సరసం కాస్తా విరసమైతే..
సరసం కాస్తా విరసమైతే..
Published Fri, Nov 25 2016 5:47 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM
తరగతి గదిలో తోటి స్నేహితులను ఆటపట్టించడం మామూలే. అయితే.. అది కొంతవరకు మాత్రమే. శ్రుతి మించితే అవతలి వాళ్లకు చిర్రెత్తుకొస్తుంది. రష్యాలో సరిగ్గా ఇలాగే జరిగింది. ఓ అమ్మాయికి ఎదురైన చేదు అనుభవం కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రష్యాలోని ఇర్కుట్స్క్ నగరంలో ఓ స్కూలు బ్రేక్ సమయంలో మారియా అనే 15 ఏళ్ల అమ్మాయి తన స్నేహితుడిని ఏడిపించాలని అనుకుంది. అందుకోసం ఆమె ఓ గ్లాసుడు నీళ్లు తీసుకుని అతగాడి మీద పోసింది. ఆర్టెమ్ అనే ఆ కుర్రాడికి ఆ ఘటనతో ఎక్కడలేని కోపం వచ్చింది.
ఒక్కసారిగా ఆమెను అవతలకు తోసి.. తలమీద, ముఖం మీద పిడికిలితో ముష్టిఘాతాలు మొదలుపెట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు.. మిగిలిన పిల్లలు పట్టుకుని ఆపేవరకు ఏకంగా పది గుద్దులు గుద్దాడు. వాళ్లంతా పట్టుకున్నా కూడా ఒకటి రెండుసార్లు కొట్టబోయాడు. అంత కోపం వచ్చింది మరా పిల్లాడికి. సరదాకు చేసిన పని కాస్తా ఇలా విరసంగా మారడంతో పాపం ఆ అమ్మాయి నేలమీద కూర్చుని రెండు చేతుల్లో తల దాచుకుని ఏడ్చింది. ఈ దాడి మొత్తాన్ని ఓ విద్యార్థి తన స్మార్ట్ఫోన్లో షూట్ చేశాడు. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో అది వైరల్గా మారింది.
కొసమెరుపు: కథ అక్కడితో అయిపోలేదు. మారియా స్నేహితులు ఐదుగురు కలిసి స్కూలు అయిపోయిన తర్వాత ఆ కుర్రాడిని కుమ్మేశారు. స్కూలు వెనకాల అతడిని పట్టుకుని, గ్రౌండులోకి తీసుకెళ్లి చితక్కొట్టారు. స్కూలు సెక్యూరిటీ గార్డు చూసి వాళ్లను ఆపాడు. అయితే, అతగాడు చేసిన పనికి ఈమాత్రం పడాల్సిందేనని సదరు గార్డుకూడా అన్నాడట!
Advertisement
Advertisement