో ఓ బాలికను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని.. అయితే వాటిని తేలికగా తీసుకోకుండా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ తల్లిదండ్రులను ఉద్దేశించి పోలీస్ శాఖ ఓ లేఖ విడుదల చేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలో పార్క్‌లాండ్ మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో 19 ఏళ్ల మాజీ విద్యార్థి విచ్చలవిడిగా కాల్పులకు దిగి 17 మందిని పొట్టనబెట్టుకున్న ఘటన తెలిసిందే. -
హైకోర్టు న్యాయమూర్తికి సమస్యలు
కోరుట్ల: ‘మేం చిన్నపిల్లలం.హైకోర్టు మా విషయంలో ఇంత ఆదరణ చూపుతుందని అనుకోలేదు. సమస్యలు తెలుసుకోవడానికి అంతా కదిలివచ్చారు. మా పాఠశాలను బాగు చేయడానికి డబ్బులు ఇస్తామన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాపై ఆదరణతో స్పందించిన హైకోర్టు న్యాయమూర్తికి ధన్యవాదాలు.. మా నమ్మకం నిలబడింది’.. అంటూ జగిత్యాల జిల్లా కోరుట్ల జెడ్పీ పాఠశాల నుంచిసమస్యలు రాసిన తొమ్మిదో తర గతి విద్యార్థినులు వైష్ణవి, రశ్మితలు సంతోç Ùం వ్యక్తంచేశారు. కోరుట్ల మండల విద్యాధికారి గంగుల నరేశం పాఠశాలను సంద ర్శించి మౌలిక వసతులను పరిశీలించారు. హడావుడిగా మరమ్మతులు హైకోర్టు ఆదేశాలతో కోరుట్ల బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలో దెబ్బతిన్న మరుగుదొడ్లను అధికారులు హడావుడిగా బాగు చేయించారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, నీటి వసతి కోసం రూ.11 లక్షలతో రూపొందించిన ప్రతిపాదనలు ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులకు పంపించారు. ఈ నిధులు త్వరలో వస్తాయని పాఠశాలకు పూర్తి వసతులు కల్పిస్తామని ఎంఈవో నరేశం తెలిపారు. విద్యార్థులు ఒక పాఠాన్ని చదివి ఆచరణాత్మకంగా తమ సమస్యల పరిష్కారానికి హైకోర్టుకు లేఖ రాయడం అభినందనీయమని పేర్కొన్నారు. రశ్మిత, వైష్ణవి చొరవ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. -
స్కూల్లో డ్యాన్సర్లు.. మండుటెండలో విద్యార్థులు!
సాక్షి, భోపాల్: ఓ పాఠశాలలో స్థానిక నేత డ్యాన్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విద్యార్థులను స్కూలు టెర్రస్ మీద మండుటెండలో కూర్చోబెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలగుచూసింది. ప్రోగ్రామ్‌కు పర్మిషన్ ఇచ్చిన స్కూలు యాజమాన్యంతో పాటు ఇలా పాఠశాలలో ఇలాంటి ఈవెంట్ నిర్వహించిన నేతపై బాలల హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన తికమ్‌గఢ్‌లో ఓ స్కూల్లో పరీక్షలు జరుగున్నాయి. అయితే మాజీ ఎమ్మెల్యే స్మారక ట్రోఫిని ప్రతి ఏడాది నిర్వహించేవారు. ఈ క్రమంలో ఓ స్థానిక నేత స్కూల్లో ఎమ్మెల్యే కప్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా కొందరు డ్యాన్సర్లను పిలిపించి స్కూలు గ్రౌండ్లో పెద్దగా సౌండ్ సిస్టమ్ పెట్టి మరీ డ్యాన్సులు చేయించారు. ఈ ఫొటోలో పసుపు రంగు చీరలో కనిపిస్తున్న యువతి పాటలకు డ్యాన్స్ చేస్తుండగా మరో యువతి ఆమెతో కలిసి స్టెప్పులేసింది. ఇంతవరకూ బాగానే ఉంది, కానీ స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను పరీక్ష రాయించేందుకు స్కూలు టెర్రస్ మీదకి తీసుకెళ్లి కూర్చోబెట్టగా, వాళ్లు మండుటెండలో చెమటలు కక్కుతూ ఎంతో శ్రమపడి పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇందుకు సంబంధిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అధికారులు చెప్పడం గమనార్హం. -
మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి..
కోరుట్ల: ‘‘మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి.. అయ్యా! మేం.. కోరుట్ల జెడ్పీ బాలికల హైస్కూల్లో చదువుతున్నాం. 540 మందిలో 320 మంది బాలికలం. మా బడిలో సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటి వసతి లేదు. అన్నం తిన్న తర్వాత తాగడానికి నీళ్లు లేక తలా కొన్ని డబ్బులు జమ చేసి కొనుక్కుంటున్నం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. 9వ తరగతి సాంఘికశాస్త్రంలో ‘బాలల హక్కులు–పరిరక్షణ’ పాఠంలో బాలలు సమస్యలు ఉంటే నేరుగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తే పరిష్కరిస్తారని చదివాం. అందుకే ఈ లేఖ రాస్తున్నాం.. తప్పయితే క్షమించండి’ ఇది.. పది హేను రోజుల క్రితం జగిత్యాల జిల్లా కోరుట్ల జెడ్పీ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ సారాంశం. లెక్కలేని సమస్యలు..: కోరుట్ల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఒక్క టాయ్‌లెట్ మాత్రమే పనిచేస్తోంది. మిగిలినవి మరమ్మతులు చేయాల్సి ఉంది. పాఠశాలలో బోరు దెబ్బతినగా..బాగు చేయించే వారులేరు. రోజు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కుంటున్నారు. పిల్లలు ఈ నీటిని తాగలేక బయట కొనుక్కుని తాగుతున్నారు. మధ్యాహ్న భోజనానికి వంటగది, డైనింగ్ హాల్ లేక విద్యార్థులు ఆరుబయట భోజనాలు చేస్తున్నారు. కూలిన ఎస్సారెస్పీ గదుల్లోనే కొన్ని తరగతులు కొనసాగుతున్నాయి. పాఠశాల సమస్యలపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. రూ. 11 లక్షలతో అంచనాలు: విద్యార్థులు లేఖ రాసిన క్రమంలో కదిలిన విద్యాశాఖ వసతుల కల్పనకు రూ.11 లక్షలతో అంచనాలు తయారు చేసింది. దీనిలో 4 మూత్రశాలలు, బోర్వెల్, వాటర్ ట్యాంకు నిర్మాణానికి రూ.2 లక్షలు, మోటార్‌కు రూ.50 వేలు, 4 గదులకు రూ.8 లక్షలు, మరుగుదొడ్లు.. టాయ్లెట్ల మరమ్మతుకు రూ.5 వేలు కేటాయిస్తూ అంచనాలు తయారుచేశారు. నిధుల మంజూరుకు విద్యా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు నివేదిక అందించారు. స్పందించిన హైకోర్టు.. విద్యార్థినులు రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. పాఠశాలలో వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కి ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి, ఆర్‌ఎంఎస్‌ఏ ఇంజనీర్లతో కలసి గురువారం పాఠశాలను పరిశీలించారు. అవసరమైన వసతులు వెంటనే కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యా«ధికారి వెంకటేశ్వర్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ద్వారా హైకోర్టుకు తెలిపారు. -
నటి చెత్తగా ఉందంటూ పోస్ట్.. దిమ్మతిరిగే రిప్లై!
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి దిశా పటాని గతంలో ఎంత చెత్తగా కనిపించేదో చూడండంటూ ఓ మీడియాలో వచ్చిన కథనంపై ఆమె వినూత్నరీతిలో స్పందించారు. అయితే తమ అభిమాన నటి దిశాను అందంగా లేదంటారా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోవైపు తన అందంపై వచ్చిన కామెంట్లపై దిశా ట్వీట్ చేశారు. మీరు చాలా నిజమే చెప్పారు. ఏడో తరగతి చదవబోయే విద్యార్థిని ఎంతో అందమైన డ్రెస్సులు ధరించి, అందంగా కనిపించేలా మేకప్, హెయిర్ స్టెయిల్తో కనిపించలేదు. మీకు ఇంతకంటే బెటర్ బ్రేకింగ్ న్యూస్ ఏదీ దొరకలేదా అంటూ తన ట్వీట్ ద్వారా సున్నితంగా విమర్శించారు దిశా. తాను అందంగా లేదంటూ వచ్చిన మీడియా కథనంపై దిశా స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దాంతో పాటుగా నటి అందంపై అనవసరంగా పోస్ట్ చేశారని, వారి ఆలోచనలు ఎలా ఉంటే అలాగే వ్యక్తులు కనిపిస్తారంటూ చురకలంటిస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారని కొందరు, మీరు ఎప్పుడూ ఇదే విధంగా సంతోషంగా, ధైర్యంగా ముందుకు సాగాలంటూ మరికొందరు ట్వీట్లు చేశారు. అలాంటి చెత్త వార్తలపై మీరు స్పందించి సమయం వృథా చేసుకోకూడదంటూ మరికొందరు నెటిజన్లు నటి దిశా పటానికి సూచించారు. వివాదం ఏంటంటే.. ఓ జాతీయ మీడియా నటి దిశా పటానీ స్కూలు రోజుల్లో దిగిన ఫొటో, ప్రస్తుత ఫొటోను జతచేస్తూ.. గతంలో నటి ఎంత విహీనంగా ఉండేదో తెలుసా.. మీరు ఆమె అందంలో ఎంత మార్పు వచ్చిందో పోల్చుకోండంటూ ట్వీట్ చేయడంతో వివాదం మొదలైంది. ఇలాంటి కథనాలు రాయడం మంచిది కాదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ల స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
‘ఫీజు’ భూతానికి విద్యార్థిని బలి!
సాక్షి, హైదరాబాద్: ఫీజుల భూతానికి మరో చదువుల తల్లి బలైపోయింది.. ఫీజు కట్టలేదంటూ పాఠశాల యాజమాన్యం పరీక్షలు రాయనీయకపోవడంతో ఆవేదన చెందింది. ‘నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు.. సారీ మామ్’అని సూసైడ్ నోట్ రాసి పెట్టి ప్రాణాలు తీసుకుంది. హైదరాబాద్‌లోని మల్కాజిగిరి జేఎల్ఎస్ నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. జేఎల్ఎస్ నగర్‌కు చెందిన బాలకృష్ణ, సునీత భార్యాభర్తలు. బాలకృష్ణ పెయింటర్‌గా పనిచేస్తుం డగా, సునీత బోయిన్‌పల్లిలోని ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తోంది. వారికి సాయిలత, సాయిదీప్తి (14) ఇద్దరు కుమార్తెలు. సాయిలత బీటెక్ చదువుతుండగా.. సాయిదీప్తి స్థానికంగా ఉన్న జ్యోతి హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల బాలకృష్ణ ఆర్థిక ఇబ్బందుల కారణంగా దీప్తి ఫీజులను చెల్లించలేకపోయాడు. దీంతో కొద్దిరోజు లుగా పాఠశాల నిర్వాహకులు ఫీజు చెల్లించాలం టూ ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నిర్వహించిన పరీక్షలకు దీప్తిని అనుమతించలేదు. దీంతో పాఠశాలకు వెళ్లిన కొద్దిసేపటికే తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే తల్లిదండ్రులు విధులకు వెళ్లిపోగా.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో అక్క సాయిలత ఇంటి వద్దనే ఉంది. త్వరగా వచ్చావేమిటని అక్క అడగటంతో ఫీజు కట్టలేదంటూ పరీక్ష రాయనీయలేదని బాధతో చెప్పింది. బ్యాంకులో పని ఉండటంతో సాయిలత బయటికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి దీప్తి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికులసహాయంతో కిం దికి దింపి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీప్తి ఆత్మహత్యకు ముందు ‘నన్ను ఎగ్జామ్ రాయనీయలేదు.. సారీ మామ్’ అని నోట్‌బుక్‌లో రాసిపెట్టినట్లు గుర్తించారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీ లించారు. ఘటనపై ఫిర్యాదు అందలేదని, అందిన తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయని తెలిపారు. యాజమాన్యం వైఖరి వల్లే దీప్తి ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులతో సకాలంలో ఫీజుచెల్లించలేకపోయామని, దాంతో ఇతర విద్యార్థుల ముందు దీప్తిని చులకనగా చూసేవారని ఆమె తల్లిదండ్రులు బాలకృష్ణ, సునీత ఆరోపించారు. తాను కూడా ఇదే పాఠశాలలో చదివానని, విద్యార్థులను ఫీజుల కోసం వేధించేవారని అక్క సాయిలత పేర్కొంది. ఘటనపై పాఠశాల నిర్వాహకురాలు లక్ష్మిని ప్రశ్నించగా సాధారణంగానే ఫీజు గురించి అడిగామని చెప్పా రు. కడుపునొప్పిగా ఉందని, ఇంటికి వెళతానని దీప్తి అడగటంతోనే ఇంటికి పంపామన్నారు. -
కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు దారుణం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మధ్యహ్నా భోజనంలో భాగంగా తనకు కొంచెం పప్పు వేయాలని అడిగినందుకు ఓ వంటమనిషి ఒకటో తరగతి చదువుతున్న బాలుడి ముఖంపై వేడిగా కాలుతున్న పప్పును విసిరికొట్టాడు. దీంతో ఆ బాలుడి ముఖం కాలింది. అలాగే చెంపలు, ఛాతీ భాగం, వెనుక భాగం కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం దిండోరిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో ప్రిన్స్ మెహ్రా అనే విద్యార్థి ఒకటో తరగతి చదువుతున్నాడు. మధ్యాహ్న భోజనం స్కూల్లోనే చేసే క్రమంలో నేమావతి బాయి అనే వంట చేసే మహిళను తనకు కొంచెం అదనంగా పప్పు వేయాలని కోరాడు. దాంతో ఆమె నేరుగా పప్పు అతడిపై విసిరి కొట్టింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విద్యార్థిని చితకబాదిన ఉపాధ్యాయుడు
కంచికచర్ల(వీరులపాడు): తరగతి గదిలో అకారణంగా నవ్వాడనే కారణంతో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు కర్రతో విచక్షణా రహితంగా కొట్టిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్లలోని విజయవాడ రవీంద్ర భారతి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామానికి చెందిన పాలడుగు రాధాకృష్ణ కుమారుడు వెంకట నంద విజయవాడ రవీంద్ర భారతి పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శనివారం మధ్యాహ్నం తరగతి గదిలో తోటి విద్యార్థులతో సరదాగా మాట్లాడుతూ నవ్వాడు. దీంతో కోపగించిన ఉపాధ్యాయుడు సైదేశ్వరరావు విద్యార్థి వీపుపై కర్రతో విచక్షణా రహితంగా కొట్టటమే కాకుండా తలను నల్లబల్లకేసి కొట్టాడు. విద్యార్థి జరిగిన సంఘటనను తండ్రికి తెలపటంతో తండ్రి పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీఈవో, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. తక్షణమే ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి బంధువులు డిమాండ్ చేశారు. కాగా విద్యార్థిని కొట్టిన ఘటనలో ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సందీప్ ఆదివారం తెలిపారు. గాయపడిన విద్యార్థి నందిగామ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని అన్నారు. -
స్కూలు బ్యాగుల్లో బూతు పుస్తకాలు
లక్నో: బూతు పుస్తకాలు, గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లు, లైటర్లు, బ్లేడ్, రేజర్, ట్రిమ్మర్, ఐపాడ్, మొబైల్ ఫోన్లు... ఇవన్నీ పిల్లల స్కూలు బ్యాగుల్లోని వస్తువులు. లక్నోలోని పలు ప్రైవేటు స్కూళ్లలో నిర్వహించిన తనిఖీల్లో ఈ వస్తువులు బయటపడడంతో టీచర్లు అవాక్కయ్యారు. నగరంలోని బ్రైట్‌ల్యాండ్ స్కూల్లో ఒకటో తరగతి విద్యార్థిపై సీనియర్ విద్యార్థిని కత్తితో దాడి చేసిన ఘటన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు స్కూళ్లలో తనిఖీలు నిర్వహించారు. 9వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో బూతు పుస్తకాలు ఉండడం చూసి షాకయ్యామని ఒక టీచర్ తెలిపారు. ఎవరికీ తెలియకుండా ఉండేందుకు బూతు పుస్తకాలకు సైన్సు అట్టలు వేసి తీసుకొస్తున్నారని ఆమె చెప్పారు. స్కూలు విద్యార్థుల నుంచి ఆ వస్తువుల్ని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు నోటీసులు జారీ చేశామని స్కూలు యాజమాన్యం వెల్లడించింది. -
సారూ.. ఏందీ ఈబుద్ధి?
విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల కళ్లు పైశాచికత్వంతో మూసుకుపోతున్నాయి. భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన టీచర్లు, కీచకులూ విద్యార్థులను భయాల గుప్పిట్లోకి నెట్టేస్తున్నారు. విద్యార్ధులపై లైంగిక దాడికి పాల్పడుతూ, ఆపై ఎవరికైన చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తాజాగా హైదరాబాద్ ఈసీఐఎల్‌లో విద్యార్థిని లైంగికంగా వేధించిన స్కూల్ ప్రిన్సిపాల్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసీఐల్లోని అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్-2(ఏఈసీఎస్)లో పాఠశాలలో 9వ తరగతి విద్యార్థినిని ప్రిన్సిపాల్ మహాపాత్ర(54) లైంగికంగా వేధించాడు. స్కూల్ సమయం అయిపోయి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని తన ఛాంబర్‌కు పిలిచాడు. కూల్‌డ్రింక్, స్నాక్స్ ఇచ్చిన ప్రిన్సిపాల్ ఛాంబర్ డోర్ వేసి బలంవంతంగా ముద్దుపెట్టాడు. విషయం ఎక్కడ చెప్పొద్దని ఒట్టు వేయించున్నాడు. దీని గురించి బయట చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించాడు. ఈ సంఘటన అనంతరం ఇంటికి వచ్చిన ఆ విద్యార్థి మరుసటి రోజు పాఠశాల వెళ్లడానికే భయపడియింది. అయితే బాలికను గమనించిన తల్లిదండ్రులు ఏమైందని ఆరాతీయగా అసలు విషయం బయట పడింది.దీంతో తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ మహాపాత్రపై షీ టీమ్స్‌కి ఫిర్యాదు చేశారు. స్పందించిన కుషాయిగూడ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. -
చచ్చిపోవాలనిపిస్తోంది..
బంజారాహిల్స్: ఓ విద్యార్థి తనపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఓ విద్యార్థిని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే..ఇందిరానగర్‌కు చెందిన బాలిక స్కూల్‌కు వెళ్లే క్రమంలో శ్రీనగర్ కాలనీలోని ప్రైవేట్ విద్యార్థి తరచూ ఆమె వెంటపడుతూ ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడ్డాడు. గత పది రోజులుగా మరో ఇద్దరు స్నేహితులతో కలిసి దారి కాచి అడ్డగిస్తూ ప్రేమించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరించసాగాడు. సోమవారం మరోసారి బెదిరింపులకు పాల్పడటంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి వేధింపులు తట్టుకోలేక చచ్చిపోవాలనిపిస్తోందంటూ పోలీసుల ముందే కన్నీరు మున్నీరైంది. పోలీసులు బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
ఢిల్లీలో పొల్యూషన్ ఎమర్జెన్సీ!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రమాదపుటంచుల్లో ఉంది. ఢిల్లీని కాలుష్య కారక స్మాగ్ (పొగ+కాలుష్యం) ముంచెత్తింది. దీంతో కాలుష్య అత్యవసర స్థితిని ప్రకటించాల్సిన ప్రమాదకర స్థాయికి ఢిల్లీ కాలుష్యం చేరింది. కేంద్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెల్లడించిన వాయు నాణ్యత సూచీ ప్రకారం 500 పాయింట్ల (గరిష్టం) స్కేల్లో కాలుష్యం ఇప్పటికే 487 పాయింట్లు దాటింది. మరో 48 గంటల్లో ఈ సూచీ 500 యూనిట్లకు చేరే ప్రమాదం కనిపిస్తోంది. రెండ్రోజులుగా ప్రజాజీవనానికి ఇబ్బంది కలిగించే రీతిలో పెరిగిన వాయు కాలుష్యం.. బుధవారం మరింత ప్రమాదకర స్థితికి చేరింది. ఈ కాలుష్యం ధాటికి శ్వాస, హృద్రోగ సంబంధింత సమస్యలున్నవారు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్ల వాడకంపై దృష్టిపెట్టారు. నగరంలో పాఠశాలలకు ఆదివారం వరకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు, పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకూ తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు పొగమంచు కారణంగా ఢీకొనగా 22 మందికి గాయాలయ్యాయి. అటు, పంజాబ్‌లో మంచు కారణంగా ఓ ట్రక్కు దూసుకెళ్లటంతో 9మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. వైపరీత్యానికి అడుగుదూరంలో.. ప్రస్తుత పరిస్థితి కొనసాగి 48 గంటల్లో కాలుష్య సూచీ 500 పాయింట్లు దాటితే.. సరి–బేసి (కారు నెంబర్లు) విధానం, నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో నిర్మాణాలు, భవనాల కూల్చివేతపై నిషేధం తక్షణమే అమల్లోకి రానుంది. దీని వల్ల ఆరోగ్యంగా ఉన్న వారు అనారోగ్యం పాలవుతుండగా.. ఇప్పటికే వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రమాదకర స్థాయిలో పీఎం 2.5, పీఎం10 భూ వాతావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో పీఎం 2.5 తీవ్రత క్యూబిక్ మీటర్‌కు 420 మైక్రో గ్రాములు, పీఎం10 తీవ్రత క్యూబిక్ మీటర్‌కు 678 మైక్రోగ్రాములున్నట్లు వెల్లడైంది. ఢిల్లీలో స్మాగ్ (కాలుష్యం, పొగమంచు కలిపి) ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని.. నగరంతోపాటు ఎన్సీఆర్ ప్రాంతంలో దట్టంగా వ్యాపించిందని మంత్రిత్వశాఖ అధికారి మాధవన్ రాజీవన్ వెల్లడించారు. పంజాబ్, హరియాణాల నుంచి నవంబర్ 6 రాత్రి నుంచి హఠాత్తుగా కాలుష్యంతో కూడిన పొగ వ్యాపించటంతోనే ఈ విపత్కర పరిస్థితులు తలెత్తాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీతోపాటుగా ఫరీదాబాద్, ఘజియాబాద్, గురుగావ్, నోయిడాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులున్నాయి. ఆదివారం వరకు స్కూళ్లు బంద్ ప్రమాదకరస్థితికి చేరుతున్న వాతావరణంతో ఢిల్లీలోని అన్ని పాఠశాలలు ఆదివారం వరకు మూసే ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్నవారు, చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని ఢిల్లీ డిప్యూటీ సీఎం, విద్యామంత్రి మనీశ్ సిసోడియా సూచించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. ‘ప్రజారోగ్య ఎమర్జెన్సీ’ ప్రకటించింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని క్లాసురూముల్లో కాకుండా ఇతర ఔట్‌డోర్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా స్కూలు యాజమాన్యాలను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది. కాగా, హస్తినలో వాతావరణ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సమన్వయంతో పనిచేద్దామని పంజాబ్, హరియాణాల సీఎంలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖలు రాశారు. ఈ రెండు రాష్ట్రాల్లో రైతులు పంటవ్యర్థాలను కాల్చేయటం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ లేఖల్లో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో పరిస్థితిని మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్లతో సమర్థవంతంగా ఎదుర్కొనలేమని ఏయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. పొగమంచుకు తొమ్మిది ప్రాణాలు బలి చండీగఢ్: పంజాబ్‌లో దట్టమైన పొగమంచు తొమ్మిది ప్రాణాలను బలితీసుకుంది. బతిండా–చండీగఢ్ హైవేపై దారి కనిపించకపోవటంతో ఓ సిమెంట్ మిక్సర్ లారీ రోడ్డుపక్కన నిల్చున్న 14మంది విద్యార్థుల పైకి దూసుకుపోయింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బతిండా జిల్లాలో ఉదయం కాలేజీలకు వెళ్లేందుకు కొందరు విద్యార్థులు ఓ బస్సెక్కారు. వీరెక్కిన బస్సు పొగమంచు కారణంగానే వేరే బస్సును ఢీకొంది. దీంతో వీరంతా వేరే బస్సు ఎక్కేందుకు రోడ్డు పక్కన నిలబడ్డారు. అటుగా వస్తున్న సిమెంట్ కాంక్రీటు లారీ డ్రైవరుకు దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డుపైనున్న విద్యార్థులు కనిపించకపోవటంతో వారిపైనుంచే వాహనాన్ని పోనిచ్చాడు. అయితే మరికొందరు విద్యార్థులు ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు దూకేయటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. రెండు బస్సులు ఢీకొనటం, తర్వాత లారీ వీరిపైనుంచి వెళ్లిన ఘటనలన్నీ కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే జరిగాయని పోలీసులు తెలిపారు. ఇక్కడికి సమీపంలోని ఫ్లైఓవర్‌పై దాదాపు పది వాహనాలు స్వల్పం గా ప్రమాదానికి గురైనట్లు పేర్కొన్నారు. -
వాయు 'గండం'
సాక్షి, చెన్నై : మూడు రోజుల పాటు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం ప్రాంతాలను ముంచెత్తిన వాన గురువారం దక్షిణ తమిళనాడు వైపు మళ్లింది. బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలోని నెలకొన్న అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతో గత మూడు రోజులుగా చైన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షంపడ్డ విషయం తెలిసిందే. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలదిగ్భందలో చిక్కుకున్నాయి. అధికార వర్గాలు ఉరుకులు పరుగులతో సహాయక చర్యల్ని చేపట్టారు. బుధవారం రాత్రి భారీ వర్షం పడే అవకాశం ఉందనే సమాచారంతో ముందుస్తుగా గురువారం ఈ మూడు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల్లో వరదల ఆందోళన రెట్టింపు అయింది. అయితే, ఆ రాత్రి చిరు జల్లులతో గడిచింది. ఉదయాన్నే భానుడు ప్రత్యక్షం కావడంతో లోతట్టు వాసుల్లో ఆనందం చిగురించింది. అధికార వర్గాలు ఆగమేఘాలపై చర్యలు చేపట్టినా, అనేకచోట్ల వరద నీరు తొలగక పోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. 20 వేళ ఇళ్లలోకి వరద నీరు చెన్నై, శివారుల్లో 20 వేల ఇళ్లల్లోకి వరద నీరు చేరినట్టు అధికార వర్గాల గణాంకాలు తేల్చాయి. ప్రధానంగా శివారువాసులు నీళ్లు తొలగని దృష్యా, ముప్పు తిప్పలు పడాల్సిన పరిస్థితి. సాయంత్రం వరకు భానుడు కనిపించినా తదుపరి వాతావరణం మారింది. మళ్లీ వర్షం తెరపించి తెరపించి పడుతోంది. చెన్నై శివారు ప్రాంతాలు, కాంచీపురం జిల్లా పరిధిలోని అన్ని చెరువులు దాదాపుగా నిండాయి. ఉబరి నీటిని విడుదల చేస్తున్నారు. మళ్లీ కుండపోత వర్షం పడ్డ పక్షంలో చెరువులకు పూర్తిస్థాయిలో గండికొట్టేందుకు ఆ పరిసర వాసులు సిద్ధం అవుతున్నారు. దీంతో అడయార్ తీరంలో ఉత్కంఠ తప్పడం లేదు. చెన్నైలో అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో డీఎంకే ఎమ్మెల్యేలు ఆగమేఘాలపై పర్యటించారు. వరద నీరు తొలగించేందుకు తగ్గ చర్యల్లో నిమగ్నం అయ్యారు. కొన్నిచోట్ల బాధితులకు తమవంతు సాయం అందించారు. ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం గురువారం దక్షిణ తమిళనాడు వైపుగా వర్షం మళ్లినట్టు పరిస్థితి నెలకొంది. ఇందుకు కారణం బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడమే. శ్రీలంకకు సమీపంలోని నెలకొన్న ఈ ద్రోణి వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాల్లో తెరపించి తెరపించి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడి లోతట్టు ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఇక, డెల్టా జిల్లాలు తంజావూరు, నాగపట్నం, తిరువారూర్లలో వర్షాలు పడుతుండగా, తిరుచ్చి, అరియలూరు, పెరంబలురు జిల్లాల్లో చినుకు కరువైంది. తిరునల్వేలిలో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు అనేకం జలదిగ్భందంలో చిక్కాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి సైతం వరదనీరు చేరింది. కుట్రాలం జలపాతం పొంగి పొర్లుతోంది. గడిచిన 24 గంటల్లో తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టైలో 13 సెం.మీ, తూత్తుకుడి జిల్లా తిరుచెందూరు 9 సె.మీ చిదంబరం 8. సె.మీ నాగటప్నటం, వేధారణ్యం, తంరంగం బాడిలలో ఆరు సె.మీ వర్షం పడింది. చెన్నై పూందమల్లి నుంగంబాక్కం, చెంగల్పట్టుల్లో నాలుగు సె.మీ వర్షం పడగా, అక్కడక్కడ తెరపించి తెరపించి చిరు జల్లులు, ఓ మోస్తరుగా వర్షం పడుతున్నది. ద్రోణి బలపడేనా లేదా అన్నది శుక్ర, లేదా శనివారం తేలుతుందని, అయితే, దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు మరింతగా పడుతాయని వాతావరణ కేంద్రం డైరెక్టర్ బాలచంద్రన్ తెలిపారు. సముద్ర తీర జాలర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చిన్నారులకు నివాళి చెన్నై కొడుంగయూరులో బుధవారం విద్యుదాఘాతానికి యువశ్రీ(9), భావన అలియాస్ మణిమేఘలై(7) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులు అప్పగించారు. ముక్కుపచ్చలారని చిన్నారుల్ని అధికారుల నిర్లక్ష్యం బలికొనడంతో ఆ పరిసర వాసులు కన్నీటి సంద్రంలో మునిగారు. డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మృతదేహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు తమ మీద ఆగ్రహంతో ఉన్నారని, ఎందుకంటే, ఈ ప్రభుత్వాన్ని ఇంకా కుప్పకూల్చకుండా తాము వేచిచూస్తుండడమేనని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం పుణ్యమా మరెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక, మత్స్యశాఖ మంత్రి జయకుమార్ మృతదేహాలకు నివాళుర్పించేందుకు రాగా, అక్కడున్న జనం అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు మృతుల కుటుంబాలు నచ్చజెప్పడంతో ప్రజలు శాంతించారు. తమ పిల్లల మరణానికి విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అని ఆ కుటుంబాలు కన్నీటి పర్యంతం అయ్యాయి. కాగా, ఒట్టేరి నమ్మాళ్వార్ పేట సుబ్బరాయన్ నాలుగో వీధిలో తన ఇంటి ముందు నిల్వ ఉన్న వర్షపు నీటిలో జారిపడి మారిముత్తు భార్య పవనమ్మాల్(48) మృతి చెందడంతో ఆ పరిసర వాసుల్లో ఆగ్రహం బయలుదేరింది. నీటిని తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండి పడుతున్నారు. ముప్పు తప్పదన్న కమల్ చెన్నైకి మళ్లీ వరద ముప్పు తప్పదని విశ్వనాయకుడు కమల్ మరో మారు హెచ్చరించారు. దక్షిణ చెన్నై శివారుల్లోని చెరువులన్నీ నిండాయని, రోడ్లు, ఖాళీ స్థలాలు, చిన్న చిన్న సందుల్లో సైతం నీళ్లు ఇంకా నిల్వ ఉన్నాయని వివరించారు. మళ్లీ వర్షం తీవ్రత పెరిగే అవకాశాలు ఉండటంతో ఈ చెరువుల పటిష్టతపై ఆందోళన తప్పడం లేదన్నారు. పాలకుల నిర్వాకం ఇందుకు నిదర్శనంగా పేర్కొంటూ, మరో ముప్పును తప్పించేందుకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇక, తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, సీపీఐ నేత ముత్తరసన్‌లు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ, చెన్నైలో వరద నివారణ చర్యల్లో పాలకులు పూర్తిగా విఫలం అయ్యారని మండిపడ్డారు. ముందస్తు చర్యల్ని చేపట్టకుండా, ప్రకల్భాలు పలికుతూ కాలం నెట్టుకు వచ్చారని విమర్శించారు. సీఎం సమాలోచన వర్షాలు విస్తారంగా పడుతుండడంతో గురువారం సచి వాలయంలో అధికారులతో సీఎం పళని స్వామి సమావేశం అయ్యారు. సీనియర్ మంత్రులు, ఆయా విభాగా ల అధికారులతో సాగిన ఈ సమావేశంలో వర్షం తీవ్రత, సహాయక చర్యల ముమ్మరం తదితర అంశాలపై చర్చించారు. భారీ వర్షాలు ఎదురైన పక్షంలో లోతట్టు ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక శిబిరాలను ముందస్తుగా సిద్ధం చేయడానికి చర్యలు తీసుకున్నారు. అన్ని జిల్లాల్లో ప్రతి అధికారి, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, మీడియాతో ప్రజా పనుల శాఖ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 4500 ప్రాంతాల్ని వర్షం భారినపడే ప్రాంతాలుగా గుర్తించి ఉన్నామని, అక్కడల్లా సహాయక చర్యలు సిద్ధంగా ఉంచామన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రజలకోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని వివరించారు. ఆ మేరకు రాష్ట్రస్థాయిలో 1070 టోల్ ఫ్రీ నంబర్‌కు, జిల్లాల స్థాయిలో 1077 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. హైకోర్టు సీరియస్ చిన్నారుల మృతి వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు న్యాయవాది జార్జ్ విలియమ్స్ విద్యుతాఘాతం సంఘటనల్లో అధికారుల నిర్లక్ష్యాన్ని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వ న్యాయవాది రాజగోపాల్ జోక్యం చేసుకుని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన బెంచ్ ప్రజల ప్రాణా లకు రక్షణ కల్గించే విధంగా ముందస్తు చర్యలు తీసుకుని ఉండాల్సిందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు వేగవంతం చేయాలని హెచ్చరించారు. చెన్నైలో వరదల విషయంగా పిటిషన్లు దాఖలు అయ్యాయని, శుక్రవారం ఆ పిటిషన్లతో కలిసి జార్జ్ వాదనను పరిగణించి విచారణ చేపడుతామని పేర్కొన్నారు. విద్యుదాఘాతం, చిన్నారుల మరణం తదితర అంశాలపై ఫొటోలతో సహా ఆధారాలు సమర్పించాలని జార్జ్‌కు సూచించారు. కాగా, కోర్టుకు వ్యవహారం చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ స్థంబాల భద్రత, ఎక్కడెక్కడ విద్యుత్ జంక్షన్ బాక్సులు ఉన్నాయో వాటన్నింటిని పరిశీలించి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా అధికారులకు విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి ఆదేశాలు ఇచ్చారు. -
గురుకుల పాఠశాలలో విషాదం
-
తెలంగాణ: గురుకుల పాఠశాలలో విషాదం
సాక్షి, జైపూర్: ఆటల పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా జైపూర్‌లో చోటుచేసుకుంది. మృతుడు సూర్యపేట జిల్లా హుజుర్‌నగర్‌కి చెందిన వెంకటేష్‌గా గుర్తించారు. వెంకటేష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. విద్యార్థి అనుమానాస్పద మృతితో అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జైపూర్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 4వ జోనల్ స్థాయి క్రీడ పోటీలు జరుగుతున్నాయి. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెంకటేష్ ఈ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో నేటి ఆదివారం అతడు హాస్టల్ భవనం పైనుంచి కింద పడిపోయి మృతిచెందాడు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
స్క్రీన్ టెస్ట్
► తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు ఈ తమిళ హీరో స్కూల్‌మేట్? ఎ) విజయ్ బి) కార్తీ సి) సూర్య డి) విశాల్ ► బిగ్ బాస్ ఫైనలిస్ట్ శివబాలాజీకి అల్లు అర్జున్ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా పేరేంటి? ఎ) బన్నీ బి) ఆర్య–2 సి) ఆర్య డి) హ్యాపీ ► మొదటి సినిమాతోనే బెస్ట్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు నంది అవార్డు సొంతం చేసుకున్న ఈ నటి ఎవరు? ఎ) సమంత బి) సోనియా అగర్వాల్ సి) త్రిష డి) సిమ్రాన్ ► ‘మైథిలీ ఎన్నై కాదలి’ అనే తమిళ సినిమా ద్వారా అమల కథానాయికగా పరిచయమయ్యారు. ఆ సినిమా దర్శకుడు ఎవరో తెలుసా? ఎ) బాలచందర్ సి) భారతీరాజా సి) టి.రాజేందర్ డి) మణిరత్నం ► అలీ బాలనటుడిగా పరిచయమైన సినిమా ఏంటో చెప్పుకోండి చూద్దాం? ఎ) నిండు నూరేళ్లు బి) సీతాకోకచిలుక సి) నెలవంక డి) పెళ్లిచేసి చూడు ► రవితేజ అనేది సిల్వర్ స్క్రీన్ పేరు. ఆయన అసలు పేరు ఏంటి? ఎ) రవీంద్రభూపతి బి) రవిశంకర్ రాజు భూపతిరాజు సి) భూపతి రాజు రవి డి) రవి భూపతి రాజు ► హాస్యనటుడు తనికెళ్ల భరణి బెస్ట్ విలన్‌గా అవార్డు అందుకున్న సినిమా పేరు చెప్పండి? ఎ) శివ బి) లేడీస్టైలర్ సి) సముద్రం డి) వారసుడు ► ‘అరుంధతి’ సినిమాలో బొమ్మాళీ నిన్నొదల...’ అంటూ ప్రేక్షకులను భయపెట్టారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ఏ సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయమయ్యారు? ఎ) అతడు బి) సూపర్ సి) మిస్టర్ మేధావి డి) అశోక్ ► ‘జెంటిల్‌మేన్’ సినిమాకు హీరో అర్జున్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆ కథను దర్శకులు శంకర్ ఒక తెలుగు హీరోకి చెప్పారు. ఆ హీరో ఎవరో ఊహించగలరా? ఎ) చిరంజీవి బి) విక్రమ్ సి ) నాగార్జున డి) రాజశేఖర్ ► దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్టూడియో చెన్నైలోని తన నివాసంలోనే ఉంటుంది. ఆ స్టూడియోలోకి ఎంటర్ కాగానే ఓ మహా సంగీత దర్శకుని చిత్రపటం ఉంటుంది. ఆ ప్రముఖ సంగీత దర్శకులు ఎవరో ఊహించండి? ఎ) మైఖేల్ జాక్సన్ బి) ఏఆర్ రెహ్మాన్ సి) ఇళయరాజా డి) ఘంటసాల ► స్టిల్ ఫొటోగ్రఫీని ప్రొఫెషన్‌గా ఎంచుకుని, నాలుగేళ్లు ఫొటోగ్రఫీలో శిక్షణ తీసుకున్న ఈ నటుడు ఇప్పుడు టాలీవుడ్లో హ్యాపెనింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టు ఎవరు? ఎ) జయప్రకాశ్‌రెడ్డి బి) రావు రమేశ్ సి) రాజీవ్ కనకాల డి) వెన్నెల కిశోర్ ► నటుడు బ్రహ్మానందాన్ని అరగుండు బ్రహ్మానందం అని ఫిక్స్ చేసిన సినిమా ఏది? ఎ) ఆహ నా పెళ్లంట బి) బాబాయ్ హోటల్ సి) విక్రమార్కుడుడి) బావగారు బాగున్నారా ► ‘నిన్నే పెళ్లాడతా’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఇప్పటి ప్రముఖ హీరో ఎవరు? ఎ) నాని బి) రవితేజ సి) శర్వానంద్ డి) రాజ్‌తరుణ్ ► మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి... కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు సార్’ అని డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? ఎ) ప్రభాస్ బి) ఎన్టీఆర్ సి) అల్లు అర్జున్ డి) రానా ► ఫస్ట్ ఇండియన్ ఫీచర్ ఫిల్మ్ ‘రాజా హరిశ్చంద్ర’దర్శకులు ఎవరు? ఎ) సత్యజిత్ రే బి) దాదా సాహెబ్ ఫాల్కే సి) కమలాకర్ కామేశ్వర రావు డి) ఎల్వీ ప్రసాద్ ► ‘నా పేరు మీనాకుమారి నా ఊరు కన్యాకుమారి..’ అని ‘మల్లన్న’ సినిమాలో ముమైత్ ఖాన్ డ్యాన్స్ చేసిన ఈ పాటను పాడిందెవరు? ఎ) మాలతి బి) సుచిత్ర సి) కౌసల్య డి) సునీత ► ‘రోబో’ చిత్రంలో సాహసాలతో కూడిన ట్రైన్ ఫైయిట్ను కంపోజ్ చేసిన ఫైట్‌మాస్టర్ ఎవరు? ఎ) రామ్–లక్ష్మణ్ బి) పీటర్ హెయి∙సి) అణల్ అరసు డి) విజయన్ ► దర్శకుడు కాకముందు ఈయన ఆడియోగ్రాఫర్. ఆ తర్వాత పెద్ద దర్శకుడయ్యారు. చిన్న క్లూ: ఇటీవల ఈయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది ఎ) కె. రాఘవేంద్ర రావు బి) ముత్యాల సుబ్బయ్య సి) కె. విశ్వనాథ్ డి) కోడి రామకృష్ణ ► ఈ ఫొటోలో చిరంజీవి ఎత్తుకున్న బుడతడు ఇప్పుడు హీరో.. చెప్పేస్తారా? ఎ) రామ్‌చరణ్ బి) ఆది సి) సాయిధరమ్ తేజ్ డి) వరుణ్ తేజ్ ► ఈ ఫొటోలో ఆడవేషంలోఉన్నది ఓ ప్రముఖ దర్శక–నిర్మాత. చిన్న క్లూ: అక్కినేని నాగేశ్వరరావుతో ఆయన ఎక్కువ సినిమాలు తీశారు. ఎ) వి.బి. రాజేంద్రప్రసాద్ బి) ఆదుర్తి సుబ్బారావు సి) కేయస్ ప్రకాశ్‌రావు డి) కేయస్ఆర్ దాస్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాల వరకూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) బి 2) సి 3) ఎ 4) సి 5) ఎ6) బి 7) సి 8) బి 9) డి 10) సి11) బి 12) ఎ 13) బి 14) సి 15) బి16) బి 17) బి 18) సి 19) బి 20) ఎ